సైబర్ నేరాలు సమాజానికి సవాల్
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి
విశాఖ లీగల్: సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన నేరాలు సమాజానికి ఒక సవాలుగా మారాయని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి చెప్పారు. విశాఖలోని ఒక హోటల్లో శనివారం జాతీయ మహిళా న్యాయవాదుల సమాఖ్య రాష్ట్ర విభాగం, విశాఖ శాఖలు సైబర్ నేరాలపై నిర్వ హించిన సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పెరు గుతున్న సైబర్ నేరాలపై న్యాయవాదులకు అవగాహన అవసరమన్నారు.
ఆన్‌లైన్, డేటా, ఇంటర్‌నెట్ వినియోగంలో సమస్యల ను గుర్తించాలన్నారు. సాంకేతికతతో నూతన నేరాలు పుట్టుకొస్తున్నాయని, ఈ మెయిల్, సైబర్, సామాజిక మాధ్యమాలు, క్రెడిట్‌కార్డు, సాంకేతిక ఉగ్రవాదం వంటివి నేర ప్రవృత్తికి అడ్డాగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. వీటిని అధిగమించడానికి పౌరుల్లో అవగాహన పెరగాలని, నూతన సవాళ్ల పరిష్కారానికి ఒక అన్వేషణ జరగాలని చెప్పారు.
మహిళా సాధికారత...అభివృద్ధి
న్యాయవాద వృత్తిలో పరిస్థితి ఇతర వృత్తులకు భిన్నంగా ఉంటుందని, న్యాయవాద వృత్తిలో నిపుణత సాధిస్తేనే రాణింపు ఉంటుందని జస్టిస్ రోహిణి స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో న్యాయవాదులు, న్యాయమూర్తుల్లో స్త్రీల సంఖ్య పెరుగుతున్నా లింగవివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు సైబర్ నేరాలను సమగ్రంగా విశ్లేషించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ టి.రజని మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానంపై అవగాహన, అప్రమత్తత అవసరమన్నారు. విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకటజ్యోతిర్మయి, సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు మంజరి, బార్ కౌన్సిల్ సభ్యురాలు చీకటి మాధవిలత, నగర అధ్యక్షురాలు డి.అరుణకుమారి, డి.మంజులత తదితరులు పాల్గొన్నారు.