
ఏది దేశభక్తి? ఏది జాతి వ్యతిరేకత?
ఇటీవల హైద్రాబాద్ సెట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మబలిదానం మనసున్న మనుషుల్నీ-దళితులు, ఇతర అణగారిన ప్రజలకు సమ న్యాయం లభించాలని కాం క్షించేవారినీ తీవ్ర వేదనకూ, ఆగ్రహానికీ గురి చేసింది. తద్వారా మత అసహనాన్నీ, వివక్షనూ ప్రోత్సహించే శక్తులు కొంత ఆత్మరక్షణలో పడినట్లనిపించింది. రోహిత్ ఘటన తర్వాత ఆత్మవిమర్శ చేసుకునేందుకు బదులు, ఆర్.ఎస్.ఎస్ దాని అనుబంధ సంస్థలైన బీజేపీ, ఏబీవీపీ, భజరంగదళ్ వంటి శక్తులు ఈసారి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇదివరకు ఎన్నడూ లేనట్టి భౌతిక ఘర్షణను సృష్టించాయి. దశాబ్దాలుగా సైద్ధాంతికపరమైన, మేధోపరమైన చర్చలకు జేఎన్‌యూ మారుపేరుగా నిలుస్తూ వచ్చింది. అలాంటి విద్యాసంస్థలో ఈ చిచ్చుకు బీజేపీ పక్షనేతలైన ఎంపీలే కాకుండా స్వయంగా కేంద్ర హోం శాఖామాత్యులు సైతం తన వ్యాఖ్యలతో తోడైనారు. ఈ క్రమంలో విశ్వసనీయత లేని ట్వీట్లను, అమెరికాలో తలదాచుకుంటూ, తనపై శిక్ష తగ్గించుకునేందుకు కుహనా జాతీయవాదులతో చేయి కలిపిన హెడ్లీ వంటి వాని అనుమానాస్పద వ్యాఖ్యలను ప్రామాణిక సాక్ష్యాలుగా తీసుకుని ప్రచార యుద్ధం మొదలెట్టారు.
తమ కూటమిలో లేని రాజకీయ పార్టీలను అన్నిటికీ మించి వామపక్షాలను దేశద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా, పాకిస్థానీ పంచమాంగదళంగా గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారు. జేఎన్‌యూ విద్యార్థి యూనియన్ అధ్యక్షుడిని ఏ విధమైన ఆధారాలూ చూపించకుండా, పాలకుల ఆదేశాల మేరకు అరెస్టు చేశారు. మరో 7గురు విద్యార్థులను నిర్బంధించారు. తమ (ఏబీవీపీ) అనుయాయుల చేత పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలిప్పించి, మొత్తం ఉద్యమాన్ని దేశద్రోహ ఉద్యమంగా సృష్టించే ప్రయత్నం చేశారు. అంతకంటే మిన్నగా, ఢిల్లీ కోర్టులో కేసు సందర్భంగా హాజరైన జేఎన్‌యూ విద్యార్థులపై, విలేకరులపై, మీడియా వారిపై కోర్టు ఆవరణలోనూ, బయటా న్యాయవాదులు, బీజేపీ వారు, వారి ఎంఎల్‌ఏ అందరూ కలిసి ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఈ కాషాయ భావజాలాన్ని, నిరంకుశ ధోరణిని అడ్డుకట్ట వేయకపోతే సాపేక్షంగా ఈ మాత్రంగానైనా మిగిలిన మన ప్రజాస్వామిక, లౌకిక, అభ్యుదయ సాంస్కృతిక విలువలు బతికి బట్టకట్టలేవు.
దేశభక్తి అంటే ఏమిటి? మా తెలుగుజాతి మహా కవి గురజాడ ఎప్పుడో శ్రీశ్రీ అన్నట్లు.. అంతర్జాతీయ గీతం కాదగిన తన ‘దేశభక్తి’ గేయం ద్వారా మాకు ‘దేశమంటే మట్టికాదనీ, దేశమంటే మనుషుల’ నీ చాటి చెప్పారు. ఇది ప్రపంచం గౌరవించదగిన మహత్తర నిర్వచనం. ఇటీవలే సియాచిన్ (భారత్- పాక్ సరిహద్దులలోని) ప్రాంతంలో గస్తీ కాస్తున్న 10 మంది మన వీర సైనికులు తీవ్రమైన ప్రతికూల వాతావరణం లో మంచు గడ్డలు విరిగిపడి మరణించారు. అక్కడ శత్రుసేనల దాడులలో రక్తం చిందించినందువల్ల కాకుండా, దుర్భర వాతావరణ స్థితి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఆ ప్రాంతంలో అదే స్థితిలో ఉన్న పాకిస్తాన్ కొన్నేళ్ల క్రితం సియాచిన్‌ని పరస్పర అంగీకారంతో ఒక నిరాయుధ జోన్‌గా ఉంచే విషయమై మన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఈ ఒప్పందాన్ని ఆసరాగా తీసుకుని, మన దేశముద్దుబిడ్డలైన సైనికుల అనవసర మరణాలను నివారించి, జైజవాన్ అని మన దివంగత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అన్నట్లు వారి రక్షణకు తోడ్ప డటం దేశభక్తి. అంతే కానీ సియాచిన్ రక్షణ పేరిట మన సైనికులను భక్షణ చేయడం కాదు. అది దేశ ప్రజలపై భక్తి ఎంతమాత్రమూ కాదు.
అందునా శరీరకష్టం తప్ప మరో జీవనోపాధి లేని, తరతరాలుగా సామాజిక న్యాయానికి నోచుకోని, అణగారిన కులాలను, ఆదివాసీలను, మైనారిటీలను, మహిళలను రక్షించి ఆదుకోవడమే దేశ భక్తి. సర్వ సృష్టి నిర్మాతలు, మనందరి ప్రాణదాతలైన వారి కష్టాన్ని దోచుకుంటూ, అడుగడుగునా వారిని అవమానాలకు గురిచేస్తూ వారి నికృష్ట జీవన శిథిలాలపై పాలకులు ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తూ, ఆ లేనివారిని పీడించి కలవారికి ఊడిగం చేయబూనటం దేశభక్తి కాదు. మళ్లీ మన గురజాడ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ‘దేశాభిమానము నాకు కద్దని వట్టిగొప్పలు చెప్పుకోకోయ్/పూని ఏదైనా ఒక మేల్ చేసి జనులకు చూపవోయ్’.
పరాయిపాలకుడు బ్రిటిష్‌వాడు తన పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉండినప్పటికీ, తనపాలనపై కనీస నిరసన తెలిపినా, దాన్ని మొగ్గలోనే తుంచివేసే రాజద్రోహ చట్టాలను ప్రవేశపెట్టాడు. తన దేశంలో దాదాపు దశాబ్ది క్రితమే ఆ చట్టాన్ని రద్దు చేసుకున్నాడు. మన దేశంలో మాత్రం ఈ వలసపాలన నాటి చట్టం నేటికీ అమలవుతూనే ఉండటం శోచనీయం. ‘స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన కేంద్రీయ విశ్వవిద్యాలయంలోకి వీసీ, పాలనాబృందం ఆదేశాలు లేకుండానే పోలీసులు ఎందుకు ప్రవేశించినట్లు? మా విశ్వవిద్యాలయాల పాలనా నిర్వహణలో జోక్యం చేసుకుని, ఫలానా విద్యార్థులను బహిష్కరించమని, ఫలానా వారిపై కేసులు పెట్టవద్దని ఆదేశించిన కేంద్ర మంత్రికి, అలా చేయమని రికమెండ్ చేసిన మరో సహచర కేంద్ర మంత్రికి ఆ అధికారం ఎవరిచ్చారు?’ అని వాదించిన విద్యార్థులు ఉగ్రవాదులూ, దేశద్రోహులూనా?
ఈ రోజున నడిరోడ్డున ఉగ్రవాదులూ, దేశద్రోహులూ కాని మామూలు హేతువాదులనూ, పాలక పార్టీలకు వంగి సలాములు కొట్టడానికి ఇష్టపడని విద్యావంతులను, మేధావులనూ ప్రభుత్వ వేధింపులకు గురి చేస్తున్నారు. చివరకు అధికార పార్టీ భావజాలాన్ని వ్యాపింపజేయడమే కర్తవ్యంగా వ్యవహరించే రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో వీరు హతమవుతున్న సంఘటనలను చూస్తున్నాం. పాలకపార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ రకాల సాధువులు, సాధ్విలు మూకుమ్మడిగా.. ‘‘జేఎన్‌యూలో పెట్రేగుతున్న ‘అరాచక’శక్తులకు, ‘ఉగ్రవాద’ మూకలకు, జాతి శత్రువులకు, దేశద్రోహులకు (తమకు తోచిన, విశ్లేషణలు చేర్చి) యావజ్జీవిత కారాగార శిక్ష విధించడం కాదు. వారికి తుపాకి గుళ్లతో, ఉరికొయ్యలతో, ఉరితాళ్లతో సమాధానమివ్వాల’’ని నిర్భయంగా, బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటే మౌన ముద్ర దాలుస్తున్న పాలన నిరంకుశ మార్గాన వెళ్తున్నట్లే కదా.
చివరగా ఈ విద్యార్థుల సహేతుకమైన పోరాటాలను, సైద్ధాంతిక రీత్యా కమ్యూనిస్టులు బలపరుస్తుంటే, సియాచిన్ మంచుగుట్టల దేశభక్తులు.. కమ్యూనిస్టులను దేశద్రోహులని, జాతి వ్యతిరేకులని విమర్శించడం చూస్తున్నాం. కమ్యూనిస్టులు బ్రిటిష్ వలసపాలనకు అనుకూలమైన జిన్నా ప్రతిపాదనను బలపరిచారనీ, భారతదేశంపై చైనా దాడి చేస్తే ఆ దాడిని బలపర్చారని, వారు దేశద్రోహులనీ, జాతి వ్యతిరేకులనీ పేర్కొంటూ అలవోకగా చరిత్రను వక్రీకరిస్తున్నారు. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. భారత దేశానికి స్వాతంత్య్రం రావాలంటే భారత ప్రజలు మొత్తంగా ఆనాడు ప్రబలంగా ఉండిన హిందూ, ముస్లిం మతభేదాలను మరచి ఐక్యంగా బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి.
1940 నాటి పరిస్థితుల్లో, హిందువులు మెజారిటీగా ఉండిన స్వతంత్ర భారతదేశంలో తమ ముస్లిం మతస్థులకు న్యాయం జరగదని, తమ ముస్లిం రాజ్యంగా పాకిస్తాన్ కావాలని జిన్నా ప్రతిపాదించాడు. అప్పుడు ‘‘ముస్లిం మతానుయాయులలో విదేశీ జాతుల (ప్రజల) కూ, అలాగే హిందూమతం అధికంగా ఉండిన ప్రాంతాల్లోని అంగ, వంగ, కళింగ, ఆంధ్ర.. ఇత్యాది జాతులకు (అప్పటి లెక్క ప్రకారం మొత్తం బ్రిటిష్ ఇండియాలో 17 జాతులున్నాయి) ప్రత్యేక రాజ్యాంగం, పాలనా స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తిని ఇవ్వాలని అలాగే, ఈ జాతులలో ఎవరైనా, తాము స్వతంత్ర భారత దేశంలో ప్రజలమని భావిస్తే వారికి విడిపోయే హక్కు కూడా యివ్వాల’’ని కమ్యూనిస్టు పార్టీ 1943-45 నాటి తన తీర్మానాల్లో ప్రతిపాదించింది.’ అలా అయితే హిందూ ముస్లింల మధ్య పరస్పర విశ్వాసం పెరిగి, కాంగ్రెస్ ముస్లింలీగ్ రెండు కూడా ఐక్యంగా ఉద్యమించి స్వతంత్రాన్ని సాధించుకునే అవకాశం ఉంటుందనీ, అలాంటి హిందూ ముస్లిం ఐక్యత కోసం నాటి కమ్యూనిస్టులు చేసిన ప్రతిపాదన ఇది!
పరమతద్వేషమే, పాకిస్తాన్ ద్వేషమే దేశభక్తిగా భావిస్తున్న శక్తులు చెప్తున్నట్లు నాడు కమ్యూనిస్టులు జిన్నాను ప్రశంసించలేదు. సరికదా, ఈ ప్రతిపాదనను జిన్నా కూడా వ్యతిరేకించాడు. ఇదీ చారిత్రక వాస్తవం.
ఇక చైనా- ఇండియా తమ మధ్య సరిహద్దు వివాదాన్ని శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకో వాలన్నది సి.పి.యంగా తదుపరి రూపుదిద్దుకున్న నాటి పార్టీ ప్రతిపాదనే. నేటి మోదీ ప్రభుత్వం కూడా ఈ భౌతిక వాస్తవికతను గుర్తిస్తోంది. చైనాతో మనదేశ సరిహద్దు వివాదాన్ని శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నది. నాటి సి.పి.ఎం వాదనలోని సహేతుకత నేటికైనా ఈ మతోన్మాదులకు అర్థం కాకపోతే దేశానికే అనర్థం!
చివరిగా.. నేను దేశద్రోహినా అని అడుగు తున్నాను. ఎందుకంటే భారతదేశం ఉంది కానీ భారత జాతి లేదు. ఎందువలన అంటే, భారతదేశం వివిధ జాతుల సమాఖ్య స్వరూపం. అంతేగానీ ఏకశిలా సదృశమైన నేషన్ స్టేట్ (జాతీయ రాజ్యం) కాదు. నాదేశం భారతదేశం అన్నట్లే- నా జాతి తెలుగుజాతి! తెలుగు జాతీయుడినైనభారతీయుణ్ణి నేను. అన్ని జాతు ల మాదిరే కశ్మీర్ కూడా మన దేశంలో ఒక జాతి! అందులో కొంత భాగం పాక్ అక్రమిత కశ్మీర్‌లో ఉంది. మరో భాగం మనదేశంలో ఉంది. మొత్తంగా కశ్మీరి జాతి ఏ దేశంలో ఉండాలో, తాము స్వతంత్ర జాతిగా ఉండాలో వారు స్వేచ్ఛగా శాంతియుతంగా పరిష్కరిం చుకునే అవకాశం రాకపోతే - ఈ కశ్మీర్ సమస్య రావణ కాష్టంలా నలుగుతూనే ఉంటుందనీ నా భావన.
ఏపీ విఠల్
వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు