Bilkis Bano case: SC asks Gujarat govt to explain why it released 11 convicts - Sakshi
Sakshi News home page

బిల్కిస్‌ బానో కేసు: ఆ 11 మంది ఎందుకు రిలీజ్‌ చేశారు? గుజరాత్‌ సర్కార్‌పై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు

Published Tue, Apr 18 2023 6:14 PM | Last Updated on Tue, Apr 18 2023 6:21 PM

Bilkis Bano Case: SC asks Gujarat govt to explain 11 convicts Release - Sakshi

ఢిల్లీ: బిలిస్క్‌ బానో రేపిస్టుల విడుదలకు సంబంధించిన ఫైల్స్ సమర్పించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన తరుణంలో.. కేంద్రం, గుజరాత్‌ ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల్ని సవాల్‌ చేస్తూ సమీక్షకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోపు ఇవాళ సుప్రీం కోర్టు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ పదకొండు మందిని ఎందుకు రిలీజ్‌ చేశారో స్పష్టం చేయాలంటూ గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది.
  
మార్చి 27వ తేదీన సుప్రీం కోర్టు ‘ఇదొక భయంకరమైన ఘటన’ అని, నిందితుల్ని రెమిషన్‌ మీద ఎందుకు విడుదల చేశారో వివరణ ఇస్తూనే.. ఆ రిలీజ్‌కు సంబంధించిన ఫైల్స్‌ను సమర్పించాలంటూ కేంద్రం, గుజరాత్‌ ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే.. 11 మంది దోషుల శిక్ష ఉపశమనానికి సంబంధించిన పత్రాలను సమర్పించకూడదని గుజరాత్‌ ప్రభుత్వం భావించింది. ఇదే విషయాన్ని ఇంతకు ముందు సుప్రీంకు స్పష్టం చేసింది. అంతేకాదు ఒక సాధారణ హత్య కేసులో ఎలాగైతే దోషులకు రెమిషన్‌ కింద ముందస్తు విడుదల చేస్తామో.. అలాగే ఈ కేసులోనూ చేశామంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

కానీ, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఇవాళ రెమిషన్‌ ఇవ్వడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో.. దోషులను ముందస్తుగా ఎందుకు రిలీజ్‌ చేసిందో తెలపాలంటూ గుజరాత్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

‘‘ఇవాళ ఈమె. రేపు మరొకరు. దేశంలోని నా సోదర సోదరీమణులకు ఏమి జరుగుతుందో అనే ఖచ్చితమైన ఆందోళన కలుగుతోంది’’ అని జస్టిస్‌ జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. అయితే.. గుజరాత్‌, కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్‌ జనరల్.. సుప్రీం ఆదేశాలపై‌ రివ్యూ పిటిషన్‌కు ఆలోచన చేస్తున్నామని, అది దాఖలు చేయాలా వద్దా అన్నది పూర్తిగా నిర్ణయించలేదని కోర్టుకు తెలిపారు.

వెంటనే.. బిల్కిస్‌ బానో కేసు ఘోరమైన నేరమన్న బెంచ్‌, రెమిషన్‌ ప్రకటించేముందు మరో వైపు కూడా ఆలోచించాల్సి ఉండాల్సిందని, ఇది సరైన పద్ధతి కాదని గుజరాత్‌ ప్రభుత్వం తీరును తప్పు బట్టింది. ఫైల్స్‌ గనుక కోర్టుకు సమర్పించకపోతే.. అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు అంతా పక్కాగా చేసినప్పుడు.. భయపడాల్సిన అవసరం ఏముందని బెంచ్‌ వ్యాఖ్యానించింది. 

ఒక గర్భవతిని(బిల్కిస్‌ బానో) గ్యాంగ్‌ రేప్‌ చేశారు. మరికొందరిని చంపేశారు. అలాంటప్పుడు ఈ కేసును సాధారణమైన హత్య కేసుగా పోల్చడానికి వీల్లేదు. యాపిల్స్‌ను బత్తాయిలతో పోల్చలేం.. అలాగే ఇంతటి మారణకాండను సింగిల్‌ మర్డర్‌గా పోల్చడానికి వీల్లేదు. నేరాలు అనేవి సాధారణంగా సమాజానికి, కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతుంటాయి. అసమానతలను సమానంగా చూడలేము అని కోర్టు అభిప్రాయపడింది. 

ఇవాళ బిల్కిస్‌.. రేపు ఇంకెవరో?. అది మీరైనా కావొచ్చు.. నేనైనా కావొచ్చు. రెమిషన్‌ ఇవ్వడానికి గల కారణాలను చూపించకపోతే, ఫైల్స్‌ సమర్పించపోతే.. న్యాయవ్యవస్థ తన స్వంత తీర్మానాన్ని తీసుకోవలసి ఉంటుందని గుజరాత్‌ ప్రభుత్వానికి స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. 

బిల్కిస్‌ బానో కేసులో పదకొండు మంది దోషులకు ఉపశమనం కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు అభ్యర్థనలను మే 2వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. నోటీసు అందుకోని దోషులందరూ తమ ప్రత్యుత్తరాలు పంపాలని ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement