కొడుకు విజయేంద్రకు మిఠాయి తినిపిస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 సీట్లను కమలం పార్టీ గెల్చుకుంది. రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ రెబల్ విజయం సాధించారు. డిసెంబర్ 5న ఎన్నికలు జరగగా, ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఈ విజయంతో రాష్ట్రంలో యడియూరప్ప ప్రభుత్వం మెజారిటీ మార్క్‌ను సొంతంగా సాధించుకున్నట్లైంది. అసెంబ్లీలో మొత్తం 225 (ఒక నామినేటెడ్‌సహా) సీట్లు కాగా, రెండు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 223 స్థానాలకు 112 మెజారిటీ మార్క్. ప్రస్తుతం ఉన్న 105 స్థానాలకు తాజా విజయంతో మరో 12 సీట్లను బీజేపీ కలుపుకుంది. దాంతో, అసెంబ్లీలో బీజేపీ బలం 117కి చేరుకుని, మెజారి టీ మార్క్‌ను సునాయాసంగా దాటేసింది.
ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఘోర పరాజయాన్ని మిగిల్చాయి. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు గుండూరావు తమ పదవులకు రాజీనామా చేశారు. శివాజీనగర, హణసూరు నియోజకవర్గాల్లో మినహాయించి మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. శివాజీనగర్‌లో రిజ్వాన్ అర్షద్, హణసూరు లో మంజునాథ్‌లు గెల్చారు. హొసకోటలో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి శరత్ గెలుపొందారు. జేడీఎస్ అభ్యర్థులు పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఉప ఎన్నికలు జరిగిన ఈ 15 సీట్లలో 12 కాంగ్రెస్‌వే. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 15 సీట్లకు గానూ.. 12 స్థానాల్లో కాంగ్రెస్, 3 సీట్లలో జేడీఎస్ గెలుపొందాయి.
ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు
ఈ ఎన్నికల్లో మెజారిటీని ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు యడియూరప్ప కృతజ్ఞతలు తెలిపారు. మిగతా మూడున్నరేళ్లు సుస్థిర, ప్రగతిశీల పాలన అందిస్తానన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తానన్న హామీ విషయంలో వెనక్కు వెళ్లబోనన్నారు. ప్రస్తుతం, ముఖ్యమంత్రి సహా కేబినెట్‌లో 18 మంది మంత్రులున్నారు. మంత్రిమండలిలో మొత్తం 34 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది.
వెన్నుపోటుదారులకు మద్దతిచ్చారు
ఉప ఎన్నికల ఫలితాలపై బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ‘అభినందనలు కర్ణాటక. వెన్నుపోటు పొడిచే వ్యక్తులు మళ్లీ ముందుకు వచ్చారు. వారే మీకు తిరుగుబాణం అవుతారని ఆశిస్తున్నాను. అనర్హులకు మద్దతు ఇచ్చారు, మంచిది’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేల గెలుపు
కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, బీజేపీకి మద్దతివ్వడంతో, ఈ జూలై నెలలో జేడీఎస్ నేత కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ 17 మందిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. జూలై 29న యడియూరప్ప అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూనే, ఆ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే చాన్సిచ్చింది. మస్కి, ఆర్‌ఆర్ నగర్ స్థానాలకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఆ స్థానాలను మినహాయించి, 15 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్, జేడీఎస్‌లపై తిరుగుబాటు చేసి తమ పార్టీలో చేరి, అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో 13 మందిని బీజేపీ పోటీలో నిలపగా 11 మంది గెల్చారు.
Comments
Please login to add a commentAdd a comment