న్యూఢిల్లీ/దాహోద్: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఆమెపై అత్యాచారం, కుటుంబీకుల హత్య కేసులో 11 మంది దోషులకు శిక్షా కాలం తగ్గిస్తూ గతేడాది గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. వారు రెండు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ మేరకు 251 పేజీల తీర్పు వెలువరించింది.
ఓ మహిళపై ఇంతటి క్రూర నేరాలకు పాల్పడ్డ కేసుల్లో శిక్ష తగ్గింపునకు అసలు ఆస్కారమెలా ఉంటుందని గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాధితురాలి జాతి, మత విశ్వాసాలతో నిమిత్తం ఉండకూడదని స్పష్టం చేసింది. ‘‘శిక్ష తగ్గింపు (రెమిషన్) గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న మతిలేని నిర్ణయం. ఈ విషయంలో దోషులతో ప్రభుత్వం పూర్తిగా కుమ్మక్కైంది. వారి విడుదల కోసం అన్నివిధాలా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడింది’’ అంటూ కడిగి పారేసింది.
‘‘సుప్రీంకోర్టులో రెమిషన్ పిటిషన్ సందర్భంగా దోషులు ఈ కేసులో వాస్తవాలను దాచారు. తద్వారా అత్యున్నత న్యాయస్థానాన్నే ఏమార్చారు. తద్వారా రెమిషన్‌పై పరిశీలనకు ఆదేశాలు పొందారు’’ అంటూ ఆక్షేపించింది. ఆ తీర్పు కూడా చెల్లుబాటు కాబోదని ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పును బాధితురాలితో పాటు ప్రధాన రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయి. బానో స్వస్థలంలో ఆమె బంధుమిత్రులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. జైలుకు వెళ్లిన అనంతరం రెమిషన్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించే అవకాశం దోషులకు ఉంది.
గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదు
గుజరాత్‌లో 2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం మత ఘర్షణలు చెలరేగడం తెలిసిందే. ఆ సందర్భంగా మిగతా బిల్కిన్ బానో ఉదంతం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణి అయిన 21 ఏళ్ల బిల్కిస్‌పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కూతురుతో పాటు కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో 11 మందిని దోషులుగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఖరారు చేసింది. వారికి జీవిత ఖైదు విధిస్తూ 2008లో తీర్పు వెలువరించింది.
దీన్ని బాంబే హైకోర్టు కూడా సమరి్థంచింది. 15 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాక తమను విడుదల చేయాలంటూ వారిలో ఒకరు 2022 మేలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిశీలించాలన్న కోర్టు ఆదేశం మేరకు గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. దాని సిఫార్సు ఆధారంగా మొత్తం 11 మందికీ రెమిషన్ మంజూరు చేయడంతో 2022 ఆగస్టు 15న వారంతా విడుదలయ్యారు. దీనిపై బిల్కిస్ తీవ్ర ఆవేదన వెలిబుచి్చంది.
రాజకీయ పారీ్టలతో పాటు అన్న విర్గాలూ వారి విడుదలను తీవ్రంగా తప్పుబట్టాయి. గుజరాత్ ప్రభుత్వ చర్యపై దేశమంతటా నిరసనలు వ్యక్తమయ్యాయి. వారి విడుదలను సుప్రీంకోర్టులో బిల్కిస్‌తో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 11 రోజుల వాదనల అనంతరం 2023 అక్టోబర్ 12న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రెమిషన్‌ను కొట్టేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.
ఈ కేసులో విచారణ జరిగి దోషులకు శిక్ష పడింది మహారాష్ట్రలో గనుక వారికి రెమిషన్ ప్రసాదించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్ష తగ్గించిందంటూ తప్పుబట్టింది. రెమిషన్ నిర్ణయాన్ని కొట్టేసేందుకు ఈ ఒక్క ప్రాతిపదికే చాలని పేర్కొంది. ‘‘2022లో సుప్రీంకోర్టుకు వెళ్లిన నిందితులు కేసులో వాస్తవాలను దాచి ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టించి పునఃసమీక్షకు తీర్పును పొందారు.
ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వం కూడా వారితో కుమ్మకైంది’’ అంటూ ఆక్షేపించింది. ‘‘రెమిషన్ కోసం దోషుల్లో ఒకరు 2019లోనే గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా మహారాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిందిగా సూచించింది. 2020లోనూ మరో పిటిషన్ పెట్టుకున్నా కొట్టేసింది. దాంతో దోషి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినా లాభం లేకపోయింది. రెమిషన్ ఇవ్వొద్దంటూ సీబీఐతో పాటు సీబీఐ ప్రత్యేక జడ్జి కూడా సిఫార్సు చేశారు.
ఈ వాస్తవాన్ని సుప్రీంకోర్టు ముందు దాచిపెట్టారు’’ అంటూ మండిపడింది. రెమిషన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ బానో నేరుగా సుప్రీంకోర్టులో పిల్ వేయడం ఆరి్టకల్ 32 ప్రకారం సబబేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘శిక్ష విధించాల్సింది ప్రతీకార దృష్టితో కాదు. నేరం పునరావృతం కాకుండా చూసేందుకు. దాంతోపాటు దోషుల్లో మార్పు తెచ్చేందుకు’’ అన్న గ్రీకు తత్వవేత్త ప్లేటో సూక్తిని జస్టిస్ నాగరత్న ప్రస్తావించారు. శిక్ష తగ్గింపు నిర్ణయానికి కూడా దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుందన్నారు. దోషుల హక్కులతో పాటు బాధితుల హక్కులనూ పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేశారు.
బాక్సు తీర్పుపై స్పందనలు...
‘‘బానో అవిశ్రాంత పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అన్యాయంపై, బీజేపీ సర్కారు అహంకారంపై ఆమె సాధించిన విజయమిది. ఎన్నికల లబ్ధి కోసం నేరగాళ్లకు ఆశ్రయమిస్తున్నదెవరో, న్యాయానికి పాతరేస్తున్నదెవరో సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి తేటతెల్లమైంది’’
– కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ
‘‘ఇది సాహసోపేతమైన తీర్పు. ఇందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు’’
– తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ
‘‘బానోకు కేంద్రం తక్షణం క్షమాపణలు చెప్పాలి’’
– మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ
‘‘మహిళలపై జరిగే అన్యాయాలను జాతి సహించబోదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది’’
– బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత
Comments
Please login to add a commentAdd a comment