రాజీవ్ హంతకులు దేశభక్తులా ?
న్యూఢిల్లీ: దేశ విద్రోహులెవరూ, దేశ భక్తులెవరూ? అసమ్మతి వ్యక్తం చేయడం దేశ విద్రోహమా? అన్న అంశంపై వాడిగా, వేడిగా పార్లమెంట్‌లో చర్చోపచర్చలు జరగుతున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థుల వివాదం కారణంగా ఈ చర్చకు తెరలేసింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని చంపిన వాళ్లు దేశభక్తులవుతారా? దేశ విద్రోహులవుతారా? అన్న అంశం కూడా కొత్తగా చర్చకు వస్తోంది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ప్రధాన దోషి నళినీ శ్రీహరన్ బుధవారం నాడు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చెన్నైకి దూరంగా ఉన్న వింద్యా ప్రాంతానికి వెళ్లారు. ఆమెకు ఇంటివద్ద విదుత్‌తలాయ్ చిరుతాయిగల్ కాట్చి ప్రాంతీయ పార్టీ (వీసీకే)కి చెందిన నాయకుడు తోల్ తిరుమవలవన్ ఘనంగా స్వాగతం చెప్పారు. ఆమెను తక్షణం జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా నినాదాలు కూడా చేశారు. ఇలాంటి ప్రవర్తన వారికి కొత్త కాదు. రాజీవ్ హత్యకు కుట్ర పన్నిన ఎల్‌టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరణ్ జయంతి ఉత్సవాలను వీసీకేతోపాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పొత్తు పెట్టుకున్న మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే) అనే మరో ప్రాంతీయ పార్టీ నిర్వహిస్తూ వస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఓట్లేశారు.
పార్లమెంట్ దాడి కేసులో ఉరిశిక్ష పడిన మిలిటెంట్ అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థి నాయకులు దేశద్రోహులైతే, సాక్షాత్తు దేశ ప్రధానినే హత్య చేయించిన మిలిటెంట్ నాయకుడు ప్రభాకరణ్ జయంతి ఉత్సవాలను ప్రతి ఏడాది నిర్వహించే ఈ రెండు పార్టీల నాయకులు, వారికి ఓట్లేసిన 20 లక్షల మంది ప్రజలు దేశద్రోహులు కారా? విద్యార్థి నాయకులను, వారిని సమర్థించిన అధ్యాపకులను అరెస్టు చేసినప్పుడు ఈ రెండు పార్టీల నాయకులను, వారిని సమర్థిస్తున్న ప్రజలను ఎందుకు అరెస్ట్ చేయరు?
ఈ రెండు పార్టీల నాయకుల సమాజంలో స్వేచ్ఛగా తిరగొచ్చు, వారి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ప్రజా ప్రతినిధులుగా కొనసాగవచ్చు. అఫ్జల్ గురును సమర్థించిన వాళ్లు మాత్రం దేశద్రోహులు. భారత ప్రజాస్వామ్యంలో ఇదేమి వైరుధ్యం. ‘జన గణ మన అధినాయక జయహే’ అనే గీతాన్ని రవీంద్ర నాథ్ టాగూర్ బ్రిటీష్ వైస్ రాయ్‌ని పొగిడేందుకు రాశారని, ఆయన్ని అధినాయక అని సంబోంధించారన్న వివాదం ఇప్పటి ఉన్న విషయం తెల్సిందే. ఈ లెక్కన ఈ గీతం రాసిన రవీంద్ర నాథ్ టాగూర్ కూడా దేశద్రోహే కావాలి. పైగా ఆ గీతాన్ని జాతీయ గీతంగా ఆలాపిస్తున్నందుకు మనల్ని ఏమనాలి?