
చైనాతో 1962లో భారత్ యుద్ధం జరుగుతోంది. దేశ విభజన గాయాల నుంచి దేశం కోలుకుంటున్న ఆ తరుణంలోనే కొందరు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని మరచిపోతున్నారు. ఇటువంటి పరిస్థితులు పైడిమర్రి వెంకట సుబ్బారావును తీవ్రంగా కలచి వేశాయి. పౌరులలో దేశభక్తిని పెంచడానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని ఆయన బలంగా అనుకున్నారు. అప్పటికే చైనాలో విద్యార్థులలో దేశభక్తిని పెంచడానికి దేశభక్తి గీతాలు ఉన్నట్లు తెలిసి వెంటనే ఆయన తొమ్మిది వాక్యాల ‘ప్రతిజ్ఞ’ రాశారు.
పైడిమర్రి 1962లో విశాఖపట్నంలో జిల్లా ‘ఖజానా’ అధికారిగా పనిచేస్తున్న రోజులవి. సెప్టెంబర్ 17న ఆయన ‘ప్రతిజ్ఞ’ రచన చేశారు. ఆయన మిత్రుడు తెన్నేటి విశ్వనాథం ప్రతిజ్ఞ ప్రతిని చూసి నాటి విద్యా శాఖ మంత్రి పీవీజీ రాజుకు చూపించడంతో ప్రతిజ్ఞ పదాలు విద్యార్థులలో దేశభక్తినీ, సోదరభావాన్నీ పెంచుతాయని భావించి... పాఠ్యపుస్తకాలలో చేర్చారు. 1964 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ ముద్రితమవుతున్నది. అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను మిగతా భారతీయ భాషల్లోకి అనువాదం చేయించింది. 1965 జనవరి 26 నుండి దేశవ్యాప్తంగా విద్యాలయాల్లో ప్రతిజ్ఞను ఆలపిస్తున్నారు. కానీ రచయిత పేరును మాత్రం ముద్రించలేదు.
2011లో ఎలికట్టె శంకరరావు ‘ప్రతిజ్ఞ సృష్టికర్త పైడిమర్రి’ పేరుతో ఓ వ్యాసం రాశారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో పైడిమర్రి పేరుని వివిధ వర్గాల వారి విజ్ఞప్తి మేరకు రెండు తెలుగు రాష్ట్రాల పాఠ్య పుస్తకాలలో ‘ప్రతిజ్ఞ’ ఎగువన ముద్రిస్తున్నారు. 1916 జూన్ 10న నల్లగొండ జిల్లాలోని అన్నేపర్తి గ్రామంలో పైడిమర్రి జన్మించారు. కవిగా, రచయితగా, నీతి నిజాయితీగల ప్రభుత్వ ఉద్యోగిగా, బహుభాషా కోవిదుడిగా ఆయన పేరు పొందారు. 1988 ఆగస్ట్ 13న పైడిమర్రి తుదిశ్వాస విడిచారు. ఇప్పటికి ‘ప్రతిజ్ఞ’ రాసి 60 ఏళ్లు అవుతోంది.
– మందడపు రాంప్రదీప్, తిరువూరు
(ఇది ‘ప్రతిజ్ఞ’ వజ్రోత్సవాల సంవత్సరం)
Comments
Please login to add a commentAdd a comment