Patriotism
-
ఆపరేషన్ ముగిసింది
ఆపరేషన్ వాలెంటైన్ ముగిసింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ద్విభాషా (తెలుగు–హిందీ) చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటించారు వరుణ్ తేజ్. ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న హీరోయిన్ మానుషీ చిల్లర్ రేడార్ ఆఫీసర్‌గా నటించగా, నవదీప్ ఓ కీలక పాత్ర చేశారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘‘వైమానిక దాడుల్లో మన దేశ వైమానిక దళం హీరోలు, వారు ఎదుర్కొన్న సవాళ్లను చూపించే ప్రయత్నంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమా పోస్ట్‌ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ప్రోడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్‌పై సందీప్ ముద్దా నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 8న రిలీజ్ కానుంది. -
చైనా, పాక్ భాష
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చైనా వ్యాఖ్యలపై రాజకీయ రగడ కొనసాగుతోంది. అరుణాచల్‌లోని తవాంగ్‌లో భారత జవాన్లను చైనా సైనికులు కొట్టారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ నిరంతరం చైనా, పాకిస్తాన్ భాష మాట్లాడుతూ ఉంటారని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరోపించారు. శనివారం నడ్డా మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ను కాంగ్రెస్ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడులపై గతంలో రాహుల్ సందేహాలు వ్యక్తం చేశారని, ఇవన్నీ చూస్తుంటే ఆయనకున్న దేశభక్తి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాహుల్ తన వ్యాఖ్యలతో సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. పార్టీని ఖర్గే తన నియంత్రణలోకి తీసుకొని రాహుల్‌ని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీతో అవగాహన ఒప్పందం చేసుకున్నారని, అందుకే ఆ దేశ భాష రాహుల్ మాట్లాడుతూ ఉంటారని ఆరోపించారు. ఆర్మీపై రాహుల్‌కు నమ్మకం లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. -
‘ప్రతిజ్ఞ’కు అరవై ఏళ్లు
చైనాతో 1962లో భారత్ యుద్ధం జరుగుతోంది. దేశ విభజన గాయాల నుంచి దేశం కోలుకుంటున్న ఆ తరుణంలోనే కొందరు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని మరచిపోతున్నారు. ఇటువంటి పరిస్థితులు పైడిమర్రి వెంకట సుబ్బారావును తీవ్రంగా కలచి వేశాయి. పౌరులలో దేశభక్తిని పెంచడానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని ఆయన బలంగా అనుకున్నారు. అప్పటికే చైనాలో విద్యార్థులలో దేశభక్తిని పెంచడానికి దేశభక్తి గీతాలు ఉన్నట్లు తెలిసి వెంటనే ఆయన తొమ్మిది వాక్యాల ‘ప్రతిజ్ఞ’ రాశారు. పైడిమర్రి 1962లో విశాఖపట్నంలో జిల్లా ‘ఖజానా’ అధికారిగా పనిచేస్తున్న రోజులవి. సెప్టెంబర్ 17న ఆయన ‘ప్రతిజ్ఞ’ రచన చేశారు. ఆయన మిత్రుడు తెన్నేటి విశ్వనాథం ప్రతిజ్ఞ ప్రతిని చూసి నాటి విద్యా శాఖ మంత్రి పీవీజీ రాజుకు చూపించడంతో ప్రతిజ్ఞ పదాలు విద్యార్థులలో దేశభక్తినీ, సోదరభావాన్నీ పెంచుతాయని భావించి... పాఠ్యపుస్తకాలలో చేర్చారు. 1964 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ ముద్రితమవుతున్నది. అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను మిగతా భారతీయ భాషల్లోకి అనువాదం చేయించింది. 1965 జనవరి 26 నుండి దేశవ్యాప్తంగా విద్యాలయాల్లో ప్రతిజ్ఞను ఆలపిస్తున్నారు. కానీ రచయిత పేరును మాత్రం ముద్రించలేదు. 2011లో ఎలికట్టె శంకరరావు ‘ప్రతిజ్ఞ సృష్టికర్త పైడిమర్రి’ పేరుతో ఓ వ్యాసం రాశారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో పైడిమర్రి పేరుని వివిధ వర్గాల వారి విజ్ఞప్తి మేరకు రెండు తెలుగు రాష్ట్రాల పాఠ్య పుస్తకాలలో ‘ప్రతిజ్ఞ’ ఎగువన ముద్రిస్తున్నారు. 1916 జూన్ 10న నల్లగొండ జిల్లాలోని అన్నేపర్తి గ్రామంలో పైడిమర్రి జన్మించారు. కవిగా, రచయితగా, నీతి నిజాయితీగల ప్రభుత్వ ఉద్యోగిగా, బహుభాషా కోవిదుడిగా ఆయన పేరు పొందారు. 1988 ఆగస్ట్ 13న పైడిమర్రి తుదిశ్వాస విడిచారు. ఇప్పటికి ‘ప్రతిజ్ఞ’ రాసి 60 ఏళ్లు అవుతోంది. – మందడపు రాంప్రదీప్, తిరువూరు (ఇది ‘ప్రతిజ్ఞ’ వజ్రోత్సవాల సంవత్సరం) -
'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్ ఆడను'
ఢాకా: ఐపీఎల్ కంటే దేశం తరపున ఆడడమే తనకు ముఖ్యమని బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్పష్టం చేశాడు. ఏప్రిల్‌లో మొదలవనున్న ఐపీఎల్ 2021 సీజన్ సమయంలోనే బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) లంకతో టెస్టు సిరీస్ ఆడాలని సోమవారం నిర్ణయం తీసుకుంది. కాగా బీసీబీ నిర్ణయం తీసుకున్న రోజే తాను ఐపీఎల్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ మరో ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ కోరాడు.దీనిపై నిరాశ చెందిన బీసీబీ ఐపీఎల్ ఆడాలనుకునేవారికి ఎన్వోసీ ఇస్తామని... లీగ్‌లో పాల్గొనే వారిని తాము అడ్డుకోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ముస్తాఫిజుర్ స్పందించాడు. ' నాకు దేశ భక్తి ఎక్కువ. ఐపీఎల్ కంటే దేశానికి ప్రాధాన్యమిస్తా. బంగ్లా బోర్డు ఏది చెబితే అదే చేస్తా. ఒకవేళ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు నా పేరును ప్రకటిస్తే దేశానికి ఆడేందుకే ప్రాధాన్యమిస్తా. ఐపీఎల్ దృష్యా ఒకవేళ బోర్డు లంకతో సిరీస్‌కు తన పేరును పరిగణలోకి తీసుకోకుంటే ఆ విషయం వాళ్లే స్వయంగా చెబుతారు. వారు ఎన్వోసీ ఇచ్చేవరకు వేచిచూస్తా.. అప్పుడే ఐపీఎల్లో ఆడేందుకు వెళ్తా. ఐపీఎల్లో పాల్గొనమని బోర్డు ఎన్వోసీ ఇచ్చినా నా మొదటి ప్రాధాన్యం దేశ భక్తిపైనే ఉంటుంది.' అని రెహ్మాన్ స్పష్టం చేశాడు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రాజస్తాన్ రాయల్స్ కనీస ధర రూ. కోటికి దక్కించుకోగా.. ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్‌ను కేకేఆర్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్ తరపున ముస్తాఫిజుర్ 14 టెస్టుల్లో 30 వికెట్లు, 61 వన్డేల్లో 115 వికెట్లు, 41 టీ20ల్లో 58 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ముస్తాఫిజుర్ చక్కగా రాణించాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి ఆ ఏడాది ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2018 ఐపీఎల్ సీజన్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన ముస్తాఫిజుర్ మొత్తం 24 మ్యాచ్‌లాడి 24 వికెట్లు తీశాడు. చదవండి: విదేశీ బౌలర్లకు అంత ఇచ్చి.. అతనికి ఇంత తక్కువ సన్‌రైజర్స్‌కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా! -
వీధి వీధినా వాడవాడలా మార్మోగే పాట ఇది!
స్వాతంత్య్ర దినోత్సవం వచ్చినా, గణతంత్ర దినోత్సవం వచ్చినా వీధి వీధినా వాడవాడలా మార్మోగే పాట ఒకటి ఉంది. అదే ‘కర్ చలే హమ్ ఫిదా జాన్ ఒ తన్ సాథియో.. అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో’ పాట. ఇది 1964లో వచ్చిన ‘హకీకత్’ సినిమాలోని పాట. ధర్మేంద్ర, బల్రాజ్ సహానీ ప్రధాన తారాగణం. 1962లో జరిగిన ఇండో–చైనా యుద్ధ నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఆ యుద్ధం మీద వచ్చిన తొలి హిందీ సినిమా కూడా. లడాక్‌లో వొరిజినల్ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. చేతన్ ఆనంద్ దర్శకుడు. ఇండో చైనా వార్‌లో మనం ఓడిపోయాం. కాని ‘రెజాంగ్ లా’ అనే చోట 120 సైనికులు ఉన్న మన బృందం చైనా సైనికుల పై పైచేయి సాధించింది. అందులో 114 మంది మనవారు చనిపోయారు. చైనా సైనికులు భారీగా చనిపోయారని అంటారు. మొత్తం మీద ఆ ఒక్క స్థలంలో మనవారు తమ బలిదానంతో భారత భూభాగాన్ని నిలుపుకోవడాన్ని కథగా తీసుకొని దర్శకుడు చేతన్ ఆనంద్ ‘హకీకత్’ తీశాడు. నిజానికి ఇది ప్రభుత్వం చెప్పాలనుకున్న ‘హకీకత్’ (వాస్తవం). చైనా యుద్ధానికి కారణం చైనా తప్పిదమే అనే నెహ్రూ అభిప్రాయానికి ప్రచారం ఇచ్చిన సినిమా ఇది. విశేషం ఏమిటంటే దేశభక్తి కలిగిన ఈ సినిమాలో పని చేసినందుకు వామపక్ష భావజాలం ఉన్న చేతన్ ఆనంద్, కైఫీ ఆజ్మీ, బల్రాజ్ సహానీ రూపాయి డబ్బు కూడా తీసుకోలేదు. దీని క్లయిమాక్స్‌లో గెలిచినా కూడా ప్రాణాలు కోల్పోయిన సైనికుల మృతదేహాల నేపథ్యంలో విషాద భరితంగా ఒక పాట కావాల్సి వచ్చింది. ఆ పాటను విజయ్ ఆనంద్ కైఫీ ఆజ్మీ చేత చేయించాడు. మదన్ మోహన్ దానికి బాణీ కట్టాడు. కర్ చలే హమ్ ఫిదా జాన్ ఒ తన్ సాథియో అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో... అంటే ‘మీ కోసం మా దేహప్రాణాలను బలిదానం చేశాం. దేశాన్ని మీకు అప్పగించి వెళుతున్నాం’ అని తోటి సైనికులకు, దేశప్రజలకు సైనికులు చెబుతున్నట్టుగా ఉండే పాట ఇది. ఐదు నిమిషాలకు పైగా వచ్చే ఈ పాట సినిమా సైనికుల మృతదేహాలను... నిజ సైనికశకటాలను చూపుతూ భావోద్వేగంగా ఉంటుంది. మహమ్మద్ రఫీ పాడిన విధానం శోకాన్ని, గగుర్పాటును, దేశభక్తిని కలిగించేలా ఉంటుంది. అందుకే ఆ పాట వచ్చి దాదాపు 60 ఏళ్లు అవుతున్నా నేటికీ వినపడుతూ ఉంది. అయితే ఈ సినిమా రిలీజుకు ముందే నెహ్రూ మరణించారు. ఈ సినిమాను నెహ్రూకు అంకితం ఇచ్చారు. ఎందరి బలిదానాలో ఈ దేశం మట్టిలో ఉన్నాయి. ఎందరి త్యాగాల ఫలితమో ఇది. అందరూ దీనికోసం ప్రాణాలు వొడ్డారు. ఈ దేశం అందరిది అనే భావనను పునశ్చరణ చేసుకోవాల్సిన సందర్భం ఇది. -
దేశభక్తిని ప్రేరేపించే సంగీతం
అడ్డగుట్ట: ఆలిండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ 20వ ముగింపు వేడుకలు ఆదివారం సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ (ఆర్ఎస్సీ) గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సంగీతం సాయుధ దళాలలో ధైర్యాన్ని, శౌర్యాన్ని రేకెత్తిస్తుందన్నారు. దేశభక్తిని, దేశ రక్షణపై నిబద్ధతను ప్రేరేపిస్తుందన్నారు. నిజాయితీతో కూడిన సేవలతో అవసరమైన మిత్రుడిగా ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించాల్సిన బాధ్యత దేశంలోని అన్ని పోలీసు దళాలకు ఉందన్నారు. ఆలిండియా పోలీస్ బ్యాండ్ ఛాంపియన్షిప్ పోటీలు అన్ని సాయుధ, పారా సైనిక దళాల మధ్య సహకారాన్ని మెరుగుపరుస్తాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ అన్నారు. పోటీలను ఆర్పీఎఫ్ జాతీయ స్థాయిలో 3వసారి నిర్వహిస్తోందన్నారు. అనంతరం, బ్రాస్ బ్యాండ్ క్యాటగిరీలో 20వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ ఛాంపియన్షిప్ విజేత ట్రోఫీని సీఆర్పీఎఫ్, పైప్ బ్యాండ్ ట్రోఫీని మహారాష్ట్ర పోలీసులకు అందజేశారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా, అదనపు జీఎం బి.బి.సింగ్, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ ఈశ్వరరావు పాల్గొన్నారు. వరంగల్‌పై ప్రత్యేక ప్రేమ సాక్షి ప్రతినిధి, వరంగల్: కాకతీయుల సుపరిపాలనకు కేంద్రమైన ఓరుగల్లుకు రావడం.. ఇక్కడి గడ్డపై జరిగే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్‌లో ఆంధ్రా విద్యాభివర్ధిని (ఏవీవీ) కళాశాల 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వరంగల్ సాంస్కృతిక వారసత్వం ఘనమైనదని, ప్రఖ్యాతి గాంచిన ఓరుగల్లు ఖిలాతో పాటు, వేయి స్తంభాల గుడి, రామప్ప, లక్నవరం, పాకాల వంటి అతి పెద్ద చెరువులు వరంగల్ నగరానికి కంఠాభరణాల్లాంటివని కొనియాడారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న నగరం కాబట్టే.. కేంద్ర ప్రభుత్వం.. ఓరుగల్లును ‘హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్’పథకం కింద మరింత అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దేశభక్తి మహిళాశక్తి
‘దేశమంటే మట్టికాదోయ్! దేశమంటే మనుషులోయ్!’ గురజాడ అప్పారావుగారు ఎంత చక్కగా చెప్పారు. కానీ ఆ కాలానికీ ఈ కాలానికి కాస్త మార్పు వచ్చింది. దేశమంటే ఇప్పుడు మనుషులు కాదు. మహిళా శక్తులు. ఏ ఉద్యమమైనా చూడండి... ఏ ఉద్యోగమైనా చూడండి. మహిళలే ముందుంటున్నారు. ఏం ఉంటున్నారూ.. పర్సెంటేజ్ చూడండి. ఆఫీస్‌లలో మగవాళ్లే ఉంటున్నారు. ఆర్మీలలో మగవాళ్లే ఉంటున్నారు. ఉండటం ముఖ్యం కాదు. ముందుండటం ముఖ్యం. పౌరసత్వ చట్టంపై నిరసన. ఎవరు ముందుంటున్నారు? మహిళలు! పర్యావరణ పరిరక్షణ. ఎవరు ముందుంటున్నారు? మహిళలు! ఢిల్లీలో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎంత కాలుష్యం అయినా ఉండనివ్వండి. గాలిలో ప్రస్తుతం స్వచ్ఛమైన దేశభక్తి గుండెల్ని తాకుతోంది. నిన్న.. నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి. రెండు రోజులు గడిస్తే గణతంత్ర దినోత్సవం. నేడు.. అమెజాన్ ప్రైమ్ వీడియో.. ‘ది ఫర్గాటెన్ ఆర్మీ.. ఆజాదీ కె లియే’ వెబ్ సిరీస్ ప్రారంభం! మహిళా శక్తికి.. ఈ మూడు సందర్భాలకు సంబంధం ఏమిటి? యుద్ధంలోకి మొదటిసారిగా మహిళల్ని తెచ్చింది నేతాజీ! స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసి, వాళ్ల చేతికి తుపాకులిచ్చారు నేతాజీ. సరిగ్గా శత్రువుల గుండెల్లోకి పేల్చేలా వారికి శిక్షణ ఇచ్చారు. కదన రంగంలో ముందుకు కదలడానికి ఆ మహిళలకు.. కట్టుకున్న చీరలు అడ్డుపడలేదు కానీ... ఆరంభంలోనే.. యుద్ధంలోకి స్త్రీలెందుకు, స్త్రీల చేతులకు తుపాకులెందుకు అని మగాళ్లు ముఖం చిట్లిస్తూ అడ్డొచ్చారు. నేతాజీ వినలేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ (నేతాజీ సారథ్యం వహించిన సైన్యం)కి ప్రత్యేకమైన పోరాట వ్యూహాలు ఉన్నప్పటికీ.. భారీ బలగాల్లేవు. మహిళాశక్తిపై నమ్మకంతో, విశ్వాసంతో వారిని సంగ్రామంలోకి ఆహ్వానించారు.నేతాజీ. అందుకోసం 1943 జూలై 9న సింగపూర్‌లో సమావేశం జరిగింది. ‘‘ఏం చేస్తారు బోస్.. ఆడవాళ్లు సైన్యంలోకి వచ్చి?’’ మగవాళ్లెవరో లేచి అడిగారు నేతాజీని. ‘‘ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు’’ అన్నారు నేతాజీ! ‘‘తిరుగుబాటుకు, స్వాతంత్య్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయే. ఇప్పుడు ప్రతి మహిళా ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను.. మహిళలూ కదిలొస్తే మనకు స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. మహిళలూ యుద్ధరంగంలోకి దుమికితే.. భారతదేశం అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్‌కు అందుతుంది’’.. అన్నారు నేతాజీ. ఆ వెంటనే.. చెయ్యి ముందుకు చాస్తూ.. ప్రమాణం చేస్తున్నట్లుగా.. ‘‘మన మహిళా దళం పేరు.. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’. మరణ ధిక్కార మహిళా దళం మనది’’ అన్నారు. ‘ది ఫర్గాటెన్ ఆర్మీ.. ఆజాదీ కె లియే’లో ఓ సన్నివేశం ఎల్లుండి.. జనవరి 26. గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే). భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ ఏడాదికి మన గణతంత్రానికి డెబ్భై యేళ్లు పూర్తవుతాయి. రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చినప్పటికీ రాజ్యాంగ రచనా సమాలోచనలు ప్రారంభమైంది మాత్రం దేశానికి స్వాతంత్య్రం రాకముందే! 1946 డిసెంబర్ 9, ఉదయం 10.45 గంటలకు న్యూఢిల్లీలోని రఫీమార్గ్‌లో ఉన్న కాన్స్టిట్యూషన్ హాల్లో (ఇప్పటి పార్లమెంట్ హౌస్‌లోని సెంట్రల్ హాల్) తొలి రాజ్యాంగ సమావేశం జరిగింది. రాజనీతిజ్ఞులు, ఆలోచనాపరులు, మేధావులు.. మొత్తం 207 మంది ఆ కీలకమైన చర్చా సమావేశానికి హాజరయ్యారు. వారిలో 15 మంది మహిళలే! అప్పట్లో అదేమీ తక్కువ సంఖ్య కాదు. ఆ పదిహేను మందిలో కూడా ఒకరు ముస్లిం. ఇంకొకరు దళిత వర్గం. బేగమ్ అజీజ్ రసూల్, దాక్షాయణి వేలాయుధన్. మిగతా పదమూడు మందీ.. రేణుకా రాయ్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, హంసా మెహ్తా, పూర్ణిమా బెనర్జీ, రాజ్‌కుమారి అమృత్‌కౌర్, మాలతీ చౌదరి, లీలా రాయ్, సుచేత కృపలాని, సరోజినీ నాయుడు, విజయలక్ష్మీ పండిట్, అమ్ము స్వామినాథన్, యానీ మాస్కరీన్, కమలా చౌదరి. ఒక్కో మహిళదీ ఒక్కో సామాజిక, రాజకీయ నేపథ్యం. రాజ్యాంగ రచనలో వీరి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు, అభ్యంతరాలు, సందేహాలు, సంశయాలకు... వీటన్నిటికీ ప్రాధాన్యం లభించింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో మహిళ సామాజిక హక్కులు ఇప్పుడొక ప్రత్యేక అధ్యాయంగా ఉండటానికి కారణం ఆనాటి ఈ పదిహేను మంది మహిళా సభ్యుల మాటకు లభించిన విలువేనంటారు జె.ఎన్.యు. ప్రొఫెసర్ నీరజా గోపాల్ జయాల్. పాలనకు రాజ్యాంగం శక్తి అయితే ఆ శక్తికి స్త్రీ స్వరూపం ఈ పదిహేను మందీ! రాణీ ఝాన్సీ రెజిమెంట్లా.. వీరి రాజ్యాంగ మహిళా సైనిక దళం. తొలి రాజ్యాంగ సమావేశంలోని 15 మంది మహిళా సభ్యులలో పదకొండు మంది 24 జనవరి 2020. ఈ రోజే! అమెజాన్ ప్రైమ్ వీడియోలో.. ‘ది ఫర్గాటెన్ ఆర్మీ.. ఆజాదీ కె లియే’ మినీ వెబ్ సిరీస్ మొదలవుతున్నాయి. అమెజాన్ అనగానే ఇవేవో నాటకీయ మహిళా దేశభక్తి ప్రసారాలని అనుకోకండి. సుభాస్ చంద్రబోస్ నడిపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని సైనికుల వాస్తవ గాథలతో పాటు.. ఆయన స్థాపించిన రాణీ ఝాన్సీ రెజిమెంట్‌లోని మహిళా సైనికుల వీరగాథల్నీ అమెజాన్ చూపించబోతోంది. వీటికి దర్శకత్వం వహిస్తున్నది కబీర్ ఖాన్. కాబూల్ ఎక్స్‌ప్రెస్, న్యూయార్క్, ఏక్ థా టైగర్, బజ్రంగి భాయ్‌జాన్, ఫాంటమ్, ట్యూబ్‌లైట్ వంటి విభిన్న కథా చిత్రాలను తీసిన కబీర్ ఖాన్.. ఇరవై ఏళ్ల క్రితమే దూరదర్శన్ కోసం ఇదే థీమ్‌తో ‘ది ఫర్గాటెన్ ఆర్మీ’ అనే డాక్యుమెంటరీ చేశారు. తాజా.. ఫర్గాటెన్ ఆర్మీ’లో.. ప్రధానంగా మహిళా యోధుల స్ఫూర్తిదాయకమైన పోరాట అనుభవాలను శార్వరీ వాగ్ (సిరీస్‌లో మాయ) ప్రధాన కథానాయికగా చిత్రీకరిస్తున్నారు. ఒకప్పుడు సమాజంలోని అన్ని వర్గాలూ కలిస్తే ఒక ఉద్యమం అయ్యేది. ఇప్పుడు ఏ ఉద్యమానికైనా మహిళా వర్గమే ముందుంటోంది. ముందుండే వారెప్పుడూ యోధులే. శక్తులే. ఇప్పుడిక ‘దేశమంటే మహిళలోయ్’ అనాలా? అనకపోయినా, అంటే ఒప్పుకోడానికి ఎవరూ ఇబ్బంది పడక్కర్లేదు. నేతాజీ ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’లో కొందరు -
దేశభక్తికి సర్కారు కొత్త నిర్వచనం చెప్తోంది
న్యూఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశభక్తి విషయంలో సరికొత్త నిర్వచనం ఇస్తున్న మోదీ ప్రభుత్వం, భిన్నత్వానికి తూట్లు పొడుస్తున్న వ్యక్తులను దేశభక్తులుగా గౌరవిస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సోనియా మాట్లాడారు. ‘ఈరోజు మనకు దేశభక్తి విషయంలో కొత్త నిర్వచనం ఇస్తున్నారు. అదే సమయంలో భిన్నత్వాన్ని పాటించని వ్యక్తులను దేశభక్తులుగా కీర్తిస్తున్నారు. పక్కా ప్రణాళికతో భారతదేశపు ఆత్మను అణచివేసేందుకు కుట్ర జరుగుతోంది. మోదీ ప్రభుత్వం అసమ్మతిని గౌరవించడానికీ, సమన్యాయ పాలన అందించేందుకు సిద్ధంగా లేదు’ అని అన్నారు. -
ధోని దేశభక్తి!
దేశం తరఫున ఆడుతున్నప్పుడు మైదానంలో ధోని అంకితభావం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మ్యాచ్‌లో జరిగిన ఒక ఘటన ధోని దేశభక్తిని మరోసారి ప్రపంచానికి చూపించింది. కివీస్ ఇన్నింగ్స్ సమయంలో ఒక అభిమాని భద్రతను ఛేదించుకొని గ్రౌండ్లోకి దూసుకొచ్చాడు. అతను నేరుగా ధోని వద్దకు వెళ్లి పాదాభివందనం చేశాడు. ఈ క్రమంలో అతని చేతిలో ఉన్న మన జాతీయ జెండా నేలను తాకింది. అంతే... అమిత వేగంతో కిందకు వంగిన ధోని ముందుగా మువ్వన్నెల జెండాను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాతే సదరు అభిమానిని పక్కకు జరిపాడు. త్రివర్ణ పతాకాన్ని నేలకు తగలకుండా ‘లెఫ్ట్‌నెంట్ కల్నల్’ ధోని దానిపై తన గౌరవాన్ని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. ఆ క్షణం మ్యాచ్‌లో ‘మూమెంట్ ఆఫ్ ద డే’గా నిలిచింది. -
మేరా బాలీవుడ్ మహాన్
నీవొక సైనికురాలివి... నేనొక సైనికుడిని ప్రత్యక్షంగా దేశాన్ని ప్రేమించి గళమెత్తి యుద్ధం చేసే సైనికులం మనం చేతిలో గన్ను లేకపోవచ్చు.. ఖడ్గం ఉండకపోవచ్చు కానీ మన చప్పట్లతో వీర జవాన్ల గుండెల్లో ధైర్యం నింపే సైనికులం మనం కుర్చీ అంచున కూర్చుని దేశభక్తిని ధ్వనించే గుండె మనది. సినిమా థియేటర్లో వినిపించే హోరు మనది స్వాతంత్య్రం వచ్చింది. ‘క్విట్ ఇండియా’, ‘వందేమాతరం’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘జైహింద్’, ‘స్వరాజ్ మేరా జన్మ్ సి«ద్ అధికార్ హై’ వంటి నినాదాలతో నాయకులు ప్రజలను ఉర్రూతలూగించి, లెక్కలేనన్ని త్యాగాలతో స్ఫూర్తి నింపి భారతమాత దాస్యశృంఖలాలను పెళ్ళగించి అవతల పారేయగలిగారు. దేశం ఉత్సాహంగా అడుగు ముందుకేసింది. ‘ఆరామ్ హరామ్ హై’ అంటూ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విరామమెరగక దేశ నిర్మాణంలో పడ్డారు. మరోవైపు అప్పటికే యవ్వనంలోకి అడుగుపెట్టిన హిందీ సినిమా ఆ స్ఫూర్తిని, ఆ తర్వాత అవసరమైన మార్గదర్శనాన్ని, ఆనాటి త్యాగాలను వీలువెంబడి వెండితెర మీద ప్రత్యక్షం చేస్తూ తాను నింప గల ఉత్సాహం తనూ నింపింది. ఎన్నో చిత్రాలు వచ్చాయి. కొన్ని మేలిమి ముత్యాలుగా నిలిచాయి. మదర్ ఇండియా... నయా దౌర్ భారతదేశం అంటే రైతు. భారతదేశం అంటే పంటచేను. భారతదేశం అంటే పల్లెసీమ. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశ గ్రామీణ చిత్రం ఎలా ఉందో చూపుతూ, భారతీయ రైతు స్త్రీ విముక్తే అసలైన దాస్య విముక్తి అని ప్రతిపాదిస్తూ ‘మదర్ ఇండియా’ (1957) సినిమా వచ్చింది. నర్గిస్ నట జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ సినిమా సంఘ వ్యతిరేకం అయితే ఈ దేశం కోసం సొంత బిడ్డను కూడా బలి ఇవ్వడానికి భారత మాతృమూర్తి వెనుకాడదని చెప్పి తేజస్సుతో నిండిన సందేశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘నయా దౌర్’ (1957) దేశంలో జరుగుతున్న యాంత్రికీకరణ, పారిశ్రామికీకరణ చర్చించింది. దేశీయ మూలాలను పదిలంగా ఉంచుతూ మార్పును స్వాగతించాలని సూచించింది. దిలీప్ కుమార్ నటించిన ఈ సినిమాలో ఓపి నయ్యర్ చేసిన ‘సాథీ హాత్ బఢానా’... అనే పాట కలిసి మెలిసి ముందుకు అడుగువేసేందుకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప బృందగీతం. హకీకత్.. బోర్డర్... లక్ష్య యుద్ధక్షేత్రం ఎలా ఉంటుందో తెలియకపోతే అసలైన దేశభక్తి ఎలా ఉంటుందో అర్థం కాదు. దేశం కోసం లేశమాత్రంగా ప్రాణం త్యాగం చేయడం ఎలా ఉంటుందో అర్థం కాదు. అందుకే బాలీవుడ్ మన దేశం ఎదుర్కొన్న యుద్ధాలను తన కథలుగా చేసుకుంది. 1962 వార్‌ను కథాంశంగా ‘హకీకత్’ (1964) తీసింది. ఇందులోని ‘కర్ చలే హమ్ ఫిదా’... పాట ఇవాళ్టికీ పర్వ దినాలలో మొగుతూ నరనరాల ఉద్వేగం నింపుతూనే ఉంటుంది. ఆ తర్వాత 1971 భారత–పాకిస్తాన్ల యుద్ధ నేపథ్యంగా ‘బోర్డర్’ (1997) వచ్చింది. సన్నిడియోల్, అక్షయ్ ఖన్నా తదితరులు నటించిన ఈ సినిమాలో ‘సందేశే ఆతేహై’.. పాట కుటుంబాలకు దూరంగా ఉండే సైనికుల వేదనను అశ్రువుల్లో చుట్టి వినిపిస్తుంది. ఇక దేశం చూపిన అతి గొప్ప సాహసం ‘కార్గిల్’ యుద్ధం. మన సైనికుల వీరత్వాన్ని చూపే ఈ యుద్ధం నేపథ్యంలో ‘లక్ష్య’ (2004) సినిమా వచ్చింది. ఫర్హాన్ అఖ్తర్ ఇందులో హీరో. భగత్‌సింగ్... సుభాష్... మంగళ్‌పాండే దేశం దేశనాయకులను ఎలా మర్చిపోదో బాలీవుడ్ కూడా మర్చిపోదు. దేశం కోసం త్యాగం చేసిన ఆ అమరవీరులను బాలీవుడ్ తన శక్తిమేరకు చూపించే సగటు ప్రేక్షకుడికి వారిని మరింత చేరువ చేసింది. భగత్ సింగ్ జీవితం ఆధారంగా వచ్చిన ‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ (2002) అజయ్ దేవగణ్‌కు గొప్ప పేరు తెచ్చి పెట్టింది. సుభాస్ చంద్రబోస్ సమగ్ర జీవితాన్ని శ్యామ్ బెనగళ్ ‘బోస్: ది ఫర్గాటెన్ హీరో’ (2005)గా తీశాడు. ఇక ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ హీరో అయిన మంగళ్‌పాండే జీవితాన్ని అదే పేరుతో 2005లో కేతన్ మెహతా ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కించాడు. సర్దార్ పటేల్ జీవితాన్ని పరేశ్ రావెల్ అభినయిస్తే దేశీయ భాషల్లో అంబేద్కర్ జీవితం వచ్చింది. హిందూస్తానీ... వెడ్నెస్ డే ఇక దేశంలోని అంతర్గత సమస్యలైన అవినీతి ఉగ్రవాదం వంటి సమస్యలను కూడా బాలీవుడ్ చర్చించింది. శంకర్ తీసిన ‘హిందూస్తానీ’ (1996), నసీరుద్దీన్ షా నటించిన ‘వెడ్నెస్ డే’ (2008) చాలా ప్రతిభావంతంగా ఆ సమస్యలను చర్చించి ప్రేక్షకులను ఆలోచింప చేశాయి బాలీవుడ్ ఇంతటితో ఆగలేదు. సర్జికల్ స్ట్రయిక్స్‌ను కూడా కథాంశంగా తీసుకుని ‘ఉడి’ (2019) వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. రాబోయే రోజులలో మరెన్నో బయోపిక్‌లో గత కాలపు దేశ ఘనతలు వెండితెరను అలంకరించనున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ మనం మేరా భారత్ మహాన్ అనుకోవాలి. ఇండియా జిందాబాద్ అని గట్టిగా నినాదం ఇవ్వగలగాలి. ఈ దేశం పట్ల ప్రేమ, గౌరవం ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలని కోరుకుందాం. ఉప్కార్... పూరబ్ ఔర్ పశ్చిమ్ ఆ తర్వాత నటుడు మనోజ్ కుమార్ వచ్చి రెండు మూడు ముఖ్యమైన సినిమాలు తీశాడు. దేశం సుభిక్షంగా ఉండాలంటే ఇటు కిసాన్, అటు జవాన్ ఇద్దరూ శక్తిమంతంగా ఉండాలనే లాల్‌బహదూర్ శాస్త్రి నినాదాన్ని ఊతంగా తీసుకొని ‘ఉప్కార్’ (1967) సినిమా తీశాడు. ‘ఏ దేశ్ కీ ధర్తీ’... పాట ఈ మట్టిలో మణులూ మాణిక్యాలు పండించడానికి స్వేదజలాన్ని చిందించే రైతుకు చేసిన శాల్యూట్ అని చెప్పవచ్చు. అదే సమయంలో మనోజ్ కుమార్ ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) సినిమా కూడా తీశాడు. స్వాతంత్య్రం వచ్చిందనే అత్యుత్సాహంలో ఇబ్బడి ముబ్బడిగా పాశ్చాత్య ప్రభావానికి లోనై మన సంస్కృతిని దెబ్బ తీయడానికి యువత ప్రభావితం కావద్దని చెబుతూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్పగా నచ్చింది. చక్ దే ఇండియా.. భాగ్ మిల్కా భాగ్... దంగల్ మరో వైపు క్రీడల ద్వారా దేశభక్తిని నింపే ప్రయత్నం కూడా బాలీవుడ్లో జరిగింది. మహిళా హాకీ జట్టులో స్ఫూర్తి నింపే ‘చక్ దే ఇండియా’ (2007) సినిమా ఘన విజయం సాధించింది. షారుక్ ఖాన్ నటించడంతో ఈ సినిమా యువతను క్రికెట్ నుంచి ఆ ఆటవైపు చూసేలా చేసింది. ‘ఫ్లయింగ్ సిక్’గా పేరుగాంచిన మిల్కాసింగ్ జీవితం ‘భాగ్ మిల్కా భాగ్’ (2013)గా రావడం ఒక ముఖ్య సన్నివేశం. ఫర్హాన్ అక్తర్ ఈతరం ప్రేక్షకులకు తెలియని మిల్కాసింగ్‌ను గొప్పగా తెర మీద చూపించగలిగాడు. ఇక ఏ దేశంలో అయితే స్త్రీలను వంటింటి పరిమితం చేస్తారనే పేరు ఉందో ఏ దేశంలో అయితే స్త్రీలను అణిచి ఉంచుతారనే ప్రచారం ఉందో ఆ దేశంలో నుంచి బాక్సింగ్ చేసే అమ్మాయిని ‘మేరీ కోమ్’ (2014)లో, కుస్తీ ఆడే ఆడపిల్లను ‘దంగల్’ (2016)లో చూపి దేశ మహిళల ఘనతకు ఒక నివాళి అర్పించగలింది. దంగల్ -
ఈ ‘దేశభక్తుల’కు సరిలేరు వేరెవ్వరు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మన దేశానికి అందరికన్నా ఎక్కువ మేధావులు, లౌకికవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది. నేనే కనుక హోం మంత్రిని అయితే వారందరినీ కాల్చి పారేయమంటూ ఆదేశాలిచ్చేవాణ్ని’, అని కర్ణాటక భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు బసన గౌడ పాటిల్ యత్నల్ ‘కార్గిల్’ దినోత్సవం నాడు బీజీపీ అనుచర వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కంటే కూడా భారత సెక్యులర్ వాదులే ఎక్కువ ప్రమాదకారులని కూడా అన్నారు. ఇలాంటి నయా జాతీయవాద దేశ భక్తులు దేశంలో రోజుకొకరు పుట్టుకొస్తున్నారు. ముస్లింలెవరు తన కార్యాలయంలో కనిపించకూడదంటూ గత నెలలో కసరుకున్నప్పుడే యత్నల్ దేశభక్తిని అందరు గుర్తించి ఉండాల్సింది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో జౌళి శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు యత్నల్ తన దేశభక్తి భయటపడకుండా ఎంతగా దాచుకున్నారో పాపం! ‘దేశంలో నేడు టెర్రరిజం, నేరాలు, గోరక్షణ హత్యలు పెరిగి పోవడానికి అసలు కారణం జనాభా పెరుగుదల. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటితో పోలిస్తే నేడు జనాభా విపరీతంగా పెరిగింది. అది కూడా ఒక్క ముస్లింల వల్లనే’ అని ఉత్తరప్రదేశ్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు హరి హోం పాండే వ్యాఖ్యానించారు. గోరక్షణ పేరిట జరుగుతున్న ముస్లింల హత్యలకు ముస్లింలనే నిందించాలన్న మాట. కొంచెం అటుఇటుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే మాట్లాడారు. ‘అనవసరంగా మూక హత్యలను హైలైట్ చేస్తున్నారు. ఏది ఏమైనా గోవుల స్మగ్లింగ్‌ను, కబేళాలకు తరలించడాన్ని ఆపేయాల్సిందే’ అని పిలుపునిచ్చారు. 2014 నుంచి 2017 మధ్య జరిగిన 87 సంఘటనల్లో 34 మంది ముస్లింలు మరణించడం పెరుగుతున్న వారి జనాభాలో ఎంతపాటి! ఇలాంటి వ్యక్తులు మాటల్లో తమ దేశభక్తిని చాటుకుంటే కేంద్ర సాంస్కతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తన దేశభక్తిని చేతల్లో చూపించారు. 2016లో ఓ ముస్లిం యువకుడిని గోరక్షణ పేరిట హత్య చేసిన కేసులో నిందితుడు అనారోగ్యం కారణంగా మరణిస్తే ఆయన మతదేహంపై జాతీయ జెండాను కప్పి అమరవీరుడిని చేశారు. ముస్లిం మూక హత్య కేసులో శిక్ష పడిన ఆరుగురు దోషులు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయితే కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వారిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి సత్కరించిన విషయం తెల్సిందే. ఈ సంఘటనకు తాను చింతిస్తున్నానంటూ ఆయన తండ్రి యశ్వంత్ సిన్హా అనవసరంగా నొచ్చుకున్నారు. ఆయన వాజపేయి హయాంలో రెండుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసినది ఎవరికి గుర్తుందీ, కొడుకు ప్రవర్తనను పొగిడి ఉంటే ‘తనయుడికి తగ్గ తండ్రి’ అంటూ ఈ దేశం జీవితాంతం గుర్తుంచుకునేది కదా! ‘దేశంలో శాంతి కోసం ఇస్లాంను పూర్తిగా తుడిచిపెట్టాల్సిందే. చర్చి మతమార్పిడి యంత్రం. భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిందే. ఇక భారత లౌకికవాదులు తల్లిదండ్రుల రక్తం పంచుకోని వివాహేతర సంబంధానికి పుట్టిన బిడ్డలు (బాస్టర్ట్స్)’ అంటూ తన భాషా నైపుణ్యాన్నంతా ప్రదర్శించి నైపుణ్య శాఖకు తగిన వ్యక్తినని నిరూపించుకున్నారు ఆ శాఖ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే. హిందూత్వాన్ని ఐక్యంగా ఉంచేందుకు, భారత్‌ను మరింత బలోపేతం చేసేందుకు హిందువులు కనీసం ఐదుగురిని కనాలని యూపీకి చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా పిలుపునిచ్చారు. ఇలాంటి మేథావులే చెప్పిన ‘హమ్ పాంచ్ హమారా పచ్చీస్’ నినాదాన్ని ముస్లింలు వీడనంతకాలం హిందువులు ఎంత మందిని కంటే మాత్రం హిందూత్వం బలపడుతుంది. ప్రస్తుత రాజ్యాంగానికి అంతో ఇంతో కట్టుబడి పనిచేసే కోర్టులు ఉన్నంతకాలం గౌరీ లంకేష్ లాంటి మేధావులను, లౌకికవాదులను ఎంత మందిని చంపితే మాత్రం ఏం ప్రయోజనం? టర్కీలో, రష్యాలో, హంగరీలోలాగా మేధావులు, లౌకికవాదులతో నయా జాతీయవాదులు, దేశభక్తులు యుద్ధం చేసి ‘తాడో పేడో’ తేల్చుకుంటే పోలా! -ఓ సెక్యూలరిస్ట్ కామెంట్ -
జగమంతా నా కుటుంబమే అనుకుంటారా..?
స్వదేశాన్ని మాతృభూమి అంటారు. అంటే దేశం జన్మనిచ్చిన తల్లితో సమానం. దేశపౌరులంతా కలసికట్టుగా ఉంటే ఎంతో బలం. ఇప్పుడు ప్రపంచం కుగ్రామం అయింది. ప్రపంచీకరణ పేరిట, దేశాలు ఇతర దేశాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిణామంలో మాతృదేశాన్ని ఎలా గౌరవిస్తున్నామో అలానే ఇతర దేశాలపై వ్యతిరేక భావం ఏర్పరచుకోకుండా ఉంటే బాగుంటుంది కదా! మీలో దేశభక్తితో పాటు విదేశాలపై ఎలాంటి భావన కలిగి ఉన్నారో తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? 1. దేశభక్తి మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. మాతృదేశాన్ని పూజ్యభావంతో చూస్తారు. ఎ. కాదు బి. అవును 2. దేశం నాకేమి ఇచ్చింది? అని ఎప్పుడూ ప్రశ్నించుకోరు. ఎ. కాదు బి. అవును 3. దేశ ఔన్నత్యాన్ని గురించి అందరితో చెప్తారు. ఎ. కాదు బి. అవును 4. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన మహనీయులను మరచిపోరు. వారి గౌరవం తగ్గేలా ఎప్పుడూ మాట్లాడరు. ఎ. కాదు బి. అవును 5. దేశసమగ్రతను కోరుకుంటారు. అందరూ సమానమేనన్న భావన పెంపొందించుకుంటారు. ఎ. కాదు బి. అవును 6. దేశ విశేషాలతోపాటు ప్రపంచంలో జరిగే విషయాలనూ తెలుసుకుంటారు. ఎ. కాదు బి. అవును 7. దేశాల మధ్య అసమానతలు రాకుండా ఉండాలని గట్టిగా కోరుకుంటారు. ఎ. కాదు బి. అవును 8. ప్రపంచమంతా ఒకతాటిపై నడిస్తే బాగుంటుందనుకుంటారు. ఎ. కాదు బి. అవును 9. ఇతర దేశాలను సందర్శించాలంటే మీకు ఇష్టం. అలానే వాటి సంస్కృతిని కూడ తెలుసుకోవాలనుకుంటారు. ఎ. కాదు బి. అవును 10. ఇతర దేశాలపై కారణం లేకుండా వ్యతిరేకత పెంచుకోరు. ఎ. కాదు బి. అవును మొదటి ఐదు సమాధానాలు ‘బి’ లు వస్తే మీలో దేశభక్తి పూర్తి స్థాయిలో ఉంటుంది. ‘బి’ లు ఎనిమిది దాటితే విదేశాలనీ ఇష్టపడతారు. ప్రపంచ విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతారు. ‘ఎ’ లు ఎక్కువ వస్తే దేశభక్తి మీలో తక్కువ ఉంటుంది. ప్రపంచం గురించి తెలుసుకోవాలనే కుతూహలం మీలో అంతగా ఉండదు. -
ఎమ్మెల్యే పేరిట కోహ్లి దేశభక్తి సిక్సర్
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో వివాహం చేసుకున్న టీమిండియా విరాట్ కోహ్లిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్ సెలబ్రిటీలు ఎమ్మెల్యేకి కౌంటర్ ఇస్తున్నారు. కోహ్లి, అనుష్కలకు దేశభక్తి లేదని, అందుకే ఇండియాలో కాకుండా ఇటలీలో వివాహం చేసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ విమర్శించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు సూజిత్ సర్కార్(పింక్ ఫేమ్ ) తన ట్విట్టర్లో స్పందించారు. ‘‘దేశభక్తి లేని విరాట్ తన తొలి సిక్సర్‌ను దేశభక్తి ఉన్న ఎమ్మెల్యే పేరు మీదే కొడతాడు’’ అంటూ సెటైర్‌తో ఓ ట్వీట్ చేశాడు. ఇక కమెడియన్ వీర్‌దాస్ అయితే పన్నాలాల్‌ను పర్యవసనాలు ఆలోచించని ఎమ్మెల్యే అంటూ ఎద్దేవా చేశాడు. అంతటితో ఆగకుండా తన ట్విట్టర్లో ‘‘ఇక నుంచి కొత్త రూలు . ఏ ఎమ్మెల్యే అయినా సరే ఆలోచించకుండా, పిచ్చిగా మాట్లాడితే న్యూస్ చానెల్స్ వాటిని ప్రచారం చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు’’ అంటూ ట్వీట్ చేశాడు. Next time @imVkohli hits his unpatriotic 1st sixer out of the park it will be in the name of that patriotic MLA. — Shoojit Sircar (@ShoojitSircar) 20 December 2017 Ok. New rule. Anytime an MLA of no consequence says something incredibly ignorant and stupid...the news channels that carry it and make it trend are fined money. What say? — Vir Das (@thevirdas) 20 December 2017 -
విదేశంలో పెండ్లి చేసుకున్న విరాట్ దేశభక్తుడా?
గునా : విరాట్ కోహ్లి-అనుష్క శర్మల పెండ్లిపై బీజేపీ కీలక నేత అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియాలో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, డబ్బులు సంపాదించి.. వాటిని ఇటలీలో ఖర్చుపెట్టిన విరాట్-అనుష్కలకు అసలు దేశభక్తి ఉందా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. జాతీయ క్రికెట్ జట్టు సారధిపై ఒక చట్టసభ్యుడు ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని గునా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న పన్నాలాల్ సంక్యా.. మంగళవారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ దేశంలోనే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విక్రమాదిత్యుడు, ధర్మరాజు లాంటి పురాణ పురుషులు పెండ్లిళ్లు చేసుకున్నారు. మనందరం కూడా ఇక్కడే పెండ్లిళ్లు చేసుకున్నాం.. ఇకపైనా చేసుకుంటాం. మనలో ఎవరైనా విదేశాలకు వెళ్లి పెండ్లిళ్లు చేసుకున్నామా? మరి కోహ్లి మాత్రం ఆపని ఎందుకు చేసినట్లు? ఇక్కడ(ఇండియాలో) సంపాదించిన డబ్బును విదేశాల్లో ఖర్చుచేయడమేంటి?’ అని పన్నాలాల్ అన్నారు. విరాట్-అనుష్కల పెండ్లి డిసెంబర్ 11న ఇటలీలోని ప్రఖ్యాత టస్కనీ నగరానికి సమీపంలో.. 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్న విరుష్కలు.. సన్నిహితుల కోసం డిసెంబర్ 21న ఢిల్లీలో, 26న ముంబైలో రిసెప్షన్ ఇవ్వనున్నారు. -
దేశభక్తిపై ఒత్తిడి చేయొద్దు
తమిళసినిమా: దేశభక్తి గురించి ఎవరినీ ఒత్తిడి చేయకూడదని నటుడు కమలహాసన్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన ఈ మధ్య తరచూ సమాజంలో జరుగుతున్న అంశాలపై ట్విట్టర్లో స్పందిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా బుధవారం కూడా జాతీయగీతం వ్యవహారంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సింగపూర్‌లో జాతీయగీతం ప్రసారం అవుతున్నట్లు మనదేశంలోనూ ప్రసారం చేయాలన్న అంశంపై కమల్ స్పందిస్తూ సింగపూర్‌లో అర్ధరాత్రుల్లో కూడా జాతీయగీతం ప్రసారం అవుతున్నట్లు మనదేశంలో దూరదర్శన్, టెలివిజన్లలో ప్రసారం చేసి అన్ని ప్రాంతాల్లోనే దేశభక్తిని ప్రదర్శించాలని ఒత్తిడి చేయకూడదన్నారు. సింగపూర్ గురించి తరచూ ప్రస్తావించడానికి కారణం కొందరు విమర్శకులు చెప్పెదాన్ని బట్టి ఆక్కడి దయగుణం కలిగిన రాజ్యాధికారమే కారణంగా పేర్కొన్నారు. అది మనకు అవసరం లేదని కమల్ పేర్కొన్నారు.ఈ విషయంపై ఎలాంటి రచ్చ జరగనుందో చూడాలి. -
మీరు పాక్ మద్దతుదారులా..?
పాట్నా: ఓ బీహార్ మంత్రి పాత్రికేయుల దేశభక్తికి పరీక్ష పెట్టారు. తన కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులను ఆయన టార్గెట్ చేశారు. పాట్నాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మంత్రి వినోద్ కుమార్ సింగ్ భారత్ మాతా కీ జై అని నినదించాలని సభికులను కోరారు. సభికుల నుంచి వచ్చిన స్పందనకు సంతృప్తి చెందని మంత్రి ముందు వరుసలో ఉన్న జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ కొందరు భారత్ మాతాకీ జై అని నినదించడం లేదని, వారు పాకిస్తాన్ మాతను గౌరవిస్తారని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. జర్నలిస్టులైనా, మరెవరైనా ముందుగా మీరు భరతమాత బిడ్డలు ఆ తర్వాతే మీడియా ప్రతినిధులంటూ హితవు పలికారు. బీజేపీకి చెందిన వినోద్ కుమార్ సింగ్ నితీష్ సర్కార్‌లో గనులు, భూగర్భ శాఖల మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు. -
ఆపవయ్యా.. ఇదేమైనా టీవీ స్టుడియోనా?
న్యూఢిల్లీ: ‘భారత్ మాతా కీ జై..’ కొట్టి దేశభక్తిని నిరూపించుకోవాలంటూ కోర్టు హాలులో నిందితుడికి సవాల్ విసిరిన ప్రభుత్వ న్యాయవదిని సాక్షాత్తూ న్యాయమూర్తే తీవ్రంగా మందలించిన సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పదేళ్లనాటి హవాలా కేసులో ప్రముఖ కశ్మీరీ వేర్పాటువాద నేత షాబీర్ షాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జులై 25న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ హవాలా బ్రోకర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా షాబీర్‌పై కేసు నమోదుచేసిన ఈడీ అధికారులు.. మరో వారం రోజుల రిమాండ్ కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం వాదోపవాదాలు జరిగాయి. విదేశాల నుంచి నిధులు సేకరించి, కశ్మీర్లో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న షాబీర్.. విచారణకు సహకరించడంలేదని, నిజానిజాలు రాబట్టేందుకు మరికొన్నిరోజులు రిమాండ్‌కు అప్పగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఈడీ తరఫున) వాదించారు. ప్రతిగా డిఫెన్స్ లాయర్.. చేయని నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా తన క్లయింట్ షాపై ఈడీ ఒత్తిడి చేస్తోందని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వ లాయర్.. షాబీర్ షాను సంబోధిస్తూ.. ‘నువ్వు నిజంగా దేశభక్తుడివే అయితే, భారత్ మాతాకీ జై..అని బిగ్గరగా అరువు’ అని సవాలు విరిసాడు. దీంతో ఖంగుతిన్న న్యాయమూర్తి.. ‘ఏంటిది? ఇదేమైనా టీవీ స్టుడియో అనుకుంటున్నావా? కోర్టు హాలన్న సంగతి మర్చిపోయావా? సవాళ్లు మానేసి పాయింటుకు రా’ అని తీవ్రంగా మందలించారు. చివరికి, షాబిర్‌షాను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పుచెప్పారు. -
మనిషిని చంపడమే దేశభక్తా..: కునాల్ కపూర్
ఛండీగఢ్: దేశభక్తిపై బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీధుల్లో ఒకరిని చంపడం, లేకపోతే సోషల్ మీడియాలో ఒకరి మీద మరోకరు విమర్శలు చేసుకోవడమే దేశభక్తా అని ప్రశ్నించారు. దేశభక్తి అంటే ఇండియా-పాక్ మ్యాచ్‌ల్లో గంతులేయడం కాదన్నారు. దేశభక్తి అంటే ఒక సిద్ధాంతం అని, దేశ నిర్మాణం దానిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. దేశంలో ప్రతిఒక్కరూ సమానమేనని అందరికీ సమాన హక్కులు ఉంటాయని కపూర్ అన్నారు. పంజాబ్ యూనివర్సిటీలో తను ప్రధాన పాత్రపోషించిన సినిమా 'రాగ్దేశ్' ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎర్రకోటలో భారతీయ ఆర్మీనేపథ్యంలో ఈచిత్రం తెరకెక్కింది. ఇందులో కునాల్ ఆర్మీ మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్ ప్రాత పోషిస్తున్నారు. రాజ్యసభ టీవీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాకిస్తాన్ నటులను బాలీవుడ్ లో నటించడానికి అనుమతినివ్వాలన్నారు. కరణ్ జోహార్ నటించిన ఏ దిల్ హై ముస్కిల్ చిత్రంలో పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ ఉన్నాడని చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. కానీ తర్వాత రోజుల్లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో పాకిస్తాన్ నటుడు ఉన్నా ఎందుకు అభ్యంతరం తెలపలేదు. అందరికీ ఒకే న్యాయం ఉండాలన్నారు. -
మేమూ దేశభక్తులమే.. నిలబడేదెలా?
దేశభక్తికి కొలమానమేది? జనగణమన.. అంటూ వినిపించగానే లేచి నిలబడ్డమేనా? మరి అటువంటప్పుడు దివ్యాంగుల పరిస్థితి ఏంటి? వారు లేచి నిలబడలేరు కదా..? అలాంటప్పుడు వారిని ‘దేశద్రోహుల్లా’ ఎందుకు చూస్తున్నారు? ఎక్కడ.. అంటారా? అయితే చదవండి... సినిమా థియేటర్లలో చిత్రం ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ప్రసారం చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో జనగణమన..ను ప్రసారం చేస్తున్నారు. జాతీయగీతం ప్రసారమవుతున్న సమయంలో థియేటర్లలోని జనాలంతా దేశభక్తిని చాటుతూ లేచి నిలబడుతున్నారు కూడా. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే దివ్యాంగులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎదురుగా జనగణమన.. వినిపిస్తున్నా.. గుండెల్లో దేశభక్తి ఉప్పొంగుతున్నా.. లేచి నిలబడలేని పరిస్థితి వారిది. అలా నిల్చోలేనివారిని మిగతా జనాలంతా వింతగా, దేశద్రోహుల్లాగా చూస్తున్నారట. దీంతో తమ గోడును వెల్లబోసుకునేందుకు మహారాష్ట్రలో దివ్యాంగులు పోరాటానికే దిగారు. సమస్య ఎక్కడంటే.. జాతీయ గీతాలాపనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. థియేటర్లలో జనగణమన.. ప్రసారమవుతున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని పేర్కొంది. అయితే మార్గదర్శకాల్లో దివ్యాంగులకు మినహాయింపునిస్తున్నట్లు పేర్కొనలేదు. దీంతో లేచి నిలబడలేని దివ్యాంగులు సినిమా హాల్లో అనేకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆనాలోచిత మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. ⇔ దివ్యాంగుల అశక్తతపై ప్రేక్షకులకు అవగాహన కలిగించేలా థియేటర్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి. ⇔ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో దివ్యాంగుల విషయాన్ని ప్రస్తావించాలి. ⇔ బదిరులు జాతీయ గీతాన్ని వినలేరు కాబట్టి.. సబ్ టైటిల్స్ వేసేలా చర్యలు తీసుకోవాలి. ⇔ దివ్యాంగులను కించపర్చేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధల్లో మార్పులు చేయాలి. –సాక్షి, స్కూల్ ఎడిషన్ -
'దేశభక్తి'పై పవన్ కల్యాణ్ ఘాటు ట్వీటు!
హైదరాబాద్: రోజుకో అంశంపై స్పందిస్తానని చెప్పిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ శనివారం 'దేశభక్తి' అంశంపై ట్వీట్ చేశారు. 'కులం, మతం, జాతి, ప్రాంతం, వర్గం, భాషకు అతీతంగా ఒక వ్యక్తిగానీ, రాజకీయ పార్టీగానీ వ్యవహరిస్తే దానిని నిజమైన దేశభక్తి అంటారు. ఒక పార్టీ ఆదర్శాలు, దృక్పథాల ఆధారంగా దేశభక్తిని చూడలేం' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మానవీయ విలువల్లో, సామరస్య భావనలో నిజమైన దేశభక్తి దాగి ఉంటుందని అన్నారు. 'ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అభిప్రాయంతోగానీ, విధానంతోగానీ విభేదిస్తే.. వారిని దేశద్రోహులుగా ముద్ర వేయకూడదు. ఇకవేళ వారు తమ ప్రత్యర్థుల గురించి తీవ్ర అభిప్రాయాలు వెల్లడించినా.. వారి గొంతును నులిమివేయకుండా మొదట వారు చెప్పేది వినాలి. ఆ తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా హడావిడిగా చర్యలు తీసుకుంటే జేఎన్‌యూ విద్యార్థులపై 'దేశద్రోహం' కేసు మాదిరిగానే ఎదురుదెబ్బ తగిలే అవకాశముంటుంది. జేఎన్‌యూ విద్యార్థుల కేసులో చివరకు వారి వీడియో కావాలని మార్చినట్టు తేలింది' అని అన్నారు. 'కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూస్తూ ఆస్వాదించాల్సిన సాయంకాలాన్ని 'దేశభక్తి' ని నిరుపించేకునే పరీక్షకు వేదికగా మార్చకూడదని పవన్ పేర్కొన్నారు. సినిమా థియేటర్లలోనే ఎందుకు? రాజకీయ పార్టీలు తమ సభల్లో మొదట జాతీయగీతాన్ని ఎందుకు ఆలపించవు? దేశంలోని ఉన్నత కార్యాలయాల్లో ఎందుకు ఆలపించడం లేదు? చట్టాలను అమలుచేయాలని ప్రబోధించే వారు మొదట తాము మార్గదర్శకంగా ఉండి ఇతరులు అనుసరించేలా చేయవచ్చు కదా' అని పవన్ పేర్కొన్నారు. 'నిజాయితీపరులకు చట్టాలను ఉచ్చుగా మార్చి.. కపటవేషగాళ్లకు వాటిని బొనంజా చేస్తున్నారా' అన్న అమెరికా ఆర్థికవేత్త థామస్ సోవెల్ వ్యాఖ్యలను పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై స్పందిస్తానని ఆయన ట్వీట్ చేశారు. జేఎన్‌యూను జేఎన్టీయూ అని పొరపాటున రాసినందుకు ఆయన క్షమాపణ కోరారు. pic.twitter.com/I4Gr7bboXO — Pawan Kalyan (@PawanKalyan) 17 December 2016 -
జై జవాన్.. జయహో భారత్
లబ్బీపేట : ‘జై జవాన్..జయహో భారత్..’ అంటూ నినదిస్తూ సుమారు ఐదు వేల మంది విద్యార్థులు శనివారం బందరు రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. భారత జవాన్ల మెరుపు దాడులను కీర్తిస్తూ, వారికి మద్దతుగా శ్రీ చైతన్య విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బెంజిసర్కిల్ నుంచి స్వరాజ్య మైదానం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రాణాలను సైతం లెక్కచేయక నిరంతరం దేశ రక్షణకు పాటుపడుతున్న సైనికుల సేవలను విద్యార్థులు కీర్తించారు. ‘మీ వెనుక మేమున్నాం..’ అని నినదించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పోలీసులు వచ్చి వాహనాలను మళ్లించారు. శ్రీ చైతన్య కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. -
భారతీయుల ఐక్యతను చాటిచెప్పాలి
కవాడిగూడ: ప్రతి భారతీయుడు దేశ భక్తిని పెంపొందించుకొని, ఐక్యతను చాటుకోవాలని బీజేపీ ఎస్సీమోర్చా జాతీయ అధ్యక్షుడు దుష్యంత్‌కుమార్ గౌతమ్ అన్నారు. మంగళవారం ఎస్సీమోర్చా ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ బాబు జగ్జీవన్‌రావు విగ్రహం నుండి లోయర్‌ట్యాంక్ బండ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ నల్లు ఇంద్రాసేనారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ఉపాధ్యక్షుడు సాంబమూర్తిలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో కొన్ని దుష్టశక్తులు ప్రజల మధ్య ఐక్యతను విచ్చిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారని, వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత ప్రభుత్వాలు త్యాగాల కుటుంబాలను విస్మరించారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో త్యాగాలు చేసిన కుటుంబాలకు తగిన గౌరవం దక్కుతుందన్నారు. చిత్తశుద్ది ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది వీరులు నిజాం ఆరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి విలువైన జీవితాలను దేశం కోసం త్యాగం చేశారన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నరహరి, జగన్, అశోక్, బీజేపీ ఎస్సీమోర్చా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ప్రసాద్, నాయకులు లింగం, పరిమళ్‌కుమార్, కృష్ణ, నాగేశ్వరరావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ భక్తి పెంపొందించేందుకే ‘తిరంగా యాత్ర’
మహారాష్ట్ర ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ చందన్ సింగ్ చందెలాజీ బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ఆసిఫాబాద్ : ప్రజల్లో దేశ భక్తి పెంపొందించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ తిరంగా యాత్ర ప్రారంభించారని మహారాష్ట్ర ఫారెస్టు కార్పొరేషన్ చైర్మన్ చందన్ సింగ్ చందెలాజీ అన్నారు. గత నెల 15 నుంచి ఈ నెల 17 వరకు దేశ వ్యాప్తంగా చేపడుతున్న తిరంగా యాత్రను పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీచౌక్, వివేకానందచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. శిశుమందిర్ విద్యార్థులు దేశ స్వాతంత్ర సమర యోధుల వేషధారణ, భగత్ సింగ్ వేష«ధారణతో గుర్రంపై ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చందన్ సింగ్, రాజూర ఎమ్మెల్యే సంజయ్ ధోటేజి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు దండనాయకుల గోపాల్ కిషన్ రావు, దండనాయకుల శ్రీనివాస రావులను శాలువలు, పూల దండలతో సన్మానించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో మతి చెందిన బీజేపీ నాయకుడు ఇరుకుల్ల కిషోర్ కుటుంబీకులకు ప్రధాన మంత్రి భీమాయోజన పథకం కింద రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి సతీశ్ బాబు, సీనియర్ నాయకులు ఈదులవాడ మారుతి, మండల పార్టీ అధ్యక్షుడు ఖాండ్రే విశాల్, చంద్రకాంత్, కొలిపాక వేణుగోపాల్, విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు కర్నాగౌడ్, వార్డు సభ్యురాలు కోట సునిత, కోట వెంకన్న, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
దేశభక్తి చాటేందుకే తిరంగా యాత్ర
రైలుపేట : స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో సోమవారం బీజేపీ నగరశాఖ, జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తిరంగ యాత్ర కార్యక్రమం జరిగింది. లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆకుల సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ కంభంపాటి హరిబాబు, బీజేపీ ఏపీ ఇన్చార్జి సిద్దార్ధనా«ద్ సింగ్‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని ప్రధాన కూడళ్లల్లో ఉన్న స్వాతంత్య్ర ఉద్యమకారులు, జాతినేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ ప్రజల్లో, యువతలో జాతీయ భావాన్ని పెంపొందించి భావిభారత పౌరులను దేశభక్తి వైపు మరలిచేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమకారుల స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసేందుకు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ ఏపీ ఇన్చార్జి సిద్దార్ధనా«ద్ సింగ్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు నలబోతు వెంకటరావు, పార్టీ నేతలు జమ్ముల శ్యామ్‌కిషోర్, శిఖాకొల్లి అభినేష్, చదలవాడ వేణుబాబు, చెరుకూరి తిరుపతిరావు పాల్గొన్నారు. -
దేశభక్తిని చాటిన తిరంగా యాత్ర
అనంతపురం కల్చరల్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన తిరంగా యాత్ర ఆద్యంతం దేశభక్తిని చాటింది. యువకేంద్ర యూత్ కోఆర్డినేటర్ శివకుమార్ నేతృత్వంలో యాద్ కరో ఖుర్బాని పేరిట త్రివర్ణ పతాకంతో కార్యక్రమం జరిగింది. వందలాది మంది యువతీ యువకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, కార్పోరేషన్ కార్యాలయం, ఎలే్కపి మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యులు కావాలని, తమ తెలివితేటలను, శక్తియుక్తులను దేశ ప్రగతి కోసం ఉపయోగించాలని వక్తలు పిలుపునిచ్చారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు వారసుడైన కల్లూరి ఆదినారాయణను ఘనంగా సత్కరించారు. అంతకు ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర డీడీఓ శ్రీనివాసులు, సాయి సంస్థ అధ్యక్షులు విజయ్సాయికుమార్, యోగా గురువులు సాయి మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా తిరంగా దివాస్
గుడివాడ టౌన్ (కృష్ణాజిల్లా) : పట్టణంలో తిరంగా దివాస్ ర్యాలీ గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నెహ్రుచౌక్ సెంటర్ నుంచి ఏలూరు రోడ్డు వరకు సాగిన ఈ ర్యాలీలో స్థానిక త్రివేణి పబ్లిక్ స్కూల్‌కు చెందిన వేయ్యి మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొని 4000 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం వజ్రోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిచినట్లుగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ (బాబ్జీ) ప్రారంభించారు. కార్యక్రమంలో త్రివేణి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఎన్.శివశంకర్ పాల్గొన్నారు. -
దేశభక్తికి అసలు చిరునామా
కొత్త కోణం నిష్కళంక దేశభక్తునిగా, సాహసమే ఊపిరిగా బతికిన విప్లవకారునిగా మన మెరిగిన భగత్‌సింగ్... భారత సమాజంలోని వైరుధ్యాలకు ఆయువుపట్టయిన కులం, దాని వికృత రూపమైన అంటరానితనాలను లోతుగా అధ్యయనం చేసి, పరిష్కారాన్ని చూపిన దార్మనికుడు కూడా. కొందరి జీవితాలు, ఆలోచనలు, సమాజ గతిని నిర్దేశిస్తాయి. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ నిరంతరం పురోగమించే శక్తిని సమాజానికిస్తాయి. అందుకే భగత్‌సింగ్ వంటి వారు అజరామరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ‘‘అంటరాని కులాల ప్రజలను జంధ్యం ధరించడానికి అనుమతిస్తు న్నామా? వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేయడానికి అంగీకరిస్తు న్నామా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. మరి అటువంటప్పుడు ఇతర దేశాల వాళ్ళు మనల్ని బానిసలుగా చూస్తున్నారని, అవమానిస్తున్నారని విమ ర్శించే హక్కు మనకు ఎక్కడున్నది?’’ బాబాసాహెబ్ అంబేద్కరో లేక మహాత్మ జ్యోతిరావు ఫూలేనో అన్న మాటలు కావివి. బ్రిటిష్ వాడి గుండెల్లో బాంబులు పేల్చి, దేశ దాస్య శృంఖలాలను ఛేదించేందుకు ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించిన విప్లవ వీరుడు షహీద్ భగత్‌సింగ్ రాసిన మాటలివి. మన మెరిగిన భగత్సింగ్లోని అంతగా వెలుగుచూడని తాత్విక కోణమిది. 1928, జూన్‌లో ‘కీర్తి’ అనే పంజాబీ పత్రికలో ‘అంటరానితనం’పై ఆయన రాసిన వ్యాసంలోని వాక్యాలివి. అంటరానితనం దుష్టస్వరూపాన్ని, దానిని అమలు చేస్తున్న హిందూమత వ్యవస్థ డొల్లతనాన్ని అందులో ఆయన తూర్పారబట్టారు. ఈ వ్యాసం రాసేనాటికి కులం, అంటరానితనం సమ స్యలపై మాట్లాడుతున్న వాళ్ళు చాలా తక్కువ. అంబేద్కర్ నాయకత్వంలోని ఉద్యమం మినహా, దళితేతరులు, రాజకీయ సంస్థలు, పార్టీలు ఏవీ నాటికి అంటరానితనం గురించి మాట్లాడటం లేదు. మహాత్మా గాంధీ ‘హరిజన సేవక్ సంఘ్’ను స్థాపించింది 1932లో. అంబేద్కర్, అంటరాని కులాల ఏకైక నాయకునిగా ఉండడం ఇష్టంలేకనే గాంధీజీ పూనా ఒప్పందం తర్వాత హరిజన సేవక్ సంఘ్‌ను మొదలు పెట్టారని భావిస్తున్నారు. భారత కమ్యూ నిస్టు పార్టీ కూడా 1931లోనే కుల సమస్యపై తీర్మానం చేసింది. ఊపిరిలోనే దేశభక్తిని నింపుకుని.... ఆ వ్యాసం రాసే నాటికి భగత్‌సింగ్ వయస్సు 22 ఏళ్లే. అప్పటికే సమాజాన్ని, ప్రపంచ పరిణామాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. భగత్‌సింగ్ కుటుంబం జాట్ అగ్రకులానికి చెందినదే అయినా, కొన్ని తరాలుగా అది సామాజిక, రాజకీయ జీవితంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. భగత్‌సింగ్ తాత అర్జున్‌సింగ్ హిందూ మత సంస్కర్తల్లో ఒకరైన ఆర్య సమాజ్ స్థాపకుడు దయానంద్ సరస్వతి అనుచరునిగా ఉండేవారు. ఆయన తండ్రి కిషన్‌సింగ్, మామలైన అజిత్‌సింగ్, స్వరణ్సింగ్లు గదర్ పార్టీలో సభ్యులుగా పని చేశారు. భగత్‌సింగ్ 1907 సెప్టెంబర్, 28న అవిభక్త పంజాబ్‌లోని ల్యాల్ పూర్(నేటి ఫైసలాబాద్) జిల్లాలోని బంగా గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉన్నది. 1911లో పాఠశాలలో చేరిన భగత్‌సింగ్, తాత పెంపకంలో దేశభక్తిని పుణికిపుచ్చుకున్నాడు. పసి వయస్సులోనే భగత్ సింగ్ మదిలో దేశభక్తి భావాన్ని నాటిన అర్జున్‌సింగ్, మనవడిని దేశానికి అంకితం చేస్తానని ప్రకటించారు. ఖల్సా హైస్కూల్లోనే పిల్లలను చదివించడం సిక్కుల ఆనవాయితీ. అయినా, అది బ్రిటిష్‌వారి కనుసన్నల్లో నడుస్తోన్నదన్న కారణంగా కిషన్‌సింగ్ తన కొడుకు భగత్‌ను లాహోర్‌లోని ఆర్య సమాజ్‌కు చెందిన దయానంద్ ఆంగ్లో-వేదిక్ స్కూల్లో చేర్పించాడు. మెట్రిక్యులేషన్ ముగిశాక నేషనల్ కళాశాలలో చేరాడు. విద్యార్థిగా ఉండగానే భగత్‌సింగ్‌కు దేశభక్తి రాజకీయాలతోపాటు, మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను, ప్రపంచ ఉద్యమాలను అధ్యయనం చేసే అవకాశం లభించింది. పద్నాలుగేళ్లకే జాతీయ విప్లవకారులతో సంబంధాలేర్పడ్డ భగత్‌సింగ్‌కు, అతని తాతమ్మ కోరిక మేరకు పెళ్ళి నిశ్చయించారు. భగత్‌సింగ్ అందుకు నిరాకరించి, ‘‘నేను విప్లవోద్యమంలో పూర్తి కాలం పనిచేయాలనుకుంటున్నాను. నీవు ఒక తల్లి కోరిక మేరకు నా పెళ్ళి చేయాలనుకుంటున్నావు. కానీ కోట్లాది మంది భారతీయుల తల్లి భరతమాత చెర విడిపించడం, ఆ తల్లి కోరిక తీర్చడం నా కర్తవ్యం’’ అంటూ తండ్రికి ఉత్తరం రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. విప్లవకారులతో కలిసి ‘‘నౌజవాన్ భారత్ సభ’’ను స్థాపిం చారు. ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ తదితరుల నేతృత్వంలో నడుస్తున్న ‘‘హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్’’లో చేరారు. 1926లో దసరా రోజున లాహోర్‌లో జరిగిన బాంబు పేలుడులో నిందితునిగా భగత్‌సింగ్‌ను అరెస్టు చేశారు. ఐదు వారాల జైలు జీవితం తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. ఇంక్విలాబ్ జిందాబాద్! 1919 నాటి జలియన్‌వాలాబాగ్ మారణకాండ, 1928 నాటి లాలా లజపతి రాయ్ మరణం భగత్‌సింగ్‌ను బాగా ప్రభావితం చేసిన రెండు ఘటనలు. జలియన్‌వాలా బాగ్ నరమేధం జరిగిన మరుసటి రోజే ఆ స్థలానికి వెళ్ళి నెత్తురింకిన మట్టిని తీసుకొని భగత్‌సింగ్ పోరాట ప్రతిజ్ఞ చేశారు. సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనపై పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన లాలా లజపతిరాయ్ ఆ తరువాత మరణించారు. ఆ లాఠీచార్జీకి కారణమైన స్కాట్‌ను కాల్చి చంపాలని వెళ్ళిన భగత్‌సింగ్ బృందం కాల్పుల్లో మరొక అధికారి సాండర్స్ మరణించాడు. జాతీయోద్యమ పోరాటాల అణచి వేతకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పబ్లిక్ సేఫ్టీ బిల్లు, కార్మిక వివాదాల బిల్లులను నిరసిస్తూ 1929 ఏప్రిల్ 8న భగత్‌సింగ్, భటుకేశ్వర్ దత్‌లు సెంట్రల్ అసెంబ్లీలో రెండు బాంబులను ఎవరూ లేని నిరపాయకరమైన చోటు చూసి విసిరారు. కేవలం హెచ్చరికగానే తాము బాంబులను వేశామని ఆ తర్వాత వారు ప్రకటించారు. బాంబులు వేసి వారు పారిపోక, స్వచ్ఛం దంగా అరెస్టయ్యారు. కేసు విచారణనే వేదిగా చేసుకుని తమ హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఎస్ఆర్ఏ) లక్ష్యాలను దేశానికి చాటాలని వారు ముందే నిర్ణయించుకున్నారు, కేసు విచారణ తదుపరి 1929 జూన్, 12న భగత్‌సింగ్. భటుకేశ్వర్ దత్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ, అండమాన్ జైలుకు పంపాలని కోర్టు తీర్పు చెప్పింది. అయితే సాండర్స్ హత్య కేసులో భగత్‌సింగ్ నిందితుడంటూ పోలీసులు ఆ కేసును తిరగ దోడారు. ఈ కేసులో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు 1930లో ఉరిశిక్ష విధించారు. కిశోరిలాల్, మహావీర్‌సింగ్, విజయ్కుమార్సిన్హా, శివవర్మ, తది తరులకు జీవిత ఖైదు విధించి అండమాన్ జైల్లో బంధించారు. వారి ఉరి శిక్షలకు వ్యతిరేకంగా దేశమంతా నిరసన వెల్లువెత్తింది. అయినా బ్రిటిష్ ప్రభుత్వం విప్లవ వీరుల్ని 1931, మార్చి 23న ఉరితీసింది. యువ విప్లవ కిశోరం ఇంక్విలాబ్ జిందాబాద్! నినాదంగా భారత ప్రజల గుండెల్లో నిత్యమూ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాడు. కులంపై సంధించిన శస్త్రం ముందే చెప్పుకున్నట్టు భారత సమాజంలోని వైరుధ్యాలకు ఆయువుపట్టుగా ఉన్న కులాన్ని, దాని వికృత రూపమైన అంటరానితనాన్ని అర్థం చేసుకొని భగత్‌సింగ్ చేసిన విశ్లేషణ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. ‘‘కొన్ని విష యాలను తలచుకుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది. ఒక కుక్కను మన తొడల మీద కూచోపెట్టుకొని గారాబం చేస్తాం. వంటగది సహా, ఇల్లంతా స్వేచ్ఛగా తిరగనిస్తాం. కానీ సాటి మనిషిగా పుట్టిన వాడిని అంటరా నివాడని పేరుపెట్టి, అంటుకుంటే చాలు మన ధర్మం నాశనమవుతుందని బాధపడిపోతాం’’ అంటూ భగత్‌సింగ్ అంటరానితనాన్ని యువ భగత్ నిర సించాడు. అంతేకాదు, మురికిగా, అపరిశుభ్రంగా ఉంటారని, అపరిశుభ్ర మైన పనులు చేస్తారని కొందరిని వెలివేస్తున్నాం. మన మురికిని కడిగిన తల్లిని ఎందుకు వెలివేయడం లేదని నిలదీశారు. దేశ రక్షణకు, సమాజ పురో గతికి అంటరాని కులాలు చేసిన సేవను ప్రస్తావిస్తూ... గురుగోవింద్‌సింగ్ సైన్యంలోనూ, ఛత్రపతి శివాజీకి అండగానూ అంటరాని కులాలు పనిచేశా యని, వాళ్ళు లేకపోతే హిందూ ధర్మం ఎప్పుడో దెబ్బతినేదని ఆయన స్పష్టం చేశారు. 1928 సమయంలో అంబేద్కర్ నాయకత్వంలో అంటరాని కులాలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఉద్యమా నికి భగత్‌సింగ్ సంఘీభావాన్ని ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్‌ను అంగీకరించడం ద్వారానే వారి జీవితాలలో మార్పు వస్తుందంటూ ‘‘ఈ సమస్యకు పరిష్కారం ఏమిటనే ప్రశ్న అందరిలో ఉదయిస్తుంది. ప్రతి మనిషి పుట్టుక, వృత్తి ద్వారా గుర్తింపును పొందకుండా, ప్రతి మనిషిని సమానంగా చూసినపుడే అంటరానితనం కుల వివక్ష, మాయమైపోతాయి’’ అంటూ కులసమస్యకు పరిష్కారం చూపాడు. అంటరాని కులాల ప్రజలను ఉద్దేశిస్తూ, ‘‘మీరు నిజమైన కార్మికవర్గం. మీ సమయాన్ని వృథా చేసుకోకండి. మీ కాళ్ళ మీద నిలబడి ఈ అసమానతల్ని ప్రతిఘటించండి. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూ డదు. మీకు మీరే రక్షకులుగా నిలవండి. సామాజిక ఉద్యమం ద్వారా విప్లవా నికి నాంది పలకండి. మీరు, మీరు మాత్రమే ఈ దేశపు మూలస్తంభాలు, మూలాధారాలు. నిద్రపోతున్న సింహాల్లారా, లేవండి విప్లవ పతాకాన్ని ఎగురవేయండి!’’ అంటూ ఆయన గర్జించడాన్ని చదువుతుంటే భగత్‌సింగ్ కళ్ళ ముందే నిలిచినట్టనిపిస్తుంది. ఆయన రచనల పేరుతో వచ్చిన చాలా పుస్తకాల్లో ఈ వ్యాసానికి చోటు దక్కకపోవడానికి కారణాలు ఎలాంటివో అర్థం చేసుకోగలం. కులం పట్ల భగత్ సింగ్ విస్పష్ట వైఖరిని మరుగుపరిచే ప్రయత్నం జరిగిందనే భావించాలి. భగత్‌సింగ్ ఇరవై నాలుగేళ్ల ప్రాయంలోనే అమరుడైనా, ఆయన ఆలోచనలు, ఆచరణ, జీవితం నాటి నుంచి నేటి వరకు యువతరాన్ని విప్లవోన్ముఖులను చేస్తూనే ఉన్నాయి. అంటరానితనంపై ఆయన ప్రకటించిన అభిప్రాయాలు నాటి పంజాబ్‌లోని అంటరాని సామా జిక వర్గాల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. అక్కడి అంటరాని కులాలు సాధిం చిన సామాజికార్థికాభివృద్ధే అందుకు నిదర్శనం. కొందరి జీవితాలు, ఆలోచ నలు, సమాజ గతిని నిర్దేశిస్తాయి. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ నిరంతరం పురోగమించే శక్తిని సమాజానికిస్తాయి. అందుకే భగత్‌సింగ్ వంటి వారు అజరామరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. - మల్లెపల్లి లక్ష్మయ్య (మార్చి 23 భగత్‌సింగ్ 85 వ వర్ధంతి) వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
దాడి చేసిన వారితో ఆటలా: ఉద్ధవ్
ముంబై: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు భద్రత కల్పిస్తామంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే మండిపడ్డారు. భారత్‌లోకి ప్రాయోజిత చొరబాటును పాక్ ఆపేంతవరకు ఆ దేశంతో మనం ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదని ఆదివారం చంద్రాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఉద్ధవ్ పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ తన దేశభక్తిని చాటుకోగా, మమతాబెనర్జీ మాత్రం ఎన్నికల నేపథ్యంలో ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. భారత్‌పై దాడిచేసిన వారితో మనం ఆడాలా? అని ప్రశ్నించారు. ఒక చేతిలో క్రికెట్, మరో చేతిలో బాంబు కుదరదని, మీరు బాల్‌నన్నా వదిలేయండి లేదా పాక్‌తో ఆడటాన్ని అయినా వదిలేయండి అని అన్నారు. -
రాజీవ్ హంతకులు దేశభక్తులా ?
న్యూఢిల్లీ: దేశ విద్రోహులెవరూ, దేశ భక్తులెవరూ? అసమ్మతి వ్యక్తం చేయడం దేశ విద్రోహమా? అన్న అంశంపై వాడిగా, వేడిగా పార్లమెంట్లో చర్చోపచర్చలు జరగుతున్నాయి. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థుల వివాదం కారణంగా ఈ చర్చకు తెరలేసింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని చంపిన వాళ్లు దేశభక్తులవుతారా? దేశ విద్రోహులవుతారా? అన్న అంశం కూడా కొత్తగా చర్చకు వస్తోంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ప్రధాన దోషి నళినీ శ్రీహరన్ బుధవారం నాడు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చెన్నైకి దూరంగా ఉన్న వింద్యా ప్రాంతానికి వెళ్లారు. ఆమెకు ఇంటివద్ద విదుత్తలాయ్ చిరుతాయిగల్ కాట్చి ప్రాంతీయ పార్టీ (వీసీకే)కి చెందిన నాయకుడు తోల్ తిరుమవలవన్ ఘనంగా స్వాగతం చెప్పారు. ఆమెను తక్షణం జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా నినాదాలు కూడా చేశారు. ఇలాంటి ప్రవర్తన వారికి కొత్త కాదు. రాజీవ్ హత్యకు కుట్ర పన్నిన ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరణ్ జయంతి ఉత్సవాలను వీసీకేతోపాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పొత్తు పెట్టుకున్న మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే) అనే మరో ప్రాంతీయ పార్టీ నిర్వహిస్తూ వస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఓట్లేశారు. పార్లమెంట్ దాడి కేసులో ఉరిశిక్ష పడిన మిలిటెంట్ అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థి నాయకులు దేశద్రోహులైతే, సాక్షాత్తు దేశ ప్రధానినే హత్య చేయించిన మిలిటెంట్ నాయకుడు ప్రభాకరణ్ జయంతి ఉత్సవాలను ప్రతి ఏడాది నిర్వహించే ఈ రెండు పార్టీల నాయకులు, వారికి ఓట్లేసిన 20 లక్షల మంది ప్రజలు దేశద్రోహులు కారా? విద్యార్థి నాయకులను, వారిని సమర్థించిన అధ్యాపకులను అరెస్టు చేసినప్పుడు ఈ రెండు పార్టీల నాయకులను, వారిని సమర్థిస్తున్న ప్రజలను ఎందుకు అరెస్ట్ చేయరు? ఈ రెండు పార్టీల నాయకుల సమాజంలో స్వేచ్ఛగా తిరగొచ్చు, వారి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, ప్రజా ప్రతినిధులుగా కొనసాగవచ్చు. అఫ్జల్ గురును సమర్థించిన వాళ్లు మాత్రం దేశద్రోహులు. భారత ప్రజాస్వామ్యంలో ఇదేమి వైరుధ్యం. ‘జన గణ మన అధినాయక జయహే’ అనే గీతాన్ని రవీంద్ర నాథ్ టాగూర్ బ్రిటీష్ వైస్ రాయ్‌ని పొగిడేందుకు రాశారని, ఆయన్ని అధినాయక అని సంబోంధించారన్న వివాదం ఇప్పటి ఉన్న విషయం తెల్సిందే. ఈ లెక్కన ఈ గీతం రాసిన రవీంద్ర నాథ్ టాగూర్ కూడా దేశద్రోహే కావాలి. పైగా ఆ గీతాన్ని జాతీయ గీతంగా ఆలాపిస్తున్నందుకు మనల్ని ఏమనాలి? -
మీ పాఠాలు అక్కర్లేదు: రాహుల్
రాయ్‌బరేలీ: దేశభక్తిపై ఆరెస్సెస్, బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. దేశం కోసం తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, దేశభక్తి తన రక్తంలోనే ఉందని చెప్పారు. శుక్రవారం తన నియోజకవర్గం అమేథీ పరిధిలోని సలోన్‌లో ఆయన రైతులతో మాట్లాడారు. కాగా, జేఎన్‌యూ గొడవే కాకుండా పటేల్ వర్గానికి రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న తమను కూడా ఆ పట్టించుకోవాలని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కోరింది. -
ఏది దేశభక్తి? ఏది జాతి వ్యతిరేకత?
ఇటీవల హైద్రాబాద్ సెట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మబలిదానం మనసున్న మనుషుల్నీ-దళితులు, ఇతర అణగారిన ప్రజలకు సమ న్యాయం లభించాలని కాం క్షించేవారినీ తీవ్ర వేదనకూ, ఆగ్రహానికీ గురి చేసింది. తద్వారా మత అసహనాన్నీ, వివక్షనూ ప్రోత్సహించే శక్తులు కొంత ఆత్మరక్షణలో పడినట్లనిపించింది. రోహిత్ ఘటన తర్వాత ఆత్మవిమర్శ చేసుకునేందుకు బదులు, ఆర్.ఎస్.ఎస్ దాని అనుబంధ సంస్థలైన బీజేపీ, ఏబీవీపీ, భజరంగదళ్ వంటి శక్తులు ఈసారి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇదివరకు ఎన్నడూ లేనట్టి భౌతిక ఘర్షణను సృష్టించాయి. దశాబ్దాలుగా సైద్ధాంతికపరమైన, మేధోపరమైన చర్చలకు జేఎన్‌యూ మారుపేరుగా నిలుస్తూ వచ్చింది. అలాంటి విద్యాసంస్థలో ఈ చిచ్చుకు బీజేపీ పక్షనేతలైన ఎంపీలే కాకుండా స్వయంగా కేంద్ర హోం శాఖామాత్యులు సైతం తన వ్యాఖ్యలతో తోడైనారు. ఈ క్రమంలో విశ్వసనీయత లేని ట్వీట్లను, అమెరికాలో తలదాచుకుంటూ, తనపై శిక్ష తగ్గించుకునేందుకు కుహనా జాతీయవాదులతో చేయి కలిపిన హెడ్లీ వంటి వాని అనుమానాస్పద వ్యాఖ్యలను ప్రామాణిక సాక్ష్యాలుగా తీసుకుని ప్రచార యుద్ధం మొదలెట్టారు. తమ కూటమిలో లేని రాజకీయ పార్టీలను అన్నిటికీ మించి వామపక్షాలను దేశద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా, పాకిస్థానీ పంచమాంగదళంగా గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారు. జేఎన్‌యూ విద్యార్థి యూనియన్ అధ్యక్షుడిని ఏ విధమైన ఆధారాలూ చూపించకుండా, పాలకుల ఆదేశాల మేరకు అరెస్టు చేశారు. మరో 7గురు విద్యార్థులను నిర్బంధించారు. తమ (ఏబీవీపీ) అనుయాయుల చేత పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలిప్పించి, మొత్తం ఉద్యమాన్ని దేశద్రోహ ఉద్యమంగా సృష్టించే ప్రయత్నం చేశారు. అంతకంటే మిన్నగా, ఢిల్లీ కోర్టులో కేసు సందర్భంగా హాజరైన జేఎన్‌యూ విద్యార్థులపై, విలేకరులపై, మీడియా వారిపై కోర్టు ఆవరణలోనూ, బయటా న్యాయవాదులు, బీజేపీ వారు, వారి ఎంఎల్ఏ అందరూ కలిసి ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఈ కాషాయ భావజాలాన్ని, నిరంకుశ ధోరణిని అడ్డుకట్ట వేయకపోతే సాపేక్షంగా ఈ మాత్రంగానైనా మిగిలిన మన ప్రజాస్వామిక, లౌకిక, అభ్యుదయ సాంస్కృతిక విలువలు బతికి బట్టకట్టలేవు. దేశభక్తి అంటే ఏమిటి? మా తెలుగుజాతి మహా కవి గురజాడ ఎప్పుడో శ్రీశ్రీ అన్నట్లు.. అంతర్జాతీయ గీతం కాదగిన తన ‘దేశభక్తి’ గేయం ద్వారా మాకు ‘దేశమంటే మట్టికాదనీ, దేశమంటే మనుషుల’ నీ చాటి చెప్పారు. ఇది ప్రపంచం గౌరవించదగిన మహత్తర నిర్వచనం. ఇటీవలే సియాచిన్ (భారత్- పాక్ సరిహద్దులలోని) ప్రాంతంలో గస్తీ కాస్తున్న 10 మంది మన వీర సైనికులు తీవ్రమైన ప్రతికూల వాతావరణం లో మంచు గడ్డలు విరిగిపడి మరణించారు. అక్కడ శత్రుసేనల దాడులలో రక్తం చిందించినందువల్ల కాకుండా, దుర్భర వాతావరణ స్థితి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఆ ప్రాంతంలో అదే స్థితిలో ఉన్న పాకిస్తాన్ కొన్నేళ్ల క్రితం సియాచిన్ని పరస్పర అంగీకారంతో ఒక నిరాయుధ జోన్‌గా ఉంచే విషయమై మన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఈ ఒప్పందాన్ని ఆసరాగా తీసుకుని, మన దేశముద్దుబిడ్డలైన సైనికుల అనవసర మరణాలను నివారించి, జైజవాన్ అని మన దివంగత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అన్నట్లు వారి రక్షణకు తోడ్ప డటం దేశభక్తి. అంతే కానీ సియాచిన్ రక్షణ పేరిట మన సైనికులను భక్షణ చేయడం కాదు. అది దేశ ప్రజలపై భక్తి ఎంతమాత్రమూ కాదు. అందునా శరీరకష్టం తప్ప మరో జీవనోపాధి లేని, తరతరాలుగా సామాజిక న్యాయానికి నోచుకోని, అణగారిన కులాలను, ఆదివాసీలను, మైనారిటీలను, మహిళలను రక్షించి ఆదుకోవడమే దేశ భక్తి. సర్వ సృష్టి నిర్మాతలు, మనందరి ప్రాణదాతలైన వారి కష్టాన్ని దోచుకుంటూ, అడుగడుగునా వారిని అవమానాలకు గురిచేస్తూ వారి నికృష్ట జీవన శిథిలాలపై పాలకులు ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తూ, ఆ లేనివారిని పీడించి కలవారికి ఊడిగం చేయబూనటం దేశభక్తి కాదు. మళ్లీ మన గురజాడ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ‘దేశాభిమానము నాకు కద్దని వట్టిగొప్పలు చెప్పుకోకోయ్/పూని ఏదైనా ఒక మేల్ చేసి జనులకు చూపవోయ్’. పరాయిపాలకుడు బ్రిటిష్‌వాడు తన పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉండినప్పటికీ, తనపాలనపై కనీస నిరసన తెలిపినా, దాన్ని మొగ్గలోనే తుంచివేసే రాజద్రోహ చట్టాలను ప్రవేశపెట్టాడు. తన దేశంలో దాదాపు దశాబ్ది క్రితమే ఆ చట్టాన్ని రద్దు చేసుకున్నాడు. మన దేశంలో మాత్రం ఈ వలసపాలన నాటి చట్టం నేటికీ అమలవుతూనే ఉండటం శోచనీయం. ‘స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన కేంద్రీయ విశ్వవిద్యాలయంలోకి వీసీ, పాలనాబృందం ఆదేశాలు లేకుండానే పోలీసులు ఎందుకు ప్రవేశించినట్లు? మా విశ్వవిద్యాలయాల పాలనా నిర్వహణలో జోక్యం చేసుకుని, ఫలానా విద్యార్థులను బహిష్కరించమని, ఫలానా వారిపై కేసులు పెట్టవద్దని ఆదేశించిన కేంద్ర మంత్రికి, అలా చేయమని రికమెండ్ చేసిన మరో సహచర కేంద్ర మంత్రికి ఆ అధికారం ఎవరిచ్చారు?’ అని వాదించిన విద్యార్థులు ఉగ్రవాదులూ, దేశద్రోహులూనా? ఈ రోజున నడిరోడ్డున ఉగ్రవాదులూ, దేశద్రోహులూ కాని మామూలు హేతువాదులనూ, పాలక పార్టీలకు వంగి సలాములు కొట్టడానికి ఇష్టపడని విద్యావంతులను, మేధావులనూ ప్రభుత్వ వేధింపులకు గురి చేస్తున్నారు. చివరకు అధికార పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయడమే కర్తవ్యంగా వ్యవహరించే రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో వీరు హతమవుతున్న సంఘటనలను చూస్తున్నాం. పాలకపార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ రకాల సాధువులు, సాధ్విలు మూకుమ్మడిగా.. ‘‘జేఎన్‌యూలో పెట్రేగుతున్న ‘అరాచక’శక్తులకు, ‘ఉగ్రవాద’ మూకలకు, జాతి శత్రువులకు, దేశద్రోహులకు (తమకు తోచిన, విశ్లేషణలు చేర్చి) యావజ్జీవిత కారాగార శిక్ష విధించడం కాదు. వారికి తుపాకి గుళ్లతో, ఉరికొయ్యలతో, ఉరితాళ్లతో సమాధానమివ్వాల’’ని నిర్భయంగా, బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటే మౌన ముద్ర దాలుస్తున్న పాలన నిరంకుశ మార్గాన వెళ్తున్నట్లే కదా. చివరగా ఈ విద్యార్థుల సహేతుకమైన పోరాటాలను, సైద్ధాంతిక రీత్యా కమ్యూనిస్టులు బలపరుస్తుంటే, సియాచిన్ మంచుగుట్టల దేశభక్తులు.. కమ్యూనిస్టులను దేశద్రోహులని, జాతి వ్యతిరేకులని విమర్శించడం చూస్తున్నాం. కమ్యూనిస్టులు బ్రిటిష్ వలసపాలనకు అనుకూలమైన జిన్నా ప్రతిపాదనను బలపరిచారనీ, భారతదేశంపై చైనా దాడి చేస్తే ఆ దాడిని బలపర్చారని, వారు దేశద్రోహులనీ, జాతి వ్యతిరేకులనీ పేర్కొంటూ అలవోకగా చరిత్రను వక్రీకరిస్తున్నారు. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. భారత దేశానికి స్వాతంత్య్రం రావాలంటే భారత ప్రజలు మొత్తంగా ఆనాడు ప్రబలంగా ఉండిన హిందూ, ముస్లిం మతభేదాలను మరచి ఐక్యంగా బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. 1940 నాటి పరిస్థితుల్లో, హిందువులు మెజారిటీగా ఉండిన స్వతంత్ర భారతదేశంలో తమ ముస్లిం మతస్థులకు న్యాయం జరగదని, తమ ముస్లిం రాజ్యంగా పాకిస్తాన్ కావాలని జిన్నా ప్రతిపాదించాడు. అప్పుడు ‘‘ముస్లిం మతానుయాయులలో విదేశీ జాతుల (ప్రజల) కూ, అలాగే హిందూమతం అధికంగా ఉండిన ప్రాంతాల్లోని అంగ, వంగ, కళింగ, ఆంధ్ర.. ఇత్యాది జాతులకు (అప్పటి లెక్క ప్రకారం మొత్తం బ్రిటిష్ ఇండియాలో 17 జాతులున్నాయి) ప్రత్యేక రాజ్యాంగం, పాలనా స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తిని ఇవ్వాలని అలాగే, ఈ జాతులలో ఎవరైనా, తాము స్వతంత్ర భారత దేశంలో ప్రజలమని భావిస్తే వారికి విడిపోయే హక్కు కూడా యివ్వాల’’ని కమ్యూనిస్టు పార్టీ 1943-45 నాటి తన తీర్మానాల్లో ప్రతిపాదించింది.’ అలా అయితే హిందూ ముస్లింల మధ్య పరస్పర విశ్వాసం పెరిగి, కాంగ్రెస్ ముస్లింలీగ్ రెండు కూడా ఐక్యంగా ఉద్యమించి స్వతంత్రాన్ని సాధించుకునే అవకాశం ఉంటుందనీ, అలాంటి హిందూ ముస్లిం ఐక్యత కోసం నాటి కమ్యూనిస్టులు చేసిన ప్రతిపాదన ఇది! పరమతద్వేషమే, పాకిస్తాన్ ద్వేషమే దేశభక్తిగా భావిస్తున్న శక్తులు చెప్తున్నట్లు నాడు కమ్యూనిస్టులు జిన్నాను ప్రశంసించలేదు. సరికదా, ఈ ప్రతిపాదనను జిన్నా కూడా వ్యతిరేకించాడు. ఇదీ చారిత్రక వాస్తవం. ఇక చైనా- ఇండియా తమ మధ్య సరిహద్దు వివాదాన్ని శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకో వాలన్నది సి.పి.యంగా తదుపరి రూపుదిద్దుకున్న నాటి పార్టీ ప్రతిపాదనే. నేటి మోదీ ప్రభుత్వం కూడా ఈ భౌతిక వాస్తవికతను గుర్తిస్తోంది. చైనాతో మనదేశ సరిహద్దు వివాదాన్ని శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నది. నాటి సి.పి.ఎం వాదనలోని సహేతుకత నేటికైనా ఈ మతోన్మాదులకు అర్థం కాకపోతే దేశానికే అనర్థం! చివరిగా.. నేను దేశద్రోహినా అని అడుగు తున్నాను. ఎందుకంటే భారతదేశం ఉంది కానీ భారత జాతి లేదు. ఎందువలన అంటే, భారతదేశం వివిధ జాతుల సమాఖ్య స్వరూపం. అంతేగానీ ఏకశిలా సదృశమైన నేషన్ స్టేట్ (జాతీయ రాజ్యం) కాదు. నాదేశం భారతదేశం అన్నట్లే- నా జాతి తెలుగుజాతి! తెలుగు జాతీయుడినైనభారతీయుణ్ణి నేను. అన్ని జాతు ల మాదిరే కశ్మీర్ కూడా మన దేశంలో ఒక జాతి! అందులో కొంత భాగం పాక్ అక్రమిత కశ్మీర్లో ఉంది. మరో భాగం మనదేశంలో ఉంది. మొత్తంగా కశ్మీరి జాతి ఏ దేశంలో ఉండాలో, తాము స్వతంత్ర జాతిగా ఉండాలో వారు స్వేచ్ఛగా శాంతియుతంగా పరిష్కరిం చుకునే అవకాశం రాకపోతే - ఈ కశ్మీర్ సమస్య రావణ కాష్టంలా నలుగుతూనే ఉంటుందనీ నా భావన. ఏపీ విఠల్ వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు -
నా దేశభక్తిని ప్రశ్నించేవాళ్లు స్టుపిడ్స్!
ముంబై: తాను లౌకిక వాదినని (సెక్యులర్) రుజువు చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పేర్కొన్నాడు. దేశంలో అసహనంపై తాను చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదమైన నేపథ్యంలో షారుఖ్ ఈ విధంగా స్పందించారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'అసహనం' చర్చ గురించి ప్రశ్నించగా 'దీని గురించి నిజంగా నాకేమీ తెలియదు. నేను ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్తాను. మంచి విషయాలు మాట్లాడుతాను. అంతేకాకుండా నేను సెక్యులర్ అని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తాను' అని ఆయన బదులిచ్చారు. 'మన ముందుకుసాగాలంటే లింగ వివక్ష, వర్ణవివక్ష, ఓ వ్యక్తి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఏ మతం వాడు, ఏ కులం వాడు వంటి అంశాలను మన మనస్సులో పెట్టుకోకూడదు. అలాంటి విషయాలకు అంతే ఉండదు' అని షారుఖ్ చెప్పాడు. కాబట్టి తాను సినిమాలు, నటన గురించి మాట్లాడాలని నిశ్చయించుకున్నట్టు తెలిపాడు. 'నీకంటే నేను ఎక్కువ దేశభక్తుడిని అని ఎవరైనా చెబితే.. అతను మూర్ఖుడు (స్టుపిడ్). ఏ కోణంలో ఒకరు తనకు తాను అధిక దేశభక్తుడినని అనుకోగలరు? దీనిలో ఎలాంటి హేతుబద్ధత లేదు. నీ కంటే నేనే ఎక్కువ దేశభక్తుడినంటూ మనం కేకలు పెడుతున్నాం. నిజానికి మనమందరం దేశభక్తులమే' అని చెప్పాడు. దేశంలోని పరిస్థితులపై గత ఇంటర్వ్యూలో తాను మనసులోని అభిప్రాయాలు వెల్లడించానని, వాటిని నెగిటివ్ దృష్టితో తీసుకున్నారని షారుఖ్ చెప్పారు. దాంతోపాటు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై షారుఖ్ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు. -
పిల్లలకు దేశభక్తి కధలు
‘మం చి’ ఎ జెండా దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మంచివోయ్... అనే కొత్త పాఠానికి ఎంతోమంది గురువులు. వాళ్ల కథలే... మచ్చుకు ఇవి కొన్ని. మన పిల్లలకు స్ఫూర్తినివ్వాలని... నిజమైన స్వాతంత్య్రం స్వార్థం నుంచి విముక్తేనని... అందమైన స్వేచ్ఛ... పంచుకోవడంలో ఉందని... దేశం కోసం పోరాటం కిసాన్లు, జవాన్లే కాదు... ఇన్సాన్లు కూడా చెయ్యొచ్చని చెప్పడానికే... ఈ మంచి కథలు. మంచితనం ఎంత నలిగితే అంత మంచిది. ఎంత అరిగితే అంత మంచిది. రేపటి భారతదేశానికి రెపరెపలాడే ఊపిరే మన ‘మంచి’ పిల్లలు. మంచితనానికి గులామ్ అవడమే దేశభక్తికి సలామ్ కొట్టడం. చిన బాలశిక్ష పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో బాబర్ అలీ అప్పట్లో తొమ్మిదేళ్ల చిన్నారి. స్కూలు నుంచి వస్తున్నప్పుడు పొలాల్లో పనులు చేసే తన ఈడు పిల్లలను గమనించాడు. వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. సొంతగా స్కూలు పెట్టాడు. తాను స్కూలు నుంచి రాగానే, ఆ పిల్లలను పోగేసి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. తన ఇంట్లో జామచెట్టు కింద పెట్టిన ఆ స్కూలు నిర్వహణ కోసం పాకెట్ మనీ ఖర్చు చేసేవాడు. పన్నెండేళ్ల కిందట మొదలైన ఆ స్కూలులో ఇప్పుడు 300 మంది చదువుకుంటున్నారు. ఆ స్కూలులో ఫస్ట్‌బ్యాచ్ విద్యార్థుల్లో ఆరుగురు ఇప్పుడు అందులోనే పాఠాలు చెబుతున్నారు. ‘చిన బాలశిక్ష’ను బోధించిన బాబర్ అలీకి జైహింద్ చెబుదాం. ఆపద్బాంధవులు... ఆ టీటీఈలు! ఆగస్టు 4... మంగళవారం అర్ధరాత్రి. మధ్యప్రదేశ్‌లో వంతెన దాటుతున్న రెండు రైళ్లు నిమిషాల వ్యవధిలో పట్టాలు తప్పాయి. ఈ సమాచారం తెలియగానే ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) వద్ద కలకలం రేగింది. ప్రమాదం పాలైన రెండు రైళ్లలో ఒకటైన కామాయని ఎక్స్‌ప్రెస్ మంగళవారం మధ్యాహ్నమే ఎల్టీటీ నుంచి బయలుదేరి వెళ్లింది. రెండో రైలు జనతా ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం అక్కడకు చేరాల్సి ఉంది. ఆ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి క్షేమ సమాచారం కోసం వారి బంధువులంతా ఎల్టీటీ వద్దకు వెల్లువెత్తారు. పరిస్థితి గమనించిన ఇద్దరు టీటీఈలు..ఏకే సిన్హా, ఆర్.శర్మ అప్పటికప్పుడే తాత్కాలిక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబరు ద్వారా వందలాది ఫోన్‌కాల్స్‌కు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. డ్యూటీ టైమ్ తర్వాత వాళ్లిద్దరూ ఇళ్లకు వెళ్లిపోవచ్చు. కానీ, బాధ్యత ఎరిగిన వారిద్దరూ రోజంతా చేసిన పని చాలామందికి ఊరటనిచ్చింది. బాధ్యత ఎరిగిన ఈ భారతీయులిద్దరికీ సలాం చేద్దాం. ప్రాణం పోసిన ప్రయాణం ప్రయాణంలో తారసపడిన స్నేహితుడు శ్రీకుమార్‌కు ప్రాణాన్నే పోశాడు. శ్రీకుమార్ కేరళలోని పుదుక్కొడతు గ్రామంలో ఎరువుల వ్యాపారి. నాలుగేళ్లుగా లివర్ సిరోసిస్‌తో బాధపడుతూ కాలేయ దాత కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి సమయంలో అనుకోకుండా ఒక బస్సు ప్రయాణంలో అజీజ్ దేవుడిలా తారసపడ్డాడు. ఇంట్లో వాళ్లను ఒప్పించి మరీ, శ్రీకుమార్‌కు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేశాడు. జూలై 15న సర్జరీ తర్వాత శ్రీకుమార్ కొత్తగా ప్రాణం పోసుకున్నాడు. ‘ప్రాణ’మైత్రికి ఆదర్శంగా నిలిచిన అజీజ్‌కు సలాం చేద్దాం. మెడిసిన్ బాబా జిందాబాద్..! ఢిల్లీలో ఓంకార్‌నాథ్ శర్మను స్థానికులంతా ‘మెడిసిన్ బాబా’గా పిలుచుకుంటారు. బ్లడ్‌బ్యాంకులో టెక్నీషియన్‌గా పనిచేసి, రిటైరైన ఓంకార్‌నాథ్ వయసు ఇప్పుడు 79 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన రోజూ ఇంటింటికీ తిరిగి, వాడగా మిగిలిపోయిన మందులను అడిగి తెచ్చుకుంటాడు. వాటిలో కాలంచెల్లిన వాటిని తీసేసి, పనికొచ్చే మందులను వాటిని కొనుక్కోలేని నిరుపేదలకు ఉచితంగా పంచిపెడుతుంటాడు. పేద రోగులకు తనవంతుగా నిస్వార్థసేవ చేస్తున్న ఈ ‘మెడిసిన్ బాబా’కు జిందాబాద్ చెబుదాం. ఫ్లైయింగ్ వాకర్స్ తమిళనాడులోని తిరుచ్చి దగ్గర్లోని మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద బాలిక స్వాతి. బాగా చదువుకుని ప్లస్‌టూలో మంచి మార్కులు సాధించిన మెరిట్ స్టూడెంట్. ఆగస్టు 8న ఆమెకు కోయంబత్తూరులో తమిళనాడు అగ్రికల్చరల్ వర్సిటీలోని అణ్ణా అరంగమ్లో అడ్మిషన్ కౌన్సెలింగ్. అయితే, పొరపాటున ఆమె, ఆమె తల్లి చెన్నైలోని అణ్ణా వర్సిటీకి చేరుకున్నారు. క్యాంపస్‌లో అడ్రస్ వెదుక్కుంటున్న తల్లీకూతుళ్లను గమనించారు అక్కడి వాకర్స్. జరిగిన పొరపాటును అర్థం చేసుకున్నారు. వెంటనే డబ్బులు సేకరించి, కోయంబత్తూరుకు టికెట్టు కొని, స్వాతిని, ఆమె తల్లిని విమానంలో పంపారు. ఈలోగా ఫలహారం పెట్టించారు. అగ్రికల్చరల్ వర్సిటీకి ఫోన్‌చేసి, ఆమెకు అదనపు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. వాకర్స్ చలవతో స్వాతి బీటెక్‌లో అడ్మిషన్ సాధించింది. అనూహ్య సాయానికి స్వాతి, ఆమె తల్లిదండ్రులు ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. త్వరలోనే చెన్నైకి వెళ్లి, తమకు సాయం చేసిన వాకర్లకు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా, విమానం టికెట్ల డబ్బులు తిరిగి ఇచ్చేసి రావాలనుకుంటున్నారు. స్వాతిని ఆదుకున్న వాకర్లు సిసలైన భారతీయులు.. వారికి జేజేలు పలుకుదాం. జగమంత కుటుంబం ఆమెది! బాల్య వివాహంతో బాధలు పడి, నిండు గర్భిణిగా రోడ్డున పడ్డ మహిళ సింధుతాయ్ నష్కల్ (67). మహారాష్ట్రకు చెందిన ఆమె జీవితంలో లెక్కలేనన్ని కష్టాలు అనుభవించింది. అయితే, ఇప్పుడామె అనాథ బాలలకు అమ్మ. ఇప్పటి వరకు ఆమె ఆశ్రయంలో దాదాపు 1400 మంది పెరిగి పెద్దయ్యారు. వాళ్లలో కొందరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఎదిగారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఐదువందలకు పైగా అవార్డులు వచ్చాయి. ఊరూరా తిరుగుతూ, ఉపన్యాసాలు ఇస్తూ, వాటి ద్వారా వచ్చే డబ్బుతోనే ఆమె అనాథ బాలల ఆలనా పాలనా చూసుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన భర్త క్షమించమని అడిగితే, పెద్దమనసుతో మన్నించింది. జగమంత కుటుంబం కలిగిన ఈ అమ్మకు వందనాలు పలుకుదాం. నిజాయితీకి గౌరవం హైదరాబాద్‌లో స్పెషల్‌బ్రాంచ్ కానిస్టేబుల్ గేదెల నారాయణరావు. విధి నిర్వహణలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న యశోదా ఆస్పత్రి వైద్యుడి పాస్‌పోర్టు పత్రాల తనిఖీకి వెళ్లారు. షరా‘మామూలు’గా ఆ వైద్యుడు వెయ్యిరూపాయలు ఇవ్వబోయారు. నారాయణరావు సున్నితంగా తిరస్కరించారు. కానిస్టేబుల్ నిజాయితీని ఆ వైద్యుడు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. మర్నాడే సీఎం స్వయంగా నారాయణరావును పిలిపించుకుని, ప్రశంసించడమే కాకుండా, అవార్డు అందజేశారు. నిజాయితీకి దక్కే గౌరవం ఇచ్చే సంతృప్తికి ఏదీ సాటిరాదు. చెక్కు చెదరని నిజాయితీ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొండేటి సతీష్ బుధవారం కరీంనగర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసుకు ఆటోలో వెళుతున్నాడు. తోవలో చిగురుమామిడి శివార్లలో గాలికి కొట్టుకుపోతున్న ఒక బ్యాంకు చెక్కును గమనించాడు. వెంటనే ఆటో దిగి, చెక్కు చేతిలోకి తీసుకున్నాడు. చెక్కుపై ఖాతాదారు దేవారపు సుధాకర్‌రెడ్డి పేరు కనిపించింది. ఇ.వెంకటయ్య అనే వ్యక్తి పేరిట ఆ చెక్కు రూ. 2 లక్షలకు రాసి ఉంది. వెంటనే ఈ విషయాన్ని నగర పంచాయతీ చైర్మన్‌కు చెప్పి, ఆ చెక్కును పోలీసులకు అందజేశాడు సతీష్. పోలీసులు అతడిని అభినందించారు. త్రివర్ణచక్రం నడిపే భయ్యా ఒంగోలులో కన్నెదారి కోటేశ్వరరావు ఆటోడ్రైవర్. ఈ ఏడాది మార్చి 4న ఒక మహిళ అతడి ఆటో ఎక్కింది. గమ్యానికి చేరుకున్నాక ఆటో దిగిన మహిళ, ఆటోలో తన బ్యాగు మరచిపోయింది. ఆ బ్యాగులో దాదాపు రూ. 3 లక్షల విలువ చేసే ఆభరణాలు ఉన్నాయి. బ్యాగులో నగలను గమనించిన కోటేశ్వరరావు, వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి ఆ బ్యాగును అప్పగించాడు. పోలీసుల ద్వారా అది సురక్షితంగా సొంతదారుకు చేరింది. కళ్లు చెదిరే బంగారు నగలు కళ్ల ముందు ఉన్నా, నిజాయితీని చాటుకున్న ఈ ఆటోడ్రైవర్ సిసలైన భారతీయుడు. అవును కదా! -
మువ్వన్నెల రుచులు
ముచ్చటైన మువ్వన్నెల జెండా పండుగ... ముచ్చటైన రాష్ట్రాలన్నీ ఒక్కటైన పండుగ... భాషలు వేరైన కాని భావమొక్కటనే పండుగ... పొరుగు రాష్ట్రాల సంస్కృతులను పంచుకునే పండుగ... ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునే పండుగ... అందరి రుచులను చవి చూసే పండుగ... ఇది దేశపండుగ... దేశభక్తితో పాటు మువ్వన్నెల రుచులను కూడా పంచుకుందాం... గుజరాతీ మ్యాంగో సలాడ్‌తో ఆమ్ శ్రీఖండ్ కావలసినవి: గట్టి పెరుగు - 2 కప్పులు (పెరుగును ఒక వస్త్రంలో గట్టిగా కట్టి, నీరంతా పోయిన తరవాత వాడాలి); కుంకుమ పువ్వు - అర టీ స్పూను; కండెన్స్డ్ మిల్క్ - 2 టిన్నులు; తాజా మామిడిపండ్లు - 300 గ్రా.; తాజా క్రీమ్ - పావు కప్పు; నిమ్మరసం - టేబుల్ స్పూను; పుదీనా ఆకులు - గుప్పెడు; చాట్ మసాలా - 2 టీ స్పూన్లు; గోల్డ్ వార్క్ - 4 షీట్లు; పిస్తా తరుగు - 80 గ్రా. తయారీ ఒక పాత్రలో గట్టి పెరుగు, కుంకుమ పువ్వు, కండెన్స్డ్ మిల్క్, మామిడి పండు తరుగు, పంచదార, ఏలకుల పొడి, తాజా క్రీమ్ వేసి బాగా కలిపి, ఫ్రిజ్‌లో చిల్లర్‌లో ఉంచాలి ఒక బౌల్లో మామిడిపండు ముక్కలు, నిమ్మరసం, పుదీనా ఆకులు, చాట్ మసాలా వేసి కలపాలి శ్రీఖండ్తో సర్వ్ చేయాలి. కాశ్మీరీ పులావ్ కావలసినవి: బాస్మతి బియ్యం - కప్పు; బటర్ - టీ స్పూను; షాజీరా - టీ స్పూను; దాల్చిన చెక్క - చిన్న ముక్క; లవంగాలు - 1; బిరియానీ ఆకు - 1; ఏలకులు - 1; ఫ్యాట్ తక్కువ ఉన్న పాలు - కప్పు; నీళ్లు - కప్పు; కుంకుమ పువ్వు - కొద్దిగా; ఉప్పు - తగినంత; పంచదార - టీస్పూను; క్యారట్, బీన్స్ ముక్కలు - కప్పు; తాజా బఠాణీ - పావు కప్పు; జీలకర్ర పొడి - అర టీ స్పూన్; ఏలకుల పొడి - పావు టీ స్పూను; వాల్నట్స్ - పావు కప్పు; బాదం తరుగు - పావు కప్పు; జీడిపప్పు పలుకులు - పావు కప్పు; కిస్మిస్ - పావు కప్పు; ఆపిల్ ముక్కలు - అర కప్పు; పైనాపిల్ ముక్కలు - అర కప్పు; బటర్ - 2 టీ స్పూన్లు; షాజీరా - అర టీ స్పూను; దాల్చిన చెక్క - చిన్న ముక్క; ఏలకులు - 1; లవంగాలు - 2; అల్లం ముక్క - చిన్నది తయారీ: టేబుల్ స్పూను పాలలో కుంకుమ పువ్వును నానబెట్టాలి బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టాక నీళ్లు ఒంపేయాలి బాణలిలో బటర్ వేసి కరిగాక, షాజీరా వేసి వేయించాలి దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, బిరియానీ ఆకు వేసి వేయించాక, బాస్మతి బియ్యం జత చేసి, రెండు మూడు నిమిషాలు దోరగా వేయించాలి కప్పు నీళ్లు, పంచదార, కప్పు పాలు జత చేయాలి తగినంత ఉప్పు జత చేసి మూత ఉంచి ఉడికించాలి ఉడుకుతుండగా కుంకుమ పువ్వు పాలు కూడా జత చేయాలి మెత్తగా ఉడికిన తర్వాత దించేయాలి క్యారట్, బీన్స్, బఠాణీలను హాఫ్ బాయిల్ చేయాలి టేబుల్ స్పూను బటర్‌ను వేసి చేసి, అందులో కిస్మిస్ వేసి అవి పొంగేలా వేయించి తీసేయాలి పిస్తాలు, జీడిపప్పులు, బాదం పలుకులు (కొద్దిసేపు నీళ్లలో నానబెట్టి, తొక్క తీసి చిన్నచిన్న ముక్కలు చేయాలి) వేసి వేయించాలి బాణలిలో బటర్ వేసి కరిగాక జీలకర్ర వేసి వేయించాలి ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, బిరాయనీ ఆకు వేసి వేయించాలి అల్లం తురుము వేసి రెండు నిమిషాలు వేయించాక స్టౌ మీద నుంచి దించేయాలి ఉడికించిన కూరగాయముక్కలు, పండ్ల ముక్కలు జత చేయాలి ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలిపి తాజా క్రీమ్, రోజా పువ్వు రేకలతో అలంకరించి వేడివేడిగా అందించాలి. తెలుగింటి పెసరట్టు కావలసినవి: పెసలు - పావు కేజీ (పొట్టుతో ఉండాలి); బియ్యం - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; అల్లం తురుము - టేబుల్ స్పూను; పచ్చి మిర్చి - 10; ఉల్లి తరుగు - 2 కప్పులు; జీలకర్ర - టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి తురుము - కప్పు; క్యారట్ తురుము - కప్పు; కొత్తిమీర తరుగు - అర కప్పు; నూనె - తగినంత తయారీ: బియ్యం, పెసలను విడివిడిగా ముందు రోజు రాత్రి నానబెట్టాలి మరుసటి రోజు ఉదయం బియ్యం విడిగా, పెసలు విడిగా మిక్సీ పట్టాలి పెసలు మిక్సీ పడుతున్నప్పుడు ఒక ఉల్లిపాయ తరుగు, ఆరు పచ్చిమిర్చి, అల్లం తురుము, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టి, బియ్యప్పిండి కూడా జత చేయాలి సుమారు అరగంట సేపు నాననివ్వాలి స్టౌ మీద పెనం ఉంచి, గరిటెడు పెసర పిండి తీసుకుని పెనం మీద అట్టు వేయాలి క్యారట్ తురుము, ఉల్లితరుగు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర... అన్నిటినీ కొద్దికొద్దిగా అట్టు మీద వేసి కాల్చాలి బాగా కాలిన తర్వాత తీసేయాలి వేడి వేడి పెసరట్టు రెడీ అల్లం పచ్చడి, కొబ్బరిపచ్చడి కాంబినేషన్‌తో సర్వ్ చేయాలి. బిహారీ లిట్ట్టీ ఛోకా కావలసినవి: గోధుమపిండి - 400 గ్రా. ; వాము - అర టీ స్పూను ; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; పెరుగు - ముప్పావు కప్పు ; బేకింగ్ సోడా - అర టీ స్పూను; ఉప్పు - ముప్పావు టీ స్పూను; స్టఫింగ్ కోసం... సత్తు - 200 గ్రా. (రకరకాల పప్పు ధాన్యాలను పిండిగా చేసినది. బిహార్‌లో ఈ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. మార్కెట్లో ఈ పిండి రెడీగా దొరుకుతుంది); అల్లం - చిన్న ముక్క; పచ్చి మిర్చి - 4; కొత్తిమీర తరుగు - అర కప్పు; జీలకర్ర - టీ స్పూను ; వాము - అర టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; పికిల్ స్పైసెస్ - టేబుల్ స్పూను; నిమ్మరసం - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; ఛోకా కోసం... వంకాయలు - 400 గ్రా.; టొమాటోలు - 250 గ్రా.; పచ్చి మిర్చి - 4; అల్లం తురుము - టీ స్పూను; కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు; ఉప్పు - తగినంత; ఆవ నూనె - 2 టీ స్పూన్లు తయారీ: జల్లెడ పట్టిన గోధుమపిండికి నెయ్యి, బేకింగ్ సోడా, వాము, ఉప్పు జత చేసి బాగా కలపాలి పెరుగును చక్కగా చిలకరించి పిండికి జత చే సి పిండి మృదువుగా అయ్యేవరకు బాగా కలపాలి చల్లటి నీరు కావలసినంత వేస్తూ పిండి క లిపి, పైన మూత ఉంచి సుమారు అర గంట సేపు నాననివ్వాలి. స్టఫింగ్ తయారీ... ఒక పాత్రలో సత్తు పిండి, అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర, వాము, ఆవ నూనె, పికిల్ స్పైసెస్ వేసి బాగా కలపాలి. (ఈ పదార్థం గట్టిగా ఉందనిపిస్తే, ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నీరు జతచేయాలి). పిట్టీ సిద్ధమయినట్లే. లిట్టీ తయారీ... పిండిని ఉండలుగా చేయాలి. ఒక ఉండను చేతిలోకి, మూడు అంగుళాల వెడల్పు వచ్చేవరకు వేళ్లతో ఒత్తాలి అందులో ఒకటిన్నర స్పూన్ల పిట్టి మిశ్రమం ఉంచి అన్నివైపులా మూసేసి, అంతా సమానంగా ఉండేలా చేతితో సరిచేయాలి. వేయించడానికి లిట్టీ సిద్ధమైనట్లే తయారు చేసుకున్న లిట్టీలను తందూరీ విధానంలో కాల్చుకోవాలి. లేదంటే స్టౌ మీద పెనం ఉంచి దాని మీద పచ్చి వాసన పోయే వరకు నూనె లేకుండా కాల్చాలి వంకాయలు, టొమాటోలను శుభ్రంగా కడగాలి బాణలిలో నూనె వేసి కాగాక, వంకాయలు, టొమాటోలను వేసి వేయించి, తీసేయాలి చల్లారినతర్వాత వాటి మీద తొక్క తీసి మెత్తగా మెదపాలి పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు, ఆవనూనె వేసి బాగా కలపాలి. చోకాలు సిద్ధమయినట్లే ఛోకాను ఒక పాత్రలో ఉంచాలి వేడివేడి లిట్టీలను మధ్యలో కొద్దిగా రంధ్రం చేసి కరిగించిన నేతిలో వేసి తీసేయాలి. చోకా, కొత్తిమీర పచ్చడులతో సర్వ్ చేయాలి. -
దటీజ్ అర్జున్!
చెన్నై: కోలీవుడ్ యాక్షన్ హీరో అర్జున్ తన సినిమాలలోనే కాకుండా, నిజజీవితంలో కూడా దేశభక్తిని చాటుకున్నారు. ఈ హీరోకి దేశభక్తి ఎంత అనేది ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రాలే సాక్ష్యం. తాజాగా మరోసారి నిరూపించుకున్నారు. కథ, కథనం, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు చేపట్టి అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'జై హింద్ -2' విద్య ప్రాముఖ్యత గురించి ఆవిష్కరించే ఈ చిత్రంలో ఆయనకు జంటగా సుర్విన్ చావ్లా, సిమ్రాన్ కపూర్లు నటిస్తున్నారు. నవ సంగీత దర్శకుడు అర్జున్ జన్య స్వరాలందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం నగరంలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు బాలా ఆవిష్కరించగా తొలి ప్రతిని ఇటీవల యుద్ధంలో మరణించిన మేజర్ ముకుంద్ కూతురు హర్షియ, చిత్రంలో నటించిన బాలతార యునినా అందుకున్నారు. ముందుగా మేజర్ ముకుంద్ కుటుంబ సభ్యులను అర్జున్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైహింద్-2 చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర టైటిల్‌కు తగ్గట్టు నిర్వహించాలని ఆశించినప్పుడు రియల్ హీరో మేజర్ ముకుంద్ గుర్తుకొచ్చారని చెప్పారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ మేజర్ కుటుంబాన్ని ఆహ్వానించి వారి సమక్షంలో జైహింద్-2 చిత్ర ఆడియోను విడుదల చేయాలని భావించానన్నారు. ఇందుకు తొలుత వారు అంగీకరించకపోయినా ఆ తరువాత ఒప్పుకున్నారని తెలిపారు. మేజర్ ముకుంద్ కుటుంబాన్ని ఈ వేదికపైకి ఆహ్వానించడంతో ఈ కార్యక్రమానికి సార్థకత చేకూరిందని అర్జున్ వ్యాఖ్యానించారు. మేజర్ చంద్రకాంత్ : మేజర్ ముకుంద్ తండ్రి వరదరాజన్ మాట్లాడుతూ అర్జున్ నటించిన జెంటిల్మెన్ చిత్రం చూసి ఆయన అభిమాని అయిన తన కొడుకు ముకుంద్ యాక్షన్ చిత్రాలను ఇష్టంగా చూసేవాడన్నారు. ఇప్పుడీ జైహింద్-2 చిత్రాన్ని చూడటానికి తను లేకపోయినా తామీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అర్జున్ను యాక్షన్ కింగ్ తదితర బిరుదులతో పిలుస్తారని అయితే తానిప్పుడాయన్ని మేజర్ చంద్రకాంత్‌గా వ్యాఖ్యానిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు హీరోయిన్లు సుర్లిన్ చావ్లా, సిమ్రాన్ కపూర్, నటుడు మనోబాలా, నిర్మాత కలైపులి ఎస్.థాను, దివంగత దర్శక నిర్మాత రామనారాయణన్ కొడుకు మురళి పాల్గొన్నారు. ** -
భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు!
ఎప్పుడు చూసినా పాప్ పాటలు, సినిమా పాటలు హమ్ చేయడమేనా? ఇక్కడ కొన్ని దేశభక్తిని బోధించే గేయాలు, సినీ గీతాలు ఉన్నాయి. వాటి పూర్తి పాఠాన్ని సంపాదించి రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గొంతెత్తి పాడండి. మీ స్నేహ బృందంలో ఉత్తేజాన్ని నింపండి. ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి’ -దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు’ -ఆత్రేయ ‘దేశమును ప్రేమించుమన్నా మంచి యన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టవోయి’ -గురజాడ ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం’ -రాయప్రోలు సుబ్బారావు -
కళాశాలలో..
-
యువతలో దేశభక్తి నింపడమే మోడీ లక్ష్యం
గుడిహత్నూర్, న్యూస్‌లైన్ :కుల, మత, వర్గాలకు అతీతంగా యువతరంలో నిండుగా దేశభక్తి స్ఫూర్తిని నింపడమే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి లక్ష్యమని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర ఉప సమన్వయకర్త రావుల రాంనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శివ కల్యాణ మండపంలో శనివారం ఉదయం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి వీరు హాజరై ప్రసంగించారు. ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేని యువత మన భారతదేశంలో ఉందని, వీరికి సరైన దిశా నిర్దేశం లేని కారణంగా దేశాభివృద్ధి జరగడం లేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు యువతలో ఉత్సాహం నింపి వారిని దేశ నిర్మాతలను చేయడానికే దేశవ్యాప్తంగా 100 నవభారత యువభేరి సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంట్లో మొట్టమొదటి సభను ఈ నెల 11న హైదరాబాద్‌లోని వివేకానంద ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాకు పోరాటయోధుల పేర్లు రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే జిల్లాకు కొమురం భీమ్, రాంజీగోండ్ పేర్లు పెడతామని బోథ్ నియోజకవర్గ కన్వీనర్ మాధవ్‌రావ్ ఆమ్టే అన్నారు. ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధిలో 2వ స్థానంలో ఉన్న గుజరాత్ రాష్ట్రాన్ని చూసి విదేశాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయని, ఇంతటి అభివృద్ధిని ఎలా సాధించగలిగారో చెప్పండని అమెరికా లాంటి దేశాలు నరేంద్ర మోడిని అడుగుతున్నారని వివరించారు. సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలతో ముందుకు సాగుతున్న మోడీ లాంటి నాయకుల సారథ్యంలో యువత ముందుకు సాగాలని, యువభేరికి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మండల ముస్లిం నాయకులు తాహెర్‌ఖాన్, శేక్ ఖాజాలను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా నాయకుడు డాక్టర్ కేంద్రే లక్ష్మణ్, మండల అధ్యక్షుడు సింధే పరమేశ్వర్, ఉపాధ్యక్షుడు నీలకంఠ్ అప్పా, నాయకులు సంతోష్ మార్వాడి, ముండే శ్రీధర్, మోరే నరేశ్ పాల్గొన్నారు.