యువతలో దేశభక్తి నింపడమే మోడీ లక్ష్యం
Published Sun, Aug 11 2013 4:51 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
గుడిహత్నూర్, న్యూస్‌లైన్ :కుల, మత, వర్గాలకు అతీతంగా యువతరంలో నిండుగా దేశభక్తి స్ఫూర్తిని నింపడమే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి లక్ష్యమని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర ఉప సమన్వయకర్త రావుల రాంనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శివ కల్యాణ మండపంలో శనివారం ఉదయం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి వీరు హాజరై ప్రసంగించారు. ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేని యువత మన భారతదేశంలో ఉందని, వీరికి సరైన దిశా నిర్దేశం లేని కారణంగా దేశాభివృద్ధి జరగడం లేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు యువతలో ఉత్సాహం నింపి వారిని దేశ నిర్మాతలను చేయడానికే దేశవ్యాప్తంగా 100 నవభారత యువభేరి సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంట్లో మొట్టమొదటి సభను ఈ నెల 11న హైదరాబాద్‌లోని వివేకానంద ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.
జిల్లాకు పోరాటయోధుల పేర్లు
రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే జిల్లాకు కొమురం భీమ్, రాంజీగోండ్ పేర్లు పెడతామని బోథ్ నియోజకవర్గ కన్వీనర్ మాధవ్‌రావ్ ఆమ్టే అన్నారు. ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధిలో 2వ స్థానంలో ఉన్న గుజరాత్ రాష్ట్రాన్ని చూసి విదేశాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయని, ఇంతటి అభివృద్ధిని ఎలా సాధించగలిగారో చెప్పండని అమెరికా లాంటి దేశాలు నరేంద్ర మోడిని అడుగుతున్నారని వివరించారు. సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలతో ముందుకు సాగుతున్న మోడీ లాంటి నాయకుల సారథ్యంలో యువత ముందుకు సాగాలని, యువభేరికి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మండల ముస్లిం నాయకులు తాహెర్‌ఖాన్, శేక్ ఖాజాలను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా నాయకుడు డాక్టర్ కేంద్రే లక్ష్మణ్, మండల అధ్యక్షుడు సింధే పరమేశ్వర్, ఉపాధ్యక్షుడు నీలకంఠ్ అప్పా, నాయకులు సంతోష్ మార్వాడి, ముండే శ్రీధర్, మోరే నరేశ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement