రూ. 200కి మనుమడిని అమ్మేసిన నాన్నమ్మ | Grandmother Living by Begging Sold Grandson for 200 Rupees in Mayurbhanj Odisha | Sakshi
Sakshi News home page

రూ. 200కి మనుమడిని అమ్మేసిన నాన్నమ్మ

Published Thu, Mar 20 2025 11:20 AM | Last Updated on Thu, Mar 20 2025 11:29 AM

Grandmother Living by Begging Sold Grandson for 200 Rupees in Mayurbhanj Odisha

మయూర్‌భంజ్‌: ఆర్థిక పరిస్థితులు మనిషిని ఎంతవరకైనా కుంగదీస్తాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలోనే విషాద ఉదంతాలు చోటుచేసుకుంటాయి. ఒడిశా(Odisha)లోని మయూర్‌భంజ్‌లో హృదయాలను ద్రవింపజేసే ఉదంతం చోటుచేసుకుంది. దీని గురించి తెలుసుకున్నవారంతా కంటతడి పెడుతున్నారు.

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా పరిధిలోని బల్డియా గ్రామానికి చెందిన వితంతువు మంద్‌ సోరెన్‌(65)కు ఉండేందుకు ఇల్లు గానీ, కాస్త స్థలం గానీ లేదు. ప్రభుత్వ పథకాల ద్వారా కూడా ఆమెకు ఎటువంటి సాయం అందడం లేదు. గతంలో ఆమె భర్త మరణించాడు. ఆమె కుమారుడు ఎటో వెళ్లిపోయాడు. కోడలు కూడా మృతి చెందింది. దీంతో ఆమె జీవితం దిక్కుతోచని విధంగా తయారయ్యింది. ఇటువంటి పరిస్థితిలో ఆమె  ఏడేళ్ల మనుమడిని పెట్టుకుని, రాయ్‌పాల్‌ గ్రామంలో ఉంటున్న సోదరి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తోంది.
 

మంద్‌ సోరెన్‌ రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ(Begging) తన మనుమడిని పోషిస్తోంది. అయితే వృద్ధాప్యం కారణంగా ఇటీవలి కాలంలో మనుమడి సంరక్షణ కూడా చూసుకోలేకపోతోంది. ఇదువంటి దుర్భర పరిస్థితుల్లో ఒక అజ్ఞాత వ్యక్తికి రూ. 200కు తన మనుమడిని అమ్మేసింది. ఇకనైనా తన మనుమడికి మంచి ఆహారం దొరుకుతుందనే భావనతో ఇలా చేశానని ఆమె చెబుతోంది. స్థానిక పంచాయతీ సభ్యులకు ఈ విషయం తెలిసింది. వారు ఉన్నతాధికారులకు ఈ సమాచారం చేరవేశారు. దీంతో రాస్‌గోవింద్‌ పూర్‌ పోలీసులు ఆ బాలుడిని రక్షించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

విషయం తెలుసుకున్న చైల్డ్‌ ప్రొటెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి, ఆ బాలునితో పాటు నాన్నమ్మను ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. ఈ సందర్భంగా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌  అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ విషయమై పోలీసులు తమకు సమాచారం అందించగానే, తాము వారిని ప్రభుత్వ సంరక్షణా గృహానికి తీసుకువచ్చామని తెలిపారు. ఆ బాలుడిని ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు ఏర్పాట్లు చేస్తామని, మంద్‌ సోరెన్‌కు ప్రభుత్వ ఫించను వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: పాక్‌కు మద్దతుగా గోడలపై నినాదాలు.. ఇద్దరు యువకులు అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement