సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలు, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలకు నేడు (మంగళవారం) ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ స్థానాలకు గత శనివారం ఉప ఎన్నిక నిర్వహించారు. మొత్తం ఐదు స్థానాల్లో నాలుగింట కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి విజయం సాధించింది.
మండ్య లోక్ సభ స్థానాన్ని జేడీఎస్ కైవసం చేసుకుంది. జేడీఎస్ అభ్యర్థి 324943 భారీ ఆధిక్యంతో గెలుపొందారు. రామ్ నగర్ అసెంబ్లీ స్థానంలో కుమార స్వామి భార్య అనిత 109137 మెజారిటీతో విజయం సాధించారు. జామ్‌ఖండి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత ఆనంద్ సిద్ధు గెలిచారు. ఇక బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది.
శివమొగ్గలో భాజాపా విజయం
ఐదు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక స్థానం మాత్రమే గెలిచుకుంది. శివమొగ్గ ఎంపీగా ఉన్న మాజీ సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగారు. జేడీఎస్ నుంచి మాజీ సీఎం బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేశారు. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర 52148 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment