ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ రోహిణి
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి బాధ్యతలు స్వీకరించారు. నిన్నటివరకూ ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి సేవలందించారు. ఆమె పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. 1955 ఏప్రిల్ 14న విశాఖపట్నంలో జన్మించిన జస్టిస్ రోహిణి, 1976లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో లా చేశారు.
1980 డిసెంబర్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నాటి బార్ కౌన్సిల్ చైర్మన్ కోకా రాఘవరావు వద్ద జూనియర్గా చేరారు. రాఘవరావు చీఫ్ ఎడిటర్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లా జర్నల్స్కు ఆమె రిపోర్టర్గా కూడా పనిచేశారు. 1995లో హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్గాను, 2001లో అదనపు జడ్జిగాను, 2002 నుంచి పూర్తి స్థాయి జడ్జిగాను ఆమె నియమితులయ్యారు. అప్పటినుంచి రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు.