జస్టిస్ రోహిణికి ఘనంగా వీడ్కోలు
హైకోర్టు న్యాయవాదుల సంఘం సన్మానం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ జి.రోహిణికి హైకోర్టు గురువారం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 21న ఆమె నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు హైకోర్టుకు సెలవు దినాలు కావడంతో గురువారమే ఆమెకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో హైకోర్టు న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు, అదనపు ఏజీలు కె.జి.కృష్ణమూర్తి, బి.భాస్కరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోద్‌కుమార్ దేశ్‌పాండే, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదుల తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు జస్టిస్ రోహిణి చేసిన సేవలను కొనియాడారు. తరువాత జస్టిస్ రోహిణి మాట్లాడుతూ, న్యాయవ్యవస్థలో తన సుదీర్ఘ ప్రస్థానంలో తనకు సహకరించిన వారిందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవృత్తిలో మెళకువలు నేర్చుకునే అవకాశం కల్పించిన సీనియర్ న్యాయవాది కోకా రాఘవరావుకు, సొంత బిడ్డలా చూసుకున్న ఆయన కుటుంబసభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు ఏజీగా ఉన్న సమయంలోనే తనను ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా నియమించారని, అలా తనను తాను నిరూపించుకునేందుకు గొప్ప అవకాశం లభించిందని జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ‘‘ఇప్పటి వరకు నేను 58 మంది న్యాయమూర్తుల వీడ్కోల సమావేశంలో పాల్గొన్నా. ఇప్పుడు నా వంతు వచ్చింది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను భాగం కాదని తలచుకుంటే నాకు ఎంతో బాధేస్తోంది. నా జీవితంలో సగభాగం ఈ ప్రతిష్టాత్మక కోర్టులోనే గడిపాను. నా కుటుంబంలో ఎవ్వరూ న్యాయవాదిగా లేరు. కష్టపడి, నిజాయితీగా పనిచేయబట్టే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నా. పని గురించి తప్ప ఇతర విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా సీనియర్ కోకా రాఘవరావు ఆంధ్రప్రదేశ్ లా జర్నల్స్‌కు ఎడిటర్‌గా ఉన్నారు. దానిలో నేను కూడా తరువాత భాగస్వామినయ్యాను. నా సీనియర్ సహకారంతో ఎంతో సాధించాను’’ అని చెప్పారు. తరువాత జస్టిస్ రోహిణిని ఎ.గిరిధరరావు నేతృత్వంలో న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు వేణుమాధవ్, కార్యదర్శి పాశం కృష్ణారెడ్డి, సంయుక్త కార్యదర్శి పి.ఎస్.పి.సురేష్‌కుమార్, కోశాధికారి భారతీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.