Karnataka bypolls
-
కర్ణాటక: కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది
సాక్షి, బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ సునాయసంగా గెలుపు సాధించి, అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారి.. ప్రస్తుతం ఆ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంలో పడింది. మహారాష్ట్ర మాదిరిగానే కర్ణాటకలో బీజేపీ హవాను అడ్డుకుంటామని ఆశపడ్డ కాంగ్రెస్ పార్టీకి సోమవారం వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జేడీఎస్‌తో పొత్తు, కూటమిలో అంతర్గత విభేదాలు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యచరణలపై స్పష్టత లేకపోడం. బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేవలం ఆరు సీట్లు అవసరమయితే.. కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తిరిగి అధికారాన్ని రాబట్టడానికి 12 స్థానాల్లో గెలవాల్సి రావడం. మాజీ సీఎం సిద్ధరామయ్య జేడీఎస్-కాంగ్రెస్ కూటమితో ఏర్పడిన కుమారస్వామి ప్రభుత్వ పనితీరును గతంలో గట్టిగా విమర్శించడం. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్చార్జీ కేసీ వేణుగోపాల్ ఉప ఎన్నికల ప్రచారంలో సరిగా పాల్గొనకపోవడం. కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసే సరియైన నాయకుడు లేకపోవడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటను అడ్డుకట్ట వేయకపోవడం. ఉత్తర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలం పుంజుకోవాలంటే.. లింగాయత్‌లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. కర్ణాటక ప్రాజ్ఞవ్యంత జనతా పార్టీ (కేపీజేపీ) నుంచి గెలిచి, కాంగ్రెస్ పార్టీలో విలీనమైన అనర్హత ఎమ్మెల్యే ఆర్. శంకర్‌కు.. ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడానికి టికెట్ దక్కకపపోవడంతో.. ఆ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన అరుణ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీకి ఒక స్వతంత్ర శాసనసభ్యుడు, చట్టసభ సభ్యుడిని ప్రభుత్వం నామినేట్ చేయడం. కర్ణాటక మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ 17 మంది ఎమ్మెల్యేలను (శాసనసభ్యులు) అనర్హులుగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ వారిని ఉప ఎన్నికలలో పోటీ చేసే వెసులుబాటు కల్పించడంతో.. ఓటర్లు పార్టీలకతీతంగా అభ్యర్థి వైపు మొగ్గుచూపరనే విషయాన్ని గమనించవచ్చు. ఉప ఎన్నికలు ఎందు వచ్చాయంటే..? కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీకి మద్దతివ్వడంతో.. జేడీఎస్ నేత కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలి యడియూరప్ప ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం జూలై 29న యడియూరప్ప అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు. పార్టీ ఫిరాయించిన17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వెసులుబాటు కల్పించింది. దీంతో మైనారిటీలో ఉన్న యడియూరప్ప ప్రభుత్వ మనుగడకు, అనర్హత ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుకు 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. డిసెంబర్ 5న జరిగిన ఉప ఎన్నికల్లో.. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో 13 మంది బీజేపీ తరఫున బరిలో దిగారు. గతంలో ఈ 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. 12 స్థానాల్లో కాంగ్రెస్, 3 సీట్లలో జేడీఎస్ గెలుపొందాయి. కీలకంగా మారిన ఈ ఉప ఎన్నికల్లో 15 స్థానాలు కైవసం చేసుకుంటామని సీఎం యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల్లో 13 మంది అనర్హులు బీజేపీ తరఫున పోటీ చేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవులు ఇస్తామని సీఎం యడియూరప్ప ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం సొంతంగా మెజారిటీ సాధించాలంటే కనీసం 8 స్థానాల్లో గెలవాల్సి ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ అన్నిస్థానాల్లోను, జేడీఎస్ 12 చోట్ల పోటీలో ఉంది. డిసెంబరు 9న వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో.. బీజేపీ తరఫున పోటీ చేసిన 13 మంది అనర్హత ఎమ్మెల్యేల్లో 11 మంది విజయం సాధించారు. కాంగ్రెస్‌కు ఘోర పరాజయం చవిచూడగా.. బీజేపీ ఘన విజయం సాధించింది. ఎంటీబీ నాగరాజు, హెచ్.విశ్వనాథ్ బీజేపీ నుంచి పోటీచేసి ఓడిపోగా.. ఆర్.శంకర్‌కు టికెట్ దక్కలేదు. 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 సీట్లను కమలం పార్టీ గెల్చుకుని విజయఢంకా మోగించింది. రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో విజయంతో రాష్ట్రంలో యడియూరప్ప ప్రభుత్వం మెజారిటీ మార్క్‌ను (113) సునాయాసంగా అధిగమించి.. 117 స్ధానాలతో బలం సాధించి.. రాష్ట్రంలో సుస్థిర పాలన గమ్యం సుగమైంది. సీఎం యడియూరప్ప సొంత జిల్లా మాండ్యలో.. ఒక్కసారి కూడా సీటు గెలువని బీజేపీ ఉప ఎన్నికల ద్వారా తొలిసారి అసెంబ్లీ సీటును తన ఖాతాలో వేసుకుంది. ఒక్కలింగ సామాజిక వర్గానికి కంచుకోట లాంటి మాండ్య జిల్లాలో బీజేపీ గెలవడాన్ని బట్టి కాషాయ పార్టీ హవా సాగిన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు గుండూరావు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు: మోదీ
బర్హి/బొకారొ: ఉప ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు అద్భుత తీర్పునిచ్చారని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల్లో తామిచ్చిన తీర్పును అపహాస్యం చేసి, వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నికల్లో మంచి గుణపాఠం చెప్పారన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బర్హి, బొకారొల్లో జరిగిన బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించారు. ‘కర్ణాటక ఉప ఎన్నికలు మూడు విషయాలు చెబుతున్నాయి. ఒకటి, ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. రెండు, తమ తీర్పును అవమానించినవారికి గుణపాఠం చెప్పారు. మూడు, బీజేపీ ప్రజల కోసం పనిచేస్తుందని నమ్మారు’ అని అన్నారు. -
ఉప ఎన్నికల్లో బీజేపీ విజయభేరి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 సీట్లను కమలం పార్టీ గెల్చుకుంది. రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ రెబల్ విజయం సాధించారు. డిసెంబర్ 5న ఎన్నికలు జరగగా, ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఈ విజయంతో రాష్ట్రంలో యడియూరప్ప ప్రభుత్వం మెజారిటీ మార్క్‌ను సొంతంగా సాధించుకున్నట్లైంది. అసెంబ్లీలో మొత్తం 225 (ఒక నామినేటెడ్సహా) సీట్లు కాగా, రెండు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 223 స్థానాలకు 112 మెజారిటీ మార్క్. ప్రస్తుతం ఉన్న 105 స్థానాలకు తాజా విజయంతో మరో 12 సీట్లను బీజేపీ కలుపుకుంది. దాంతో, అసెంబ్లీలో బీజేపీ బలం 117కి చేరుకుని, మెజారి టీ మార్క్‌ను సునాయాసంగా దాటేసింది. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఘోర పరాజయాన్ని మిగిల్చాయి. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు గుండూరావు తమ పదవులకు రాజీనామా చేశారు. శివాజీనగర, హణసూరు నియోజకవర్గాల్లో మినహాయించి మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. శివాజీనగర్‌లో రిజ్వాన్ అర్షద్, హణసూరు లో మంజునాథ్‌లు గెల్చారు. హొసకోటలో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి శరత్ గెలుపొందారు. జేడీఎస్ అభ్యర్థులు పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఉప ఎన్నికలు జరిగిన ఈ 15 సీట్లలో 12 కాంగ్రెస్‌వే. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 15 సీట్లకు గానూ.. 12 స్థానాల్లో కాంగ్రెస్, 3 సీట్లలో జేడీఎస్ గెలుపొందాయి. ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఈ ఎన్నికల్లో మెజారిటీని ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు యడియూరప్ప కృతజ్ఞతలు తెలిపారు. మిగతా మూడున్నరేళ్లు సుస్థిర, ప్రగతిశీల పాలన అందిస్తానన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తానన్న హామీ విషయంలో వెనక్కు వెళ్లబోనన్నారు. ప్రస్తుతం, ముఖ్యమంత్రి సహా కేబినెట్లో 18 మంది మంత్రులున్నారు. మంత్రిమండలిలో మొత్తం 34 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది. వెన్నుపోటుదారులకు మద్దతిచ్చారు ఉప ఎన్నికల ఫలితాలపై బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ‘అభినందనలు కర్ణాటక. వెన్నుపోటు పొడిచే వ్యక్తులు మళ్లీ ముందుకు వచ్చారు. వారే మీకు తిరుగుబాణం అవుతారని ఆశిస్తున్నాను. అనర్హులకు మద్దతు ఇచ్చారు, మంచిది’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల గెలుపు కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, బీజేపీకి మద్దతివ్వడంతో, ఈ జూలై నెలలో జేడీఎస్ నేత కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ 17 మందిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. జూలై 29న యడియూరప్ప అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూనే, ఆ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే చాన్సిచ్చింది. మస్కి, ఆర్ఆర్ నగర్ స్థానాలకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఆ స్థానాలను మినహాయించి, 15 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్, జేడీఎస్‌లపై తిరుగుబాటు చేసి తమ పార్టీలో చేరి, అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో 13 మందిని బీజేపీ పోటీలో నిలపగా 11 మంది గెల్చారు. -
బీజేపీకి కర్ణాటక కిక్కు
ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతున్న కాంగ్రెస్‌కు సోమవారం వెలువడిన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లోనూ అదే పునరావృతం అయింది. ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో కేవలం రెండే దక్కడంతో ఈ పరాజయానికి నైతికబాధ్యత వహించి కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు రాజీనామా చేశారు. అంచనా లకు మించి 12 స్థానాలు గెల్చుకున్న బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. అభ్యర్థుల ఎంపికనూ, ప్రచార బాధ్యతల్ని తన భుజస్కంధాలపై వేసుకున్న ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికలు రాజకీయంగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. మహారాష్ట్రలో ఊహించనివిధంగా కూటమి భాగస్వామి శివసేన విప క్షాలతో చేతులు కలిపి తమకు అధికారం దక్కకుండా చేసింది. పైగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్‌లో ఇంకా మూడు దశలు పూర్తి కావలసి ఉంది. అక్కడ పాత మిత్రుల్ని వదిలించుకుని ఒంట రిగా బరిలోకి దిగాల్సివచ్చింది. ఇలాంటి సమయంలో అంచనాలను మించి ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీకి జవసత్వాలనిచ్చింది. కర్ణాటకలో నిరుడు మే నెలలో జరిగిన శాసనసభ ఎన్ని కల్లో ఈ 15 స్థానాల్లో పన్నెండింటిని కాంగ్రెస్ గెల్చుకోగా, మూడుచోట్ల జేడీఎస్ విజయం సాధిం చింది. వీరు, వీరితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరానికి ఫిరాయించడంతో 14 నెలల పాటు పాలించిన హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం మొన్న జూలైలో కుప్పకూలింది. మరో రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందువల్ల వాటికి ఉపఎన్నికలు జరగలేదు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో తమకు గరిష్టంగా 9 స్థానాలు రావొచ్చునని బీజేపీ అంచనా వేసుకుంది. కానీ ఫలితాలు దాని అంచనాలను మించాయి. పైగా జేడీఎస్‌కు కంచుకోట అయిన ఓల్డ్ మైసూరు ప్రాంతంలోని మాండ్యా జిల్లాలో తొలిసారి బీజేపీ విజ యకేతనం ఎగరేసింది. అక్కడ కృష్ణరాజపేటె స్థానం తన ఖాతాలో వేసుకుంది. జేడీఎస్‌కు దన్నుగా ఉండే వొక్కళిగ జనాభా అధికంగా ఉన్న స్థానమిది. 224మంది సభ్యులుండే కర్ణాటక శాసనసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస మెజారిటీ 113. ఇప్పటికే బీజేపీకి 105 స్థానా లుండగా, ఉప ఎన్నికల తర్వాత దాని బలం 117కి చేరుకుంది. ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటారని, అందువల్ల ఫిరాయింపుల కార ణంగా సభ్యత్వం కోల్పోయి, బరిలో నిలిచిన వారంతా ఓటమి పాలవుతారని రాజ్యాంగ నైతికతను కోరుకునే వారంతా ఆశించారు. ఈ ఫిరాయింపులతో అధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్, జేడీఎస్‌లు సైతం అలాగే కోరుకున్నాయి. జనమంతా ఫిరాయింపుదార్లకు గట్టిగా బుద్ధి చెబుతారని భావిం చాయి. అయితే ప్రజలు కేవలం ఫిరాయింపుల అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని భావించడం దురాశ. ఈ ఫిరాయింపుల కారణంగా పతనమైన కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అంతక్రితం 14 నెలలపాటు ఎలా పాలించిందో కూడా వారు అంచనా వేసుకున్నారు. ఆ 14 నెలలూ రెండు పార్టీలూ పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడమే సరిపోయింది. రెండు మూడు సందర్భాల్లో అప్పటి సీఎం కుమారస్వామి కంటతడి పెట్టారు. ఏం చేద్దామనుకున్నా తనకు అడ్డంకులు ఎదురవు తున్నాయని ఆయన వాపోయారు. కేవలం బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసం కలవడం తప్ప రాజకీయంగా ఆ రెండు పార్టీలూ ఒక ఉమ్మడి ఎజెండా రూపొందించుకోలేక పోయాయి. వరస వివాదాల్లో ఆ పార్టీలు తలమునకలై ఉండగా ఉపాధి లేమి, కరువుకాటకాలు రాష్ట్రాన్ని పీల్చిపిప్పి చేశాయి. వీటన్నిటినీ ప్రజలు మరిచిపోలేదు. కనుకనే ఫిరాయింపుదార్ల అనైతిక రాజకీయాల గురించి ఎంత ప్రచారం చేసినా వారు పట్టించుకోలేదు. బీజేపీ ప్రచారం చేసిన సుస్థిర పాలన, అభివృద్ధికే వారు ఓటేశారు. ఉదాహరణకు కృష్ణరాజపేటె స్థానం నుంచి నిరుడు తమ పార్టీ అభ్యర్థిగా గెలిచి బీజేపీకి ఫిరాయించిన నారాయణగౌడపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గట్టిగా ప్రచారం చేశారు. రాజకీయంగా తమ గొంతు కోసిన ఆయనను చిత్తుగా ఓడించాలని ఎంతో ఉద్వేగంతో పిలుపునిచ్చారు. కానీ జనం నారాయణగౌడకే పట్టంగట్టారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెల్గాం జిల్లాలో గెలుపుపై బీజేపీ నేతల్లోనే అనుమానాలున్నాయి. పొరుగు రాష్ట్రంలోని పరిణామాలు ఈ ఉప ఎన్నికలపై ప్రభావాన్ని చూపుతాయని వారు భావించారు. కానీ అక్కడ కూడా విజయం సాధించడం వారిని ఉత్సాహపరిచింది. ఈ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి యడియూరప్పకు రాజకీయంగా ఊపిరిపోశాయి. నిజానికి ఆయన ఒకరకంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నారు. 75 ఏళ్లు దాటిన నేతలు ముఖ్య పదవుల నుంచి వైదొలగాలన్న సూత్రానికి విరుద్ధంగా బీజేపీ ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టక తప్ప లేదు. ఫిరాయింపుదార్లందరికీ టికెట్లివ్వడానికి అధిష్టానం సుముఖంగా లేదన్న వార్తలొచ్చాయి. కానీ యడియూరప్ప పట్టుబట్టి పార్టీ టిక్కెట్లు వచ్చేలా చేశారు. పైగా గెలిస్తే వీరికి మంత్రి పదవులు ఇస్తామని కూడా ప్రచారసభల్లో చెప్పారు. అది ఎంతవరకూ సాధ్యమో చూడాల్సివుంది. పార్టీ కేంద్ర నాయకులెవ్వరూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో మాత్రమే కాదు... దేశంలో కూడా పార్టీ ప్రతిష్టను యడియూరప్ప పెంచగలి గారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను మరింత కుంగదీసే ప్రమాదం ఉంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిస్తేజంగా ఉండటం, రాష్ట్రంలో పార్టీ సారథులు రాజీనామాలు చేయడం నైతికంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుంగదీస్తుంది. రాజకీయంగా తమ భవిష్యత్తేమిటన్న గాభరా కలిగిస్తుంది. ఇప్పుడు సుస్థిర మెజారిటీ లభించింది గనుక బీజేపీ ప్రభుత్వం ఇక పాలనపై దృష్టి పెట్టాలి. ఆంతరంగిక కలహాల్లో తలమునకలైతే ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్‌లకు ఎదురైన చేదు అనుభవమే మున్ముందు బీజేపీకి కూడా తప్పకపోవచ్చు. -
ఉప ఎన్నికల ఫలితాలు: బీజేపీ హవా
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల జరిగిన 15 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ హవా కొనసాగింది. ఊహించినట్లుగానే బీజేపీ దూసుకుపోయింది. 15 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా, 12 సీట్లను కాషాయ పార్టీ కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం ఇక శాశ్వతంగా సమసిపోయినట్లే. అసెంబ్లీలో ప్రస్తుతం మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప సర్కార్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మంచి జోష్‌ను నింపింది. యడ్డీ సర్కార్ మ్యాజిక్ ఫిగర్ కంటే ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలుపొందటంతో ఆ సంఖ్య 117కి చేరింది. దీంతో ఉత్కంఠ భరిత స్థితిలో ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న బీఎస్ యడియూరప్ప సేఫ్ జోన్లో ఉన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊరటను కలిగించాయి. కన్నడలో ఇక తమకు తిరుగులేదని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. కన్నడ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఇక కాలం చెల్లినట్టే అని ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సంభరాలు కూడా ప్రారంభించారు. ఇక యడియూరప్ప సర్కార్‌ను మరోసారి కూల్చాలని కలలుకన్న జేడీఎస్, కాంగ్రెస్‌లకు ఉప ఎన్నికల్లో చేదు పలితాలే ఎదురయ్యాయి. ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మరింత నిరాశను మిగిల్చాయి. 15 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. -
‘ఉప’ ఫలితాలు : వారందరికీ మంత్రివర్గంలో స్థానం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికల్లో యడియూరప్ప ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకుంది. తాజా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుభిని మోగించింది. 15 అసెంబ్లీ స్థానాలకు గాను 6 చోట్ల విజయం సాధించి, మరో 6 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతుంది. దీంతో కర్ణాటకలో స్థిరమైన బీజేపీ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. కాగా, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లతో సరిపెట్టుకుంది. ఇక జేడీఎస్ ఖాతా కూడా తెరవలేదు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీ.. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. మిగత 6 స్థానాల్లో కూడా బీజేపీ గెలుపు దాదాపు ఖరారయినట్లే. ఎన్నికల్లో గెలిచిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం యడియూరప్ప ప్రకటించారు. కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి చెందిన 17మంది తిరుగుబాటు చేయడంతో కర్ణాకటలోని కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. తర్వాత అప్పటి స్పీకర్ 17మందిపై అనర్హత వేటు వేసింది. తర్వాత బలపరీక్షలో బీజేపీ నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతతో కర్ణాటకలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యేల అనర్హతతో 17 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, హైకోర్టు కేసు కారణంగా రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో డిసెంబర్ 5న 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు మొత్తం 15 స్థానాల్లో, జేడీఎస్ 12 చోట్ల బరిలోకి దిగాయి. ♦ ఎమ్మెల్యేలుగా గెలిచిన 12 మంది సభ్యులకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని కర్ణాటక మంత్రి అశోక్ అన్నారు. బీజేపీ కచ్చితంగా 12 స్థానాల్లో గెలుస్తుంది. వారందరికి సీఎం యడియురప్ప సముచిత స్థానం కల్పిస్తారా ఆశాభావం వ్యక్తం చేశారు. బోణీ కొట్టిన బీజేపీ ఉప ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. యల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హెబ్బర్ శివరామ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తొలి విజయంతో సాధించడం పట్ల శివరాం సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా శివరాం మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరో 11 నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్‌లో ఉంది. ఓటమిని అంగీకరించిన డీకే ఉప ఎన్నికల ఫలితాలను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ స్వాగతించారు. ప్రజా తీర్పును గౌరవించి ఓటమిని అంగీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఫిరాయింపుదారులను అంగీరించారని, అందుకే వారిని గెలిపించారని తెలిపారు. ఈ ఫలితాలతో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక తమ ప్రభుత్వానికి ఢోకా లేదంటూ పటాసులు పేల్చుతున్నారు. కాగా, ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మరింత నిరాశను మిగిల్చేలా ఉన్నాయి. ♦ బీజేపీ అత్యధిక స్థానాల్లో లీడ్‌లో ఉండటం పట్ల సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర హర్షం వక్తం చేశారు. తన తండ్రి, సీఎం యడియూరప్ప దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప కుమారుడికి మిఠాయి తినిపించారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఉప ఎన్నికల్లో కనీసం ఆరు స్థానాల్లో గెలుపొందినా ఆ సంఖ్య 111కి చేరుతుంది. దీంతో ఉత్కంఠ భరిత స్థితిలో ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న బీఎస్ యడియురప్ప సీటుకు వచ్చిన ఢోకా ఏం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊరటను కలిగిస్తున్నాయి. -
యడియూరప్ప ప్రభుత్వానికి విషమ పరీక్ష
నాలుగు నెలల యడియూరప్ప ప్రభుత్వానికి మరో అగ్నిపరీక్ష. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం మనుగడ సాగించాలా, వద్దా? అన్నదానిపై ఓటరు దేవుళ్లు నేడు తీర్పు ఇవ్వబోతున్నారు. బెంగళూరు, బెళగావి ప్రాంతాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉప ఎన్నికల జ్వరం ఆవహించింది. గెలుపోటములపై బెట్టింగ్‌లు తారస్థాయికి చేరాయి. సుమారు రెండువారాల నుంచి ప్రచారంలో నిమగ్నమైన అగ్రనేతలు 9వ తేదీ వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ రోజున వెలువడే ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను మార్చబోతున్నాయి. సాక్షి, బెంగళూరు: 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు పార్టీల భవితవ్యం ఇమిడి ఉంది. యడియూరప్ప సర్కారు మనుగడను తేల్చే ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మినీ అసెంబ్లీ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలుగా పేరుపొందిన ఈ సమరంలో మూడు ప్రధాన రాజకీయ పారీ్టల నుంచి సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. ఒకేసారి 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగడం కూడా రికార్డే. మొత్తం 165 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. కాగా శివాజీనగర నుంచి అత్యధికంగా 19 మంది పోటీ చేస్తుండగా, కృష్ణరాజపేటె, యల్లాపుర నుంచి అత్యల్పంగా ఏడుగురు చొప్పున బరిలో ఉన్నారు. ఓటరు కార్డు లేదా ఆధార్, రేషన్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు, పాన్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు తదితర 11 రకాల కార్డుల్లో ఏదైనా తీసుకుని వెళ్లి ఓటు వేయవచ్చు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం యడియూరప్ప సూచించారు. బుధవారం ఉదయం ఆయన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ బాగానే జరుగుతుందని అన్ని పార్టీలు ఆశాభావంతో ఉన్నాయి. నిర్భయంగా ఓటేయండి : సీఎం సూచన సాక్షి బెంగళూరు: నేడు గురువారం జరిగే ఉప ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లందరు నిర్భయంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సూచించారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేయాలని తెలిపారు. వానాగాలీ, చలి ఉన్నా పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. సుమారు 85 శాతం పోలింగ్ నమోదు దాటితే ప్రజాస్వామ్యానికి బలమని బుధవారం సాయంత్రం అన్నారు. -
దేవెగౌడ మనవడిపై హత్యాయత్నం కేసు
బెంగళూరు: కర్ణాటకలో గురువారం 15 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో జేడీఎస్‌కు షాక్ తగిలింది. నలుగురు బీజేపీ కార్యకర్తల మీద హత్యాయత్నం చేశారంటూ మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్నపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్ జిల్లాలోని చన్నరాయపట్న పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. జేడీఎస్ నుంచి బీజేపీలోకి మారిన కార్యకర్తల ఇళ్లపై దాదాపు 150–200 మంది వచ్చి దాడి చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని బీజేపీ ఆరోపించింది. గాయపడిన తమ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. సరైన సమయానికి పోలీసులు రాకపోయి ఉంటే పరిస్థితి మరింత చేజారేదని అన్నారు. దీంతో సూరజ్ సహా ఆరు మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఆరోపణలను జేడీఎస్ ఖండించింది. -
..అందుకే ఫడ్నవీస్‌ను సీఎం చేశాం!
బెంగళూరు: ‘రూ. 40 వేల కోట్ల నిధులను కాపాడేందుకే మహారాష్ట్రలో హుటాహుటిన ఫడ్నవీస్‌ను సీఎం చేశాం’ అంటూ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఫడ్నవీస్ ఖండించారు. హెగ్డే వ్యాఖ్యల్లో వాస్తవం ఉంటే ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ, ఇది మహారాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనని శివసేన మండిపడ్డాయి. కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం అనంత్ కుమార్ హెగ్డే పై వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీకి మెజారిటీ లేకపోయినా, మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ను ఎందుకు సీఎం చేశారన్న ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. అదంతా ముందుగా అనుకున్న ప్రణాళికే. మహారాష్ట్రలో సీఎం నియంత్రణలో రూ. 40 వేల కోట్లు ఉన్నాయి. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ నిధులు దుర్వినియోగమవుతాయి. ఆ నిధులను కాపాడటం కోసమే హుటాహుటిన ఫడ్నవీస్‌ను సీఎం చేశాం.. వాటిని అభివృద్ధి పనులకు కేటాయించడం కోసమే ఆ డ్రామా ఆడాం. ఫడ్నవీస్ సీఎం అయిన 15 గంటల్లోనే ఆ నిధులను ఎక్కడికి పంపాలో అక్కడికి పంపి, వాటిని కాపాడారు. ఆ నిధులను కేంద్రానికి తిరిగి పంపించనట్లయితే.. అవి శివసేన కూటమి సీఎం చేతిలో పడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు’ అంటూ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ మద్దతుతో నవంబర్ 23న ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం, ఆ తరువాత మెజారిటీ నిరూపించుకోలేని పరిస్థితుల్లో 80 గంటల్లోపే రాజీనామా చేయడం తెలిసిందే. అదంతా అబద్ధం: ఫడ్నవీస్ హెగ్డే వ్యాఖ్యలను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అబద్ధాలంటూ ఖండించారు. తాను సీఎంగా ఉన్న ఆ మూడు రోజుల్లో ఎలాంటి నిధుల గురించి కేంద్రం అడగలేదని, తాము కూడా కేంద్రానికి నిధులను పంపించలేదని సోమవారం స్పష్టం చేశారు. ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ కంపెనీ చేపట్టింది. వారికి భూ సేకరణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం మమ్మల్ని నిధులు అడగలేదు. మేం పంపించలేదు. ఏ ప్రాజెక్టు నుంచి కూడా మహారాష్ట్రకు చెందిన ఒక్క రూపాయిని కూడా కేంద్రానికి పంపించలేదు’ అని ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు. -
ఉపఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం బిజీబిజీ
సాక్షి, బెంగళూరు: మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన కాంగ్రెస్– జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ తరఫున ఉప ఎన్నికలు బరిలో ఉండటంతో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అనర్హత ఎమ్మెల్యేల గెలుపుతో పాటు ప్రభుత్వ మనుగడకు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సీఎం బెంగళూరులోని యశవంతపున నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎస్టీ సోమశేఖర్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతిపక్షాల ప్రచారం అనర్హత ఎమ్మెల్యేలను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, జేడీఎస్ శ్రమిస్తున్నాయి. సీఎల్పీ నేత సిద్ధరామయ్య బెళగావి జిల్లా కాగవాడలో కాంగ్రెస్ అభ్యర్థి రాజుకాగె తరఫున ప్రచారం చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కాగవాడలో జేడీఎస్ అభ్యర్థి శ్రీశైలతుగశెట్టికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ చిక్క బళ్లాపురలో ప్రచారం నిర్వహించారు. ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం శనివారం చిక్కబళ్లాపురలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఆయనను చూడడానికి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో సందడి నెలకొంది. మాటల యుద్ధం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరొకరు మాటల దాడికి దిగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతలు.. తప్పు మీదంటే మీదని ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ – జేడీఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఉప ఎన్నికల్లో భాగంగా బహిరంగ ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు అనుచరులతో ముమ్మర సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరికొందరు మఠాలు, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని భారీ కసరత్తు చేస్తున్నారు. సీఎం యడియూరప్ప అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి వరాల హామీలు గుప్పిస్తున్నారు. హైఓల్టేజీ స్థానాలపై బెట్టింగ్? ఉప ఎన్నికలు జరిగే హొసకోటె, హుణసూరు, కృష్ణరాజపేటె, గోకాక్, యశవంతపుర, విజయనగర నియోజకవర్గాల్లో భారీ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఏ పార్టీ ఎక్కువ స్థానా ల్లో విజయం సాధిస్తుందనే దానిపై కూడా బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ – బీజేపీ మధ్య పోటీ ఉందని.. ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్– జేడీఎస్ మధ్యనే పోటీ ఉందని బెట్టింగ్ కాస్తున్నారు. చిక్కబళ్లాపుర, గోకాక్, శివాజీనగర స్థానా లపై కూడా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. -
15 సీట్లకు 248 మంది పోటీ
సాక్షి, బొమ్మనహళ్లి: ఉప సమరంలో అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. రాష్ట్రంలో 15 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరుగనుండగా మొత్తం 248 మంది అభ్యర్థులు 353 నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారంతో నామినేషన్ల పర్వం సమాప్తమైంది. ఇందులో అత్యధికంగా బెంగళూరు నగరంలోని శివాజీనగరలో 36 నామినేషన్లు, హొసకోటె నుంచి 32 నామినేషన్లు, హుణసూరు నుంచి 31 నామినేషన్లు వేశారు. ఏ నియోజకవర్గంలో ఎంతమంది? ► బీజేపీ, కాంగ్రెస్ తదితర జాతీయ పార్టీల నుంచి 56 మంది అభ్యర్థులు 112 నామినేషన్లు సమర్పించారు. ► రాష్ట్ర పార్టీలకు చెందిన 17 మంది అభ్యర్థులు 29 నామినేషన్లు ఇచ్చారు. ► నమోదు కాని పార్టీల నుంచి 47 మంది అభ్యర్థులు 56 నామినేషన్లు వేశారు. ► 128 మంది స్వతంత్రులు 156 నామినేషన్లు అందజేశారు. ► శివాజీనగర నుంచి 28 మంది బరిలో ఉండగా హొసకోటె నుంచి 27 మంది పోటీలో ఉన్నారు. ► హుణసూరు నుంచి 21 మంది, అథణిలో 16, కాగవాడలో 18 మంది, గోకాక్‌లో 13 మంది, యల్లాపురలో 11 మంది, హిరేకరూరులో 14 మంది, రాణి బెన్నూరులో 14 మంది, హొసపేటలో 18 మంది, ► చిక్కబళ్ళాపురలో 15 మంది, కృష్ణరాజపురంలో 16 మంది, యశవంతపురలో 12 మంది, మహాలక్ష్మి లేఔట్లో 17 మంది, కెఆర్ పేట నుంచి 8 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. -
అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లు
శివమొగ్గ : ఒకవైపు అనర్హత, మరోవైపు కోర్టులో విచారణతో తమ రాజకీయ భవితవ్యం ఏమవుతుందోనని మథనపడుతున్న అనర్హత ఎమ్మెల్యేలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అభయమిచ్చారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని యడియూరప్ప తెలిపారు. సోమవారం జిల్లాలోని శికారిపుర పట్టణంలో నిర్వహించిన జనతాదర్శన్ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమై ఉపఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా అందుకు అంగీకరించారని చెప్పారు. అనర్హత ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరు ఇంచార్జ్‌లను నియమించి అనర్హత ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడాలి అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని ఉపఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలను గెలిపించడానికి సహకరించాలని సూచించారు. పారీ్టలోని కీలకనేతలకు సముచిత స్థానం కలి్ప స్తామని ఇదే విషయంపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన నేతలకు నిగమ మండళి స్థానాలు కట్టబెడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే కరెక్టా? ఈవీఎంల ట్యాంపరింగ్ అవుతాయేమోనని మాజీ సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేయడాన్ని యడియూరప్ప తప్పుపట్టారు. కాంగ్రెస్ గెలిస్తే సరిగ్గా పనిచేసే ఈవీఎంలు బీజేపీ గెలిచినపుడు మాత్రం ఎలా ట్యాంపరింగ్ అవుతాయో సిద్దరామయ్యే చెప్పాలని కోరారు. అనర్హత ఎమ్మెల్యేల విషయంలో ఇక ఎవరిదారి వారిదే అని ఉమేశ్ కత్తి చేసిన వ్యాఖ్యలపై త్వరలోనే ఆయన భేటీ అయి చర్చిస్తానని చెప్పారు. చకచకా శివమొగ్గ ఎయిర్‌పోర్టు శివమొగ్గ నగర శివార్లలోని సోనగానహళ్లిలో నిలిచిపోయిన విమానాశ్రయ నిర్మాణ పనులను పునఃప్రారంభిస్తామంటూ సీఎం తెలిపారు. అతి త్వరలో విమానాశ్రయ పనులను పునఃప్రారంభించనున్నామని అందుకోసం రూ.45 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. పదినెలల్లో విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని విమానాశ్రయంతో పాటు జిల్లా యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు స్థాపనపై కూడా దృష్టి సారించామన్నారు. -
కర్ణాటకలో బీజేపీకి నిరాశ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు బీజేపీకి నిరాశను మిగిల్చాయి. మొత్తం ఐదు స్థానాల్లో ఒక్కచోట మాత్రమే బీజేపీ గెలవగా, మిగిలిన నాలుగు స్థానాల్లోనూ కాంగ్రెస్–జేడీఎస్ కూటమి విజయం సాధించింది. 15 ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బళ్లారి లోక్‌సభ స్థానంలో ఈసారి కాంగ్రెస్ ఏకంగా 2.43 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. అటు కలహాలు, విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ఈ ఉప ఎన్నికల్లో విజయంతో కొత్త ఉత్సాహం లభించింది. ఫలితాలు వెలువడిన అనంతరం బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప మాట్లాడుతూ డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టడం ద్వారానే కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఉప ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపించారు. ఈ ఏడాది మేలో మొత్తం 224 స్థానాలకు శాసనసభ ఎన్నికలు జరగ్గా బీజేపీకి సంపూర్ణ ఆధిక్యం రానప్పటికీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప నాటకీయ పరిణామాల మధ్య సీఎంగా ప్రమాణం చేసి రెండ్రోజుల్లోనే పదవి కోల్పోవడం, జేడీఎస్–కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం తెలిసిందే. తాజా ఉప ఎన్నికల ఫలితాల అనంతరం అసెంబ్లీలో జేడీఎస్–కాంగ్రెస్ కూటమి బలం 120కి చేరగా, బీజేపీకి 104 మంది సభ్యులున్నారు. శివమొగ్గ స్థానాన్ని నిలుపుకున్న బీజేపీ యడ్యూరప్ప శివమొగ్గ నుంచి, మరో బీజేపీ నేత శ్రీరాములు బళ్లారి నుంచి, జేడీఎస్‌కు చెందిన సీఎస్ పుట్టరాజు మండ్య నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారు. మేలో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ వీరు పోటీచేసి గెలిచి లోక్‌సభకు రాజీనామా చేయడంతో తాజా ఉప ఎన్నికలు జరిగాయి. అటు సీఎం కుమారస్వామి మేలో రామనగర, చెన్నపట్న అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. అనంతరం రామ నగర స్థానానికి ఆయన రాజీనామా చేశారు. ఇక జాంఖండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్ నేత సిద్దూ న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో మొత్తం ఐదు స్థానాలకు గాను శివమొగ్గలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. యడ్యూరప్ప కొడుకు బీవై రాఘవేంద్ర జేడీఎస్ అభ్యర్థి మధు బంగారప్పపై 52 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మండ్యలో జేడీఎస్ నేత శివరామె గౌడ బీజేపీ అభ్యర్థి సిద్ధరామయ్యపై 3.24 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేశారు. ఇక రామనగర అసెంబ్లీ స్థానంలో కుమార స్వామి భార్య అనిత 1.09 లక్షల ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి చంద్రశేఖర్‌పై గెలుపొందారు. వాస్తవానికి కాంగ్రెస్‌కు చెందిన చంద్రశేఖర్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి, నామినేషన్ వేసిన అనంతరం ఆ పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదంటూ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు. అయితే అప్పటికే నామినేషన్ వేసినందున బీజేపీ తరఫున ఆయన పోటీలో ఉన్నట్లుగానే భావించారు. అటు జాంఖండి అసెంబ్లీ నియోజకవర్గంలో సిద్ధూ న్యామగౌడ కొడుకు ఆనంద్ న్యామగౌడ 39,480 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ కులకర్ణిని ఓడించారు. సతీసమేతంగా అసెంబ్లీకి సీఎం సీఎం కుమారస్వామి భార్య అనిత రామనగర స్థానం నుంచి ఉప ఎన్నికలో విజయం సాధించడంతో కర్ణాటక అసెంబ్లీలో కొత్త రికార్డు నమోదైంది. కుమారస్వామి ప్రస్తుతం చెన్నపట్న నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో కర్ణాటక శాసనసభలో సీఎం, ఆయన భార్య ఏకకాలంలో సభ్యులుగా ఉండటం ఇదే తొలిసారి కానుంది. బీజేపీ చేజారిన బళ్లారి బళ్లారి లోక్‌సభ స్థానంలో 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంది. గనుల వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి సోదరుల అండతో 2004 నుంచి బళ్లారిలో బీజేపీయే గెలుస్తోంది. తాజా ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి, శ్రీరాములు సోదరి జె.శాంతపై కాంగ్రెస్ నేత వీఎస్ ఉగ్రప్ప 2.43 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. ఎన్నికల్లో బీజేపీ గాలి సోదరులను పక్కనబెట్టగా ఉపఎన్నిక కోసం తుమకూరు జిల్లా పావగడకు చెందిన వాల్మీకి వర్గానికి చెందిన ఉగ్రప్పను కాంగ్రెస్ పోటీలో నిలిపింది. ఈయన తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు. బళ్లారిలో కన్నడ కన్నా తెలుగు వారే అధికం. కుల సమీకరణాలతోపాటు భాషా కారణాల వల్లే ఉగ్రప్ప భారీ విజయం సాధించారని విశ్లేషకులు అంటున్నారు. -
కర్ణాటక ఉప ఎన్నికలు: బీజేపీకి బిగ్ షాక్!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలు, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలకు నేడు (మంగళవారం) ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ స్థానాలకు గత శనివారం ఉప ఎన్నిక నిర్వహించారు. మొత్తం ఐదు స్థానాల్లో నాలుగింట కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి విజయం సాధించింది. మండ్య లోక్ సభ స్థానాన్ని జేడీఎస్ కైవసం చేసుకుంది. జేడీఎస్ అభ్యర్థి 324943 భారీ ఆధిక్యంతో గెలుపొందారు. రామ్ నగర్ అసెంబ్లీ స్థానంలో కుమార స్వామి భార్య అనిత 109137 మెజారిటీతో విజయం సాధించారు. జామ్‌ఖండి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత ఆనంద్ సిద్ధు గెలిచారు. ఇక బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. శివమొగ్గలో భాజాపా విజయం ఐదు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక స్థానం మాత్రమే గెలిచుకుంది. శివమొగ్గ ఎంపీగా ఉన్న మాజీ సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగారు. జేడీఎస్ నుంచి మాజీ సీఎం బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేశారు. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర 52148 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. -
విజయం మాదే : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బళ్లారి, శివమొగ్గ, మండ్య లోక్‌సభ స్థానాలలో పోలింగ్ కొనసాగుతోంది. రామనగరం, జమ్ఖండి అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. బీజేపీదే విజయం : యడ్యూరప్ప ఉపఎన్నికల్లో తన కూమారుడు బీఎస్ రాఘవేంద్ర భారీ విజయం సాధిస్తాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. 101 శాతం శివమొగ్గ నుంచి రాఘవేంద్ర విజయం తథ్యమన్నారు. బళ్లారిలో భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. అందరి దృష్టి బళ్లారిపైనే ఐదు స్థానాల కంటే బళ్లారి లోక్‌సభ ఉపఎన్నికపైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ నువ్వా..నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్పకు మద్దతుగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న జే. శాంతకు మద్దతుగా ఆయన సోదరుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు బీ. శ్రీరాములు జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేశారు. రెండూ పార్టీలు ఇక్కడ తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
ఐదు నెలల కోసం ఎన్నికలా?
బెంగళూరు: కర్ణాటకలోని మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై ప్రధాన పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని శివమొగ్గ, బళ్లారి, మాండ్య లోక్‌సభ స్థానాలతోపాటు రామనగర, జంఖాడి అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ కాలపరిమితి మరో నాలుగున్నరేళ్లు ఉన్నందున, ఉప ఎన్నికలు జరపడం సబబే. అయితే, వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ప్రస్తుతం ఉప ఎన్నిక అవసరమేముంది?’ అని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
డబ్బులు పంచుతూ కెమెరాకు దొరికిపోయారు!
-
డబ్బులు పంచుతూ కెమెరాకు దొరికిపోయారు!
కర్ణాటకలో ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నికల్లో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్ష బీజేపీ జోరుగా ప్రలోభాలకు తెరతీశాయి. నంజన్‌గుడ, గుండ్లుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకోవడంతో.. ఇక్కడ డబ్బులు ఏరులై పారుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప ఓటర్లకు డబ్బులు ఇస్తూ కెమెరా కంటికి దొరికిపోయారు. చామ్రాజ్ నగర్ జిల్లాలో ఓ కుటుంబానికి ఆయన డబ్బులు ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోపై ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుండగా.. యడ్యూరప్ప మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబానికి తాను మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం చేశానని, ఇంటి పెద్ద అయిన రైతు చనిపోవడంతో ఆ కుటుంబం దీనస్థితిని గమనించి.. పార్టీ ఫండ్ నుంచి వారికి సాయం చేశామని ఆయన ‘ఇండియా టుడే’తో చెప్పారు. అంతకుముందే కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో డబ్బులతో తిరుగుతున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. కర్ణాటక కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి హెబల్కర్ రూ. 2వేల నోట్లను చేతిలో పట్టుకొని ప్రచారం నిర్వహిస్తున్న వీడియో దుమారం రేపింది. ఈ వీడియోల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. BJP Karnataka chief B S Yeddyurappa gives money to family of deceased farmer.Congress alleges violation of model code(bypolls) (7.4.17) pic.twitter.com/OhaI7MJnUj — ANI (@ANI_news) 8 April 2017