రాజీవ్‌ హత్య కేసులో దోషి తాజా వినతి | Murugan produced in Vellore court | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ హత్య కేసులో దోషి తాజా వినతి

Published Tue, May 23 2017 11:05 AM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

మురుగన్‌ను కోర్టుకు తీసుకొస్తున్న పోలీసులు

మురుగన్‌ను కోర్టుకు తీసుకొస్తున్న పోలీసులు

వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ తాజా కేసులో సోమవారం ఉదయం వేలూరు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నకలు ఇవ్వాలని మురగన్‌ న్యాయమూర్తిని కోరారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో మురుగన్, భార్య నళినితో పాటు పేరరివాలన్, శాంతన్‌ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. వీరిలో నళిని మహిళా జైలులోను మిగిలిన వారు పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

కోర్టు ఆదేశాల మేరకు మురుగన్, భార్య నళిని ప్రతి 15 రోజులకు ఒకసారి కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీన మురుగన్‌ గదిలో జైలు అధికారులు తనిఖీలు చేపట్టిన సమయంలో రెండు సెల్‌ఫోన్‌లు, చార్జరు, రెండు సిమ్‌ కార్డులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై జైలు అధికారులు బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో మురుగన్‌ మూడు నెలలు ఎవరినీ కలిసి మాట్లాడకుండా నిషేధించారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఉదయం ఎక్సైజ్‌ డీఎస్పీ రామనా«థ్‌ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ సెంట్రల్‌ జైలు నుంచి మురుగన్‌ను ఉదయం కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఆలసియా ముందు హాజరు పరిచారు. ఆ సమయంలో మురుగన్‌ సెల్‌ఫోన్‌ ఉపయోగించిన కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నకలు కాపీని తనకు ఇప్పించాలని కోరాడు. వీటిపై అరగంట పాటు విచారణ జరిగింది.

ఇదిలా ఉండగా మురుగన్‌ను చూసేందుకు శ్రీలంక నుంచి ఆయన తల్లి సోమణి వెట్రివేల్‌ కోర్టుకు వచ్చారు. కోర్టు ప్రాంగణంలో కుమారుడు మురుగన్‌తో మాట్లాడలేక కన్నీరు మున్నీరయ్యారు. తల్లి కన్నీటిని చూసి మురుగన్‌ కూడా పోలీసుల దగ్గర నుంచే కన్నీరు పెట్టాడు. అనంతరం పోలీసులు సెంట్రల్‌ జైలుకు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా ఈ నెల 29 లోపు తాను శ్రీలంక వెళ్లాల్సి ఉండగా ఆ లోపు మురుగన్‌తో కలిసి మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తల్లి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement