మేమూ దేశభక్తులమే.. నిలబడేదెలా?
దేశభక్తికి కొలమానమేది?
జనగణమన.. అంటూ వినిపించగానే లేచి నిలబడ్డమేనా?
మరి అటువంటప్పుడు దివ్యాంగుల పరిస్థితి ఏంటి?
వారు లేచి నిలబడలేరు కదా..?
అలాంటప్పుడు వారిని ‘దేశద్రోహుల్లా’
ఎందుకు చూస్తున్నారు?
ఎక్కడ.. అంటారా? అయితే చదవండి...
సినిమా థియేటర్లలో చిత్రం ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ప్రసారం చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో జనగణమన..ను ప్రసారం చేస్తున్నారు. జాతీయగీతం ప్రసారమవుతున్న సమయంలో థియేటర్లలోని జనాలంతా దేశభక్తిని చాటుతూ లేచి నిలబడుతున్నారు కూడా. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే దివ్యాంగులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎదురుగా జనగణమన.. వినిపిస్తున్నా.. గుండెల్లో దేశభక్తి ఉప్పొంగుతున్నా.. లేచి నిలబడలేని పరిస్థితి వారిది. అలా నిల్చోలేనివారిని మిగతా జనాలంతా వింతగా, దేశద్రోహుల్లాగా చూస్తున్నారట. దీంతో తమ గోడును వెల్లబోసుకునేందుకు మహారాష్ట్రలో దివ్యాంగులు పోరాటానికే దిగారు.
సమస్య ఎక్కడంటే..
జాతీయ గీతాలాపనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. థియేటర్లలో జనగణమన.. ప్రసారమవుతున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని పేర్కొంది. అయితే మార్గదర్శకాల్లో దివ్యాంగులకు మినహాయింపునిస్తున్నట్లు పేర్కొనలేదు. దీంతో లేచి నిలబడలేని దివ్యాంగులు సినిమా హాల్లో అనేకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆనాలోచిత మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పోరాటానికి దిగారు.
⇔ దివ్యాంగుల అశక్తతపై ప్రేక్షకులకు అవగాహన కలిగించేలా థియేటర్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి.
⇔ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో దివ్యాంగుల విషయాన్ని ప్రస్తావించాలి.
⇔ బదిరులు జాతీయ గీతాన్ని వినలేరు కాబట్టి.. సబ్ టైటిల్స్ వేసేలా చర్యలు తీసుకోవాలి.
⇔ దివ్యాంగులను కించపర్చేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధల్లో మార్పులు చేయాలి.
–సాక్షి, స్కూల్ ఎడిషన్