న్యూఢిల్లీ : పార్టీ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రెండోరోజు కూడా తమ ఆందోళనను కొనసాగిస్తోంది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట బుధవారం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆందోళనకు ఆర్జేడీ, జేడీయూ, వామపక్షాలు మద్దతు తెలిపాయి.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ లోక్ సభ స్పీకర్పై తమకు గౌరవం ఉందని, స్పీకర్ను గౌరవిస్తామని అన్నారు. అయితే స్పీకర్ తీసుకున్న అన్ని నిర్ణయాలను తాము ఆమోదించలేమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ తమ నిరసన కొనసాగుతోందని, సస్పెన్షన్ ఎత్తివేతపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
కాగా సభా కార్యకలాపాలాకు అడ్డుతగులుతున్నారన్న కారణంతో సోమవారం 25 మంది కాంగ్రెస్ ఎంపీలను లోక్ సభ స్పీకర్ అయిదు రోజుల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిన్న కూడా కాంగ్రెస్ ఆందోళన చేసింది. మరో పక్క ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం.
స్పీకర్పై మాకు గౌరవం ఉంది, కానీ: రాహుల్
Published Wed, Aug 5 2015 11:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement