న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో హాసన్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎన్నికైన జెడి-ఎస్ ఏకైక ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించింది. రేవణ్ణపై ఎన్నికల అనర్హత వేటు వేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనం రేవణ్ణ ఎన్నిక చెల్లదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలపై జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎంపిక చెల్లదంటూ ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు హైకోర్టు నిర్ణయంపై స్టే విధించడంతో ప్రజ్వల రేవణ్ణకు కొంత ఉపశమనం లభించినట్టైంది.
వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రేవణ్ణను అనుమతించాలని ఆయన తరపు న్యాయవాది కెకె వేణుగోపాల్ కోర్టును అభ్యర్థించగా, సుప్రీం కోర్టు అందుకు కూడా అనుమతించింది. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు మాజీ మంత్రి రేవణ్ణ కుమారుడు.
ఇది కూడా చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment