
పుణె: సహచర కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే రాజ్యాంగాన్ని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మరో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఘాటుగా స్పందించారు. రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదని, తాను అలా జరగనివ్వబోనని ఆయన అన్నారు. కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి అయిన అథవాలే ఆదివారం పుణెలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హెగ్డే వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. ‘ఎవరైనా రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే.. మేం వారిని మారుస్తాం’ అని సరదాగా నవ్వుతూ అన్నారు. రాజ్యాంగాన్ని పవిత్రపుస్తకంగా ప్రధాని మోదీ అభివర్ణించిన విషయాన్ని గుర్తుచేసిన అథవాలే.. హెగ్డేపై చర్యలు తీసుకోవాలని బీజేపీని కోరారు.
రాజ్యాంగాన్ని గతంలో చాలాసార్లు సవరించారని, కాబట్టి బీజేపీ ప్రభుత్వం భవిష్యత్తులో రాజ్యాంగాన్ని సవరించి.. అందులోని లౌకికవాదం పదాన్ని తొలగించబోతున్నదని కేంద్రమంత్రి హెగ్డే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment