'దేశభక్తి'పై పవన్ కల్యాణ్ ఘాటు ట్వీటు!
హైదరాబాద్: రోజుకో అంశంపై స్పందిస్తానని చెప్పిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ శనివారం 'దేశభక్తి' అంశంపై ట్వీట్ చేశారు. 'కులం, మతం, జాతి, ప్రాంతం, వర్గం, భాషకు అతీతంగా ఒక వ్యక్తిగానీ, రాజకీయ పార్టీగానీ వ్యవహరిస్తే దానిని నిజమైన దేశభక్తి అంటారు. ఒక పార్టీ ఆదర్శాలు, దృక్పథాల ఆధారంగా దేశభక్తిని చూడలేం' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మానవీయ విలువల్లో, సామరస్య భావనలో నిజమైన దేశభక్తి దాగి ఉంటుందని అన్నారు.
'ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అభిప్రాయంతోగానీ, విధానంతోగానీ విభేదిస్తే.. వారిని దేశద్రోహులుగా ముద్ర వేయకూడదు. ఇకవేళ వారు తమ ప్రత్యర్థుల గురించి తీవ్ర అభిప్రాయాలు వెల్లడించినా.. వారి గొంతును నులిమివేయకుండా మొదట వారు చెప్పేది వినాలి. ఆ తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా హడావిడిగా చర్యలు తీసుకుంటే జేఎన్‌యూ విద్యార్థులపై 'దేశద్రోహం' కేసు మాదిరిగానే ఎదురుదెబ్బ తగిలే అవకాశముంటుంది. జేఎన్‌యూ విద్యార్థుల కేసులో చివరకు వారి వీడియో కావాలని మార్చినట్టు తేలింది' అని అన్నారు.
'కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూస్తూ ఆస్వాదించాల్సిన సాయంకాలాన్ని 'దేశభక్తి' ని నిరుపించేకునే పరీక్షకు వేదికగా మార్చకూడదని పవన్ పేర్కొన్నారు. సినిమా థియేటర్లలోనే ఎందుకు? రాజకీయ పార్టీలు తమ సభల్లో మొదట జాతీయగీతాన్ని ఎందుకు ఆలపించవు? దేశంలోని ఉన్నత కార్యాలయాల్లో ఎందుకు ఆలపించడం లేదు? చట్టాలను అమలుచేయాలని ప్రబోధించే వారు మొదట తాము మార్గదర్శకంగా ఉండి ఇతరులు అనుసరించేలా చేయవచ్చు కదా' అని పవన్ పేర్కొన్నారు. 'నిజాయితీపరులకు చట్టాలను ఉచ్చుగా మార్చి.. కపటవేషగాళ్లకు వాటిని బొనంజా చేస్తున్నారా' అన్న అమెరికా ఆర్థికవేత్త థామస్ సోవెల్ వ్యాఖ్యలను పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై స్పందిస్తానని ఆయన ట్వీట్ చేశారు. జేఎన్‌యూను జేఎన్‌టీయూ అని పొరపాటున రాసినందుకు ఆయన క్షమాపణ కోరారు.
— Pawan Kalyan (@PawanKalyan) 17 December 2016