Bilkis gang rape
-
బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలని 11 మంది దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లలో న్యాయంలేదని పేర్కొంది. దోషులు ఆదివారం నాటికి జైలులో లొంగిపోవాలని ఆదేశించింది. బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దోషులలో ఒకరైన గోవింద్‌భాయ్.. తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యతను పేర్కొంటూ గడువు పొడిగింపును కోరాడు. తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడనని ఆయన పేర్కొన్నాడు. మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని, ఆరు వారాల పొడిగింపును కోరాడు. మూడవ దోషి మితేష్ చిమన్లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అఘాయిత్యం జరిగింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే వీళ్లను విడుదల చేసింది. అయితే.. ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు, కారణం ఏంటంటే.. -
‘బిల్కిస్ బానో దోషుల్ని ఎలా రిలీజ్ చేస్తారు?’
ఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఇవాళ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో దోషుల్ని ఎలా విడుదల చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది సుప్రీంకోర్టు. 2002 అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోను అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబాన్ని ఊచ కోత కోశారు కొందరు. అయితే ఈ కేసుకు సంబంధించిన 11 మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని కలిపి ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ కేసులో దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. అలాంటప్పుడు 14 ఏళ్ల శిక్షాకాలం ముగియగానే వాళ్లను ఎలా విడుదల చేశారు?. ఇతర ఖైదీలను అలాంటి ఉపశమనం ఎందుకు ఇవ్వలేకపోయారు?. సత్ప్రవర్తన వీళ్లు మాత్రమే కనబర్చారా?.. ప్రత్యేకించి ఈ కేసులోనే దోషుల్ని విడుదల చేయడంలో అంతర్యం ఏంటి? అని గుజరాత్ ప్రభుత్వాన్ని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ ప్రశ్నించింది. ఈ మేరకు పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. బిల్కిస్ దోషుల కోసం జైలు సలహా కమిటీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని, అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను సైతం అందించాలని కోర్టు ఆదేశించింది. గోద్రా కోర్టులో విచారణ జరగకున్నా.. అభిప్రాయాన్ని ఎందుకు కోరారని కూడా ప్రశ్నించింది. అయితే ప్రశ్నలకు వివరణ కష్టతరమని, సుప్రీం కోర్టులో ఇందుకు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉందని అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. దోషుల చట్టప్రకారమే విడుదల జరిగిందని, 1992 పాలసీ ప్రకారం రెమిషన్ కింద ముందస్తుగా వాళ్లను విడుదల చేసిందని, విడుదలకు వాళ్లు అన్ని విధాల అర్హత కలిగి ఉన్నారని ఆయన కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ.. గుజరాత్ ప్రభుత్వం తరపున నుంచి సమగ్ర సమాచారం సేకరించి కోర్టు ముందు ఉంచుతామని ఆయన విన్నవించారు. ఇదిలా ఉంటే.. గుజరాత్లో ఈ కేసు విచారణ జరగడం కష్టతరం అవుతుందన్న ఉద్దేశంతో.. మహారాష్ట్ర కోర్టు(సీబీఐ కోర్టు)లో విచారణ జరిపించారు. సీబీఐ కోర్టు వాళ్లకు /జీవిత ఖైదు శిక్షలు ఖరారు చేసింది. కానీ, ఈ కేసులో 11 మంది దోషుల్ని గతేడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఇక బిల్కిస్ బానో తరపు న్యాయవాది శోభా గుప్తా వాదిస్తూ.. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం దోషి రాధేశ్యామ్ 15 సంవత్సరాల 4 నెలల శిక్షా కాలం పూర్తి చేసుకోవడంతో.. రెమిషన్ ఇచ్చే అంశం పరిశీలించాలని సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వానికి చెప్పింది. కానీ, ప్రతిగా గుజరాత్ ప్రభుత్వం దోషులందరినీ విడుదల చేసిందని శోభా వాదించారు. దోషుల్ని విడుదల చేయాలని ప్రతిపాదించిన ప్యానెల్ కమిటీ.. ‘‘సంప్రదాయ బ్రహ్మణులైన ఆ 11 మంది పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవివంచారని.. సత్ప్రవర్తన కారణంగానే వాళ్లను విడుదల చేయాలని తాము సూచిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు దోషుల విడుదల గురించి తనకు ఎలాంటి సమాచారం అందించలేదన్న అభ్యంతరాలపై బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌పై ఆగష్టు 24వ తేదీన విచారణ జరగనుంది. ఇదీ చదవండి: నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది? -
బిల్కిస్ బానోకు చుక్కెదురు.. దోషుల విడుదలపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురై, దోషుల విడుదలపై పోరాడుతున్న బాధితురాలు బిల్కిస్ బానోకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన, తమ కుటుంబ సభ్యులను హత్య చేసిన వారిని విడుదల చేయడంపై రెండు వేర్వేరు పిటిషన్ల ద్వారా సవాల్ చేసింది. అందులో ఒకటి దోషులకు రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని పిటిషన్ దాఖలు చేశారు బిల్కిస్ బానో. తాజాగా ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇదీ కేసు.. 2002లో గోద్రా రైలు దహనం తర్వాత గుజరాత్లో అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలోనే బిల్కిస్ బానో కుటుంబ సభ్యులను హత్య చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ స్పెషల్ కోర్టు 2008 జనవరిలో జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్లు జైలులో గడిపిన తర్వాత తమను విడుదల చేయాలంటూ అందులో ఒకరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో 1992 నాటి రెమిషన్ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది. అందుకు సుప్రీం కోర్టు సైతం అనుమతిచ్చింది. దీంతో వారు 2022, ఆగస్టు 15న దోషులను విడుదల చేశారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో దోషుల విడుదల కేసు విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ -
Bilkis Bano Case: విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేయటాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారణ ఇవాళ (డిసెంబర్ 13న) చేపట్టాల్సి ఉండగా.. జస్టిస్ బేలా ఎం త్రివేది విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను కొత్త బెంచ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ముందుకు మంగళవారం బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదల పిటిషన్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది విచారించాలనుకోవట్లేదని తెలిపారు మరో జడ్జీ జస్టిస్ అజయ్ రాస్తోగి. ‘ఈ ధర్మాసనం ముందుకు పిటిషన్ వచ్చినా.. అందులో ఒకరు తప్పుకున్నారు.’అని జస్టిస్ రాస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే, జస్టిస్ త్రివేది ఎందుకు తప్పుకున్నారనే విషయంపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె కుటుంబ సభ్యులతో సహా పలువురిని హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు అనంతరం నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకుని.. జీవిత ఖైదుగా మార్చాయి. తాజాగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ పాలసీ ప్రకారం.. ఆ పదకొండు మందిని విడుదల చేసింది. ఆగస్టు 15న 11 మంది దోషులను విడుదల చేయటాన్ని రెండు వేరువేరు పిటిషన్ల ద్వారా సవాల్ చేశారు బిల్కిస్ బానో. సుప్రీం కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇదీ చదవండి: 11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో.. సుప్రీంలో పిటిషన్ -
నేరస్థులను సన్మానించడం ముమ్మాటికీ తప్పే..
ముంబై: బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. వారికి కొందరు పూలమాలలు వేసి సన్మానాలు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తాజాగా మహారాష్ట్ర హోంమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే దోషులు విడుదలయ్యారని, వారంతా దాదాపు 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నారు. అయితే నేరస్థులకు పూలమాలలు వేసి సన్మానాలు చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే అని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇలా చేయటం సరికాదన్నారు. మహారాష్ట్ర భండారాలో 35ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానో ఘటనను సభలో ప్రస్తావించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 2002 గుజరాత్ అలర్ల సమయంలో బాల్కిస్ బానో సామూహిక అత్యాచార ఘటన జరిగింది. బాధితురాలి కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 11 మందిని 2008లో దోషులుగా తేల్చింది ముంబయిలోని సీబీఐ న్యాయస్థానం. అందరికీ యవజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. అయితే 14 ఏళ్ల శిక్షకాలం పూర్తి చేసుకున్నందున తమను జైలు నుంచి విడుదల చేయాలని దోషుల్లో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని గుజారత్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న 11 మందిని విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. వీరంతా జైలు నుంచి బయటకు రాగానే కొందరు పూలమాలలు వేసి మిఠాయిలు తినిపించారు. దోషులందరినీ జైలు నుంచి విడుదల చేయడం, సన్మానించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
‘బిల్కిస్ బానో’ దోషుల విడుదలపై సుప్రీం కోర్టులో పిల్
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేయటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు పలువురు మహిళా హక్కుల కార్యకర్తలు. సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో దోషులుగా తేలిన వారిని విడుదల చేయొద్దని పిటిషన్లో పేర్కొన్నారు. బిల్కిస్ బానో కేసు దోషుల రెమిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు మహిళా హక్కుల కార్యకర్తలు సుభాషిని అలీ, రేవతి లాల్, రాప్ రేఖ వర్మలు. ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, అపర్నా భట్. 14 మంది హత్య, గర్భిణీపై అత్యాచారానికి సంబంధించిన కేసులో దోషులను విడుదల చేయటాన్ని సవాల్ చేసినట్లు కపిల్ సిబాల్ పేర్కొన్నారు. ఈ పిల్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అంతకు ముందు.. సుమారు 6వేల మంది హక్కుల కార్యకర్తలు, చరిత్రకారులు దోషుల విడుదలను వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు. ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్ ఆవేదన -
‘వారు సంస్కారవంతులు’.. బిల్కిస్ బానో దోషులకు బీజేపీ ఎమ్మెల్యే మద్దతు
బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది నిందితులను విడుదల చేయటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈక్రమంలో అధికార బీజేపీ ఎమ్మెల్యే దోషులకు మద్దతు తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులోని దోషుల్లో కొందరు బ్రాహ్మణులు ఉన్నారని, వారు సంస్కారవంతులని గుజరాత్‌లోని గోద్రా బీజేపీ ఎమ్మెల్యే సి.కె.రౌల్జీ చెప్పారు. ఈ కేసులో దోషులకు శిక్షను తగ్గించాలని సిఫార్సు చేసిన ప్రభుత్వ కమిటీలోని ఇద్దరు బీజేపీ నేతల్లో ఎమ్మెల్యే రౌల్జీ ఒక సభ్యుడు కావడం గమనార్హం. ‘వారు నేరం చేశారో లేదో నాకు తెలియదు. కానీ, నేరం చేసే ఉద్దేశం ఉండి ఉండాలి. వారిలో కొంత మంది బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులు మంచి సంస్కారవంతులు. వారిని శిక్షించాలని కొందరి దురుద్దేశం అయి ఉండవచ్చు. జైలులో ఉన్నప్పుడు వారు సత్ప్రవర్తన కలిగి ఉన్నారు.’ అని పేర్కొన్నారు సీకే రౌల్జీ. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బిల్కిస్ బానో కేసు 2002 గుజరాత్ గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో.. దాహోద్ జిల్లా లింఖేధా మండలం రంధిక్పూర్లో.. మూక దాడులు జరిగాయి. దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చడంతో పాటు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. బిల్కిస్ బానోస్ కుటుంబంపైనా దాడి జరిగింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్ కుటుంబ సభ్యులు ఏడుగురిని(బిల్కిస్ మూడేళ్ల కూతురిని సహా) హతమార్చారు. ఆ సమయానికి బిల్కిస్ వయసు 21 ఏళ్లు. ఆ దాడుల్లో ప్రాణాలతో బయటపడింది బిల్కిస్, ఓ వ్యక్తి, మూడేళ్ల ఓ చిన్నారి మాత్రమే. ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్ ఆవేదన -
మోదీజీ.. సిగ్గనిపించడం లేదా?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అత్యాచార ఘటనల్లో దోషులకు అధికార బీజేపీ అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మహిళల పట్ల బీజేపీ వైఖరి ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇలాంటి రాజకీయాలు చూస్తే మీకు సిగ్గనిపించడం లేదా? అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సూటిగా ప్రశ్నించారు. ఉన్నావో, హథ్రాస్, కథువా తదితర సంఘటనల్లో నేరస్తులకు బీజేపీ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. గుజరాత్లో బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడినవారిని జైలు నుంచి విడుదల చేశారని ఆక్షేపించారు రాహుల్ గాంధీ. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. బిల్కిస్ బానోపై గ్యాంగ్‌రేప్ కేసులో దోషులైన 11 మందిని జైలు నుంచి విడుదల చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సైతం తప్పుపట్టారు. उन्नाव- भाजपा MLA को बचाने का काम कठुआ- बलात्कारियों के समर्थन में रैली हाथरस- बलात्कारियों के पक्ष में सरकार गुजरात- बलात्कारियों की रिहाई और सम्मान! अपराधियों का समर्थन महिलाओं के प्रति भाजपा की ओछी मानसिकता को दर्शाता है। ऐसी राजनीति पर शर्मिंदगी नहीं होती, प्रधानमंत्री जी? — Rahul Gandhi (@RahulGandhi) August 18, 2022 ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్ ఆవేదన -
ఇక భయంతో బతకాల్సిందేనా?: బిల్కిస్ బానో ఆవేదన
తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను రెమిషన్ కింద విడుదల చేయడంపై బిల్కిస్ యాకూబ్ రసూల్ అలియాస్ బిల్కిస్ బానో స్పందించారు. న్యాయవ్యవస్థ పట్ల తనకున్న నమ్మకాన్ని ఈ నిర్ణయం చెదరగొట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం తనను మోసం చేసిందని, ఆ నిర్ణయం బాధించిందని, ఇంతకాలం అభద్రతాభావంతో బతికిన తాను ఇకపైనా భయంభయంగా బతకాల్సిందేనా? అంటూ ప్రశ్నిస్తున్నారామె. ‘‘న్యాయస్థానాలు పవిత్రమైనవి నమ్మాను. కానీ, ఏ మహిళకైనా న్యాయపరిధిలో ఇలాంటి ముగింపు దక్కుతుందా?. నేను వ్యవస్థను నమ్మాను. అందుకే గాయంతోనే జీవించడం నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. నా ఈ బాధ, అస్థిరమైన విశ్వాసం నా ఒక్కదానిదే కాదు.. న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి స్త్రీది అని ఆమె పేర్కొన్నారు. ఇది అన్యాయం. నా భద్రత, బాగోగుల గురించి పట్టింపులేదన్నట్లు గుజరాత్ ప్రభుత్వం వ్యవహరించింది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలిని సంప్రదించాలన్న స్పృహ గుజరాత్ ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరం. గుజరాత్ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే.. భయాందోళనలు లేకుండా మనశ్శాంతిగా బతికే నా హక్కును నాకు ఇవ్వమని. నన్ను, నా కుటుంబానికి రక్షణ కల్పించమని అని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు. జైల్లో ఉన్నా భయంగానే.. బిల్కిస్ బానో పోరాటం పద్దెనిమిదేళ్ల పైనే కొనసాగింది. ఈ సమయంలో ఆమె ఒక చోట స్థిరంగా ఉండలేదు. దోషుల కుటుంబాల నుంచి హాని పొంచి ఉండడంతో అజ్ఞాతంలో కొన్నాళ్లు, ఆపై క్రమంతప్పకుండా ఇళ్లను మారుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు నిందితుల విడుదలతో ఆమెలో మరింత ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాది శోభా గుప్తా చెప్తున్నారు. నిందితుల విడుదల వ్యవహారంపై న్యాయ పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారామె. గుజరాత్ వీహెచ్‌పీ ఆఫీస్‌లో సన్మానం అందుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు దోషులు బిల్కిస్ బానో కేసు 2002 గుజరాత్ గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో.. దాహోద్ జిల్లా లింఖేధా మండలం రంధిక్పూర్లో.. మూక దాడులు జరిగాయి. దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చడంతో పాటు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. బిల్కిస్ బానోస్ కుటుంబంపైనా దాడి జరిగింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్ కుటుంబ సభ్యులు ఏడుగురిని(బిల్కిస్ మూడేళ్ల కూతురిని సహా) హతమార్చారు. ఆ సమయానికి బిల్కిస్ వయసు 21 ఏళ్లు. ఆ దాడుల్లో ప్రాణాలతో బయటపడింది బిల్కిస్, ఓ వ్యక్తి, మూడేళ్ల ఓ చిన్నారి మాత్రమే. ఈ కేసులో 2008, జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేలుస్తూ శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ బిల్కిస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేసును సుప్రీంకోర్టు అహ్మదాబాద్ నుంచి బాంబే హైకోర్టుకు బదలాయించింది. ఇది అత్యంత అరుదైన కేసని, ప్రధాన నిందితులైన జశ్వంత్‌భాయ్, గోవింద్‌భాయ్, రాధేశ్యాంలకు ఉరిశిక్ష వేయాలని సీబీఐ వాదించింది. అయితే.. కింది కోర్టు ఇచ్చిన జీవిత ఖైదు తీర్పును సమర్థించి బాంబే హైకోర్టు. 1992 పాలసీ ప్రకారం.. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో నిందితులను రెమిషన్ కింద విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. దీంతో దేశం మొత్తం భగ్గుమంది. రేపిస్టులు.. నరహంతకులను విడుదల చేయడంపై రాజకీయ నేతల దగ్గరి నుంచి సామాన్యుల దాకా సోషల్ మీడియాలో గుజరాత్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రెమిషన్ పాలసీ 2014 ప్రకారం.. తీవ్రమైన నేరాలకు పాల్పడిన నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయకూడదు. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం దోషులకు 2008లో శిక్ష పడిందని, ‘సుప్రీం కోర్టు ఆదేశాలానుసారం 1992 పాలసీ ప్రకారం’ వాళ్ల విడుదల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని విడుదల చేశామని తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇదీ చదవండి: అసలు ‘బిల్కిస్’ దోషుల విడుదలకు కేంద్రం అనుమతి ఉందా? -
‘‘బిల్కిస్’ దోషుల విడుదలకు కేంద్రం అనుమతి ఉందా?’
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో ఉదంతంలో ప్రధాని మోదీపై విమర్శల దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రం చేసింది. సామూహిక అత్యాచారం, హత్యలకు సంబంధించిన ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది విడుదల విషయంలో గుజరాత్ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘ఈ నిర్ణయానికి మోదీ అనుమతి ఉందా? లేని పక్షంలో గుజరాత్ సీఎంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆయన, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పాలి’’ అని బుధవారం డిమాండ్ చేశారు. మోదీ మాటలకూ చేతలకూ ఎంత తేడా ఉందో ప్రపంచమంతా గమనిస్తూనే ఉందన్నారు రాహుల్ గాంధీ. ‘‘ఐదు నెలల గర్భిణిపై సామూహిక అత్యాచారానికి, ఆమె మూడున్నరేళ్ల చిన్నారితో పాటు ఏడుగురు కుటుంబీకుల పాశవిక హత్యకు పాల్పడ్డ వాళ్లను స్వాతంత్య్ర అమృతోత్సవం నాడే విడుదల చేశారు. నారీ శక్తి అంటూ భారీ ప్రసంగాలు చేసిన వాళ్లు ఈ చర్యల ద్వారా మహిళలకు ఏం సందేశమిచ్చినట్టు?’’ అంటూ మోదీ పంద్రాగస్టు ప్రసంగాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. సీబీఐ వంటి సంస్థలు దర్యాప్తు చేసిన కేసుల్లో దోషులకు కేంద్రం అనుమతి లేకుండా క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. ఇదీ చదవండి: మోదీజీ.. అదే నిజమైతే మీ చిత్తశుద్ది నిరూపించుకోండి.. రేపిస్టులకు బెయిల్ రాకుండా చేయండి: మంత్రి కేటీఆర్ -
సిగ్గుచేటు నిర్ణయం
ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారాలు చట్టబద్ధమైనవే కావచ్చు. కానీ, రాజకీయ కారణాలతో వాటిని విచక్షణా రహితంగా వాడితే? ఇరవై ఏళ్ళ క్రితం గుజరాత్ మారణకాండ వేళ దేశాన్ని కుదిపేసిన బిల్కిస్ బానో కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడదే జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ‘నారీశక్తి’ గురించి గొప్పగా చెప్పారు. ‘మహిళల్ని తక్కువగా చూసి, బాధించే మన ప్రవర్తననూ, సంస్కృతినీ, రోజువారీ జీవనవిధానాన్నీ మార్చుకోలేమా’ అని అడిగారు. కానీ, సరిగ్గా అదే రోజున సాక్షాత్తూ ప్రధాని మాటల స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఆయన స్వరాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం దిగ్భ్రాంతికరం. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో యావజ్జీవ కారాగార వాసం అనుభవించాల్సిన 11 మంది దోషులకు శిక్ష తగ్గించి, విడుదల చేయడం శోచనీయం. మతఘర్షణల్లో మూడేళ్ళ పసికందు తలను బండకేసి కొట్టి, మరో 13 మంది ముస్లిమ్‌లను చిత్రహింసలు పెట్టి క్రూరంగా చంపి, 5 గ్యాంగ్ రేపులు చేసిన 11 మంది దోషుల అమానుషత్వం ఇప్పటికీ దేశాన్ని నిద్రపోనివ్వని పీడకల. అయినా సరే ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో పాలకులు ఇలా క్షమించి, వదిలేశారంటే – దాని వెనుక కారణాలు ఏమై ఉంటాయో ఊహించడం కష్టమేమీ కాదు. ఈ రాజకీయ నిర్ణయంతో దోషులకు శిక్ష మాటేమో కానీ, బాధితులకు జరగాల్సిన న్యాయం తగ్గిందనే భావన కలుగుతోంది. తక్షణమే ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోకుంటే, ఇది ఒక పూర్వోదాహరణగా మారే ప్రమాదం ఉంది. పాలకుల చేతిలోని శిక్షాకాలపు తగ్గింపు అధికారాలు ఎక్కడికక్కడ తరచూ దుర్వినియోగం కావచ్చనే భయమూ కలుగుతోంది. 2002 గుజరాత్ అల్లర్లలో రాష్ట్రం విడిచి పారిపోవడానికి ప్రయత్నించిన వందలాది గుజరాతీ ముస్లిమ్లలో బిల్కిస్ బానో ఒకరు. మార్చి 3న ఆమె తన మూడేళ్ళ పాపతో, 15 మంది కుటుంబ సభ్యులతో కలసి గ్రామం విడిచిపోతూ, పొలంలో తలదాచుకున్నారు. కత్తులు, కర్రలు, కొడవళ్ళు పట్టుకొని దాడికి దిగిన దుర్మార్గులు అయిదునెలల గర్భిణి అయిన 21 ఏళ్ళ బానోపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆమె కళ్ళెదుటే ఆమె కుటుంబ సభ్యులు ఏడుగుర్ని దారుణంగా చంపారు. ఆమె తల్లినీ, సోదరినీ వదలకుండా హత్యాచారం చేశారు. కొనఊపిరితో మిగిలిన బానో కళ్ళు తెరి చాక, ఓ ఆదివాసీ మహిళ ఇచ్చిన వస్త్రాలతో బయటపడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేక మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో చివరకు సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకుంది. బానోకు ప్రాణహాని బెదిరింపుల మధ్య సరైన న్యాయవిచారణ కోసం కేసు గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేశారు. దోషులకు 2008లో సీబీఐ కోర్ట్ విధించిన శిక్షను 2017లో బొంబాయి హైకోర్ట్, ఆపైన సుప్రీమ్ సమర్థించాయి. తీరా ఇప్పుడు కనీసం 14 ఏళ్ళ జైలుశిక్ష పూర్తయిన ఖైదీలను విడుదల చేసే విచక్షణాధికారాన్ని అడ్డం పెట్టుకొని, దోషులను గుజరాతీ సర్కార్ విడుదల చేసింది. గోధ్రా జైలు నుంచి బయటకొచ్చిన దోషుల్లో పలువురు విశ్వహిందూ పరిషత్ సభ్యులని వార్త. రేపిస్టు, హంతకులను సమర్థిస్తూ, దండలు వేసి స్వాగతిస్తూ, లడ్డూలు పంచుతున్న దృశ్యాలు తల దించుకొనేలా చేస్తున్నాయి. బాధితురాలు బానో బిక్కుబిక్కుమంటూ 15 ఏళ్ళలో ఇరవై ఇళ్ళు మారి, దీర్ఘకాలం చేసిన పోరాటం వృథాయేనా? బాధితురాలు నివసిస్తున్న అదే గ్రామంలో ఆమె ఎదుటే, ఇప్పుడా 11 మంది దోషులు రొమ్ము విరుచుకు తిరుగుతుంటే, అదెంత మానసిక క్షోభ? కక్ష కట్టిన దోషుల నుంచి ఆమె ప్రాణాలకు ఎవరు రక్ష? కేంద్రాన్ని సంప్రతించకుండా శిక్షాకాలపు తగ్గింపు నిర్ణయం తీసుకోరాదని చట్టం. సంప్రతించడమంటే, అనుమతి అనే తాత్పర్యం. అంటే, హేయమైన నేరం చేసినవారిని వదిలేయాలన్న గుజరాత్ సర్కార్ పాపంలో కేంద్రానికీ వాటా ఉందనేగా! అదేమంటే, నిందితులకు శిక్షపడిన 2008 నాటికి అమలులో ఉన్న పాత 1992 నాటి విధి విధానాల ప్రకారమే నడుచుకున్నామంటూ సర్కార్ తప్పించుకోజూస్తోంది. నిజానికి ఆ నిబంధనల్ని కొట్టేసి, 2013లో కొత్త నిబంధనలూ వచ్చాయి. సున్నితమైన కేసుల్లో నిబంధనల్లోని లొసుగుల్ని వాడుకొనే కన్నా, సామాన్యులకు జరిగిన అన్యాయంపై పాలకులు కఠినంగా ఉండాలనే ప్రజలు ఆశిస్తారు. గుజరాత్ సర్కార్ ప్రవర్తన అలా లేదు. పైగా, బానో కేసు దోషులకు శిక్షాకాలం తగ్గించమన్న సలహా సంఘంలో ఇద్దరు సభ్యులు బీజేపీ ఎమ్మెల్యేలే. వృందా గ్రోవర్ లాంటి లాయ ర్లన్నట్టు ఆ 1992 నాటి నిబంధనల కాపీ పబ్లిక్ డొమైన్లో కనిపించకుండాపోవడం ఆశ్చర్యకరం. బానో కేసులో దోషుల్ని జైలు నుంచి విడిచిపెట్టి, గుజరాత్ అల్లర్లపై గళం విప్పిన ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్, పోలీసు అధికారులు సంజీవ్ భట్, ఆర్పీ శ్రీకుమార్ లాంటివారిని కటకటాల వెనక్కి నెట్టడం వక్రోక్తి. నోరెత్తిన నేరానికి వయోభారం, వైకల్యంతో ఉన్నాసరే కవుల్నీ, ప్రొఫెసర్లనీ విచారణ సాకుతో అక్రమ కేసుల్లో ఏళ్ళ తరబడి జైలులో మగ్గబెడుతున్న మన పాలక, న్యాయవ్యవస్థ లకు క్రూరమైన హత్యాచార దోషులపై ఎక్కడలేని జాలి కలగడం విడ్డూరం. 2012లో ‘నిర్భయ’ తర్వాత దేశంలో కఠిన చట్టాలు చేశామని జబ్బలు చరుచుకుంటున్న పాలకుల చిత్తశుద్ధిని ఇప్పుడేమ నాలి? స్త్రీలు సరైన దుస్తులు ధరించకపోతే అత్యాచార వ్యతిరేక చట్టం వర్తించదంటున్న కేరళ కోర్టును చూస్తే మన వ్యవస్థలు ఏం మారినట్టు? ఈ మాటలు, నిర్ణయాలు సమాజానికే సిగ్గుచేటు. బానో కేసులో పాలకుల నిర్ణయం మహిళలెవ్వరూ సహించలేని ఘోరం! క్షమించలేని నేరం! -
మోదీగారు.. మహిళలంటే గౌరవం ఉంటే గనుక..!: కేటీఆర్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను.. రెమిషన్ ఆదేశాల కింద గుజరాత్ సర్కార్ విడుదల చేయడంపై దేశం భగ్గుమంటోంది. గుజరాత్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుండగా.. విపక్షాలు, మేధోవర్గం ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఏకీపడేస్తున్నాయి. ఈ క్రమంలో.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సైతం ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రియమైన మోదీగారు.. మహిళల గౌరవం గురించి మీరు మాట్లాడడం నిజమే అయితే.. ఈ విషయంలో జోక్యం చేసుకోండి. పదకొండు మంది రేపిస్టులను విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వపు ఆదేశాలను రద్దు చేయించండి. ఈ దేశాలు వెగటు పుట్టించేవిగా ఉన్నాయి. మీరు జోక్యం చేసుకుని చిత్తశుద్ధి చూపించాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు కేటీఆర్. Dear PM @narendramodi Ji, If you had really meant what you spoke about Respecting women, urge you to intervene & rescind the Gujarat Govt remission order releasing 11 Rapists 🙏 Sir, it is nauseating to put it mildly & against MHA order. Need you to show sagacity to the Nation — KTR (@KTRTRS) August 17, 2022 అంతేకాదు.. సార్.. ఐపీసీ, సీఆర్పీసీలో రేపిస్టులకు బెయిల్ దొరక్కుండా ఉండేందుకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని, బలమైన చట్టాలతోనే న్యాయవ్యవస్థ పటిష్టంగా, వేగంగా పని చేస్తుందని మరో కొనసాగింపు ట్వీట్లో పేర్కొన్నారు కేటీఆర్. ఇదీ చదవండి: మోదీ పాతికేళ్ల లక్ష్యాలు భేష్..: కేటీఆర్ -
కశ్మీరీ పండిట్లకు రక్షణ ఏదీ?: ఒవైసీ
ఢిల్లీ: కశ్మీరీ పండిట్ల రక్షణ విషయంలో కేంద్రం అవలంభిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తాజాగా అక్కడ కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణ దాడి నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. కశ్మీరీ లోయలో కశ్మీరీ పండిట్లకు రక్షణ కరువైంది. కేంద్ర పాలన దారుణంగా విఫలమవుతోంది. ఆర్టికల్ 370 రద్దు పండిట్లకు లాభం చేకూరుస్తుందని ప్రచారం చేసింది కేంద్రం. కానీ, ఇప్పుడు వాళ్లు అక్కడ అభద్రతా భావానికి లోనవుతున్నారు అని కేంద్రాన్ని నిందించారు ఒవైసీ. అక్కడ(జమ్ము కశ్మీర్)లో బీజేపీ చేత నియమించబడ్డ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. నరేంద్ర మోదీ పాలనే అక్కడా సాగుతోంది. కానీ, చేతకానీ స్థితిలో ఉండిపోయారు వాళ్లు అంటూ విమర్శించారు. అలాగే.. గుజరాత్లో బిల్కిస్ బానో దురాగతం నిందితులకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడంపైనా ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ నారీశక్తి గురించి మాట్లాడారు. అలాంటిది గ్యాంగ్‌రేప్ దోషులకు రిలీజ్ చేయడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. ఇక యూపీలో గాడ్సే ఫొటోతో తిరంగా యాత్రను నిర్వహించడంపై.. అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఎంపీ ఒవైసీ. మాటల్లో గాంధీని ఉపయోగిస్తున్నారని.. కానీ, చేతల్లో గాడ్సే మీద ప్రేమను ఒలకబోస్తున్నారంటూ యోగి సర్కార్‌పై మండిపడ్డారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో క(వ్య)థ ఇది! -
బిల్కిస్ సామూహిక అత్యాచారం కేసులో 12 మందికి జీవిత ఖైదు
► కింది కోర్టు తీర్పును సమర్థించిన బాంబే హైకోర్టు ► ముగ్గురికి ఉరిశిక్ష వేయాలన్న సీబీఐ అభ్యర్థన తిరస్కరణ ముంబై: గుజరాత్లో సంచలనం రేపిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 12 మందికి జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. దోషుల్లో ముగ్గురికి ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులు, వైద్యులను నిర్దోషులుగా ప్రకటించిన కింది కోర్టు తీర్పును పక్కనబెట్టింది. కాగా, ఈ ఏడుగురూ ఇప్పటికే అనుభవించిన జైలు జీవితాన్ని శిక్షా కాలంగా పరిగణిస్తామని, అయితే ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధిస్తున్నామని, ఈ మొత్తాన్ని 8 వారాల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వీకే తహిల్రమణి, జస్టిస్ మృదులా భట్కర్తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. దోషుల్లో ఒకరు శిక్ష అనుభవిస్తూ మరణించారు. 2002 గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్‌పూర్‌లోని బిల్కిస్ ఇంటిపై దాడి చేశారు. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్ కుటుంబ సభ్యులు ఏడుగురిని హతమార్చారు. ఈ కేసులో 2008లో ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేలుస్తూ శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ బిల్కిస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేసును సుప్రీంకోర్టు అహ్మదాబాద్ నుంచి ముంబై హైకోర్టుకు బదలాయించింది. ఇది అత్యంత అరుదైన కేసని, ప్రధాననిందితులైన జశ్వంత్‌భాయ్, గోవింద్‌భాయ్, రాధేశ్యాంలకు ఉరిశిక్ష వేయాలని సీబీఐ వాదించింది. శిక్ష పడింది వీరికే: జశ్వంత్‌భాయ్ నాయి, గోవింద్‌భాయ్ నాయి, శైలేష్ భట్, రాధేశ్యాం షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, ప్రదీప్ మొరాధియా, బకభాయి వోహానియా, రాజుభాయ్ సోని, మితేష్భట్, రమేష్ చందన.