దేవేంద్ర ఫడ్నవీస్, అనంతకుమార్ హెగ్డే
బెంగళూరు: ‘రూ. 40 వేల కోట్ల నిధులను కాపాడేందుకే మహారాష్ట్రలో హుటాహుటిన ఫడ్నవీస్‌ను సీఎం చేశాం’ అంటూ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఫడ్నవీస్ ఖండించారు. హెగ్డే వ్యాఖ్యల్లో వాస్తవం ఉంటే ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ, ఇది మహారాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనని శివసేన మండిపడ్డాయి. కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం అనంత్ కుమార్ హెగ్డే పై వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీకి మెజారిటీ లేకపోయినా, మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ను ఎందుకు సీఎం చేశారన్న ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. అదంతా ముందుగా అనుకున్న ప్రణాళికే.
మహారాష్ట్రలో సీఎం నియంత్రణలో రూ. 40 వేల కోట్లు ఉన్నాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ నిధులు దుర్వినియోగమవుతాయి. ఆ నిధులను కాపాడటం కోసమే హుటాహుటిన ఫడ్నవీస్‌ను సీఎం చేశాం.. వాటిని అభివృద్ధి పనులకు కేటాయించడం కోసమే ఆ డ్రామా ఆడాం. ఫడ్నవీస్ సీఎం అయిన 15 గంటల్లోనే ఆ నిధులను ఎక్కడికి పంపాలో అక్కడికి పంపి, వాటిని కాపాడారు. ఆ నిధులను కేంద్రానికి తిరిగి పంపించనట్లయితే.. అవి శివసేన కూటమి సీఎం చేతిలో పడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు’ అంటూ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ మద్దతుతో నవంబర్ 23న ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం, ఆ తరువాత మెజారిటీ నిరూపించుకోలేని పరిస్థితుల్లో 80 గంటల్లోపే రాజీనామా చేయడం తెలిసిందే.
అదంతా అబద్ధం: ఫడ్నవీస్
హెగ్డే వ్యాఖ్యలను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అబద్ధాలంటూ ఖండించారు. తాను సీఎంగా ఉన్న ఆ మూడు రోజుల్లో ఎలాంటి నిధుల గురించి కేంద్రం అడగలేదని, తాము కూడా కేంద్రానికి నిధులను పంపించలేదని సోమవారం స్పష్టం చేశారు. ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ కంపెనీ చేపట్టింది. వారికి భూ సేకరణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం మమ్మల్ని నిధులు అడగలేదు. మేం పంపించలేదు. ఏ ప్రాజెక్టు నుంచి కూడా మహారాష్ట్రకు చెందిన ఒక్క రూపాయిని కూడా కేంద్రానికి పంపించలేదు’ అని ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment