సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
రాజీవ్‌గాంధీ హంతకుల మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మరుసటి రోజే ఈ కేసులోని ఏడుగురు దోషులను విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజీవ్ గాంధీ హత్య అనేది దేశంపై జరిగిన దాడిగా కేంద్రం పేర్కొంది. ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయద్దని తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సూచించారు. వారిని విడుదల చేయడం అన్ని రకాల సిద్ధాంతాలకు వ్యతిరేకమని, న్యాయపరంగా ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా ఉగ్రవాదంపై పోరు విషయంలో మెతక వైఖరి అవలంభించకూడదని ప్రధాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ వారిని విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశించింది. రాజీవ్ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని నోటీసులు జారీ చేసింది.
మరోవైపు రాజీవ్ హత్యకేసులో దోషులు నళిని, మురుగన్ల కుమార్తె హరిత్ర రాహుల్ గాంధీని క్షమాపణ కోరింది. చేసిన నేరానికి తన తల్లిదండ్రులు శిక్ష అనుభవించటంతో పాటు, పశ్చాత్తాపం చెందారని వారిని క్షమించి వదిలేయాలని విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉండగా, తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.