మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులకు ఉరి శిక్షను... యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మర్నాడే తమిళనాడు ప్రభుత్వం వారిని విడుదల చేయడానికి నిర్ణయించింది.
చెన్నై : మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులకు ఉరి శిక్షను... యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన మర్నాడే తమిళనాడు ప్రభుత్వం వారిని విడుదల చేయడానికి నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వంలో అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తమిళనాట రాజకీయ లబ్దిపొందేందుకు తహతహలాడుతున్న ఏఐఏడిఎంకే పార్టీకి రాజీవ్ హంతకులు వరంలా కలిసొచ్చారని పరిశీలకులంటున్నారు.
మరణశిక్ష అమలులో తీవ్రమైన జాప్యం జరిగిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. రాజీవ్ హంతకులకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్పు చేయడంతో పాటు.. ఇప్పటికే 23ఏళ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన దరమిలా.. రెమిషన్ ఇచ్చి విడుదల చేసే నిర్ణయాధికారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి ఇచ్చింది. వెంటనే స్పందించిన డిఎంకే, ఎండిఎంకే, సిపిఐలు వారిని వెంటనే విడుల చేయాలని డిమాండ్ చేశాయి. శ్రీలంకలో తమిళుల అణచివేత నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తమిళ సెంటిమెంటును ఎన్నికల వేళ తమకు అనుకూలంగా మలచుకోడానికి వేగంగా పావులు కదిపిన జయలలిత ప్రభుత్వం.. ఆఘమేఘాల మీద వారి విడుదలకు ఆదేశించింది.