మైసూరు: అనేకమంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, వారి పేర్లు వివరాలను ఇప్పుడే వెల్లడించలేం అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. శనివారం మైసూరులో రామకృష్ణనగర్‌లోనున్న స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌లో చేరడానికి బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగానే ఉన్నా ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో వారి విజయావకాశాలపై స్పష్టత వచ్చాకే వారిని పార్టీలోకి ఆహ్వానించాలా, లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరం నుంచే నేను రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నా.
డిసెంబర్ 13 నుంచి నిరంతరంగా పర్యటిస్తా’ అన్నారు. సిద్దరామయ్యకు వరుణ నియోజకవర్గం గురించి పూర్తిగా తెలియదంటూ కేంద్రమంత్రి సదానందగౌడ చేసిన విమర్శలపై స్పందిస్తూ ఆయనకు వరుణ నియోజకవర్గం గురించి తెలిసిఉంటే వచ్చే ఎన్నికల్లో వరుణ నుంచి బరిలో దిగాలని సవాల్ విసిరారు. ఇక పాత్రికేయుడు రవి బెళగెరెను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తనకు తెలియదని, దీనిపై పూర్తి సమాచారం అందిన తరువాతే స్పందిస్తానని చెప్పారు. శుక్రవారం ఒక కార్యక్రమంలో తమతో పాటు హాజరైన ఎంపీ ప్రతాప సింహాకు మీ పద్ధతి మార్చుకోవాలని సూచించామన్నారు.
చాముండేశ్వరి నుంచే చివరిసారి పోటీ
ఉప ఎన్నికల్లో తమకు రాజకీయ పునర్జన్మనిచ్చిన చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలన్నది తన చిరకాల వాంఛ అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. తనకు ఇవే చివరి ఎన్నికలని ఆయన చెప్పారు. ఈ నాలుగేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన పథకాల వల్లే కర్ణాటక దేశంలో అన్ని రంగాల్లోనూ మొదటిస్థానంలో ఉందన్నారు. కేఆర్‌ఎస్, కబిని జలాశయాల నుంచి చాముండేశ్వరి నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీటిని అందించామన్నారు.
కత్తితో మాట్లాడుతుంటా
బీజేపీ మాజీ మంత్రి ఉమేశ్ కత్తితో తమకు చాలా కాలంగా స్నేహం కొనసాగుతోందని సీఎం అన్నారు. తామిద్దరం తరచూ మాట్లాడుకుంటూనే ఉంటామని, ఇందులో రాజకీయ ప్రస్తావన ఉండదని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరతానని ఆయన, చేరాలని తాము ఎప్పుడూ చర్చించలేదన్నారు. ఉమేశ్ కత్తి సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment