Anant kumar Hegde
-
బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. మెజార్టీ సీట్లు గెలిస్తే!
బెంగళూరు: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలల్లో బీజేపీ మూడింట రెండు వంతుల ఎంపీ సీట్లలో గెలుపొంది.. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేస్తామని అన్నారు. రాజ్యాంగంలోని పీఠికలో ఉన్న ‘లైకికవాదం’ను తొలగిస్తామని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ. ‘అనవసరమైన అంశాలను కాంగ్రెస్ బలవంతంగా చొప్పించి రాజ్యాంగాన్ని వక్రీకరించింది. ముఖ్యంగా హిందూ సామాజాన్ని అణచివేసే చట్టాలను తీసుకుచ్చింది. వాటిలో మార్పులు తీసుకురావాలంటే బీజేపీకి ప్రస్తుతం ఉన్న మెజార్టీ సరిపోదు. కాంగ్రెస్ మెజార్టీ లోక్‌సభ స్థానాలు గెలువలేదు. మోదీ నాయకత్వంలో బీజేపీ లోక్‌సభలో మూడింట రెండు వంతుల సీట్లను గెలుస్తుంది. అయితే లోక్‌సభ, రాజ్యసభల్లో మూడింట రెండువంతుల సీట్లను బీజేపీ గెలవటంతో పాటు.. అదే స్థాయిలో 20 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో మార్పులు తీసుకురావచ్చు’ అని అనంత్‌కుమార్ హెగ్డే అన్నారు. ‘ఈసారి బీజేపీ 400 సీట్లు గెలవాలి. 400 సీట్లు ఎందుకంటే? లోక్‌సభలో మెజార్టీ ఉన్నా.. రాజ్యసభలో బీజేపీ మెజార్టీ లేదు. రాజ్యసభలో తక్కువ మెజార్టీ ఉంది. అలాగే పలు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి కావల్సినంత మెజార్టీ లేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి 400 సీట్ల గెలుపొందితే.. రాజ్యసభలో బీజేపీ మెజార్టీ పెరగటానికి దోహదపడుతుంది’అని స్పష్టం చేశారు. అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. హెగ్డే వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకమైన పార్టీ అని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో కేంద్రంలోని బీజేపీకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై వ్యతిరేకత ఎంత ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు. MP Shri Ananth Kumar Hegde's remarks on the Constitution are his personal views and do not reflect the party's stance. @BJP4India reaffirms our unwavering commitment to uphold the nation's Constitution and will ask for an explanation from Shri Hegde regarding his comments. — BJP Karnataka (@BJP4Karnataka) March 10, 2024 దీంతో కర్ణాటక బీజేపీ ‘ఎక్స్’వేదికగా స్పందిస్తూ.. ‘ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి.. వాటితో పార్టీకి ఎటువంటి సంబంధిం లేరు. ఆయన వ్యాఖ్యలు పార్టీని ప్రతిబింబించవు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మేము వివరణ కోరుతాం’ అని బీజేపీ పేర్కొంది. -
‘బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశద్రోహులు’
బెంగళూరు: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచే బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఉద్యోగులను ఉద్దేశిస్తూ.. హెగ్డే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులన్నారు. కుమ్టే ప్రాంతంలో జరిగిన ఓ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రసిద్ధ సంస్థను అభివృద్ధి చేయడానికి సంస్థ ఉద్యోగులు ఏమాత్రం ఇష్టపడటం లేదన్నారు. వీరంతా దేశ ద్రోహులని హెగ్డే విరుచుకుపడ్డారు. (బై బై బీఎస్ఎన్ఎల్.. భావోద్వేగానికి లోనైన ఉద్యోగి) అందుకే 88000 మంది ఉద్యోగులను తొలగించారని, సంస్థను ప్రైవేటీకరణ చేయనున్నారని హెగ్డే పేర్కొన్నారు. వారికి బుద్ధి చెప్పాలంటే ఇది ఒక్కటే సరైన పరిష్కారం అన్నారు హెగ్డే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. హెగ్డే వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ వ్యాఖ్యలు ఆయన చౌకబారు వ్యక్తిత్వానికి నిదర్శమని పేర్కన్నది. బీజేపీ అసమర్థత వల్లే బీఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ జరుగుతుందని ఆరోపించింది. కేంద్రం ప్రతిదానిని ప్రైవేటీకరిస్తుందని తెలిపింది. -
అనంత్ ‘చరిత్ర’ పాఠాలు
నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలు తరచుగా కట్టు తప్పుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అలాంటివారిలో ఒకరు. పార్టీలో శరవేగంతో ఎదగడానికో...అధినేత దృష్టిలో పడితే ఇప్పుడున్న స్థానాన్ని మించిన అవకాశాలు వస్తాయనో భావించి ఇష్టానుసారం మాట్లాడే నేతలు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు. కానీ అనంత్‌కుమార్ హెగ్డే ఆ కోవలోకి రారు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకొచ్చినవారు కాదు. ఇప్పటికే ఆరుసార్లు ఎంపీగా పనిచేసినవారు. అలాంటి నాయకుడు బాధ్యతాయుతంగా మాట్లాడకపోతే, జవాబుదారీతనంతో వ్యవహరించకపోతే కొత్తగా వచ్చే నాయకులకు, సాధారణ ప్రజానీకానికి తప్పుడు సంకేతాలు పోతాయి. ఆ సంగతి ఆయన గ్రహిస్తున్నట్టు లేరు. ఇంతక్రితం కూడా పలు సందర్భాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిపై నిరసనలు పెల్లుబికాయి. ఒకసారైతే నోరు జారారనుకోవచ్చు. కానీ పదే పదే అలాంటి వ్యాఖ్యలు చేస్తే వాటి వెనక నిర్దిష్టమైన ఉద్దేశాలు న్నాయని, ప్రయోజనాలున్నాయని అనుకోవాల్సివస్తుంది. ఆయన తాజాగా దేశ స్వాతంత్య్రోద్యమం గురించి మాట్లాడారు. మహాత్మా గాంధీ పేరెత్తకుండా, ఆయన్నుద్దేశించే అంటున్నట్టు అందరికీ అర్థ మయ్యేలా నిందాపూర్వకంగా వ్యాఖ్యానించారు. చరిత్ర గురించి, అది తీసుకున్న మలుపుల గురించి అందరూ ఒకే అభిప్రాయంతో ఉండాలని, ఉంటారని ఆశించలేం. అలాగే స్వాతంత్య్రోద్యమంపైనా, దాని తీరుతెన్నులపైనా భిన్నాభిప్రాయం ఉండటం తప్పేం కాదు. ఆ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలోనే షహీద్ భగత్‌సింగ్ వంటి వారికి గాంధీ అవలంబిస్తున్న విధానాలపై అసంతృప్తి ఉండేది. బలప్రయోగంతో ప్రజల స్వాతంత్య్రేచ్ఛను అణిచివేయాలని చూస్తున్న బ్రిటిష్ పాలకులకు అదే భాషలో బదులీయాలని ఆయన వాదించేవారు. నేతాజీ సుభాస్‌చంద్ర బోస్ సైతం ఇలాంటి అభిప్రాయంతోనే ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ)ను స్థాపించి, యువతీయువకులను సమీకరించారు. అయితే హెగ్డే అభ్యం తరం పూర్తిగా వేరు. ఆయన దృష్టిలో స్వాతంత్య్రోద్యమంలో రెండు రకాలవారున్నారు. ఆయుధా లతో పోరాడినవారు. మేధోశక్తితో అందరినీ ప్రేరేపితుల్ని చేసినవారు. వీరుగాక మరో రకం సమర యోధులున్నారు. ఈ సమరయోధులు బ్రిటిష్ పాలకులతో లాలూచీ పడి ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమ సారథులు దాన్నెలా నడపాలో ఎప్పటికప్పుడు బ్రిటిష్ వారినుంచి సలహాలు తీసుకునే వారు. పాలకులు చెప్పినట్టల్లా చేస్తామన్న అవగాహనతో, సర్దుబాట్లతో ఆ ఉద్యమం సాగింది. తమ ఉద్యమాన్ని గుర్తించి, తమను అరెస్టు చేసి జైలుకు పంపమని ఈ ఉద్యమ సారథులు పాలకులను వేడుకునేవారు. జైళ్లలో తమను జాగ్రత్తగా చూసుకుంటే చాలని కోరేవారు. ఇలాంటి నాయకులపై బ్రిటిష్ పోలీసులు ఒక్కసారి కూడా చేయిచేసుకోలేదు. ఇంతవరకూ ఎవరి గురించి మాట్లాడు తున్నారో స్పష్టత లేకుండా ప్రసంగించిన అనంత్‌కుమార్ ఆ తర్వాత కాస్త స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్‌ను సమర్థించేవారంతా ఆమరణ నిరాహార దీక్షల వల్లా, సత్యాగ్రహం వల్లా స్వాతంత్య్రం వచ్చిందని చెబుతుంటారని, కానీ అది పూర్తిగా అవాస్తవమని ఆయన తెలిపారు. సత్యాగ్రహం వల్ల బ్రిటిష్ పాలకులు ఈ దేశం వదిలిపోలేదని, వారు నిరాశానిస్పృహలకు లోనై స్వాతంత్య్రం ప్రకటిం చారన్నది హెగ్డే అభిప్రాయం. ఇలా స్వాతంత్య్రోద్యమ చరిత్రనంతా ఏకరువు పెట్టాక, ఈ ఉద్యమం నడిపించినవారు మన దేశంలో మహాత్ములయ్యారని వ్యాఖ్యానించారు. నిజంగా ఈ దేశం కోసం పనిచేసి, పెను మార్పులు తీసుకురావడానికి త్యాగాలు చేసినవారిని చరిత్ర చీకటి కోణాల్లోకి నెట్టేశారని ఆవేదన చెందారు. ఎవరికీ తెలియని ఈ చరిత్రనంతా తాను ఎక్కడ అధ్యయనం చేశారో ఆయన చెప్పలేదు. వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ అధినాయకత్వం ఆదేశించాక తన మాటల్ని మీడియా వక్రీకరించిందని ఆయనంటున్నారు. తాను గాంధీ, నెహ్రూ పేర్లెత్తలేదని చెబుతున్నారు. ఈ దేశంలో స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహ సమరం నడిపిందీ, ఆమరణ దీక్షలు చేసిందీ ఎవరో హెగ్డే చెప్పకపోయి ఉండొచ్చు. అలాగే ఈ ఉద్యమాలు సాగించినవారు మహాత్ములయ్యారన్నప్పుడు కూడా ఆయన ఎవరి పేరూ ప్రస్తావించి ఉండకపోవచ్చు. కానీ స్వాతంత్య్రోద్యమం గురించి ఎంతో కొంత తెలిసినవారికి కూడా ఎవరినుద్దేశించి ఆయన ఆ మాటలన్నారో సులభంగా తెలుస్తుంది. నిజానికి అలా తెలియాలనే ఆయన అంత వివరంగా, అంత ‘స్పష్టంగా’ మాట్లాడారు. కాకపోతే పేర్లు నేరుగా వెల్లడించడానికి ఇంకా సమయం రాలేదని అనుకుని ఉండొచ్చు. ‘పెదవి దాటని మాటలకు మనం యజమానులం. పెదవి దాటి బయటకు వచ్చిన మాటలకు మాత్రం మనమే బానిసలవుతామ’ని బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. మహాత్ముణ్ణి గుర్తుకుతెచ్చేంతగా వ్యాఖ్యానించిన హెగ్డే...తమ మేధో శక్తితో అందరినీ ప్రేరేపితుల్ని చేసిన ఆ మహానుభావులెవరో కూడా స్పష్టంగా చెప్పివుండాల్సింది. అప్పట్లో ఈ దేశంలో పెను మార్పులు తీసుకురావడానికి పాటుబడి, చరిత్ర చీకటికోణాల్లో మగ్గిపోయిన వారెవరో కూడా వివరించి ఉండాల్సింది. ఆయన అలా చేసివుంటే ఈ చర్చ మొత్తం వేరుగా ఉండేది. అలాగే తన ‘లాలూచీ’ ఆరోపణలకు సమర్థనగా బ్రిటిష్ ప్రభుత్వ పత్రాలేమైనా వెల్లడించివుంటే అందరూ సంతోషించేవారు. బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కూడా గత నవంబర్‌లో ఇదేవిధంగా మహాత్మా గాంధీని ఏమనలేదు. కానీ ఆయన్ను పొట్టనబెట్టుకున్న నాథూరాం గాడ్సేను దేశ భక్తుడన్నారు. అప్పుడూ ఇప్పుడూ కూడా బీజేపీ మందలించింది. ఆ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని చెప్పింది. స్వాతంత్య్రోద్యమాన్ని పల్చన చేసి, దాని సారథుల్ని కించపరిచి సాధించదల్చు కున్నదేమిటో హెగ్డే చెప్పాలి. తమ పార్టీ వారినుంచే తరచు ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలెందు కొస్తున్నాయో బీజేపీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. -
గాంధీపై వ్యాఖ్యలు : హెగ్డే క్షమాపణకు బీజేపీ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్ హెగ్డేను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఆదేశించింది. బెంగళూర్‌లో ఆదివారం జరిగిన ఓ బహిరంగ సభలో కర్ణాటకకు చెందిన పార్టీ సీనియర్ నేత అనంత్‌కుమార్ హెగ్డే మహాత్మ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గాంధీ సారథ్యంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటాన్ని ఆయన డ్రామాగా అభివర్ణించారు. చరిత్ర చదువుతుంటే తన రక్తం మరుగుతోందని, గాంధీని మహాత్మగా పిలవడం మన దౌర్భాగ్యమని హెగ్డే వ్యాఖ్యానించారు. స్వాతంత్రోద్యమం యావత్తూ బ్రిటిషర్ల కనుసన్నల్లో సాగిందని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలంరేపాయి. కాగా హెగ్డే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ నాయకత్వం ఆయన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. చదవండి : గాంధీజీపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు -
..అందుకే ఫడ్నవీస్‌ను సీఎం చేశాం!
బెంగళూరు: ‘రూ. 40 వేల కోట్ల నిధులను కాపాడేందుకే మహారాష్ట్రలో హుటాహుటిన ఫడ్నవీస్‌ను సీఎం చేశాం’ అంటూ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఫడ్నవీస్ ఖండించారు. హెగ్డే వ్యాఖ్యల్లో వాస్తవం ఉంటే ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ, ఇది మహారాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనని శివసేన మండిపడ్డాయి. కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం అనంత్ కుమార్ హెగ్డే పై వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీకి మెజారిటీ లేకపోయినా, మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ను ఎందుకు సీఎం చేశారన్న ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. అదంతా ముందుగా అనుకున్న ప్రణాళికే. మహారాష్ట్రలో సీఎం నియంత్రణలో రూ. 40 వేల కోట్లు ఉన్నాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ నిధులు దుర్వినియోగమవుతాయి. ఆ నిధులను కాపాడటం కోసమే హుటాహుటిన ఫడ్నవీస్‌ను సీఎం చేశాం.. వాటిని అభివృద్ధి పనులకు కేటాయించడం కోసమే ఆ డ్రామా ఆడాం. ఫడ్నవీస్ సీఎం అయిన 15 గంటల్లోనే ఆ నిధులను ఎక్కడికి పంపాలో అక్కడికి పంపి, వాటిని కాపాడారు. ఆ నిధులను కేంద్రానికి తిరిగి పంపించనట్లయితే.. అవి శివసేన కూటమి సీఎం చేతిలో పడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు’ అంటూ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ మద్దతుతో నవంబర్ 23న ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం, ఆ తరువాత మెజారిటీ నిరూపించుకోలేని పరిస్థితుల్లో 80 గంటల్లోపే రాజీనామా చేయడం తెలిసిందే. అదంతా అబద్ధం: ఫడ్నవీస్ హెగ్డే వ్యాఖ్యలను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అబద్ధాలంటూ ఖండించారు. తాను సీఎంగా ఉన్న ఆ మూడు రోజుల్లో ఎలాంటి నిధుల గురించి కేంద్రం అడగలేదని, తాము కూడా కేంద్రానికి నిధులను పంపించలేదని సోమవారం స్పష్టం చేశారు. ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ కంపెనీ చేపట్టింది. వారికి భూ సేకరణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం మమ్మల్ని నిధులు అడగలేదు. మేం పంపించలేదు. ఏ ప్రాజెక్టు నుంచి కూడా మహారాష్ట్రకు చెందిన ఒక్క రూపాయిని కూడా కేంద్రానికి పంపించలేదు’ అని ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు. -
హిందూత్వ వాదుల అఖండ విజయం
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ గతంలోకన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధించడానికి కారణం ప్రజలు హిందూత్వ వాదానికి పట్టం గట్టడమేనని స్పష్టంగా అర్థం అవుతోంది. ‘వికాస్’ ప్రధాన నినాదంగా ప్రచారం చేయడం ద్వారా గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈసారి ఆ నినాదాన్ని పక్కన పడేసి ‘హిందూత్వ’ నినాదాన్ని పట్టుకోవడం వల్ల గతంలోకెల్లా బీజేపీకి ఈసారి ఎక్కువ సీట్లు వచ్చాయి. గత బీజేపీ హయాంలో పెరిగిన గోరక్షక దాడులు, మూక హత్యలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న ధరలు తదితర అంశాలన్నీ హిందూత్వ జాతీయవాదం ముందు తుడిచిపెట్టుకుపోయాయి. మూకుమ్మడి హత్యకు సంబంధించిన టెర్రరిస్టు కుట్ర కేసులో విచారణ ఎదుర్కొంటూనే బీజేపీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌పై అఖండ విజయం సాధించడం మామాలు విషయం కాదు. కరుడుగట్టిన హిందూత్వ వాదులు సాక్షి మహరాజ్, గిరిరాజ్ సింగ్, అనంతకుమార్ హెగ్డేలు గతంకన్నా ఎక్కువ మెజారిటీతో విజయం సాధించడం అంటే హిందూత్వవాదానికి ప్రజలు ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అనంత్ కుమార్ హెగ్డే కర్ణాటకలోకి ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి ఐదోసారి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన అనంత్‌కుమార్ హెగ్డే కేంద్రంలో వ్యాపారరంగంలో నైపుణ్యాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన కరడుగట్టిన ఆర్ఎస్సెస్ వాదే కాకుండా దాని విద్యార్థి సంస్థ ఏబీవీపీలో కూడా పనిచేశారు. ముస్లింలు, దళితులకు వ్యతిరేకండా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ఆయనకు అలవాటు. ఇస్లాం బతికున్నంతకాలం ప్రపంచంలో శాంతి అనేది ఉండదంటూ 2016లో ఆయన విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు ఆయనపై కేసు కూడా నమోదయింది. ఇక ఆయన 2018లో దళితులను మొరిగే కుక్కలంటూ అవమానించారు. ఆగ్రాలోని తాజ్ మహల్ కూడా ఒకప్పుడు ‘తేజో మహాలయ అనే శివాలయం’ అంటూ కొత్త వివాదాన్ని కూడా తీసుకొచ్చారు. ఆయన 2014 ఎన్నికల్లో 1.4 లక్షల మెజారిటీతో విజయం సాధించగా, ఈ సారి ఏకంగా నాలుగు లక్షల ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించారు. గిరిరాజ్ సింగ్ కేంద్ర సూశ్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న గిరిరాజ్ సింగ్ బీహార్ ఎంపీ. ఇంతకుముందు ఆయన నావడా నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, ఈసారి సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ను ఎదుర్కొనేందుకు బెగుసరాయ్ నుంచి పోటీ చేశారు. కరుడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపొందిన ఆయన ముస్లింల సంతానోత్పత్తిని ఎదుర్కొనేందుకు పదేసి మంది పిల్లల్ని కనాలంటూ హిందువులకు పలుసార్లు పిలుపునిచ్చారు. మోదీకి మద్దతివ్వని వారంతా పాకిస్థాన్‌కు వెళ్లాలంటూ హెచ్చరించారు. ఆయన పదే పదే మతపరమైన విమర్శలు చేస్తుంటే 2014 ఎన్నికల సందర్భంగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆయన ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు కూడా విధించింది. ఈసారి కూడా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. గత ఎన్నికల్లో ఆయన 44.1 శాతం పోలింగ్‌తో 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఈసారి మంచి స్పీకర్‌గా పేరుపొండడమేకాకుండా వినూత్న రీతిలో విస్తతంగా ఎన్నికల ప్రచారం చేసిన కన్హయ్య కుమార్‌పై 56.53 ఓట్ల శాతంతో రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సాక్షి మహరాజ్ కరుడుగట్టిన హిందూత్వవాది సాక్షి మహరాజ్‌పై ఏకంగా 34 క్రిమినల్ కేసులు ఉన్నాయి. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా 2011లో ఆయన ఓ మూకుమ్మడి రేప్ కేసు నుంచి బయటపడ్డారు. 2013లో జరిగిన ఓ హత్య కేసులో ఆయన ఇప్పటికీ నిందితుడే. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులోనూ నిందితుడే. గాంధీజీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా ఆయన పలుసార్లు వర్ణించారు. ప్రతి హిందువు కనీసం నలుగురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. ఆవును హింసించినా, మతం మారిన హత్య కేసు కింద మరణిదండన విధించాలంటూ ప్రచారం చేశారు. ఆయన గత ఎన్నికల్లో మూడు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఈ సారి యూపీలోని ఉన్నావో నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థి అరుణ్ శంకర్ శుక్లాపై ఏకంగా నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఆమె కరడుగట్టిన హిందూత్వ వాది. 2008లో జరిగిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కుట్ర కేసులో ప్రధాన నిందితురాలు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమె అనారోగ్య కారణాలపై బెయిల్ తీసుకొని మూడుసార్లు శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. మూడోసారి ఆపరేషన్‌తో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ నయం అయింది. అయితే తాను రోజు ఆవు మూత్రం తాగడం వల్ల తన క్యాన్సర్ నయం అయిందని కూడా ఎన్నికల్లో ఆమె ప్రచారం చేసుకున్నారు. ఓ హత్య కేసు విచారణను ఎదుర్కొంటూనే ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వ్యక్తిగా కూడా ఆమె చరిత్ర సష్టించారు. తాను నిందితులుగా ఉన్న మాలెగావ్ కేసును విచారిస్తున్న ‘యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్’ చీఫ్ హేమంత్ కర్కరే అదే సంవత్సరం సంభవించిన ఓ బాంబు పేలుడులో మరణించగా తన శాపం కారణంగానే ఆయన మరణించారంటూ వ్యాఖ్యానించి తాత్కాలికంగా చిక్కుల్లో పడ్డారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయడంలో తాను ప్రముఖ పాత్ర వహించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని కూడా పదే పదే చెప్పుకున్నారు. ఆమె దిగ్విజయ్ సింగ్‌పై మూడున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. -
పేపర్ చదవను.. టీవీ చూడను !
కర్ణాటక , యశవంతపుర : పత్రికలు, టీవీలపై తనకు నమ్మకం పోయిందని, దీంతో పదేళ్లుగా తాను టీవీ, పత్రికలను చూడటం లేదని కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే మీడియాపై విరుచుకు పడ్డారు. బుధవారం ఆయన కారవార జిల్లా అంకోల తాలూకా అలగెరెలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మీరు ఆరోగ్యంగా ఉండలాంటే టీవీలను చూడటం మానుకోవాలన్నారు. నెల రోజుల క్రితం ఉద్యోగ మేళాలో ఆపరేషన్ కమలం స్పందించాలని కోరిన విలేకర్లను కేంద్రమంత్రి తన రక్షణ సిబ్బందితో నెట్టివేయించారు. దీంతో మీడియా కేంద్రమంత్రి సమావేశాన్ని అప్పట్లో బహిష్కరించింది. దీంతో అప్పటి నుంచి ఆయన మీడియాపై అక్కసు పెంచుకున్నారు. వారం రోజుల క్రితం అంకోలలో పాస్‌పోర్ట్ ఆఫీసు ప్రారంభోత్సవానికి రాగా మీడియా ఆయనను పట్టించుకోలేదు. దీంతో ఆయన మీడియాపై కోపం పెంచుకుని ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది. -
ఏం చేస్తారో చేసుకోండి..
న్యూఢిల్లీ: హిందూ మహిళలను తాకిన చేయి ఎవరిదైనా సరే కులమతాలకు అతీతంగా ఆ చేతిని నరికేయాల్సిందే అంటూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు దీటుగా స్పందిస్తున్నారు. ప్రతి భారతీయుడిని తలదించుకునేలా చేసిన హెగ్డే కేంద్ర మంత్రిగా అనర్హుడని, ఆయనను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ (నైపుణ్యాభివృద్ధి) మంత్రిగా ఉన్న అనంత్ కుమార్ హెగ్డే.. ప్రజల చేతుల నరకండి, చంపండి అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. హేగ్డేకు కాంగ్రెస్ నాయకుడు తెహసీన్ పొనవల్లా ట్విటర్ వేదికగా సవాల్ విసిరారు. హిందువైన తన భార్యను ఆలింగనం చేసుకున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘చూడండి నా చేతులు హిందువైన నా భార్యను తాకాయి. ఏం చేస్తారో చేసుకోండి. మీకు ఇదే నా సవాల్’ అంటూ కామెంట్ పెట్టారు. (‘ముస్లిం మహిళ వెనుక పరిగెత్తడం మాత్రమే తెలుసు’) Good afternoon @AnantkumarH . See my hands are touching my hindu life ..Now do what u can !! It's a dare sir!! pic.twitter.com/8AyJcV5yqT — Tehseen Poonawalla (@tehseenp) January 28, 2019 -
‘ముస్లిం మహిళ వెనుక పరిగెత్తడం మాత్రమే తెలుసు’
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావుల మధ్య సోషల్ మీడియా వేదికగా విమర్శల యుద్ధం కొనసాగుతోంది. ఆదివారం కొడగులో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనంత్ కుమార్ మాట్లాడుతూ.. హిందూ మహిళలను తాకిన చేయి ఎవరిదైనా సరే కులమతాలకు అతీతంగా ఆ చేతిని నరికేయాల్సిందే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెగ్డే వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావు... ‘ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నందుకు మీరు సాధించిందేమిటి? కర్ణాటక అభివృద్ధిలో మీ పాత్ర ఎంత? ఇలాంటి వ్యక్తులను ఎంపీలుగా, మంత్రులుగా కలిగి ఉండటం విచారకరం’ అని ట్వీట్ చేశారు. ఇందుకు స్పందనగా.. ‘దినేష్ గుండూరావుకు నేను కచ్చితంగా సమాధానం ఇచ్చితీరతాను. అయితే అంతకన్నా ముందు తన విజయాల వెనుక ఎవరు ఉన్నారనే ప్రశ్నకి ఆయన బదులివ్వాలి. నాకు తెలిసినంత వరకు ఓ ముస్లిం మహిళ వెంట పడటం మాత్రమే తనకు తెలుసు’ అంటూ అనంత్ కుమార్ విమర్శించారు. దీంతో.. ‘ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ అనంత్ కుమార్ తన స్థాయిని దిగజార్చుకున్నారు. నాకు తెలిసి ఆయనకు సంస్కారం లేదు. హిందూ వేదాలు ఆయనకు ఏమీ నేర్పలేదేమో. ఇంకా సమయం మించి పోలేదు. ఇప్పటికైనా పద్ధతైన మనిషిగా మారేందుకు అవకాశం ఉంది’ అంటూ దినేష్ రావు ఘాటుగా స్పందించారు. కాగా దినేష్ గుండూరావు టబూ అనే ముస్లిం మహిళను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మతాంతర వివాహాన్ని కారణంగా చూపి బీజేపీ ఎంపీ శోభా కరాంద్లజే, ప్రతాప్ సింహా తదితర నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో దినేష్ గుండూరావుని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో.. తానేమీ రాజకీయాల్లో లేనని, తన మతం గురించి ప్రస్తావించి దినేష్‌ను ఇబ్బంది పెట్టడం సరైంది కాదంటూ టబూ రావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. I shall definitely answer this guy @dineshgrao's queries, before which could he please reveal himself as to who he is along with his achievements? I only know him as a guy who ran behind a Muslim lady. https://t.co/8hVJ2wQXMU — Anantkumar Hegde (@AnantkumarH) January 27, 2019 Sad to see @AnantkumarH stoop to such low levels as to bring in personal issues. Guess it’s his lack of culture. Guess he hasn’t learnt from our Hindu scriptures. Time hasn’t run out, he can still try and become a more dignified human. https://t.co/AaX5OuUAVb — Dinesh Gundu Rao (@dineshgrao) January 28, 2019 -
‘తాజ్‌మహల్.. ఒకప్పటి శివాలయం’
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ నిర్మాణంపై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్‌ను ముస్లింలు నిర్మించలేదని, అది ఒకప్పటి శివాలయం అని.. ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘తాజ్‌మహల్‌ను ముస్లింలు నిర్మించలేదు. జయసింహా అనే రాజు వద్ద నుంచి తాజ్‌మహల్‌ను కొనుగోలు చేసినట్టు తన ఆత్మకథలో షాజహాన్ చెప్పారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన శివాలయాన్ని తొలుత తేజోమహల్ అని పిలిచేవారు.. కాలక్రమంలో దాని పేరును తాజ్‌మహల్‌గా మార్చారు. మనం ఇలాగే నిద్ర పోతుంటే మన ఇళ్ల పేర్లను మసీదులుగా మారుస్తారు. రామున్ని జహాపన అని.. సీతా దేవిని బీబి అని పిలుస్తార’ని తెలిపారు. అంతేకాకుండా చరిత్రని.. వక్రీకరిస్తూ తిరగరాశారని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలపై అనంత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
కేంద్ర మంత్రికి చేదు అనుభవం
సాక్షి, వైఎస్సార్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలతో పాటు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ... రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కడపలో ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే కారును అడ్డుకున్నారు. జిల్లాలో ఉక్కు కర్మాగారంను వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళకారులు మంత్రి కారును చుట్టుముట్టి విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆందోళనకు దిగారు. బీజేపీ, ఆర్సీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కారును అడ్డుకున్న వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. -
ఈ ‘దేశభక్తుల’కు సరిలేరు వేరెవ్వరు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మన దేశానికి అందరికన్నా ఎక్కువ మేధావులు, లౌకికవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది. నేనే కనుక హోం మంత్రిని అయితే వారందరినీ కాల్చి పారేయమంటూ ఆదేశాలిచ్చేవాణ్ని’, అని కర్ణాటక భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు బసన గౌడ పాటిల్ యత్నల్ ‘కార్గిల్’ దినోత్సవం నాడు బీజీపీ అనుచర వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కంటే కూడా భారత సెక్యులర్ వాదులే ఎక్కువ ప్రమాదకారులని కూడా అన్నారు. ఇలాంటి నయా జాతీయవాద దేశ భక్తులు దేశంలో రోజుకొకరు పుట్టుకొస్తున్నారు. ముస్లింలెవరు తన కార్యాలయంలో కనిపించకూడదంటూ గత నెలలో కసరుకున్నప్పుడే యత్నల్ దేశభక్తిని అందరు గుర్తించి ఉండాల్సింది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో జౌళి శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు యత్నల్ తన దేశభక్తి భయటపడకుండా ఎంతగా దాచుకున్నారో పాపం! ‘దేశంలో నేడు టెర్రరిజం, నేరాలు, గోరక్షణ హత్యలు పెరిగి పోవడానికి అసలు కారణం జనాభా పెరుగుదల. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటితో పోలిస్తే నేడు జనాభా విపరీతంగా పెరిగింది. అది కూడా ఒక్క ముస్లింల వల్లనే’ అని ఉత్తరప్రదేశ్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు హరి హోం పాండే వ్యాఖ్యానించారు. గోరక్షణ పేరిట జరుగుతున్న ముస్లింల హత్యలకు ముస్లింలనే నిందించాలన్న మాట. కొంచెం అటుఇటుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే మాట్లాడారు. ‘అనవసరంగా మూక హత్యలను హైలైట్ చేస్తున్నారు. ఏది ఏమైనా గోవుల స్మగ్లింగ్‌ను, కబేళాలకు తరలించడాన్ని ఆపేయాల్సిందే’ అని పిలుపునిచ్చారు. 2014 నుంచి 2017 మధ్య జరిగిన 87 సంఘటనల్లో 34 మంది ముస్లింలు మరణించడం పెరుగుతున్న వారి జనాభాలో ఎంతపాటి! ఇలాంటి వ్యక్తులు మాటల్లో తమ దేశభక్తిని చాటుకుంటే కేంద్ర సాంస్కతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తన దేశభక్తిని చేతల్లో చూపించారు. 2016లో ఓ ముస్లిం యువకుడిని గోరక్షణ పేరిట హత్య చేసిన కేసులో నిందితుడు అనారోగ్యం కారణంగా మరణిస్తే ఆయన మతదేహంపై జాతీయ జెండాను కప్పి అమరవీరుడిని చేశారు. ముస్లిం మూక హత్య కేసులో శిక్ష పడిన ఆరుగురు దోషులు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయితే కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వారిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి సత్కరించిన విషయం తెల్సిందే. ఈ సంఘటనకు తాను చింతిస్తున్నానంటూ ఆయన తండ్రి యశ్వంత్ సిన్హా అనవసరంగా నొచ్చుకున్నారు. ఆయన వాజపేయి హయాంలో రెండుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసినది ఎవరికి గుర్తుందీ, కొడుకు ప్రవర్తనను పొగిడి ఉంటే ‘తనయుడికి తగ్గ తండ్రి’ అంటూ ఈ దేశం జీవితాంతం గుర్తుంచుకునేది కదా! ‘దేశంలో శాంతి కోసం ఇస్లాంను పూర్తిగా తుడిచిపెట్టాల్సిందే. చర్చి మతమార్పిడి యంత్రం. భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిందే. ఇక భారత లౌకికవాదులు తల్లిదండ్రుల రక్తం పంచుకోని వివాహేతర సంబంధానికి పుట్టిన బిడ్డలు (బాస్టర్ట్స్)’ అంటూ తన భాషా నైపుణ్యాన్నంతా ప్రదర్శించి నైపుణ్య శాఖకు తగిన వ్యక్తినని నిరూపించుకున్నారు ఆ శాఖ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే. హిందూత్వాన్ని ఐక్యంగా ఉంచేందుకు, భారత్‌ను మరింత బలోపేతం చేసేందుకు హిందువులు కనీసం ఐదుగురిని కనాలని యూపీకి చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా పిలుపునిచ్చారు. ఇలాంటి మేథావులే చెప్పిన ‘హమ్ పాంచ్ హమారా పచ్చీస్’ నినాదాన్ని ముస్లింలు వీడనంతకాలం హిందువులు ఎంత మందిని కంటే మాత్రం హిందూత్వం బలపడుతుంది. ప్రస్తుత రాజ్యాంగానికి అంతో ఇంతో కట్టుబడి పనిచేసే కోర్టులు ఉన్నంతకాలం గౌరీ లంకేష్ లాంటి మేధావులను, లౌకికవాదులను ఎంత మందిని చంపితే మాత్రం ఏం ప్రయోజనం? టర్కీలో, రష్యాలో, హంగరీలోలాగా మేధావులు, లౌకికవాదులతో నయా జాతీయవాదులు, దేశభక్తులు యుద్ధం చేసి ‘తాడో పేడో’ తేల్చుకుంటే పోలా! -ఓ సెక్యూలరిస్ట్ కామెంట్ -
బీజేపీకి దళిత యువ నేత సవాల్
పుణే : రాజ్యాంగాన్ని గౌరవించని నేతలకు చట్టసభల్లో కొనసాగే అర్హత లేదని దళిత నేత, యువ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ పేర్కొన్నాడు. అనంత కుమార్ హెగ్డే వ్యాఖ్యలను ఊటంకించిన జిగ్నేష్.. బీజేపీ పార్టీకి పెను సవాల్ విసిరాడు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య పద్ధతిని మారుస్తామని కొందరు ప్రకటనలు చేస్తున్నారు. దమ్ముంటే ఆ చేయండి. మా శక్తిని ఉపయోగించి దానిని ఎలా అడ్డుకోవాలో మాకు బాగా తెలుసు. ప్రజల అభిష్టం, వారి రక్షణ కోసం చట్టాల రూపకల్పన జరగాలి, అంతేకానీ, పార్టీలు, నేతలు తమ ఇష్టానుసారం మారుస్తామంటే కుదరదు అని జిగ్నేష్ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు గెలుచుకోనీయకుండా అడ్డుకోగలిగామని.. అన్నివర్గాలు ఏకమయితే 2019 ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించొచ్చని జిగ్నేష్ సభీకులను ఉద్దేశించి పిలుపునిచ్చాడు. కాగా, భీమ-కొరేగావ్ యుద్ధం స్మారకార్థం నిర్వహించిన ఆదివారం సాయంత్రం పుణేలో నిర్వహించిన ‘ఎల్గార్ పరిషత్’లో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో రోహిత్ వేముల తల్లి రాధిక, భీమ్ ఆర్మీ ప్రెసిడెంట్ వినయ్ రతన్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్(మాజీ ఎంపీ), జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ తదితరులు హజరుకాగా, పలు విద్యాలయాల నుంచి విద్యార్థులు, ప్రముఖ దళిత నేతలు హాజరయ్యారు. -
కేంద్ర మంత్రి హెగ్డేపై తోటి మంత్రి ఘాటు కామెంట్!
పుణె: సహచర కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే రాజ్యాంగాన్ని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మరో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఘాటుగా స్పందించారు. రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదని, తాను అలా జరగనివ్వబోనని ఆయన అన్నారు. కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి అయిన అథవాలే ఆదివారం పుణెలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హెగ్డే వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. ‘ఎవరైనా రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే.. మేం వారిని మారుస్తాం’ అని సరదాగా నవ్వుతూ అన్నారు. రాజ్యాంగాన్ని పవిత్రపుస్తకంగా ప్రధాని మోదీ అభివర్ణించిన విషయాన్ని గుర్తుచేసిన అథవాలే.. హెగ్డేపై చర్యలు తీసుకోవాలని బీజేపీని కోరారు. రాజ్యాంగాన్ని గతంలో చాలాసార్లు సవరించారని, కాబట్టి బీజేపీ ప్రభుత్వం భవిష్యత్తులో రాజ్యాంగాన్ని సవరించి.. అందులోని లౌకికవాదం పదాన్ని తొలగించబోతున్నదని కేంద్రమంత్రి హెగ్డే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
నువ్వూ బూట్లు నాకావా?
సాక్షి, బళ్లారి: రాజకీయాలల్లో విమర్శలు చేయడం సర్వసాధారణం. అయితే వాడే పదజాలాలు ఇతరులను నొప్పించకుండా ఉండాలి. నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే సంస్కృతి అనిపించుకోదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సాధనా పర్వలో భాగంగా ఆయన చిత్రదుర్గ జిల్లాలో హొళల్కెరె తాలూకాలో విలేకరులతో మాట్లాడారు. తాను అధికారం కోసం బూట్లు నాకుతానని ఎవరో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అయితే అదే వ్యక్తి అధికారం కోసం పదవులు అనుభవించేందుకు బూట్లు నాకాడా? అని బీజేపీ నేతలపై మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో నిర్మించాల్సిన కనక భవనాన్ని తాలూకా కేంద్రంలో ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని మంత్రి ఆంజనేయపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. హెగ్డే వల్ల బీజేపీకి నష్టం కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే నీచ పదజాలాలు ఉపయోగిస్తుండడం ఆయన హోదాకు తగదన్నారు. బ్రాహ్మణ కులంలో మంచి జ్ఞానం కలిగిన వారు ఉన్నారని, ముఖ్యమంత్రి గుండూరావు ఎంతో సంస్కృతితో వ్యవహరించారని గుర్తు చేశారు. అనంత్‌కుమార్ హెగ్డే మాట తీరు వల్ల బీజేపీకి ఓట్లు వస్తాయనే భ్రమల్లో ఉన్నారని, కానీ.. ఆ పార్టీకి రోజు రోజుకి ప్రజాదరణ తగ్గిపోతోందన్నారు. హిందూ ధర్మంలో కూడా ఎక్కడా పరధర్మంపై విమర్శలు చేయమని చెప్పలేదన్నారు. ఒక సమాజం ఎక్కువ, మరొక సమాజం తక్కువ చేసి మాట్లాడడం మానుకోమన్నారు. -
హెగ్డే క్షమాపణలు.. శాంతించని కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో తనపై వస్తున్న విమర్శలకు హెగ్డే ఎట్టకేలకు లోక్ సభలో క్షమాపణలు తెలియజేశారు. రాజ్యాంగాన్ని, పార్లమెంట్, అంబేద్కర్లను తాను గౌరవిస్తానని హెగ్డే పేర్కొన్నారు. ఓ పౌరుడిగా తాను రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏనాడూ ప్రవర్తించబోనని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. అయితే హెగ్డే వివరణపై ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం సంతృప్తి వ్యక్తం చేయలేదు. అనంత కుమార్ వివరణ సహేతుకంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక నేటి ఉదయం పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. దీనికి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వం వహించగా.. పలువురు సీనియర్, కీలక నేతలు ఆయన వెంట ఉన్నారు. త్వరలోనే రాజ్యాంగంలోని లౌకిక(సెక్యులర్) అనే పదాన్ని తొలగిస్తామని, అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అనంతకుమార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ మంత్రిని తీసేస్తేనే సభలో కూర్చుంటామని ఇప్పటికే ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి కూడా. కేంద్రం మాత్రం ఈ వివాదం నుంచి పక్కకు జరిగింది. అనంతకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని ప్రభుత్వానికి ఆయన మాటలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.