సాక్షి, బెంగళూరు: గోవధ నివారణ, పశువుల సంరక్షణ బిల్లు-2020ను కర్ణాటక ప్రభుత్వం బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం ఆవులు, దూడలను వధించకూడదు. చట్టవిరుద్ధంగా ఆవులను అమ్మడం, రవాణా చేయడం లేదా నరకడం శిక్షార్హం అవుతుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు ఆమోదించడంతో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ట్విటర్‌లో దుయ్యబట్టారు.
గోవధ బిల్లును శాసనసభలో కనీసం చర్చించకుండానే యడియూరప్ప ప్రభుత్వం ఆమోందించిందని, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. బీజేపీ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ బిల్లులు ఎజెండాలో లేవని రాష్ట్ర బిజినెస్ అడ్వయిజరీ కమిటీ తెలియజేసిందని గుర్తుచేశారు. బిల్లును చర్చించలేని పిరికి ప్రభుత్వం బీజేపీ అని, అందుకే యడియూరప్ప ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుందన్నారు. అవినీతి నిరంకుశ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. బీజేపీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తామని ట్విటర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment