
తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు
డీఆర్‌ఐ డీజీకి లేఖ రాసిన నటి
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కేసులో నిందితురాలు, కన్నడ నటి రన్యా రావు తాజాగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులపై ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ)కు మార్చి ఆరో తేదీన హర్షవర్థిని రన్యా పేరిట ఆమె రాసిన లేఖ తాజాగా బహిర్గతమైంది.
పరప్పన అగ్రహార జైలు చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా ఆమె ఈ లేఖను డీఆర్‌ఐకు పంపించారు. దుబాయ్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పుడు తాను బంగారాన్ని తీసుకురాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. కస్టడీలో ఉన్న సమయంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పలుమార్లు చెంప దెబ్బ కొట్టారని, తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని చెప్పారు.
‘‘ఈ అంశంలో నేను నిరపరాధినని వివరించేందుకు ఎంత ప్రయత్నించినా అధికారులు నా మాటల్ని వినిపించుకోలేదు. ఎయిర్‌పోర్ట్ బయటకాకుండా విమానంలోనే నన్ను అరెస్ట్‌చేశారు. కోర్టులో హాజరుపరచడానికి ముందు వరకు అధికారులు మొత్తంగా 10, 15 సార్లు చెంపదెబ్బ కొట్టారు. కొట్టినా, చెంపదెబ్బ తిన్నాసరే వాళ్లు టైప్‌చేసిన పేజీలపై సంతకాలు చేయబోనని చెప్పా. దీంతో అన్యాయంగా మా తండ్రి పేరును ఈ కేసులోకి లాగి పరువు తీస్తామని బెదిరించారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా వాళ్లు చెప్పినపనిచేశా. దాదాపు 60 టైప్‌చేసిన పేజీలపై, 40 తెల్లకాగితాలపై సంతకాలు చేశా’’అని అన్నారు.
రన్యా రావు సవతి తండ్రి కె.రామచంద్రరావు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీసుల గృహ, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ‘‘మూడో తారీఖు సాయంత్రం అరెస్టయితే నాలుగో తేదీ రాత్రి కోర్టులో హాజరుపరిచేదాకా నన్ను నిద్రపోనివ్వలేదు, తిండి పెట్టలేదు. ఆరోజు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల్లా నటించిన కొందరు వ్యక్తులు ఆ విమానంలోని కొందరు ప్రయాణికులను రక్షించేందుకు నన్ను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు.
జడ్జి ఎదుట హాజరుపరిచేందుకు కారులో తీసుకెళ్లేటప్పుడూ అధికారులు బెదిరించారు. కొట్టిన విషయం చెప్తే నాన్న సంగతి, నా సంగతి చూస్తామని బెదిరించారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఉన్నకాలంలో బలవంతంగా తీసుకున్న నా వాంగ్మూలాలకు విలువ ఇవ్వకండి’’అని డీఆర్‌ఐకు లేఖలో విజ్ఞప్తి చేశారు. కస్టడీలో ఉన్న కాలంలో కళ్ల కింద నల్లని చారలతో, నిస్సత్తువగా ఉన్న రన్యా రావు ఫొటో ఒకటి వైరల్‌గా మారిన విషయం తెల్సిందే.

మూడ్రోజులు రెవెన్యూ ఇంటెలిజెన్స్ కస్టడీలో ఉన్న ఆమెను ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. గతంలో రన్యా రావు భిన్న వాదనలు చేశారు. అరెస్ట్‌సమయంలో తన నుంచి పోలీసులు 17 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారని ఏడోతేదీన వాంగ్మూలంలో ఒప్పకున్నారు. అధికారులు ఇష్టమొచ్చినట్లు తిట్టారని పదో తేదీన కోర్టులో ఆమె చెప్పారు. అయితే కొట్టలేదని ఒప్పుకున్నారు. మరోవైపు, రన్యారావు సవతి తండ్రి రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం తాజాగా సెలవుపై పంపించింది. ఈ మేరకు శనివారం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment