ఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఇవాళ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో దోషుల్ని ఎలా విడుదల చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది సుప్రీంకోర్టు.
2002 అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోను అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబాన్ని ఊచ కోత కోశారు కొందరు. అయితే ఈ కేసుకు సంబంధించిన 11 మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని కలిపి ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతోంది.
ఈ కేసులో దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. అలాంటప్పుడు 14 ఏళ్ల శిక్షాకాలం ముగియగానే వాళ్లను ఎలా విడుదల చేశారు?. ఇతర ఖైదీలను అలాంటి ఉపశమనం ఎందుకు ఇవ్వలేకపోయారు?. సత్‌ప్రవర్తన వీళ్లు మాత్రమే కనబర్చారా?.. ప్రత్యేకించి ఈ కేసులోనే దోషుల్ని విడుదల చేయడంలో అంతర్యం ఏంటి? అని గుజరాత్ ప్రభుత్వాన్ని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ ప్రశ్నించింది.
ఈ మేరకు పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. బిల్కిస్ దోషుల కోసం జైలు సలహా కమిటీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని, అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను సైతం అందించాలని కోర్టు ఆదేశించింది. గోద్రా కోర్టులో విచారణ జరగకున్నా.. అభిప్రాయాన్ని ఎందుకు కోరారని కూడా ప్రశ్నించింది.
అయితే ప్రశ్నలకు వివరణ కష్టతరమని, సుప్రీం కోర్టులో ఇందుకు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉందని అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. దోషుల చట్టప్రకారమే విడుదల జరిగిందని, 1992 పాలసీ ప్రకారం రెమిషన్ కింద ముందస్తుగా వాళ్లను విడుదల చేసిందని, విడుదలకు వాళ్లు అన్ని విధాల అర్హత కలిగి ఉన్నారని ఆయన కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ.. గుజరాత్ ప్రభుత్వం తరపున నుంచి సమగ్ర సమాచారం సేకరించి కోర్టు ముందు ఉంచుతామని ఆయన విన్నవించారు.
ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో ఈ కేసు విచారణ జరగడం కష్టతరం అవుతుందన్న ఉద్దేశంతో.. మహారాష్ట్ర కోర్టు(సీబీఐ కోర్టు)లో విచారణ జరిపించారు. సీబీఐ కోర్టు వాళ్లకు /జీవిత ఖైదు శిక్షలు ఖరారు చేసింది. కానీ, ఈ కేసులో 11 మంది దోషుల్ని గతేడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం.
ఇక బిల్కిస్ బానో తరపు న్యాయవాది శోభా గుప్తా వాదిస్తూ.. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం దోషి రాధేశ్యామ్ 15 సంవత్సరాల 4 నెలల శిక్షా కాలం పూర్తి చేసుకోవడంతో.. రెమిషన్ ఇచ్చే అంశం పరిశీలించాలని సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వానికి చెప్పింది. కానీ, ప్రతిగా గుజరాత్ ప్రభుత్వం దోషులందరినీ విడుదల చేసిందని శోభా వాదించారు.
దోషుల్ని విడుదల చేయాలని ప్రతిపాదించిన ప్యానెల్ కమిటీ.. ‘‘సంప్రదాయ బ్రహ్మణులైన ఆ 11 మంది పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవివంచారని.. సత్‌ప్రవర్తన కారణంగానే వాళ్లను విడుదల చేయాలని తాము సూచిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు దోషుల విడుదల గురించి తనకు ఎలాంటి సమాచారం అందించలేదన్న అభ్యంతరాలపై బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌పై ఆగష్టు 24వ తేదీన విచారణ జరగనుంది.
ఇదీ చదవండి: నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment