డబ్బులు పంచుతూ కెమెరాకు దొరికిపోయారు!
కర్ణాటకలో ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నికల్లో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్ష బీజేపీ జోరుగా ప్రలోభాలకు తెరతీశాయి. నంజన్‌గుడ, గుండ్లుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకోవడంతో.. ఇక్కడ డబ్బులు ఏరులై పారుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప ఓటర్లకు డబ్బులు ఇస్తూ కెమెరా కంటికి దొరికిపోయారు. చామ్‌రాజ్ నగర్ జిల్లాలో ఓ కుటుంబానికి ఆయన డబ్బులు ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుండగా.. యడ్యూరప్ప మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబానికి తాను మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం చేశానని, ఇంటి పెద్ద అయిన రైతు చనిపోవడంతో ఆ కుటుంబం దీనస్థితిని గమనించి.. పార్టీ ఫండ్ నుంచి వారికి సాయం చేశామని ఆయన ‘ఇండియా టుడే’తో చెప్పారు. అంతకుముందే కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో డబ్బులతో తిరుగుతున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. కర్ణాటక కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి హెబల్కర్ రూ. 2వేల నోట్లను చేతిలో పట్టుకొని ప్రచారం నిర్వహిస్తున్న వీడియో దుమారం రేపింది. ఈ వీడియోల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
BJP Karnataka chief B S Yeddyurappa gives money to family of deceased farmer.Congress alleges violation of model code(bypolls) (7.4.17) pic.twitter.com/OhaI7MJnUj
— ANI (@ANI_news) 8 April 2017