
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యా రావ్ కేసు కీలక మలుపు తిరిగింది. కిలో బంగారం రవాణాకు రన్యారావ్‌కు రూ.5 లక్షల కమీషన్ అందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నటి పాత్రధారి కాగా అసలైన సూత్రధారి వేరే వ్యక్తి అని తెలిసింది. నటి రన్యారావ్‌ను డీఆర్‌ఏ అధికారులు తీవ్ర విచారణ చేపట్టగా నేను పాత్రధారి మాత్రమే అని, అసలు వ్యక్తి వేరేవారని తెలిపింది. రూ.17 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసే శ్రీమంతురాలు కాదు. ఈమె సీనియర్ పోలీస్ అధికారి పెంపుడు కూతురు కావడంతో ఆమెను ఈ దందాకు వాడుకుంటే చాలా సులభంగా బంగారం రవాణా చేయవచ్చనే అంచనాతో నటి రన్యారావ్‌ను బంగారం రవాణాకు వాడుకున్నారు.
అక్రమ బంగారం రవాణాలో విమానాశ్రయంలోని కొందరు అధికారులు కూడా కుమ్మకైనట్లు అనుమానం వ్యక్తమైంది. డీఆర్‌ఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. కిలో బంగారం రవాణా కోసం రన్యారావ్‌కు రూ.5 లక్షలు కమీషన్ ఇస్తున్నట్లు తెలిసింది. కమీషన్‌తో పాటు రాకపోకలు, బస, ఇతర ఖర్చులకు మొత్తంగా రూ.12 లక్షలు వసూలు చేసేదని విచారణలో తేలింది. ఒక్క ట్రిప్‌లో ఆమె సుమారు పది కేజీలకు పైగానే బంగారం అక్రమ రవాణా చేసేదని పోలీసులు గుర్తించారు. రన్యారావ్ బెంగళూరుకు తీసుకువచ్చిన బంగారం ఎవరికి ఇస్తుంది అనేదానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రన్యారావ్ వాడుతున్న బ్యాంక్ అకౌంట్ మొబైల్‌ను అదికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ అధికారులు అసలు సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
అయితే, ఈ అక్రమ బంగారం రవాణా స్టోరీలో ఆమెకు ఓ రాజకీయ నాయకుడి సహకారమూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రన్యా రావుకు పరిచయం ఉన్న నాయకులతో పాటు ఇతర అధికారుల పేర్లు విచారణలో తెలుస్తాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయ సలహాదారు, ఎమ్మెల్యే ఏఎస్ పొన్నణ్ణ పేర్కొన్నారు. కొందరు స్మగ్లర్లతో ఆమెకు సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆమె సుమారు 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు సమాచారం.
అధికారితో గొడవ వల్లే దొరికిపోయింది
కొద్దిరోజుల క్రితం రన్యా రావు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన సమయంలో విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారితో ఆమె గొడవకు దిగింది. తన బంధువు పేరును వాడుకున్న ఆమె తన దర్పాన్ని ఆ అధికారి వద్ద ప్రదర్శించింది. ఈ గొడవే ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ ఘటన వల్ల రన్యా రావు రాకపోకల వివరాలను ఆ అధికారి పరిశీలించారు. ఈ క్రమంలో గతంలో ఆమె ఎక్కడెక్కడకు ప్రయాణం చేశారో చెక్ చేశారు. అయితే, ఆమె తరచూ దుబాయ్‌కు వెళ్లి వస్తుండటమే కాకుండా.. వెళ్లిన ప్రతిసారీ ఒకే రకమైన దుస్తులు ధరించి కనిపిస్తుండటంతో ఆయన అనుమానించారు.ఈసారి ఆమె దుబాయ్ నుంచి మళ్లీ వచ్చినప్పుడు సోదాలు చేయాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె బంగారం బిస్కెట్లతో దొరికిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment