life term
-
11మంది సీపీఎం కార్యకర్తలకు జీవితఖైదు
తిరువనంతపురం : సీపీఎం పార్టీకి చెందిన 11 మంది కార్యకర్తలకు కేరళలోని తలస్సెరీ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. 2008లో బీజేపీ కార్యకర్త మహేశ్ హత్య కేసులో నిందితులగా ఉన్న వీరిని దోషులుగా గుర్తించిన కోర్టు గురువారం శిక్ష ఖరారు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆటో నడుపుతూ జీవనం సాగించే మహేశ్ తొలుత సీపీఎం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. ఆ తర్వాత అతడు బీజేపీలో చేరాడు. అది జీర్ణించుకోలేకపోయిన కొంతమంది సీపీఎంకు చెందిన కార్యకర్తలు అతనిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. 2008 మార్చి 6వ తేదీన పథకం ప్రకారం మహేశ్‌పై దాడికి దిగి అతన్ని హతమార్చారు. ఆ తర్వాత తలస్సెరీ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ కేసుపై సుదీర్ఘ కాలంపాటు విచారణ జరిపిన కోర్టు సీపీఎం పార్టీకి చెందిన ధనేశ్, ఉత్తమన్, బాబు, ప్రకాశన్, ఉమేశ్, రంజిత్, ముకేశ్, పురుషోత్తమన్, సునేశ్, సూరజ్, శిజులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరింది. -
చైనా సర్వోన్నత నేత జిన్‌పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇక జీవితకాలం ఆ పదవిలో కొనసాగేందుకు మార్గం అధికారికంగా సుగమమైంది. ఓ వ్యక్తి అధ్యక్షుడిగా రెండు కంటే ఎక్కువసార్లు పనిచేయకూడదంటూ ఉన్న పరిమితిని ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు ఆ దేశ పార్లమెంటు ఆదివారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జిన్‌పింగ్ రెండోసారి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇకపై కూడా ఆయన ఎన్నాళ్లు కోరుకుంటే అన్నాళ్లు, కావాలంటే చనిపోయేంత వరకు కూడా అధ్యక్షుడిగా ఉండొచ్చు. ఇటీవలి దశాబ్దాల్లో చైనాలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా జిన్‌పింగ్ ఎదిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) స్థాపక చైర్మన్ అయిన మావో జెడాంగ్ తర్వాత అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగనున్న నేతగా జిన్‌పింగ్ రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఎవరూ రెండు కన్నా ఎక్కువసార్లు చేపట్టకూడదంటూ ఉన్న నిబంధనను రద్దు చేయాలని ఇటీవల జరిగిన సీపీసీ మహాసభల్లో తీర్మానించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులపై ఉన్న పరిమితిని ఎత్తివేయాలన్న సీపీసీ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదించింది. పొరుగుదేశాలకు ఆందోళనకరం.. జిన్‌పింగ్‌కు జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం కల్పించడం భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు ఆందోళన కలిగించే అంశం. 2013లో జిన్‌పింగ్ అధ్యక్షుడయ్యాక ఆయా దేశాలతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. భారత్‌తో డోక్లాం వివాదం తెలిసిందే. భారత్‌కు శత్రుదేశమైన పాకిస్తాన్‌కు చైనా బాగా దగ్గరవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా–పాక్ ఆర్థిక కారిడార్‌ను కూడా నిర్మిస్తోంది. మాల్దీవులు, శ్రీలంకల్లోనూ తన ప్రాబల్యాన్ని బాగా పెంచుకుంది. రోడ్డు, రైల్వే ప్రాజెక్టులతో నేపాల్‌తో కూడా సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలతోనూ విభేదాలను చైనా పెంచుకుంది. ఇవన్నీ జిన్‌పింగ్ అధ్యక్షుడయ్యాక జరిగినవే. ఈ నేపథ్యంలో జీవితకాలం పదవిలో కొనసాగే అవకాశాన్ని ఆయనకు కల్పించడం పొరుగుదేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యంత ప్రాధాన్యం... చైనాను ఆర్థికంగా, సైనికపరంగా ‘సూపర్‌పవర్’గా మార్చాలనేదే జిన్‌పింగ్ లక్ష్యం. మరో 30 ఏళ్లలో చైనాను ›ప్రపంచ ఆర్థికశక్తిగా, ప్రపంచస్థాయి మిలటరీ శక్తిగా రూపుదిద్దే తన జీవితకాల లక్ష్యాన్ని సాధించేందుకు జిన్‌పింగ్‌కు తాజా నిర్ణయం దోహదపడతుందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలను చేపట్టడంతో పాటు పార్టీ కఠినమైన క్రమశిక్షణ పాటించేలా చేయడం, వివిధస్థాయిల్లో అవినీతిని అంతమొందించేందుకు తీసుకున్న ధృడచిత్త వైఖరి ఆయనకు ప్రజాదరణ తెచ్చిపెట్టింది. ఈ విషయంలో పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారిని కూడా ఉపేక్షించలేదనే పేరు గడించారు. ఇప్పటికే ఆయన చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రధానకార్యదర్శిగా, చైనా పీపుల్స్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్‌గా దేశంలోని అన్ని వ్యవస్థలపై కీలకబాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేపథ్యమిదీ... విప్లవోద్యమ కాలంలో నిర్వహించిన పాత్రతో జిన్‌పింగ్ తండ్రి పార్టీలో కీలకబాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయనను తప్పించడంతో షీ కుటుంబం కష్టాలు ఎదుర్కొంది. పార్టీలో జిన్‌పింగ్ నిబద్ధతతో, అత్యంత క్రమశిక్షణతో పనిచేశారు. 1971లోనే కమ్యూనిస్ట్ యూత్‌లీగ్‌లో చేరారు. పార్టీలో చేరేందుకు పదిసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమై 1974లో దానిని సాధించగలిగారు. 1999లో ఫుజియన్ ప్రావిన్స్ గవర్నర్ పదవిని చేపట్టారు. 2002లో ఝేజియాంగ్ ప్రావిన్స్, 2007లో షాంఘై పార్టీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. 2007లోనే పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో, సెంట్రల్ సెక్రటేరియట్లో చేరారు. హుజింటావో అధ్యక్షుడిగా ఉన్నపుడు 2008–13 మధ్యలో ఉపాధ్యక్షుడిగా, 2010–12 మధ్యకాలంలో సెంట్రల్ మిలటరీ కమిషన్ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. 2012లో తొలిసారిగా ప్రధానకార్యదర్శి పదవిని చేపట్టిన ఆయన 2017లో మళ్లీ ఆ పదవికి ఎన్నికయ్యారు. -
విజయవాడ కోర్టు సంచలన తీర్పు
-
విజయవాడ కోర్టు సంచలన తీర్పు
విజయవాడ: యువతులకు మత్తుమందు ఇచ్చి.. వారిపై అత్యాచారం జరిపిన కేసులో విజయవాడ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఓ ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి శిక్ష ఖరారు చేసింది. ఏ-1 నిందితుడు నిమ్మకూరి సాయిరామ్‌కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీపక్, అభిలాష్, మున్నాలకు 20 ఏళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది. మరో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. విజయవాడలో 2014 సంవత్సరం ఆగస్టు 23న ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన నిమ్మకూరి సాయిరాం, దీపక్, అభిలాష్, అబ్దుల్ ఖాదర్ అలియాస్ మున్నా, దుర్గా ప్రసాద్ అనే ఐదుగురు యువకులు కొంతమంది యువతులపై అత్యాచారం చేశారు. ఈ ఘటనను వీడియాలుగా తీసి అందరూ షేర్ చేసుకోవటమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురినీ అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో ఐదుగురు నేరం చేసినట్లు నిరూపణ కావడంతో విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ ముఠా సభ్యుల్లో ఓ మైనర్ బాలుడు ఉండటంతో అతడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. -
ఆ క్రూరుడికి జీవితఖైదు
కల్బుర్గి: 14 ఏళ్ల బాలికను పదేళ్ల పాటు రేప్ చేసిన కిరాతకుడికి బీదర్ జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 5 వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. నేరస్తుడి ఆస్తులను జప్తు చేసి బాధితురాలికి రూ.5 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. 2002లో ఆరుద్ పట్టణ ప్రైమరీ స్కూల్ చైర్మన్ గా ఉన్న మారుతి అమ్రేప్ప తారే ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్నారిని వేధించడం ప్రారంభించాడు. అప్పటికే ఇద్దరు బిడ్డలకు తండ్రయిన మారుతి చిన్నారిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను కోరగా వారు చదువు మాన్పించి, మంగుళూరులో చదువుకోవడానికి పంపేశారు. మంగుళూరు వెళ్లిన మారుతి ఆమెను అక్కడి నుంచి తీసుకువచ్చి తన ఇంట్లో పెళ్లి చేసుకున్నాడు. ఆయనను కూతురు కూడా ఇష్టపడుతుందేమోనని అనుకున్న తల్లిదండ్రులు ఏం చేయలేకపోయారు. అప్పటి నుంచి బాలిక తొమ్మిది సార్లు గర్భవతి అయిన ఆమెకు ఎనిమిది సార్లు అబార్షన్ చేయించాడు. తొమ్మిదో సారి వారి ఇద్దరికి బిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మారుతి బిడ్డను ఉదయగిరిలోని ఆశ్రమంలో వదిలేసి వచ్చాడు. 2012లో ఆమె మరలా గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడు. దాన్ని వ్యతిరేకించిన ఆమెను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దీంతో తల్లిదండ్రులను ఆశ్రయించిన ఆమె ఆరుద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంజీవ్ కుమార్ హంచాటే నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. -
పసికందును చంపిన తల్లికి జీవిత ఖైదు
కాలిఫోర్నియా: అమెరికాలో నెల రోజుల ఆడశిశువును చంపిన కేసులో తల్లికి జీవిత ఖైదు పడింది. కాలిఫోర్నియా కోర్టు క యంగ్ (34) అనే మహిళకు 26 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. 2011లో క యంగ్ తన బిడ్డను మైక్రోవేవ్ ఓవెన్లో ఐదు నిమిషాల పాటు ఉంచింది. తీవ్రంగా గాయపడిన పసికందు మరణించింది. కాగా యంగ్ మూర్ఛ వ్యాధితో బాధపడుతోందని, ఆ సమయంలో ఏం చేసిందో ఆమె తెలుసుకునే స్థితిలో లేదని ఆమె తరపు న్యాయవాది వాదించారు. అయితే కోర్టు ఈ వాదనలను తోసిపుచ్చుతూ క యంగ్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. కాగా ఆమెకు మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
'జీవితఖైదు పడినా క్షమాభిక్ష పెట్టొచ్చు'
న్యూఢిల్లీ: జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీల ను శిక్ష తగ్గించి, విడుదల చేసేందుకు రాష్ట్రాల కున్న అధికారాలపై నిరుడు విధించిన స్టేను సుప్రీంకోర్టు గురువారం తొలగించింది. జీవిత ఖైదీలను విడుదల చేసేందుకు కొన్నిషరతులతో కూడిన అనుమతిని రాష్ట్రాలకిచ్చింది. ఆ షరతుల ప్రకారం.. * సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణజరిగి,శిక్షఅనుభవిస్తున్న ఖైదీలకు.. * టాడా వంటి కేంద్ర చట్టాల కింద దోషులుగా తేలిన వారికి.. * లైంగికపరమైన ఘోర నేరాలైన హత్యాచారం(అత్యాచారం+ హత్య) చేసినవారికి.. * కనీసం 14 ఏళ్లు జైలుశిక్ష అనుభవించని ఖైదీలకు.. జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలని స్పష్టంగా పేర్కొన్న ఖైదీలకు.. * 20 నుంచి 25 ఏళ్లంటూ శిక్షాకాలాన్ని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నవారికి.. శిక్షను తగ్గించి, జైలు నుంచి విడుదల చేయకూడదు. వారి విషయంలో రాష్ట్రాలకున్న ‘శిక్ష తగ్గింపు’ అధికారం వర్తించదు. ఈ ఆదేశాలు మాజీ ప్రధాని రాజీవ్ హంతకుల విడుదలకు సంబంధించిన పిటిషన్‌కు వర్తించబోవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ పిటిషన్‌పై తామివ్వనున్న తుది తీర్పు ప్రకారం నడుచుకోవాలని పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగానే గత సంవత్సరం.. జీవిత ఖైదీల శిక్ష తగ్గింపు, విడుదలకు సంబంధించి రాష్ట్రాలకున్న అధికారాలపై సుప్రీం స్టే విధించింది. మరణ శిక్ష మేలు కదా! ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జీవితాంతం జైళ్లో ఉంచడం కన్నా.. ఆ దోషులకు మరణ శిక్ష విధించడం మంచిది కదా అని పేర్కొంది. ‘మనమంతా ఏదో ఆశతో జీవిస్తాం. జీవితాంతం జైల్లోనే మగ్గాల్సిన ఖైదీలకు ఆశలుండవు. మరి వారిని జైళ్లో ఉంచడంలో అర్థమేముంది? వారికి మరణశిక్ష విధించండి.. అదే మేలు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చనిపోయేవరకు జైళ్లో ఉంచ డం వెనుక హేతువు ఏంటని కేంద్రాన్ని ప్రశ్నిం చింది. ‘తప్పు చేసిన వారిలో మార్పును తీసుకువచ్చే శిక్షాస్మృతిని మనం ఆచరిస్తున్నాం. జీవి తాంతం జైళ్లోనే ఉండాల్సిన ఖైదీ తాను మారాలని ఎందుకనుకుంటాడు?’ అని ప్రశ్నించింది. -
'జీవితఖైదు పడినా క్షమాభిక్ష పెట్టొచ్చు'
-
భర్తను హత్య చేసిన కేసులో భార్యకు యావజ్జీవం
ముంబై: భర్తను చంపిన భార్యకు ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు ఖరారు చేసింది. సోనాలి గిరి (26) ట్రయల్ కోర్టు తనకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ తాహిల్ రమణి, విఎల్ అచ్లీయాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారణ జరిపింది. బీర్‌బార్‌లో పనిచేసే సోనాలి గిరి డిసెంబర్ 30, 2009లో మద్యం సేవించి ఇంటికి వచ్చింది. మరుసటి రోజు భర్త సంతోష్ సోదరుడు సంజయ్‌కి ఫోన్ చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ చేసింది. వారు వచ్చి చూసేటప్పటికీ మృతదేహం నేలపైనే పడిఉంది. వైద్య పరీక్షలో సంతోష్‌ది ఆత్మహత్య కాదని, హత్యకు గురయ్యాడని తేలింది. వైద్య నివేదికల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేసిన ట్రయల్ కోర్టు ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించి దోషిగా ప్రకటించింది. -
బాలికను వ్యభిచారకూపంలోకి దింపిన వ్యక్తికి యావజ్జీవం
న్యూఢిల్లీ: స్వయానా అన్న కూతురిపైనే అత్యాచారం జరడమేగాక, ఆమెకు వ్యభిచారకూపంలోకి దింపిన 50 ఏళ్ల వయస్కుడికి యావజ్జీవం విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. నిందితుడు, ఉత్తరప్రదేశ్వాసి పన్నూ అత్యాచారం, సామూహిక అత్యాచారం, బెదిరింపులు, నేరపూరిత కుట్ర, అక్రమ నిర్భందం వంటి నేరాలకు పాల్పడ్డట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి వీరేందర్ భట్ నిర్ధారించారు. ఇతడు చేసిన నేరాలు అత్యంత క్రూరమైనవి, రాక్షసప్రవృత్తితో కూడుకున్నవని ఆయన వ్యాఖ్యానించారు. బాలిక తండ్రి మరణించిన తరువాత ఆమెకు చదువు చెప్పిస్తానని 2003లో ఢిల్లీకి తీసుకొచ్చి కామవాంఛ తీర్చుకున్నాడని పేర్కొన్నారు. బాలికతో బలవంతంగా మద్యం తాగించి నగ్నంగా నృత్యాలు చేయించాడని పేర్కొన్నారు. స్నేహితులతో కలిసి సామూహికంగా అత్యాచారం కూడా చేశాడని కోర్టు ప్రకటించింది. బాలిక పనిచేసే ఇంటి యజమాని పన్నూ దురాగతాల గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఢిల్లీ కంటోన్మెంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.