చైనా రాజ్యాంగ సవరణ ఓటింగ్‌లో జిన్‌పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇక జీవితకాలం ఆ పదవిలో కొనసాగేందుకు మార్గం అధికారికంగా సుగమమైంది. ఓ వ్యక్తి అధ్యక్షుడిగా రెండు కంటే ఎక్కువసార్లు పనిచేయకూడదంటూ ఉన్న పరిమితిని ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు ఆ దేశ పార్లమెంటు ఆదివారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జిన్‌పింగ్ రెండోసారి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇకపై కూడా ఆయన ఎన్నాళ్లు కోరుకుంటే అన్నాళ్లు, కావాలంటే చనిపోయేంత వరకు కూడా అధ్యక్షుడిగా ఉండొచ్చు.
ఇటీవలి దశాబ్దాల్లో చైనాలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా జిన్‌పింగ్ ఎదిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) స్థాపక చైర్మన్ అయిన మావో జెడాంగ్ తర్వాత అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగనున్న నేతగా జిన్‌పింగ్ రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఎవరూ రెండు కన్నా ఎక్కువసార్లు చేపట్టకూడదంటూ ఉన్న నిబంధనను రద్దు చేయాలని ఇటీవల జరిగిన సీపీసీ మహాసభల్లో తీర్మానించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులపై ఉన్న పరిమితిని ఎత్తివేయాలన్న సీపీసీ నిర్ణయాన్ని పార్లమెంట్
ఆమోదించింది.
పొరుగుదేశాలకు ఆందోళనకరం..
జిన్‌పింగ్‌కు జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం కల్పించడం భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు ఆందోళన కలిగించే అంశం. 2013లో జిన్‌పింగ్ అధ్యక్షుడయ్యాక ఆయా దేశాలతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. భారత్‌తో డోక్లాం వివాదం తెలిసిందే. భారత్‌కు శత్రుదేశమైన పాకిస్తాన్‌కు చైనా బాగా దగ్గరవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా–పాక్ ఆర్థిక కారిడార్‌ను కూడా నిర్మిస్తోంది.
మాల్దీవులు, శ్రీలంకల్లోనూ తన ప్రాబల్యాన్ని బాగా పెంచుకుంది. రోడ్డు, రైల్వే ప్రాజెక్టులతో నేపాల్‌తో కూడా సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలతోనూ విభేదాలను చైనా పెంచుకుంది. ఇవన్నీ జిన్‌పింగ్ అధ్యక్షుడయ్యాక జరిగినవే. ఈ నేపథ్యంలో జీవితకాలం పదవిలో కొనసాగే అవకాశాన్ని ఆయనకు కల్పించడం పొరుగుదేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
అత్యంత ప్రాధాన్యం...
చైనాను ఆర్థికంగా, సైనికపరంగా ‘సూపర్‌పవర్’గా మార్చాలనేదే జిన్‌పింగ్ లక్ష్యం. మరో 30 ఏళ్లలో చైనాను ›ప్రపంచ ఆర్థికశక్తిగా, ప్రపంచస్థాయి మిలటరీ శక్తిగా రూపుదిద్దే తన జీవితకాల లక్ష్యాన్ని సాధించేందుకు జిన్‌పింగ్‌కు తాజా నిర్ణయం దోహదపడతుందని భావిస్తున్నారు.
పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలను చేపట్టడంతో పాటు పార్టీ కఠినమైన క్రమశిక్షణ పాటించేలా చేయడం, వివిధస్థాయిల్లో అవినీతిని అంతమొందించేందుకు తీసుకున్న ధృడచిత్త వైఖరి ఆయనకు ప్రజాదరణ తెచ్చిపెట్టింది. ఈ విషయంలో పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారిని కూడా ఉపేక్షించలేదనే పేరు గడించారు. ఇప్పటికే ఆయన చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రధానకార్యదర్శిగా, చైనా పీపుల్స్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్‌గా దేశంలోని అన్ని వ్యవస్థలపై కీలకబాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నేపథ్యమిదీ...
విప్లవోద్యమ కాలంలో నిర్వహించిన పాత్రతో జిన్‌పింగ్ తండ్రి పార్టీలో కీలకబాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయనను తప్పించడంతో షీ కుటుంబం కష్టాలు ఎదుర్కొంది. పార్టీలో జిన్‌పింగ్ నిబద్ధతతో, అత్యంత క్రమశిక్షణతో పనిచేశారు. 1971లోనే కమ్యూనిస్ట్ యూత్‌లీగ్‌లో చేరారు. పార్టీలో చేరేందుకు పదిసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమై 1974లో దానిని సాధించగలిగారు.
1999లో ఫుజియన్ ప్రావిన్స్ గవర్నర్ పదవిని చేపట్టారు. 2002లో ఝేజియాంగ్ ప్రావిన్స్, 2007లో షాంఘై పార్టీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. 2007లోనే పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో, సెంట్రల్ సెక్రటేరియట్‌లో చేరారు. హుజింటావో అధ్యక్షుడిగా ఉన్నపుడు 2008–13 మధ్యలో ఉపాధ్యక్షుడిగా, 2010–12 మధ్యకాలంలో సెంట్రల్ మిలటరీ కమిషన్ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. 2012లో తొలిసారిగా ప్రధానకార్యదర్శి పదవిని చేపట్టిన ఆయన 2017లో మళ్లీ ఆ పదవికి ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment