చిక్కబళ్లాపురలో ప్రముఖ నటుడు బ్రహ్మానందం రోడ్‌షో
సాక్షి, బెంగళూరు: మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన కాంగ్రెస్– జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ తరఫున ఉప ఎన్నికలు బరిలో ఉండటంతో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అనర్హత ఎమ్మెల్యేల గెలుపుతో పాటు ప్రభుత్వ మనుగడకు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సీఎం బెంగళూరులోని యశవంతపున నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎస్‌టీ సోమశేఖర్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రతిపక్షాల ప్రచారం
అనర్హత ఎమ్మెల్యేలను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, జేడీఎస్ శ్రమిస్తున్నాయి. సీఎల్పీ నేత సిద్ధరామయ్య బెళగావి జిల్లా కాగవాడలో కాంగ్రెస్ అభ్యర్థి రాజుకాగె తరఫున ప్రచారం చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కాగవాడలో జేడీఎస్ అభ్యర్థి శ్రీశైలతుగశెట్టికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ చిక్క బళ్లాపురలో ప్రచారం నిర్వహించారు. ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం శనివారం చిక్కబళ్లాపురలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఆయనను చూడడానికి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో సందడి నెలకొంది.
మాటల యుద్ధం
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరొకరు మాటల దాడికి దిగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతలు.. తప్పు మీదంటే మీదని ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ – జేడీఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఉప ఎన్నికల్లో భాగంగా బహిరంగ ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు అనుచరులతో ముమ్మర సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరికొందరు మఠాలు, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని భారీ కసరత్తు చేస్తున్నారు. సీఎం యడియూరప్ప అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి వరాల హామీలు గుప్పిస్తున్నారు.
హైఓల్టేజీ స్థానాలపై బెట్టింగ్?
ఉప ఎన్నికలు జరిగే హొసకోటె, హుణసూరు, కృష్ణరాజపేటె, గోకాక్, యశవంతపుర, విజయనగర నియోజకవర్గాల్లో భారీ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఏ పార్టీ ఎక్కువ స్థానా ల్లో విజయం సాధిస్తుందనే దానిపై కూడా బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ – బీజేపీ మధ్య పోటీ ఉందని.. ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్– జేడీఎస్ మధ్యనే పోటీ ఉందని బెట్టింగ్ కాస్తున్నారు. చిక్కబళ్లాపుర, గోకాక్, శివాజీనగర స్థానా లపై కూడా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment