సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారని, త్వరలో జరిగే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గె లుపొంది అధికారంలో వస్తామని అన్నారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేల చేరిక సందర్భంగా యడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఎన్నికల్లోపు మరింతమంది బీ జేపీలోకి వలస వస్తారని చెప్పారు. త్వరలో ఎన్నికలు ఉన్నం దున పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం చట్టవిరుద్ధమని యడ్డి అన్నారు. మూడు నెలలకు గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని సూచించారు. గత బడ్జెట్‌లో కనీసం 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. ఎన్నికల ముందు ఈ మూడు నెలల్లో ఏకంగా రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
జేడీఎస్‌లో మాకు ప్రాధాన్యం లేదనే రాజీనామా
శాసనసభ స్పీకర్ కేబీ కోళివాడ్ అందుబాటులో లేకపోవడంతో గురువారం శాసనసభ కార్యదర్శి ఎస్.మూర్తికి జేడీఎస్ ఎమ్మెల్యేలు వజ్జల్, పాటిల్ తమ రాజీనామా లేఖలను అందజేశారు. గడిచిన ఏడాది కాలంగా జేడీఎస్ అధినాయకత్వం తమను పక్కన పెట్టిందని వారిద్దరూ ఆరోపించారు. చాలా కార్యక్రమాల్లో తమ ఇద్దరికీ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాము జేడీఎస్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు.
రాజీనామా పత్రాలపై హైడ్రామా
రాజీనామా లేఖల విషయంలో భారీ హైడ్రామా చోటుచేసుకుంది. జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలను అందుకునేందుకు శాసనసభ కార్యదర్శి మూర్తి సంశయించారు. నియమాల ప్రకారం రాజీనామా లేఖలను స్పీకర్‌కే సమర్పించాలని వారిద్దరికీ సూచించారు. అయితే గత రాత్రే తాము స్పీకర్‌తో మాట్లాడినట్లు, స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖలు ఇవ్వాల్సిందిగా సూచించినట్లు వారు చెప్పినా మూర్తి ఒప్పుకోలేదు. దీంతో వారు బలవంతంగా మూర్తికి రాజీనామా లేఖలు సమర్పించి వెళ్లిపోయారు.
ఫిబ్రవరి 4న బెంగళూరుకు ప్రధాని మోదీ
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఎన్నికలకు వెళ్తామని బీజేపీ కర్ణాటక ఇన్‌చార్జి పి.మురళీధర్‌రావు చెప్పారు. ఐదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, పలువురు హిందూ కార్యకర్తలు దారుణ హత్యలకు గురయ్యారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పనేనని తెలిపారు. బెంగళూరులో ఫిబ్రవరి 4న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి బహిరంగ సభలో ప్రసంగిస్తారని రావ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment