
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య 2025-26కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తాజాగా రూ. 4,08,647 కోట్ల బడ్జెట్‌ను సభలో ప్రస్తావించారు. అయితే, కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల (సంక్షేమం) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ధరలతో పాటు సినీ రంగంలో ఇతర ఆదాయ వనరులపై సెస్ విధించే ప్రణాళికల అంశాన్ని చర్చించారు. ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను సిద్ధ రామయ్య ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చింది.
కర్ణాటక చిత్ర రంగాన్ని ప్రోత్సాహించేందుకు సినిమా టికెట్ ధరలను రూ.200గా ఉండాలని నిర్ణయించాలనుకున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లతో పాటు ఇతర థియేటర్స్‌లలో కూడా ఇదే రేటు ఉంటుందని ఆయన అన్నారు. అందరికీ అందుబాటులో ధరలు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నామని సిద్ధ రామయ్య పేర్కొన్నారు. సినిమా విడుదల రోజే కాదు.. ప్రీమియర్ షోలు ప్రదర్శించినా ఇదే రేటుతో టికెట్లు ధరలు ఉండాలని ఆయన తెలిపారు. భారీ బడ్జెట్ పెట్టి చిత్రాలు నిర్మించినా సరే ఇక నుంచి టికెట్ ధర మాత్రం రూ. 200 మించి ఉండకూడదని చెప్పారు.
కర్ణాటక సినిమా ఇండస్ట్రీ కోసం తాము ఎప్పటికీ ముందు ఉంటామని సీఎం అన్నారు. ఈ క్రమంలో మైసూర్‌లో ఒక భారీ ఫిలిం సిటీని నిర్మాస్తామని చెప్పారు. అందుకు గాను ప్రభుత్వం నుంచి 150 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో ఆయన ప్రకటించారు. నిర్మాణం కోసం రూ. 500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు కూడా చెప్పారు.