సాక్షి, న్యూఢిల్లీ : ‘మన దేశానికి అందరికన్నా ఎక్కువ మేధావులు, లౌకికవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది. నేనే కనుక హోం మంత్రిని అయితే వారందరినీ కాల్చి పారేయమంటూ ఆదేశాలిచ్చేవాణ్ని’, అని కర్ణాటక భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు బసన గౌడ పాటిల్ యత్నల్ ‘కార్గిల్’ దినోత్సవం నాడు బీజీపీ అనుచర వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కంటే కూడా భారత సెక్యులర్ వాదులే ఎక్కువ ప్రమాదకారులని కూడా అన్నారు. ఇలాంటి నయా జాతీయవాద దేశ భక్తులు దేశంలో రోజుకొకరు పుట్టుకొస్తున్నారు.
ముస్లింలెవరు తన కార్యాలయంలో కనిపించకూడదంటూ గత నెలలో కసరుకున్నప్పుడే యత్నల్ దేశభక్తిని అందరు గుర్తించి ఉండాల్సింది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో జౌళి శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు యత్నల్ తన దేశభక్తి భయటపడకుండా ఎంతగా దాచుకున్నారో పాపం!
‘దేశంలో నేడు టెర్రరిజం, నేరాలు, గోరక్షణ హత్యలు పెరిగి పోవడానికి అసలు కారణం జనాభా పెరుగుదల. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటితో పోలిస్తే నేడు జనాభా విపరీతంగా పెరిగింది. అది కూడా ఒక్క ముస్లింల వల్లనే’ అని ఉత్తరప్రదేశ్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు హరి హోం పాండే వ్యాఖ్యానించారు. గోరక్షణ పేరిట జరుగుతున్న ముస్లింల హత్యలకు ముస్లింలనే నిందించాలన్న మాట. కొంచెం అటుఇటుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే మాట్లాడారు. ‘అనవసరంగా మూక హత్యలను హైలైట్ చేస్తున్నారు. ఏది ఏమైనా గోవుల స్మగ్లింగ్‌ను, కబేళాలకు తరలించడాన్ని ఆపేయాల్సిందే’ అని పిలుపునిచ్చారు. 2014 నుంచి 2017 మధ్య జరిగిన 87 సంఘటనల్లో 34 మంది ముస్లింలు మరణించడం పెరుగుతున్న వారి జనాభాలో ఎంతపాటి!
ఇలాంటి వ్యక్తులు మాటల్లో తమ దేశభక్తిని చాటుకుంటే కేంద్ర సాంస్కతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తన దేశభక్తిని చేతల్లో చూపించారు. 2016లో ఓ ముస్లిం యువకుడిని గోరక్షణ పేరిట హత్య చేసిన కేసులో నిందితుడు అనారోగ్యం కారణంగా మరణిస్తే ఆయన మతదేహంపై జాతీయ జెండాను కప్పి అమరవీరుడిని చేశారు. ముస్లిం మూక హత్య కేసులో శిక్ష పడిన ఆరుగురు దోషులు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయితే కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వారిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి సత్కరించిన విషయం తెల్సిందే. ఈ సంఘటనకు తాను చింతిస్తున్నానంటూ ఆయన తండ్రి యశ్వంత్ సిన్హా అనవసరంగా నొచ్చుకున్నారు. ఆయన వాజపేయి హయాంలో రెండుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసినది ఎవరికి గుర్తుందీ, కొడుకు ప్రవర్తనను పొగిడి ఉంటే ‘తనయుడికి తగ్గ తండ్రి’ అంటూ ఈ దేశం జీవితాంతం గుర్తుంచుకునేది కదా!
‘దేశంలో శాంతి కోసం ఇస్లాంను పూర్తిగా తుడిచిపెట్టాల్సిందే. చర్చి మతమార్పిడి యంత్రం. భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిందే. ఇక భారత లౌకికవాదులు తల్లిదండ్రుల రక్తం పంచుకోని వివాహేతర సంబంధానికి పుట్టిన బిడ్డలు (బాస్టర్ట్స్)’ అంటూ తన భాషా నైపుణ్యాన్నంతా ప్రదర్శించి నైపుణ్య శాఖకు తగిన వ్యక్తినని నిరూపించుకున్నారు ఆ శాఖ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే. హిందూత్వాన్ని ఐక్యంగా ఉంచేందుకు, భారత్‌ను మరింత బలోపేతం చేసేందుకు హిందువులు కనీసం ఐదుగురిని కనాలని యూపీకి చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా పిలుపునిచ్చారు.
ఇలాంటి మేథావులే చెప్పిన ‘హమ్ పాంచ్ హమారా పచ్చీస్’ నినాదాన్ని ముస్లింలు వీడనంతకాలం హిందువులు ఎంత మందిని కంటే మాత్రం హిందూత్వం బలపడుతుంది. ప్రస్తుత రాజ్యాంగానికి అంతో ఇంతో కట్టుబడి పనిచేసే కోర్టులు ఉన్నంతకాలం గౌరీ లంకేష్ లాంటి మేధావులను, లౌకికవాదులను ఎంత మందిని చంపితే మాత్రం ఏం ప్రయోజనం? టర్కీలో, రష్యాలో, హంగరీలోలాగా మేధావులు, లౌకికవాదులతో నయా జాతీయవాదులు, దేశభక్తులు యుద్ధం చేసి ‘తాడో పేడో’ తేల్చుకుంటే పోలా!
-ఓ సెక్యూలరిస్ట్ కామెంట్
Comments
Please login to add a commentAdd a comment