
సూరజ్ రేవన్న
బెంగళూరు: కర్ణాటకలో గురువారం 15 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో జేడీఎస్‌కు షాక్ తగిలింది. నలుగురు బీజేపీ కార్యకర్తల మీద హత్యాయత్నం చేశారంటూ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్నపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్ జిల్లాలోని చన్నరాయపట్న పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. జేడీఎస్ నుంచి బీజేపీలోకి మారిన కార్యకర్తల ఇళ్లపై దాదాపు 150–200 మంది వచ్చి దాడి చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని బీజేపీ ఆరోపించింది. గాయపడిన తమ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. సరైన సమయానికి పోలీసులు రాకపోయి ఉంటే పరిస్థితి మరింత చేజారేదని అన్నారు. దీంతో సూరజ్ సహా ఆరు మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఆరోపణలను జేడీఎస్ ఖండించింది.