Rajiv Gandhi assassination case
-
మమ్మల్ని క్షమించండి... ఆ దారుణానికి చింతిస్తున్నా!: నళిని శ్రీహరన్
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా తేలిన నళిని తోపాటు మరో ఐదుగురు నిందితులను విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజీవ్ గాందీ హత్య కేసులో దోషులలో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడుతూ...."ఆ దారుణం గురించి ఆలోచిస్తూ చాలా ఏళ్లు గడిపాం. మమ్మల్ని క్షమించండి. ఆ ఆత్మహుతి దాడి ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారు ఆ విషాదం నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను." అని బాధితుల కుటుంబాలకు నళిని పశ్చాత్తాపంతో కూడిన సందేశం ఇచ్చింది. తాను తన భర్తతో కలిసి యూకే వెళ్లి స్థిరపడాలనుకున్నట్లు తెలిపారు. గాంధీ కుటుంబాన్ని కలుస్తారా అని మీడియా ప్రశ్నించగా...వారు కలుస్తారని అనుకోను, కలిసే సమయం అయిపోయిందని భావిస్తున్నాను అని నళిని అన్నారు. అయితే రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఐతే ఈ తీర్పుని తమిళనాడులో చాలా మంది స్వాగతించారు. ఖైదీల సత్ప్రవర్తన, ఈ కేసులో దోషిగా తేలిన మరో వ్యక్తి ఏజీ పెరరివాలన్ మేలో విడుదల కావడం, అతడు అరెస్టు అయ్యే సమయానికి 19 ఏళ్లు కావడం, అదీగాక దోషులంతా 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించడం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. (చదవండి: రాజీవ్ హత్య కేసు: ఎట్టకేలకు నళినికి విడుదల.. జైలు జీవితం ఎన్ని రోజులో తెలుసా?) -
Rajiv Gandhi Case: ఆ ఫొటోగ్రాఫర్ ఇంట్లో దొరికిన రసీదే.. హంతకులను తెరపైకి తెచ్చిందా?!
లంక పరిణామాలు మన దేశంలో భారీ మార్పులు తీసుకువచ్చాయి. ప్రభాకరన్‌ను లంక సైన్యం మట్టుపెట్టడం, ఎల్టీటీఈ తన శ్రేణులన్నీ కోల్పోవడంతో జాఫ్నాతో పాటు ఉత్తర ప్రాంతమంతా లంక సైన్యం ఆధీనంలోకి వచ్చింది. అంతర్యుద్ధం ముగిసిందని అప్పటి అధ్యక్షుడు రాజపక్సే ప్రకటించారు. లంకలో తమిళుల ప్రాభవం వేగంగా కోల్పోవడంతో ఇక్కడ ఖైదీల మీద వీపరీతంగా సానుభూతి పెరిగింది. ఈలోగా జైల్లో ఉన్న ఏడుగురు ఖైదీలు తమను క్షమించమంటూ అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతిభా పాటిల్ దీన్ని నిర్దంద్వంగా తోసిపుచ్చారు. ఈ లోగా మరో పిటిషన్ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కింది. వాదోపవాదాలు, అప్పటి పరిస్థితుల దృష్ట్యా మద్రాస్ హైకోర్టు ఉరి శిక్షపై స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇది ఎల్టీటీఈ ఖైదీలకు పెద్ద ఊరట. ఉరిశిక్ష స్థానంలో యావజ్జీవ శిక్షను సూచించింది సుప్రీంకోర్టు. ఈలోగా రాజీవ్ గాంధీ కుటుంబానికి తమిళుల వినతులు వెల్లువెత్తాయి. నేరుగా రాజీవ్ కూతురు ప్రియాంక, కొడుకు రాహుల్ గాంధీ నేరస్థులను జైల్లో కలిశారు. పరిస్థితి ఎందాక వెళ్లిందంటే మొత్తం సమాజం నేరస్థులను క్షమించారా అన్నంత చర్చకు దారి తీసింది. ఈలోగా తమిళనాడు సీఎం జయలలిత ఓ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. 23ఏళ్లకు పైగా జైల్లో ఉన్న అందరూ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఢిల్లీలో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దేశానికి అత్యున్నత పదవుల్లో ఒకటయిన ప్రధానిగా పని చేసిన రాజీవ్‌గాంధీ హత్యకు గురయితే, దానికి కారకులను ఓ రాష్ట్రం ఎలా విడిచిపెడతారన్న చర్చ జరిగింది. ఇదే విషయం సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలుత తమిళనాడు నిర్ణయంపై స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. జయ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాజీవ్ హంతకుల విడుదలపై నిర్ణయం తీసుకునే హక్కు తమిళనాడు ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ముగ్గురు న్యాయమూర్తుల డివిజన్ బెంచ్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. జైల్లో నుంచి బయటపడతామని కోటి ఆశలు పెట్టుకున్న ఎల్టీటీఈ ఖైదీలు సుప్రీం తీర్పుతో నిరాశకు గురయ్యారు. అయితే వారిలో ఆశ మాత్రం చావలేదు. దానికి కారణం తమిళులు, వారి రాజకీయాలు. చదవండి: (రాజీవ్ హత్య.. సినిమాను మించే ట్విస్ట్‌లు.. అసలు ఆనాడేం జరిగింది?) నాడు రాజీవ్ హంతకులను పట్టుకోవడానికి కార్తికేయన్ సారధ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచిత్ర పరిస్థితుల మధ్య పలు రకాల అవాంతరాల నడుమ సిట్ పట్టువదలకుండా దర్యాప్తు కొనసాగించింది. విమర్శలు వచ్చినా, సమస్యలు ఎదురైనా ఢీలా పడకుండా విచారణ సాగించిన సిట్ ఈ దారుణానికి పాల్పడింది ఎల్టీటీఈ అని తేల్చింది. ఫోటోగ్రాఫర్ హరిబాబు ఇంట్లో దొరికిన రసీదును ఆధారంగా చేసుకొని తీగ లాగిన సిట్.. హంతకుల పేర్లను తెరపైకి తెచ్చింది. 1991.. దేశమంతటా అస్థిర వాతావరణం నెలకొన్న సమయం. కేంద్రంలో ప్రభుత్వాలు ఒకదాని వెంట ఒకటి కూలిపోయిన తరుణం. అలాంటి సమయంలో లోక్‌సభకు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రచార భారం రాజీవ్‌గాంధీపై పడింది. అప్పటికే దేశమంతా తిరుగుతున్న ఆయన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారంపై దృష్టి పెట్టిన ఆయన అందుకు తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 1991, మే 20 నుంచి 22 వరకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారం ముగించుకొని 22 సాయంత్రం వరకైనా రాజీవ్ ఢిల్లీకి చేరుకోవాలి. ఇదీ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ పర్యటన వరకు అన్నీ అనుకున్న ప్రకారం జరిగాయి. కానీ 21న పరిస్థితి మొత్తం మారిపోయింది. -
రాజీవ్ హత్య కేసు దోషికి బెయిల్
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యోదంతం కేసులో దోషిలా తేలిన ఏజీ పెరారివాలన్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరుచేసింది. పెరారివాలన్‌కు గతంలో యావజ్జీవ కారాగార శిక్ష పడటంతో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అయితే, గత 30 సంవత్సరాలుగా ఆయన జైల్లో మగ్గిపోయారని, పెరోల్ కాలంలోనూ సత్ప్రవర్తనతో మెలిగాడని బెయిల్ ఉత్తర్వుల మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎండీఎంఏ కేసు పూర్తయ్యేదాకా తన జీవితకాల శిక్షను రద్దు చేయాలంటూ 47 ఏళ్ల పెరారివాలన్ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1991 మే 21న రాజీవ్‌గాంధీని మహిళా ఆత్మాహుతి బాంబర్ ధను హత్యచేయడం తెల్సిందే. ఈ ఘటనలో ప్రమేయమున్న మురుగన్, సంథమ్, నళినిలతోపాటు పెరారివాలన్‌లకు ఉరిశిక్ష పడింది. అయితే శంథన్, మురుగన్, పెరారివాలన్‌ల క్షమాభిక్ష పిటిషన్లు 11 ఏళ్లపాటు పెండింగ్‌లో ఉండటంతో 2014 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు పెరారివాలన్ ఉరిశిక్షను యావజ్జీవశిక్షగా మారుస్తూ తీర్పు చెప్పింది. (చదవండి: ‘ఈవీఎం’ ఆరోపణలు.. ఈసీ కీలక నిర్ణయం) -
రాజీవ్ గాంధీ హంతకులకు దీర్ఘకాలిక పెరోల్?
సాక్షి, చెన్నై : రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు దీర్ఘకాలం ఆంక్షలు, షరతులతో జైలు బయట ఉండేందుకు వీలుగా పెరోల్ నిబంధనల్లో మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రాజీవ్ హత్య కేసులో నిందితులను విడుదల చేయాలని గత మంత్రి వర్గం తీర్మానం చేయడం, దాన్ని గవర్నర్ రాష్ట్రపతికి పంపడం తెలిసిందే. తమను విడుదల చేస్తూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని నిందితులు న్యాయ పోరాటం చేశారు. చివరకు బంతి మళ్లీ రాష్ట్రపతి కోర్టులోకి చేరింది. డీఎంకే రాష్ట్ర పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఎన్నికల వాగ్దానంగా నిందితుల విడుదలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. అయితే చట్టపరమైన చిక్కులు డీఎంకేను కలవరంలో పడేస్తున్నాయి. ఈ క్రమంలోనే తన కుమారుడితో సహా మిగిలిన వారిని విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని పేరరివాలన్ తల్లి అర్బుదమ్మాల్ బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎం స్టాలిన్‌ను కలిసి విన్నవించారు. వారి విడుదలకు ఎదురవుతున్న చట్టపరమైన చిక్కుల్ని అధిగమించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ మేరకు నిందితులు ఎక్కువ కాలం జైలులో కాకుండా షరతులు, నిబంధనలకు అనుగుణంగా తమ కుటుంబంతో కలిసి ఉండేందుకు వీలుగా ఈ మార్గాన్ని ఎంచుకునే పనిలో పడినట్టు సమాచారం. వీరి కోసమే పెరోల్ నిబంధనల్ని మార్పులు చేయడానికి కసరత్తులు సాగుతున్నాయి. నిందితులు ఏడుగురిలో పెరరివాలన్, నళిని, రవిచంద్రన్ మాత్రం తమిళనాడుకు చెందిన వారు. మిగిలిన నలుగురు శ్రీలంకకు చెందిన వారు. ఆ ముగ్గురు కుటుంబంతో గడిపేందుకు వీలుగా, మిగిలిన నలుగురిని శ్రీలంకకు పంపించకుండా ఇక్కడి శరణార్థుల శిబిరంలో స్వేచ్ఛాయుత జీవితాన్ని గడిపేందుకు తగినట్టు దీర్ఘ కాలిక పెరోల్ కసరత్తు సాగుతుండటం గమనార్హం. -
ఎట్టకేలకు పెరోల్‌పై విడుదలైన నళిని
సాక్షి, చెన్నై: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవితఖైదు అనుభవిస్తున్న నళిని ఎట్టకేలకు పెరోల్‌పై గురువారం జైలు నుంచి విడుదలైంది. తన కుమార్తె హరిత వివాహానికి ఆరు నెలలు పెరోల్ కావాలని మద్రాస్ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. అయితే నళినికి ఆరు నెలలు ఇవ్వలేమనీ, ఇతర సాధారణ ఖైదీల్లాగే 30 రోజుల పెరోల్‌ను కోర్టు మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన నళినినీ తీసుకువెళ్లేందుకు ఆమె తల్లి వచ్చింది. ఈ సందర్భంగా నళిని మాట్లాడుతూ తన కుమార్తె విషయంలో తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించలేకపోయానని, అంతేకాకుండా తండ్రి చనిపోయిన తర్వాత కూడా కుమార్తెగా కుటుంబానికి ఏమీ చేయలేకపోయాని, పెరోల్ లభించిన సందర్భంగా కుటుంబాన్ని కలవడంతో పాటు కుమార్తె వివాహాన్ని దగ్గరుండి జరిపించనున్నట్లు నళిని తెలిపింది. కాగా రాజీవ్ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత 28 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖ పట్నం నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు. కాగా గతంలోనూ న్యాయస్థానం ఆమెకు ఒక్కరోజు పెరోల్ ఇచ్చింది. గత ఏడాది నళిని తండ్రి శంకర్ నారాయణన్ అంత్యక్రియల కార్యక్రమానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. -
రాజీవ్‌గాంధీ హంతకురాలు నళినీకి పెరోల్
-
ఇంతకు రాజీవ్ హంతకులు విడుదలవుతారా?
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో తమకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతూ ఏడుగురు దోషులు పెట్టుకున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారం తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌కు ఉందంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం, దోషులను తాను ఎప్పుడో క్షమించేశానని రాజీవ్ గాంధీ తనయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో దోషులు విడుదలయ్యే అవకాశం ఉందా ! అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. దోషులందరిని విడుదల చేయాల్సిందిగా ఆదివారం నాడు తమిళనాడు కేబినెట్ కూడా తీర్మానించి ఆ మేరకు రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసును పునర్ పరిశీలించాల్సిందిగా తిప్పి పంపే అధికారం రాష్ట్రపతి లాగా గవర్నర్‌కు లేనందున గవర్నర్ సిఫార్సును ఆమోదించి దోషుల విడుదలకు ఆదేశాలు జారీ చేస్తారా? ఆయన చేసినంత మాత్రాన దోషులు విడుదలవుతారా? గవర్నర్ నిర్ణయాన్ని తిరిగి కేంద్రం సవాల్ చేసే అవకాశం లేదా? ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గవర్నర్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకు అనుమతిస్తుందా? అనుమతిస్తే అందుకు ప్రజల సానుభూతి కేంద్రానికి లభిస్తుందా ? కాంగ్రెస్ పార్టీకి లభిస్తుందా? లేదా మొదటి నుంచి దోషుల విడుదలను కోరుతున్న తమిళనాడు ప్రభుత్వానికి దక్కుతుందా? రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్షలు అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం 2014లో నిర్ణయించింది. భారతీయ శిక్షాస్మతిలోని 432 సెక్షన్ కింద దోషుల శిక్షను తగ్గించేందుకు లేదా రద్దు చేసేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండడంతో నాడు తమిళనాడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే తమిళనాడు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. కేసును రాష్ట్ర పోలీసులు కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ విచారించినందున ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం ఓ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అందుకు కేంద్రం అనుమతి తప్పనిసరని కేంద్రం వాదించింది. దీంతో కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది. 2015లో అదే భారతీయ శిక్షాస్పతిలోని 435 సెక్షన్ కింద కేంద్రం అనుమతి తప్పనిసరంటూ కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయితే భారత రాజ్యాంగంలోని 161వ అధికరణ కింద రాష్ట్ర గవర్నర్ దోషులకు క్షమాభిక్షను ప్రసాదిస్తే 435 సెక్షన్ కింద కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దోషులను విడుదల చేయవచ్చని అదే తీర్పులో సుప్రీం కోర్టు సూచించింది. దీంతో పాతికేళ్లకుపైగా జైలు శిక్షను అనుభవిస్తున్న ఏడుగురు దోషులు తమిళనాడు గవర్నర్‌కు మెర్సీ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాటిని ఆమోదించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర కేబినెట్ ఆదివారం నాడు సిఫార్సు చేసింది. దోషులను విడుదల చేయడం వల్ల అంతర్జాతీయ పర్వవసానాలను ఎదుర్కోవల్సి వస్తుందంటూ ప్రతి దశలో దోషుల విడుదలను అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి మాత్రం గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేయదా? చేయడానికి చట్టపరంగా అవకాశాలు కూడా ఉన్నాయి. క్షమించే అధికారం...ఆంక్షలు వివిధ కేసుల్లో శిక్ష పడిన దోషులకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసే అధికారాలను రాజ్యాంగంలోని 72వ అధికరణ కల్పిస్తుండగా, అలాంటి అధికారాలనే రాష్ట్ర గవర్నర్‌కు రాజ్యాంగంలోని 161వ అధికరణ కల్పిస్తోంది. రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాల పరిధిలోకి వచ్చే ఏ చట్టం కిందయినా, ఏ నేరానికైనా, ఎంత శిక్ష పడినా, దోషుల శిక్షను తగ్గించే అధికారం రాష్ట్ర గవర్నర్‌కు ఉంది. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి జాబితాలోని అధికారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వర్తిస్తాయి కనుక ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పరిధిలో శిక్షలు పడిన దోషులకు గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. ప్రమాణాలు ఉండాల్సిందే క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయికదా! అని వాటిని విచక్షణా రహితంగా ఉపయోగించడానికి వీల్లేదంటూ ఓ రెండు కేసుల విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మార్గదర్శకాలను సూచించింది. ‘ఇవేమి విశేషాధికారాలు కాదు. పనితీరుకు సంబంధించిన విచక్షణాధికారాలు. దోషుల క్షమాభిక్ష కారణంగా అది వారి ఒక్కరికే లాభం చేకూర కూడదు. వారితోపాటు ప్రజలకు కూడా మేలుచేస్తుందని అనుకున్నప్పుడే ఈ అధికారాలు ఉపయోగించాలి. రాజకీయ లబ్ధిని ఆశించి అసలు నిర్ణయం తీసుకోరాదు. 72వ అధికరణ కింద రాష్ట్రపతి, 162 కింద గవర్నర్‌కు సంక్రమించే అధికారాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి’ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరేం జరుగుతుంది? రాష్ట్ర కేబినెట్ సిఫార్సును తింపి పంపే అధికారం గవర్నర్‌కు లేకపోయినప్పటికీ, ఆ సిఫార్సుపై న్యాయ సమీక్షను కోరే అవకాశం ఆయనకు ఉంది. పైగా దోషులు స్వయంగా తనకే పిటిషన్లు పెట్టుకున్నందున తానే స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం రాజీవ్ హత్య కేసులో ప్రజలకు మేలు చేసే అంశం లేనందున గవర్నర్ పిటిషన్లకు తిరస్కరించే అవకాశమే ఎక్కువగా ఉంది. ఒకవేళ గవర్నర్ దోషుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకున్నా సవాల్ చేసే అధికారం కేంద్రానికి ఉంది. దోషులను ఎవరు క్షమించినా రాజీవ్‌తోపాటు మరణించిన 17 మంది వ్యక్తుల కుటుంబాలు దోషులను క్షమించక పోవచ్చు.వారైనా సవాల్ చేయవచ్చు! అంతర్జాతీయ అంశాలు దోషుల్లో ముగ్గురు శ్రీలంక జాతీయులు అవడం వల్ల అంతర్జాతీయ న్యాయ, దౌత్యపరమైన అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. శ్రీలంక జాతీయులను విడుదల చేసి వారి దేశానికి పంపిస్తే వారిని తిరిగి అరెస్ట్ చేసి వారి చట్టాల ప్రకారం విచారించి మళ్లీ శిక్ష విధించే అవకాశం ఉంది. వారికి మన దేశంలో ఆశ్రయం కల్పించాలన్నా, మరో దేశంలో ఆశ్రయం కల్పించాలన్నా దౌత్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. -
రాజీవ్‌ని చంపిన బాంబు ఎక్కడిది?
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్నలు సంధించింది. కేసు విచారణ పురోగతితోపాటు, ఆయన్ను చంపటానికి ఉపయోగించిన బాంబు ఎక్కడి నుంచి వచ్చిందన్న ఆరాలు తీసింది. 26 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో పలు దర్యాప్తు సంస్థలు చేపట్టిన విచారణ పారదర్శకంగా లేదంటూ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న దోషి ఏజీ పెరరివలన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు గురువారం పిటిషన్ పై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. " రాజీవ్ ను చంపడానికి ఉపయోగించిన బాంబు ఎక్కడిది? దానిని ఎవరు తయారు చేశారు? అసలు దానిని ఎవరు తీసుకొచ్చారు? అని ప్రశ్నలు సంధించింది. ఈ అంశంపై సోలిసిటర్ జనరల్ లేదా అదనపు సోలిసిటర్ జనరల్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడుతూ వచ్చే బుధవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది. బాంబు ఎక్కడి నుంచి వచ్చిందోనన్న అంశంపై స్పష్టత వస్తే తన క్లయింట్ నిర్దోషితత్వం నిరూపించుకునే అవకాశం లభిస్తుందని పెరరివలన్ తరపు న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణ్ తెలిపారు. మే 21, 1991 లో శ్రీపెరంబదూర్ లో రాజీవ్ గాంధీ హత్యకు గురికాగా, 1998 డిసెంబర్ 2 లో అప్పటి ప్రభుత్వం ఎండీఎంఏ(మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్ ఏజెన్సీ) అంటూ ఢిల్లీ, చెన్నైకి చెందిన సీబీఐ, మరికొన్ని పరిశోధనల సంస్థలతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బాంబుకు సంబంధించి రెండుబ్యాటరీలు తయారు చేశాడన్న ఆరోపణలపై పెరరివలన్‌కు ఉరిశిక్ష పడగా, తర్వాత అప్పీల్ తో అది యావజ్జీవ శిక్షగా కోర్టు మార్చేసింది. -
రాజీవ్ హత్య కేసులో దోషి తాజా వినతి
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ తాజా కేసులో సోమవారం ఉదయం వేలూరు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నకలు ఇవ్వాలని మురగన్ న్యాయమూర్తిని కోరారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో మురుగన్, భార్య నళినితో పాటు పేరరివాలన్, శాంతన్ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. వీరిలో నళిని మహిళా జైలులోను మిగిలిన వారు పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మురుగన్, భార్య నళిని ప్రతి 15 రోజులకు ఒకసారి కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీన మురుగన్ గదిలో జైలు అధికారులు తనిఖీలు చేపట్టిన సమయంలో రెండు సెల్ఫోన్లు, చార్జరు, రెండు సిమ్ కార్డులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై జైలు అధికారులు బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో మురుగన్ మూడు నెలలు ఎవరినీ కలిసి మాట్లాడకుండా నిషేధించారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఉదయం ఎక్సైజ్ డీఎస్పీ రామనా«థ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ సెంట్రల్ జైలు నుంచి మురుగన్‌ను ఉదయం కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఆలసియా ముందు హాజరు పరిచారు. ఆ సమయంలో మురుగన్ సెల్‌ఫోన్ ఉపయోగించిన కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నకలు కాపీని తనకు ఇప్పించాలని కోరాడు. వీటిపై అరగంట పాటు విచారణ జరిగింది. ఇదిలా ఉండగా మురుగన్‌ను చూసేందుకు శ్రీలంక నుంచి ఆయన తల్లి సోమణి వెట్రివేల్ కోర్టుకు వచ్చారు. కోర్టు ప్రాంగణంలో కుమారుడు మురుగన్‌తో మాట్లాడలేక కన్నీరు మున్నీరయ్యారు. తల్లి కన్నీటిని చూసి మురుగన్ కూడా పోలీసుల దగ్గర నుంచే కన్నీరు పెట్టాడు. అనంతరం పోలీసులు సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా ఈ నెల 29 లోపు తాను శ్రీలంక వెళ్లాల్సి ఉండగా ఆ లోపు మురుగన్‌తో కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తల్లి తెలిపారు. -
కుమార్తె పెళ్లి కోసం విడుదల చేయండి
టీనగర్: ఇరవై ఆరేళ్ల జైలు జీవితం తనను మార్చివేసిందని, తన కుమార్తె వివాహం జరిపించేందుకు తనను విడుదల చేయాలంటూ నళిని కోర్టును కోరింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితురాలు నళిని 26 ఏళ్లుగా జైల్లో ఉన్నారు. జైల్లో ఉండగా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డకు మెకరా అని నామకరణం చేశారు. నళిని భర్త మురుగన్ కూడా 26 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. మెకరా బంధువుల సంరక్షణలో ఉంది. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంటోంది. మెకరా పెళ్లి ఈడుకు వచ్చినందున ఆమెకు వివాహం చేసేందుకు నళిని ఆశిస్తోంది. 51 ఏళ్ల వయసుగల నళిని శారీరకంగా, మానసికంగా కృంగిపోయారు. ఆమె న్యాయవాది పుహలేంది తరపున రాతపూర్వకంగా ఇచ్చిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. తాను గత 26 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నానని, తన భవిష్యత్తు ఎలావుంటుందో చెప్పలేనన్నారు. 2008 మార్చి నెలలో ఒక మహిళ వేలూరు జైలుకు వచ్చింద ని, ఆమెను తాను సరిగా గుర్తించలేకపోయానని తెలిపారు. తాను ప్రియాంకా అని తెలియజేయడంతో తాను నమ్మలేకపోయానని పేర్కొన్నారు. ఆ తర్వాత తేరుకున్న తాను తనకేమీ తెలియదమ్మా? అన్నానని, అందుకు ప్రియాంకా తన తండ్రి ఎంతో మంచి వ్యక్తి అని, ఎందుకు ఇలా చేశారు? కారణమేంటి? ఏ సమస్య అయినా చర్చలతో పరిష్కరించుకోవచ్చు కదా! అన్నట్లు తెలిపారు. దీన్ని తాను తట్టుకోలేక బిగ్గరగా రోదించానని, ప్రియాంకతో నాటి కలయిక ఇప్పటికీ మరచిపోలేకున్నట్లు తెలిపారు. తన కుమార్తెను 2005లో చూశానని, ఆ తర్వాత చూడలేదని తెలిపారు. ఆమెను చూసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. ఆమెకు వివాహం చేయాలనుకుంటున్నానని, ఇందుకోసం తనను విడుదల చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. తనను విడుదల చేయాలంటూ నళిని దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. -
రాజీవ్ హంతకులు దేశభక్తులా ?
న్యూఢిల్లీ: దేశ విద్రోహులెవరూ, దేశ భక్తులెవరూ? అసమ్మతి వ్యక్తం చేయడం దేశ విద్రోహమా? అన్న అంశంపై వాడిగా, వేడిగా పార్లమెంట్లో చర్చోపచర్చలు జరగుతున్నాయి. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థుల వివాదం కారణంగా ఈ చర్చకు తెరలేసింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని చంపిన వాళ్లు దేశభక్తులవుతారా? దేశ విద్రోహులవుతారా? అన్న అంశం కూడా కొత్తగా చర్చకు వస్తోంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ప్రధాన దోషి నళినీ శ్రీహరన్ బుధవారం నాడు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చెన్నైకి దూరంగా ఉన్న వింద్యా ప్రాంతానికి వెళ్లారు. ఆమెకు ఇంటివద్ద విదుత్తలాయ్ చిరుతాయిగల్ కాట్చి ప్రాంతీయ పార్టీ (వీసీకే)కి చెందిన నాయకుడు తోల్ తిరుమవలవన్ ఘనంగా స్వాగతం చెప్పారు. ఆమెను తక్షణం జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా నినాదాలు కూడా చేశారు. ఇలాంటి ప్రవర్తన వారికి కొత్త కాదు. రాజీవ్ హత్యకు కుట్ర పన్నిన ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరణ్ జయంతి ఉత్సవాలను వీసీకేతోపాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పొత్తు పెట్టుకున్న మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే) అనే మరో ప్రాంతీయ పార్టీ నిర్వహిస్తూ వస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఓట్లేశారు. పార్లమెంట్ దాడి కేసులో ఉరిశిక్ష పడిన మిలిటెంట్ అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థి నాయకులు దేశద్రోహులైతే, సాక్షాత్తు దేశ ప్రధానినే హత్య చేయించిన మిలిటెంట్ నాయకుడు ప్రభాకరణ్ జయంతి ఉత్సవాలను ప్రతి ఏడాది నిర్వహించే ఈ రెండు పార్టీల నాయకులు, వారికి ఓట్లేసిన 20 లక్షల మంది ప్రజలు దేశద్రోహులు కారా? విద్యార్థి నాయకులను, వారిని సమర్థించిన అధ్యాపకులను అరెస్టు చేసినప్పుడు ఈ రెండు పార్టీల నాయకులను, వారిని సమర్థిస్తున్న ప్రజలను ఎందుకు అరెస్ట్ చేయరు? ఈ రెండు పార్టీల నాయకుల సమాజంలో స్వేచ్ఛగా తిరగొచ్చు, వారి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ప్రజా ప్రతినిధులుగా కొనసాగవచ్చు. అఫ్జల్ గురును సమర్థించిన వాళ్లు మాత్రం దేశద్రోహులు. భారత ప్రజాస్వామ్యంలో ఇదేమి వైరుధ్యం. ‘జన గణ మన అధినాయక జయహే’ అనే గీతాన్ని రవీంద్ర నాథ్ టాగూర్ బ్రిటీష్ వైస్ రాయ్‌ని పొగిడేందుకు రాశారని, ఆయన్ని అధినాయక అని సంబోంధించారన్న వివాదం ఇప్పటి ఉన్న విషయం తెల్సిందే. ఈ లెక్కన ఈ గీతం రాసిన రవీంద్ర నాథ్ టాగూర్ కూడా దేశద్రోహే కావాలి. పైగా ఆ గీతాన్ని జాతీయ గీతంగా ఆలాపిస్తున్నందుకు మనల్ని ఏమనాలి? -
క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత...ఉరి కాదు యావజ్జీవం
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులకు ఉరి శిక్ష విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నామని బుధవారం సుప్రీం కోర్టు అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. రాజీవ్ హంతకులకు ఉరిశిక్షను ఖరారు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వారి ఉరిశిక్షను, యావజ్జీవ శిక్షగా మారుస్తూ ఇచ్చిన తీర్పును సమర్థించుకుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులు క్షమాభిక్షకు అర్హులు కారని ఇటీవల కేంద్రం స్పష్టం చేసింది. 1991 మేలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర జరిగిందని పేర్కొంది. రాజీవ్ ను హత్య చెయ్యడానికి విదేశీయుల సహాయం తీసుకున్నారని, అలాంటి వారిని క్షమించొద్దని సుప్రీంకు విజ్క్షప్తి చేసింది. వారిని విడిచి పెట్టడం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు లో అర్జీ సమర్పించింది. అయితే రాజీవ్ గాంధీని హత్య చేసిన వారికి ఉరి శిక్ష విధించకుండా యావజ్జీవ శిక్ష ను విధించడాన్ని ప్రశ్నిస్తూ, శిక్ష అనుభవిస్తున్న వారిని ముందుగానే విడుదల చెయ్యాలని సమర్పించిన అర్జీలను కూడా బుధవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. -
'జీవితఖైదు పడినా క్షమాభిక్ష పెట్టొచ్చు'
న్యూఢిల్లీ: జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీల ను శిక్ష తగ్గించి, విడుదల చేసేందుకు రాష్ట్రాల కున్న అధికారాలపై నిరుడు విధించిన స్టేను సుప్రీంకోర్టు గురువారం తొలగించింది. జీవిత ఖైదీలను విడుదల చేసేందుకు కొన్నిషరతులతో కూడిన అనుమతిని రాష్ట్రాలకిచ్చింది. ఆ షరతుల ప్రకారం.. * సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణజరిగి,శిక్షఅనుభవిస్తున్న ఖైదీలకు.. * టాడా వంటి కేంద్ర చట్టాల కింద దోషులుగా తేలిన వారికి.. * లైంగికపరమైన ఘోర నేరాలైన హత్యాచారం(అత్యాచారం+ హత్య) చేసినవారికి.. * కనీసం 14 ఏళ్లు జైలుశిక్ష అనుభవించని ఖైదీలకు.. జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలని స్పష్టంగా పేర్కొన్న ఖైదీలకు.. * 20 నుంచి 25 ఏళ్లంటూ శిక్షాకాలాన్ని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నవారికి.. శిక్షను తగ్గించి, జైలు నుంచి విడుదల చేయకూడదు. వారి విషయంలో రాష్ట్రాలకున్న ‘శిక్ష తగ్గింపు’ అధికారం వర్తించదు. ఈ ఆదేశాలు మాజీ ప్రధాని రాజీవ్ హంతకుల విడుదలకు సంబంధించిన పిటిషన్‌కు వర్తించబోవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ పిటిషన్‌పై తామివ్వనున్న తుది తీర్పు ప్రకారం నడుచుకోవాలని పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగానే గత సంవత్సరం.. జీవిత ఖైదీల శిక్ష తగ్గింపు, విడుదలకు సంబంధించి రాష్ట్రాలకున్న అధికారాలపై సుప్రీం స్టే విధించింది. మరణ శిక్ష మేలు కదా! ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జీవితాంతం జైళ్లో ఉంచడం కన్నా.. ఆ దోషులకు మరణ శిక్ష విధించడం మంచిది కదా అని పేర్కొంది. ‘మనమంతా ఏదో ఆశతో జీవిస్తాం. జీవితాంతం జైల్లోనే మగ్గాల్సిన ఖైదీలకు ఆశలుండవు. మరి వారిని జైళ్లో ఉంచడంలో అర్థమేముంది? వారికి మరణశిక్ష విధించండి.. అదే మేలు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చనిపోయేవరకు జైళ్లో ఉంచ డం వెనుక హేతువు ఏంటని కేంద్రాన్ని ప్రశ్నిం చింది. ‘తప్పు చేసిన వారిలో మార్పును తీసుకువచ్చే శిక్షాస్మృతిని మనం ఆచరిస్తున్నాం. జీవి తాంతం జైళ్లోనే ఉండాల్సిన ఖైదీ తాను మారాలని ఎందుకనుకుంటాడు?’ అని ప్రశ్నించింది. -
క్షమాభిక్షపై రగడ
చట్ట ప్రకారం తే ల్చుకుంటాం : జయ పునఃపరిశీలించాలంటూ కాంగ్రెస్ ఆందోళన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో రగడ సృష్టించింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించగా, కాంగ్రెస్ మాత్రం అమ్మ నిర్ణయంపై ఆగ్రహంతో కదం తొక్కింది. పునఃపరిశీలించాలని సోమవారం ఆందోళన చేపట్టింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాజీవ్ గాంధీ హత్యకేసులో ఉరిశిక్ష అనుభవిస్తున్న ఖైదీలను జీవితఖైదీలుగా మార్చి శిక్షను తగ్గిస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. శిక్ష తగ్గించడం కాదు ఏకంగా ఏడుగురినీ విడుదల చేస్తామని మరుసటిరోజే సీఎం జయలలిత ప్రకటించారు. అయితే అదే స్థాయి లో కాంగ్రెస్ వైపు నుంచి ప్రతిఘటన ఎదురైంది. మాజీ ప్రధాని హత్యకేసులోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే సామాన్యుని గతేంటని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, రాజీవ్ తనయుడు రాహుల్‌గాంధీ తన నిరసన గళాన్ని వినిపించారు. అంతేగాక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుతో స్టే మంజూరైంది. తమ పార్టీ నేతను హతమార్చిన వ్యక్తులకు క్షమాభిక్ష పెడతారా అంటూ తమిళనాడు కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. సోనియా గుర్తుకు రాలేదా? ఏడుగురు ఖైదీల విడుదలలో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ పేర్కొన్నారు. తన భర్త హత్యకు కారకురాలైన నళినీకి క్షమాభిక్ష పెట్టిన సోనియా గాంధీ గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. చెన్నై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరాటే త్యాగరాజన్ అధ్యక్షతన వల్లువర్కూట్టం వద్ద సోమవారం భారీ ఎత్తున ధర్నా, ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించారు. జ్ఞానదేశికన్ మాట్లాడుతూ, ఆ ఏడుగురు దోషులు కారని పేర్కొన్న పీఎంకే అధినేత వైగో అసలు దోషులెవరో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చెన్నై రాయపేటలో నివసించిన భాగ్యనాథన్, పద్మ, నళినీ, రాష్ట్రానికి చెందిన పేరరివాళన్లను సమర్థిస్తే సరే, రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేని శాంతన్, మురుగన్‌లను కూడా వైగో వెనకేసుకురావడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. వేదికలపై నుంచి ప్రసంగించేపుడు పార్టీ నేతలు జాతీయ స్పృహ కలిగి ఉండాలని ఆయన హితవు పలికారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడేలోపే ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌పై జయ కస్సుబుస్సు ఖైదీల విడుదల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీఎం జయ కస్సుబుస్సుమంటున్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న నలుగురి విడుదలపై తాను చట్టపరంగా వ్యవహరించానని ఆమె సమర్థించుకున్నారు. తన నిర్ణయంపై కాంగ్రెస్ వారు కోర్టుకెళతారని ముందే తెలుసనంటూ వ్యాఖ్యానించారు. అయినా పరవాలేదు, చట్ట ప్రకారమే ఈ అంశాన్ని ఎలా అధిగమించాలో పరిశీలిస్తున్నానని అన్నారు. నళినీ పెరోల్ పిటిషన్ 17కు వాయిదా రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదీగా వేలూరు జైలులో ఉంటున్న నళినీ పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌ను మార్చి 17కు వాయిదా వేశారు. తిరునెల్వేలీలో ఉంటున్న తన తండ్రి శంకరనారాయణన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నందున చివరి రోజుల్లో ఆయనతో గడిపేందుకు నెలరోజుల పెరోల్‌ను మంజూరు చేయాలని నళినీ పెట్టుకున్న పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. నళినీ తదితరులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, సుప్రీం కోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్న పరిస్థితుల్లో పెరోల్ పిటిషన్‌ను వాయిదావేయాలని ప్రభుత్వ న్యాయవాది షణ్ముగ వేలాయుధం వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తులు రాజేశ్వరన్, ప్రకాష్ పెరోల్ పిటిషన్‌ను వచ్చేనెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్రం
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. రాజీవ్‌గాంధీ హంతకుల మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మరుసటి రోజే ఈ కేసులోని ఏడుగురు దోషులను విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజీవ్ గాంధీ హత్య అనేది దేశంపై జరిగిన దాడిగా కేంద్రం పేర్కొంది. ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయద్దని తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సూచించారు. వారిని విడుదల చేయడం అన్ని రకాల సిద్ధాంతాలకు వ్యతిరేకమని, న్యాయపరంగా ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా ఉగ్రవాదంపై పోరు విషయంలో మెతక వైఖరి అవలంభించకూడదని ప్రధాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ వారిని విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశించింది. రాజీవ్ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజీవ్ హత్యకేసులో దోషులు నళిని, మురుగన్ల కుమార్తె హరిత్ర రాహుల్ గాంధీని క్షమాపణ కోరింది. చేసిన నేరానికి తన తల్లిదండ్రులు శిక్ష అనుభవించటంతో పాటు, పశ్చాత్తాపం చెందారని వారిని క్షమించి వదిలేయాలని విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
రాజీవ్ హంతకుల విడుదలకు నిర్ణయం
చెన్నై : మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులకు ఉరి శిక్షను... యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మర్నాడే తమిళనాడు ప్రభుత్వం వారిని విడుదల చేయడానికి నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వంలో అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తమిళనాట రాజకీయ లబ్దిపొందేందుకు తహతహలాడుతున్న ఏఐఏడిఎంకే పార్టీకి రాజీవ్ హంతకులు వరంలా కలిసొచ్చారని పరిశీలకులంటున్నారు. మరణశిక్ష అమలులో తీవ్రమైన జాప్యం జరిగిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. రాజీవ్ హంతకులకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్పు చేయడంతో పాటు.. ఇప్పటికే 23ఏళ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన దరమిలా.. రెమిషన్ ఇచ్చి విడుదల చేసే నిర్ణయాధికారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి ఇచ్చింది. వెంటనే స్పందించిన డిఎంకే, ఎండిఎంకే, సిపిఐలు వారిని వెంటనే విడుల చేయాలని డిమాండ్ చేశాయి. శ్రీలంకలో తమిళుల అణచివేత నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తమిళ సెంటిమెంటును ఎన్నికల వేళ తమకు అనుకూలంగా మలచుకోడానికి వేగంగా పావులు కదిపిన జయలలిత ప్రభుత్వం.. ఆఘమేఘాల మీద వారి విడుదలకు ఆదేశించింది. -
రాజీవ్ హంతకులకు ఉరి తప్పింది
న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులకు ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసులో ముగ్గురు దోషులకు ఉరిశిక్షను ...జీవిత ఖైదుగా మార్చుతూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. క్షమాభిక్ష విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఆలస్యమైనందున తమ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు నిచ్చింది. ఈ కేసులో మురుగన్, శంతన్, పేరారివాలన్ జైలు శిక్ష అనుభవిస్తున్నవిషయం తెలిసిందే. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో హంతకుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు రాజీవ్ హత్యకేసులో దోషులకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.