సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో తనపై వస్తున్న విమర్శలకు హెగ్డే ఎట్టకేలకు లోక్ సభలో క్షమాపణలు తెలియజేశారు.
రాజ్యాంగాన్ని, పార్లమెంట్, అంబేద్కర్‌లను తాను గౌరవిస్తానని హెగ్డే పేర్కొన్నారు. ఓ పౌరుడిగా తాను రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏనాడూ ప్రవర్తించబోనని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. అయితే హెగ్డే వివరణపై ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం సంతృప్తి వ్యక్తం చేయలేదు. అనంత కుమార్ వివరణ సహేతుకంగా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక నేటి ఉదయం పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. దీనికి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వం వహించగా.. పలువురు సీనియర్, కీలక నేతలు ఆయన వెంట ఉన్నారు. త్వరలోనే రాజ్యాంగంలోని లౌకిక(సెక్యులర్) అనే పదాన్ని తొలగిస్తామని, అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అనంతకుమార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ మంత్రిని తీసేస్తేనే సభలో కూర్చుంటామని ఇప్పటికే ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి కూడా. కేంద్రం మాత్రం ఈ వివాదం నుంచి పక్కకు జరిగింది. అనంతకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని ప్రభుత్వానికి ఆయన మాటలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment