కరీంనగర్‌లో రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ
కేంద్రమంత్రి మురుగన్‌తో కలిసి బండి సంజయ్ రోడ్‌షో
కరీంనగర్ టౌన్: తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని తేలడంతో రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని, సీఎం సీటు పోతుందనే భయంతో రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చి నట్లు మాట్లాడుతున్నా రని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీని, ఆర్‌ఎస్‌ఎస్‌ను బద్నాం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రిజర్వేషన్ల రద్దు కోసమే 2000లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్‌ను బీజేపీ ప్రభుత్వం నియమించిందన్నారు.
ఆయనిచ్చిన రిపోర్టును కూడా తొక్కిపెట్టారని చెబుతున్న రేవంత్‌రెడ్డికి 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అని తెలీదా? మరి ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లోని కమాన్‌చౌరస్తా వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోకు వేలాది మంది తరలివచ్చారు. కేంద్రమంత్రి మురుగన్‌తోపాటు సంజయ్ పాల్గొని మాట్లాడారు.
తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని విస్తరించిన నాయకుడు మురుగన్ అని, ఆయన ఎంపీ కాకపోయినా దళితుడైన మురుగన్ సేవలను గుర్తించి నేరుగా కేంద్రమంత్రిని చేసిన ఘనత ప్రధాని మోదీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు డిపాజిట్లు రావని, రెండోస్థానం కోసమే పోటీ పడుతున్నారని ఎద్దేవాచేశారు. పొన్నం, వినోద్‌కుమార్ కరీంనగర్‌కు ఏంచేశారో చెప్పాలన్నారు.
ఇవి దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, సంక్షేమ పథకాలు అందాలంటే, దేశ రక్షణ కావాలంటే మోదీనే మళ్లీ ప్రధాని కావాలని సంజయ్ తెలిపారు. దేశమంతా కరీంనగర్‌లో బండి సంజయ్‌ను ఎంత మెజారిటీతో గెలిపిస్తారనే చర్చ జరుగుతోందన్నారు. తనను ఎంపీగా గెలిపించి మోదీని ప్రధానిగా ఎన్నుకునే అవకాశం కల్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment