సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికల్లో యడియూరప్ప ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకుంది. తాజా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుభిని మోగించింది. 15 అసెంబ్లీ స్థానాలకు గాను 6 చోట్ల విజయం సాధించి, మరో 6 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతుంది. దీంతో కర్ణాటకలో స్థిరమైన బీజేపీ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. కాగా, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లతో సరిపెట్టుకుంది. ఇక జేడీఎస్ ఖాతా కూడా తెరవలేదు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీ.. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. మిగత 6 స్థానాల్లో కూడా బీజేపీ గెలుపు దాదాపు ఖరారయినట్లే. ఎన్నికల్లో గెలిచిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం యడియూరప్ప ప్రకటించారు.
కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి చెందిన 17మంది తిరుగుబాటు చేయడంతో కర్ణాకటలోని కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. తర్వాత అప్పటి స్పీకర్ 17మందిపై అనర్హత వేటు వేసింది. తర్వాత బలపరీక్షలో బీజేపీ నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతతో కర్ణాటకలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యేల అనర్హతతో 17 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, హైకోర్టు కేసు కారణంగా రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో డిసెంబర్ 5న 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు మొత్తం 15 స్థానాల్లో, జేడీఎస్ 12 చోట్ల బరిలోకి దిగాయి.
♦ ఎమ్మెల్యేలుగా గెలిచిన 12 మంది సభ్యులకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని కర్ణాటక మంత్రి అశోక్ అన్నారు. బీజేపీ కచ్చితంగా 12 స్థానాల్లో గెలుస్తుంది. వారందరికి సీఎం యడియురప్ప సముచిత స్థానం కల్పిస్తారా ఆశాభావం వ్యక్తం చేశారు.
బోణీ కొట్టిన బీజేపీ
ఉప ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. యల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హెబ్బర్ శివరామ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తొలి విజయంతో సాధించడం పట్ల శివరాం సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా శివరాం మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరో 11 నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్‌లో ఉంది.
ఓటమిని అంగీకరించిన డీకే
ఉప ఎన్నికల ఫలితాలను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ స్వాగతించారు. ప్రజా తీర్పును గౌరవించి ఓటమిని అంగీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఫిరాయింపుదారులను అంగీరించారని, అందుకే వారిని గెలిపించారని తెలిపారు. ఈ ఫలితాలతో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు.
సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు
ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక తమ ప్రభుత్వానికి ఢోకా లేదంటూ పటాసులు పేల్చుతున్నారు. కాగా, ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మరింత నిరాశను మిగిల్చేలా ఉన్నాయి.
♦ బీజేపీ అత్యధిక స్థానాల్లో లీడ్‌లో ఉండటం పట్ల సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర హర్షం వక్తం చేశారు. తన తండ్రి, సీఎం యడియూరప్ప దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప కుమారుడికి మిఠాయి తినిపించారు.
ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఉప ఎన్నికల్లో కనీసం ఆరు స్థానాల్లో గెలుపొందినా ఆ సంఖ్య 111కి చేరుతుంది. దీంతో ఉత్కంఠ భరిత స్థితిలో ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న బీఎస్ యడియురప్ప సీటుకు వచ్చిన ఢోకా ఏం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊరటను కలిగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment