సిద్ధుకు కౌంట్‌డౌన్ మొదలైంది
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప జోస్యం
బెంగళూరు: రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో అక్రమాలకు అంతులేకుండా పోతోందని, ఈక్రమంలో సీఎం సిద్ధరామయ్యకు కౌంట్‌డౌన్ మొదలైందని, ఎప్పుడైనా ఆ పదవి నుంచి దిగిపోవచ్చని బీజేపీ కర్ణాటకశాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప పేర్కొన్నారు. బెంగళూరులోని తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన శుక్రవారం మాట్లాడారు. అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్రాన్ని పాలిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన మూడేళ్లలో వేల కోట్ల రుపాయల విలువ చేసే కుంభకోణాలకు పాల్పడ్డారని యడ్యూరప్ప ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్టోరియా ఆస్పత్రిలో సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య డెరైక్టర్‌గా ఉన్న మ్యాట్రిక్స్ ఇమేజింగ్ సొల్యూషన్ సంస్థకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి అవకాశం కల్పించడం, బీడీఏ సంస్థ నుంచి శాంతా ఇండస్ట్రీస్ సంస్థకు రూ. వందల కోట్ల విలువ చేసే భూమిని కేటాయించడం ఉదాహరణలు మాత్రమేనన్నారు.
సిద్ధరామయ్య ఇలాంటి అక్రమాలెన్నింటికో పాల్పడ్డారని, ఆయన త్వరలోనే తన పదవిని కోల్పోనున్నారని తెలిపారు. ప్రచారం కోసం మాత్రమే సిద్ధరామయ్య కరువు పర్యటనకు వెలుతున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా రూ.1.16 కోట్ల విలువ చేసే కారును యడ్యూరప్పకు మాజీ మంత్రి, బీజేపీ నేత మురుగేష్ నిరాణి అందజేశారు. ఈ కారులోనే యూడ్యూరప్ప రాష్ట్ర పర్యటన చేయనున్నారు. ఈ విధంగా తమ పార్టీకు చెందిన ఓ నాయకుడు ఖరీదైన కారును తనకు అందజేయడం తప్పు కాదని యడ్యూరప్ప పేర్కొన్నారు.