బీజేపీకి కర్ణాటక కిక్కు | Editorial On Karnataka BYE Election Results Favours To BJP | Sakshi
Sakshi News home page

బీజేపీకి కర్ణాటక కిక్కు

Published Tue, Dec 10 2019 12:33 AM | Last Updated on Tue, Dec 10 2019 12:33 AM

Editorial On Karnataka BYE Election Results Favours To BJP - Sakshi

ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతున్న కాంగ్రెస్‌కు సోమవారం వెలువడిన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లోనూ అదే పునరావృతం అయింది. ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో కేవలం రెండే దక్కడంతో ఈ పరాజయానికి నైతికబాధ్యత వహించి కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నేత సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు దినేష్‌ గుండూరావు రాజీనామా చేశారు. అంచనా లకు మించి 12 స్థానాలు గెల్చుకున్న బీజేపీ సంబరాలు చేసుకుంటోంది.

అభ్యర్థుల ఎంపికనూ, ప్రచార బాధ్యతల్ని తన భుజస్కంధాలపై వేసుకున్న ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికలు రాజకీయంగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి. మహారాష్ట్రలో ఊహించనివిధంగా కూటమి భాగస్వామి శివసేన విప క్షాలతో చేతులు కలిపి తమకు అధికారం దక్కకుండా చేసింది. పైగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్‌లో ఇంకా మూడు దశలు పూర్తి కావలసి ఉంది.

అక్కడ పాత మిత్రుల్ని వదిలించుకుని ఒంట రిగా బరిలోకి దిగాల్సివచ్చింది. ఇలాంటి సమయంలో అంచనాలను మించి ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీకి జవసత్వాలనిచ్చింది. కర్ణాటకలో నిరుడు మే నెలలో జరిగిన శాసనసభ ఎన్ని కల్లో ఈ 15 స్థానాల్లో పన్నెండింటిని కాంగ్రెస్‌ గెల్చుకోగా, మూడుచోట్ల జేడీఎస్‌ విజయం సాధిం చింది. వీరు, వీరితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరానికి ఫిరాయించడంతో 14 నెలల పాటు పాలించిన హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌–కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం మొన్న జూలైలో కుప్పకూలింది. మరో రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందువల్ల వాటికి ఉపఎన్నికలు జరగలేదు.

వాస్తవానికి ఈ ఎన్నికల్లో తమకు గరిష్టంగా 9 స్థానాలు రావొచ్చునని బీజేపీ అంచనా వేసుకుంది. కానీ ఫలితాలు దాని అంచనాలను మించాయి. పైగా జేడీఎస్‌కు కంచుకోట అయిన ఓల్డ్‌ మైసూరు ప్రాంతంలోని మాండ్యా జిల్లాలో తొలిసారి బీజేపీ విజ యకేతనం ఎగరేసింది. అక్కడ కృష్ణరాజపేటె స్థానం తన ఖాతాలో వేసుకుంది. జేడీఎస్‌కు దన్నుగా ఉండే వొక్కళిగ జనాభా అధికంగా ఉన్న స్థానమిది.  224మంది సభ్యులుండే కర్ణాటక శాసనసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస మెజారిటీ 113. ఇప్పటికే బీజేపీకి 105 స్థానా లుండగా, ఉప ఎన్నికల తర్వాత దాని బలం 117కి చేరుకుంది. 

ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటారని, అందువల్ల ఫిరాయింపుల కార ణంగా సభ్యత్వం కోల్పోయి, బరిలో నిలిచిన వారంతా ఓటమి పాలవుతారని రాజ్యాంగ నైతికతను కోరుకునే వారంతా ఆశించారు. ఈ ఫిరాయింపులతో అధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్, జేడీఎస్‌లు సైతం అలాగే కోరుకున్నాయి. జనమంతా ఫిరాయింపుదార్లకు గట్టిగా బుద్ధి చెబుతారని భావిం చాయి. అయితే ప్రజలు కేవలం ఫిరాయింపుల అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని భావించడం దురాశ.

ఈ ఫిరాయింపుల కారణంగా పతనమైన కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వం అంతక్రితం 14 నెలలపాటు ఎలా పాలించిందో కూడా వారు అంచనా వేసుకున్నారు. ఆ 14 నెలలూ రెండు పార్టీలూ పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడమే సరిపోయింది. రెండు మూడు సందర్భాల్లో అప్పటి సీఎం కుమారస్వామి కంటతడి పెట్టారు. ఏం చేద్దామనుకున్నా తనకు అడ్డంకులు ఎదురవు తున్నాయని ఆయన వాపోయారు. కేవలం బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసం కలవడం తప్ప రాజకీయంగా ఆ రెండు పార్టీలూ ఒక ఉమ్మడి ఎజెండా రూపొందించుకోలేక పోయాయి. వరస వివాదాల్లో ఆ పార్టీలు తలమునకలై ఉండగా ఉపాధి లేమి, కరువుకాటకాలు రాష్ట్రాన్ని పీల్చిపిప్పి చేశాయి.

వీటన్నిటినీ ప్రజలు మరిచిపోలేదు. కనుకనే ఫిరాయింపుదార్ల అనైతిక రాజకీయాల గురించి ఎంత ప్రచారం చేసినా వారు పట్టించుకోలేదు. బీజేపీ ప్రచారం చేసిన సుస్థిర పాలన, అభివృద్ధికే వారు ఓటేశారు. ఉదాహరణకు కృష్ణరాజపేటె స్థానం నుంచి నిరుడు తమ పార్టీ అభ్యర్థిగా గెలిచి బీజేపీకి ఫిరాయించిన నారాయణగౌడపై జేడీఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గట్టిగా ప్రచారం చేశారు. రాజకీయంగా తమ గొంతు కోసిన ఆయనను చిత్తుగా ఓడించాలని ఎంతో ఉద్వేగంతో పిలుపునిచ్చారు. కానీ జనం నారాయణగౌడకే పట్టంగట్టారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెల్గాం జిల్లాలో గెలుపుపై బీజేపీ నేతల్లోనే అనుమానాలున్నాయి. పొరుగు రాష్ట్రంలోని పరిణామాలు ఈ ఉప ఎన్నికలపై ప్రభావాన్ని చూపుతాయని వారు భావించారు. కానీ అక్కడ కూడా విజయం సాధించడం వారిని ఉత్సాహపరిచింది. 

ఈ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి యడియూరప్పకు రాజకీయంగా ఊపిరిపోశాయి. నిజానికి ఆయన ఒకరకంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నారు. 75 ఏళ్లు దాటిన నేతలు ముఖ్య పదవుల నుంచి వైదొలగాలన్న సూత్రానికి విరుద్ధంగా బీజేపీ ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టక తప్ప లేదు. ఫిరాయింపుదార్లందరికీ టికెట్లివ్వడానికి అధిష్టానం సుముఖంగా లేదన్న వార్తలొచ్చాయి. కానీ యడియూరప్ప పట్టుబట్టి పార్టీ టిక్కెట్లు వచ్చేలా చేశారు. పైగా  గెలిస్తే వీరికి మంత్రి పదవులు ఇస్తామని కూడా ప్రచారసభల్లో చెప్పారు.

అది ఎంతవరకూ సాధ్యమో చూడాల్సివుంది. పార్టీ కేంద్ర నాయకులెవ్వరూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో మాత్రమే కాదు... దేశంలో కూడా పార్టీ ప్రతిష్టను యడియూరప్ప పెంచగలి గారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను మరింత కుంగదీసే ప్రమాదం ఉంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిస్తేజంగా ఉండటం, రాష్ట్రంలో పార్టీ సారథులు రాజీనామాలు చేయడం నైతికంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుంగదీస్తుంది. రాజకీయంగా తమ భవిష్యత్తేమిటన్న గాభరా కలిగిస్తుంది. ఇప్పుడు సుస్థిర మెజారిటీ లభించింది గనుక బీజేపీ ప్రభుత్వం ఇక పాలనపై దృష్టి పెట్టాలి. ఆంతరంగిక కలహాల్లో తలమునకలైతే ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్‌లకు ఎదురైన చేదు అనుభవమే మున్ముందు బీజేపీకి కూడా తప్పకపోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement