కమలం కరువు భేరి
► తుమకూరులో శ్రీకారం
► హాజరైన కేంద్రమంత్రులు
►పార్టీలో విభేదాల్లేవు: యడ్డి
తుమకూరు: తమ మధ్య ఎటువంటి విభేదాలు, అంతర్గత కలహాలు లేవు, పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో మేమంతా కలిసే పాల్గొంటున్నాం, రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందంటూ వచ్చిన వార్తలు కేవలం మీడియా సృష్టేనని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మురళీధర్‌రావు, ఇతర సీనియర్ నాయకులు 40 రోజుల రాష్ట్రవ్యాప్త కరువు పర్యటనను గురువారం తుమకూరులో ఆరంభించారు. తుమకూరు సిద్ధగంగా మఠాధీశుడు శివకుమార్‌స్వామీజీ దర్శనం చేసుకున్నారు.
అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 రోజుల పాటు అన్ని జిల్లాలు, తాలూకాల్లో పర్యటించి కరువుపై సమాచారాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. నిత్యం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కరువు అధ్యయన పర్యటన సాగుతుందని చెప్పారు. పార్టీలో ఎలాంటి అనైక్యత లేదని తేల్చిచెప్పారు.
త్వరలో సిద్ధగంగ మఠానికి ప్రధాని మోదీ
కేంద్రమంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ.. ఇటీవల అనారోగ్యానికి గురైన శివకుమార్‌స్వామీజీ ఆరోగ్యంపై విచారించిన ప్రధాని నరేంద్రమోదీ త్వరలోనే మఠానికి వచ్చి స్వామీజీని దర్శించుకుంటారని తెలిపారు. రాష్ట్ర కరువు నివారణ అధ్యయన పర్యటనను స్వామీజీ ఆశీర్వాదంతో తుమకూరు జిల్లా నుంచి ప్రారంభించడం సంతోషకరమన్నారు. అనంతరం తుమకూరు నగరంలోని దళితవాడలో కరువు నివారణ, తాగునీరు తదితర సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రమేశ్ జిగజణగి, నేతలు జగదీశ్ శెట్టర్, ఈశ్వరప్ప, శోభ, శ్రీరాములు పాల్గొన్నారు.