నీవొక సైనికురాలివి... నేనొక సైనికుడిని ప్రత్యక్షంగా దేశాన్ని ప్రేమించి గళమెత్తి యుద్ధం చేసే సైనికులం మనం చేతిలో గన్ను లేకపోవచ్చు.. ఖడ్గం ఉండకపోవచ్చు కానీ మన చప్పట్లతో వీర జవాన్ల గుండెల్లో ధైర్యం నింపే సైనికులం మనం కుర్చీ అంచున కూర్చుని దేశభక్తిని ధ్వనించే గుండె మనది. సినిమా థియేటర్‌లో వినిపించే హోరు మనది
స్వాతంత్య్రం వచ్చింది. ‘క్విట్ ఇండియా’, ‘వందేమాతరం’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘జైహింద్’, ‘స్వరాజ్ మేరా జన్మ్ సి«ద్ అధికార్ హై’ వంటి నినాదాలతో నాయకులు ప్రజలను ఉర్రూతలూగించి, లెక్కలేనన్ని త్యాగాలతో స్ఫూర్తి నింపి భారతమాత దాస్యశృంఖలాలను పెళ్ళగించి అవతల పారేయగలిగారు. దేశం ఉత్సాహంగా అడుగు ముందుకేసింది. ‘ఆరామ్ హరామ్ హై’ అంటూ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విరామమెరగక దేశ నిర్మాణంలో పడ్డారు. మరోవైపు అప్పటికే యవ్వనంలోకి అడుగుపెట్టిన హిందీ సినిమా ఆ స్ఫూర్తిని, ఆ తర్వాత అవసరమైన మార్గదర్శనాన్ని, ఆనాటి త్యాగాలను వీలువెంబడి వెండితెర మీద ప్రత్యక్షం చేస్తూ తాను నింప గల ఉత్సాహం తనూ నింపింది. ఎన్నో చిత్రాలు వచ్చాయి. కొన్ని మేలిమి ముత్యాలుగా నిలిచాయి.
మదర్ ఇండియా... నయా దౌర్
భారతదేశం అంటే రైతు. భారతదేశం అంటే పంటచేను. భారతదేశం అంటే పల్లెసీమ. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశ గ్రామీణ చిత్రం ఎలా ఉందో చూపుతూ, భారతీయ రైతు స్త్రీ విముక్తే అసలైన దాస్య విముక్తి అని ప్రతిపాదిస్తూ ‘మదర్ ఇండియా’ (1957) సినిమా వచ్చింది. నర్గిస్ నట జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ సినిమా సంఘ వ్యతిరేకం అయితే ఈ దేశం కోసం సొంత బిడ్డను కూడా బలి ఇవ్వడానికి భారత మాతృమూర్తి వెనుకాడదని చెప్పి తేజస్సుతో నిండిన సందేశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘నయా దౌర్’ (1957) దేశంలో జరుగుతున్న యాంత్రికీకరణ, పారిశ్రామికీకరణ చర్చించింది. దేశీయ మూలాలను పదిలంగా ఉంచుతూ మార్పును స్వాగతించాలని సూచించింది. దిలీప్ కుమార్ నటించిన ఈ సినిమాలో ఓపి నయ్యర్ చేసిన ‘సాథీ హాత్ బఢానా’... అనే పాట కలిసి మెలిసి ముందుకు అడుగువేసేందుకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప బృందగీతం.
హకీకత్.. బోర్డర్... లక్ష్య
యుద్ధక్షేత్రం ఎలా ఉంటుందో తెలియకపోతే అసలైన దేశభక్తి ఎలా ఉంటుందో అర్థం కాదు. దేశం కోసం లేశమాత్రంగా ప్రాణం త్యాగం చేయడం ఎలా ఉంటుందో అర్థం కాదు. అందుకే బాలీవుడ్ మన దేశం ఎదుర్కొన్న యుద్ధాలను తన కథలుగా చేసుకుంది. 1962 వార్‌ను కథాంశంగా ‘హకీకత్’ (1964) తీసింది. ఇందులోని ‘కర్ చలే హమ్ ఫిదా’... పాట ఇవాళ్టికీ పర్వ దినాలలో మొగుతూ నరనరాల ఉద్వేగం నింపుతూనే ఉంటుంది. ఆ తర్వాత 1971 భారత–పాకిస్తాన్‌ల యుద్ధ నేపథ్యంగా ‘బోర్డర్’ (1997) వచ్చింది. సన్నిడియోల్, అక్షయ్ ఖన్నా తదితరులు నటించిన ఈ సినిమాలో ‘సందేశే ఆతేహై’.. పాట కుటుంబాలకు దూరంగా ఉండే సైనికుల వేదనను అశ్రువుల్లో చుట్టి వినిపిస్తుంది. ఇక దేశం చూపిన అతి గొప్ప సాహసం ‘కార్గిల్’ యుద్ధం. మన సైనికుల వీరత్వాన్ని చూపే ఈ యుద్ధం నేపథ్యంలో ‘లక్ష్య’ (2004) సినిమా వచ్చింది. ఫర్హాన్ అఖ్తర్ ఇందులో హీరో.
భగత్‌సింగ్... సుభాష్... మంగళ్‌పాండే
దేశం దేశనాయకులను ఎలా మర్చిపోదో బాలీవుడ్ కూడా మర్చిపోదు. దేశం కోసం త్యాగం చేసిన ఆ అమరవీరులను బాలీవుడ్ తన శక్తిమేరకు చూపించే సగటు ప్రేక్షకుడికి వారిని మరింత చేరువ చేసింది. భగత్ సింగ్ జీవితం ఆధారంగా వచ్చిన ‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ (2002) అజయ్ దేవగణ్‌కు గొప్ప పేరు తెచ్చి పెట్టింది. సుభాస్ చంద్రబోస్ సమగ్ర జీవితాన్ని శ్యామ్ బెనగళ్ ‘బోస్: ది ఫర్గాటెన్ హీరో’ (2005)గా తీశాడు. ఇక ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ హీరో అయిన మంగళ్‌పాండే జీవితాన్ని అదే పేరుతో 2005లో కేతన్ మెహతా ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కించాడు. సర్దార్ పటేల్ జీవితాన్ని పరేశ్ రావెల్ అభినయిస్తే దేశీయ భాషల్లో అంబేద్కర్ జీవితం వచ్చింది.
హిందూస్తానీ... వెడ్‌నెస్ డే
ఇక దేశంలోని అంతర్గత సమస్యలైన అవినీతి ఉగ్రవాదం వంటి సమస్యలను కూడా బాలీవుడ్ చర్చించింది. శంకర్ తీసిన ‘హిందూస్తానీ’ (1996), నసీరుద్దీన్ షా నటించిన ‘వెడ్‌నెస్ డే’ (2008) చాలా ప్రతిభావంతంగా ఆ సమస్యలను చర్చించి ప్రేక్షకులను ఆలోచింప చేశాయి బాలీవుడ్ ఇంతటితో ఆగలేదు. సర్జికల్ స్ట్రయిక్స్‌ను కూడా కథాంశంగా తీసుకుని ‘ఉడి’ (2019) వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. రాబోయే రోజులలో మరెన్నో బయోపిక్‌లో గత కాలపు దేశ ఘనతలు వెండితెరను అలంకరించనున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ మనం మేరా భారత్ మహాన్ అనుకోవాలి. ఇండియా జిందాబాద్ అని గట్టిగా నినాదం ఇవ్వగలగాలి. ఈ దేశం పట్ల ప్రేమ, గౌరవం ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలని కోరుకుందాం.
ఉప్‌కార్... పూరబ్ ఔర్ పశ్చిమ్
ఆ తర్వాత నటుడు మనోజ్ కుమార్ వచ్చి రెండు మూడు ముఖ్యమైన సినిమాలు తీశాడు. దేశం సుభిక్షంగా ఉండాలంటే ఇటు కిసాన్, అటు జవాన్ ఇద్దరూ శక్తిమంతంగా ఉండాలనే లాల్‌బహదూర్ శాస్త్రి నినాదాన్ని ఊతంగా తీసుకొని ‘ఉప్‌కార్’ (1967) సినిమా తీశాడు. ‘ఏ దేశ్ కీ ధర్తీ’... పాట ఈ మట్టిలో మణులూ మాణిక్యాలు పండించడానికి స్వేదజలాన్ని చిందించే రైతుకు చేసిన శాల్యూట్ అని చెప్పవచ్చు. అదే సమయంలో మనోజ్ కుమార్ ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) సినిమా కూడా తీశాడు. స్వాతంత్య్రం వచ్చిందనే అత్యుత్సాహంలో ఇబ్బడి ముబ్బడిగా పాశ్చాత్య ప్రభావానికి లోనై మన సంస్కృతిని దెబ్బ తీయడానికి యువత ప్రభావితం కావద్దని చెబుతూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్పగా నచ్చింది.
చక్ దే ఇండియా.. భాగ్ మిల్కా భాగ్... దంగల్
మరో వైపు క్రీడల ద్వారా దేశభక్తిని నింపే ప్రయత్నం కూడా బాలీవుడ్‌లో జరిగింది. మహిళా హాకీ జట్టులో స్ఫూర్తి నింపే ‘చక్ దే ఇండియా’ (2007) సినిమా ఘన విజయం సాధించింది. షారుక్ ఖాన్ నటించడంతో ఈ సినిమా యువతను క్రికెట్ నుంచి ఆ ఆటవైపు చూసేలా చేసింది. ‘ఫ్లయింగ్ సిక్’గా పేరుగాంచిన మిల్కాసింగ్ జీవితం ‘భాగ్ మిల్కా భాగ్’ (2013)గా రావడం ఒక ముఖ్య సన్నివేశం. ఫర్హాన్ అక్తర్ ఈతరం ప్రేక్షకులకు తెలియని మిల్కాసింగ్‌ను గొప్పగా తెర మీద చూపించగలిగాడు. ఇక ఏ దేశంలో అయితే స్త్రీలను వంటింటి పరిమితం చేస్తారనే పేరు ఉందో ఏ దేశంలో అయితే స్త్రీలను అణిచి ఉంచుతారనే ప్రచారం ఉందో ఆ దేశంలో నుంచి బాక్సింగ్ చేసే అమ్మాయిని ‘మేరీ కోమ్’ (2014)లో, కుస్తీ ఆడే ఆడపిల్లను ‘దంగల్’ (2016)లో చూపి దేశ మహిళల ఘనతకు ఒక నివాళి అర్పించగలింది.
దంగల్
Comments
Please login to add a commentAdd a comment