'జీవితఖైదు పడినా క్షమాభిక్ష పెట్టొచ్చు'
న్యూఢిల్లీ: జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీల ను శిక్ష తగ్గించి, విడుదల చేసేందుకు రాష్ట్రాల కున్న అధికారాలపై నిరుడు విధించిన స్టేను సుప్రీంకోర్టు గురువారం తొలగించింది. జీవిత ఖైదీలను విడుదల చేసేందుకు కొన్నిషరతులతో కూడిన అనుమతిని రాష్ట్రాలకిచ్చింది. ఆ షరతుల ప్రకారం..
* సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణజరిగి,శిక్షఅనుభవిస్తున్న ఖైదీలకు..
* టాడా వంటి కేంద్ర చట్టాల కింద దోషులుగా తేలిన వారికి..
* లైంగికపరమైన ఘోర నేరాలైన హత్యాచారం(అత్యాచారం+ హత్య) చేసినవారికి..
* కనీసం 14 ఏళ్లు జైలుశిక్ష అనుభవించని ఖైదీలకు.. జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలని స్పష్టంగా పేర్కొన్న ఖైదీలకు..
* 20 నుంచి 25 ఏళ్లంటూ శిక్షాకాలాన్ని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నవారికి..
శిక్షను తగ్గించి, జైలు నుంచి విడుదల చేయకూడదు. వారి విషయంలో రాష్ట్రాలకున్న ‘శిక్ష తగ్గింపు’ అధికారం వర్తించదు. ఈ ఆదేశాలు మాజీ ప్రధాని రాజీవ్ హంతకుల విడుదలకు సంబంధించిన పిటిషన్‌కు వర్తించబోవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ పిటిషన్‌పై తామివ్వనున్న తుది తీర్పు ప్రకారం నడుచుకోవాలని పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగానే గత సంవత్సరం.. జీవిత ఖైదీల శిక్ష తగ్గింపు, విడుదలకు సంబంధించి రాష్ట్రాలకున్న అధికారాలపై సుప్రీం స్టే విధించింది.
మరణ శిక్ష మేలు కదా!
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జీవితాంతం జైళ్లో ఉంచడం కన్నా.. ఆ దోషులకు మరణ శిక్ష విధించడం మంచిది కదా అని పేర్కొంది. ‘మనమంతా ఏదో ఆశతో జీవిస్తాం. జీవితాంతం జైల్లోనే మగ్గాల్సిన ఖైదీలకు ఆశలుండవు. మరి వారిని జైళ్లో ఉంచడంలో అర్థమేముంది? వారికి మరణశిక్ష విధించండి.. అదే మేలు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చనిపోయేవరకు జైళ్లో ఉంచ డం వెనుక హేతువు ఏంటని కేంద్రాన్ని ప్రశ్నిం చింది. ‘తప్పు చేసిన వారిలో మార్పును తీసుకువచ్చే శిక్షాస్మృతిని మనం ఆచరిస్తున్నాం. జీవి తాంతం జైళ్లోనే ఉండాల్సిన ఖైదీ తాను మారాలని ఎందుకనుకుంటాడు?’ అని ప్రశ్నించింది.