
బెంగళూరు: కన్నడనాట పొలిటికల్ హనీ ట్రాప్(Honey Trap) వ్యవహారం కలకలం రేగింది. మంత్రులు సహా అనేకమంది నేతలు వలపు వల విసిరారని.. అందులో కొందరు చిక్కుకున్నారని స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించడం సంచలన చర్చకు దారి తీసింది. ఇందులో జాతీయ స్థాయి నేతలు కూడా ఉన్నట్లు తెలిపిన ప్రభుత్వం.. ఉన్నత న్యాయస్థాయి దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించుకుంది.
తనపై రెండుసార్లు హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్న కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న.. ఈ వ్యవహారంలో తనకు తెలిసే 48 మంది చిక్కుకుని ఉన్నారని అసెంబ్లీ ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై విచారణ జరిపించాలని అధికార, విపక్ష పార్టీ సభ్యులు డిమాండ్ చేసిన నేపథ్యంలో.. అందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
రాష్ట్రానికి చెందిన అనేక మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకుపోయారని, తనకు తెలిసినంతవరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని, అధికారపక్షం సహా విపక్షానికి చెందిన వారు బాధితుల్లో ఉన్నారని, ఇంకా ఎంతో మంది ఉండొచ్చని అభిప్రాయపడ్డారాయన. బాధితులతో అసభ్యకర వీడియోలు చిత్రీకరించారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేశారని పేర్కొన్నారు. వాళ్లకు సంబంధించిన సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు.
ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరమన్న మంత్రి రాజన్న.. దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. దీని వెనక ఎవరు(King Ping) ఉన్నారనే విషయం బయటపడుతుందని, ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాలని మంత్రి రాజన్న స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాజన్న సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు.
హనీ ట్రాప్ ఆరోపణలపై కర్ణాటక హోంశాఖ మంత్రి జి.పరమేశ్వర సభలో స్పందించారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు.మరోవైపు ఇదే వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఎవరినైనా అరెస్టు చేశారో లేదోనన్న విషయం తనకు తెలియదన్నారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్ జార్కిహోళీ మాట్లాడుతూ.. మంత్రివర్గంలోని ఒక సీని యర్ సహచరుడిపై హానీ ట్రాప్ ప్రయత్నాలు జరిగి నప్పటికీ అవి సఫలం కాలేదని అన్నారు. అయితే, ఇది రాష్ట్రానికి కొత్త కాదని, గత 20 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని అన్నారు. ఈ తరహా ఘటనలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ దీనిపై సీబీఐ దర్యాప్తు కోరుతోంది.

బుధవారం రాష్ట్ర శాంతి భద్రతల అంశంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే వీ సునీల్ కుమార్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హనీ ట్రాప్ ప్రభుత్వం నడిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆయన.. హోం శాఖ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులను ఓడించలేక అనైతిక చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. హనీ ట్రాప్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ మాట్లాడుతూ... రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికి బ్లాక్‌మెయిల్ మార్గాలు ఎంచుకుంటున్నారని, ఇందులో భాగంగా హనీ ట్రాప్‌లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే.. గత వారం తుమకూరు(Tumakuru)కు చెందిన ఓ బీజేపీ నేతపై జరిగిన హనీ ట్రాప్ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అన్నప్ప స్వామి అనే నేతకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ.. అసభ్యకర వీడియోలతో తనను బ్లాక్‌మెయిల్ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన పోలీసులను ఆశ్రయించగా.. ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment