ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారాలు చట్టబద్ధమైనవే కావచ్చు. కానీ, రాజకీయ కారణాలతో వాటిని విచక్షణా రహితంగా వాడితే? ఇరవై ఏళ్ళ క్రితం గుజరాత్ మారణకాండ వేళ దేశాన్ని కుదిపేసిన బిల్కిస్ బానో కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడదే జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ‘నారీశక్తి’ గురించి గొప్పగా చెప్పారు. ‘మహిళల్ని తక్కువగా చూసి, బాధించే మన ప్రవర్తననూ, సంస్కృతినీ, రోజువారీ జీవనవిధానాన్నీ మార్చుకోలేమా’ అని అడిగారు. కానీ, సరిగ్గా అదే రోజున సాక్షాత్తూ ప్రధాని మాటల స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఆయన స్వరాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం దిగ్భ్రాంతికరం. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో యావజ్జీవ కారాగార వాసం అనుభవించాల్సిన 11 మంది దోషులకు శిక్ష తగ్గించి, విడుదల చేయడం శోచనీయం.
మతఘర్షణల్లో మూడేళ్ళ పసికందు తలను బండకేసి కొట్టి, మరో 13 మంది ముస్లిమ్‌లను చిత్రహింసలు పెట్టి క్రూరంగా చంపి, 5 గ్యాంగ్ రేపులు చేసిన 11 మంది దోషుల అమానుషత్వం ఇప్పటికీ దేశాన్ని నిద్రపోనివ్వని పీడకల. అయినా సరే ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో పాలకులు ఇలా క్షమించి, వదిలేశారంటే – దాని వెనుక కారణాలు ఏమై ఉంటాయో ఊహించడం కష్టమేమీ కాదు. ఈ రాజకీయ నిర్ణయంతో దోషులకు శిక్ష మాటేమో కానీ, బాధితులకు జరగాల్సిన న్యాయం తగ్గిందనే భావన కలుగుతోంది. తక్షణమే ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోకుంటే, ఇది ఒక పూర్వోదాహరణగా మారే ప్రమాదం ఉంది. పాలకుల చేతిలోని శిక్షాకాలపు తగ్గింపు అధికారాలు ఎక్కడికక్కడ తరచూ దుర్వినియోగం కావచ్చనే భయమూ కలుగుతోంది.
2002 గుజరాత్ అల్లర్లలో రాష్ట్రం విడిచి పారిపోవడానికి ప్రయత్నించిన వందలాది గుజరాతీ ముస్లిమ్‌లలో బిల్కిస్ బానో ఒకరు. మార్చి 3న ఆమె తన మూడేళ్ళ పాపతో, 15 మంది కుటుంబ సభ్యులతో కలసి గ్రామం విడిచిపోతూ, పొలంలో తలదాచుకున్నారు. కత్తులు, కర్రలు, కొడవళ్ళు పట్టుకొని దాడికి దిగిన దుర్మార్గులు అయిదునెలల గర్భిణి అయిన 21 ఏళ్ళ బానోపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆమె కళ్ళెదుటే ఆమె కుటుంబ సభ్యులు ఏడుగుర్ని దారుణంగా చంపారు. ఆమె తల్లినీ, సోదరినీ వదలకుండా హత్యాచారం చేశారు. కొనఊపిరితో మిగిలిన బానో కళ్ళు తెరి చాక, ఓ ఆదివాసీ మహిళ ఇచ్చిన వస్త్రాలతో బయటపడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫలితం లేక మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో చివరకు సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకుంది. బానోకు ప్రాణహాని బెదిరింపుల మధ్య సరైన న్యాయవిచారణ కోసం కేసు గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేశారు. దోషులకు 2008లో సీబీఐ కోర్ట్ విధించిన శిక్షను 2017లో బొంబాయి హైకోర్ట్, ఆపైన సుప్రీమ్ సమర్థించాయి. తీరా ఇప్పుడు కనీసం 14 ఏళ్ళ జైలుశిక్ష పూర్తయిన ఖైదీలను విడుదల చేసే విచక్షణాధికారాన్ని అడ్డం పెట్టుకొని, దోషులను గుజరాతీ సర్కార్ విడుదల చేసింది.
గోధ్రా జైలు నుంచి బయటకొచ్చిన దోషుల్లో పలువురు విశ్వహిందూ పరిషత్ సభ్యులని వార్త. రేపిస్టు, హంతకులను సమర్థిస్తూ, దండలు వేసి స్వాగతిస్తూ, లడ్డూలు పంచుతున్న దృశ్యాలు తల దించుకొనేలా చేస్తున్నాయి. బాధితురాలు బానో బిక్కుబిక్కుమంటూ 15 ఏళ్ళలో ఇరవై ఇళ్ళు మారి, దీర్ఘకాలం చేసిన పోరాటం వృథాయేనా? బాధితురాలు నివసిస్తున్న అదే గ్రామంలో ఆమె ఎదుటే, ఇప్పుడా 11 మంది దోషులు రొమ్ము విరుచుకు తిరుగుతుంటే, అదెంత మానసిక క్షోభ? కక్ష కట్టిన దోషుల నుంచి ఆమె ప్రాణాలకు ఎవరు రక్ష? కేంద్రాన్ని సంప్రతించకుండా శిక్షాకాలపు తగ్గింపు నిర్ణయం తీసుకోరాదని చట్టం. సంప్రతించడమంటే, అనుమతి అనే తాత్పర్యం. అంటే, హేయమైన నేరం చేసినవారిని వదిలేయాలన్న గుజరాత్ సర్కార్ పాపంలో కేంద్రానికీ వాటా ఉందనేగా!
అదేమంటే, నిందితులకు శిక్షపడిన 2008 నాటికి అమలులో ఉన్న పాత 1992 నాటి విధి విధానాల ప్రకారమే నడుచుకున్నామంటూ సర్కార్ తప్పించుకోజూస్తోంది. నిజానికి ఆ నిబంధనల్ని కొట్టేసి, 2013లో కొత్త నిబంధనలూ వచ్చాయి. సున్నితమైన కేసుల్లో నిబంధనల్లోని లొసుగుల్ని వాడుకొనే కన్నా, సామాన్యులకు జరిగిన అన్యాయంపై పాలకులు కఠినంగా ఉండాలనే ప్రజలు ఆశిస్తారు. గుజరాత్ సర్కార్ ప్రవర్తన అలా లేదు. పైగా, బానో కేసు దోషులకు శిక్షాకాలం తగ్గించమన్న సలహా సంఘంలో ఇద్దరు సభ్యులు బీజేపీ ఎమ్మెల్యేలే. వృందా గ్రోవర్ లాంటి లాయ ర్లన్నట్టు ఆ 1992 నాటి నిబంధనల కాపీ పబ్లిక్ డొమైన్‌లో కనిపించకుండాపోవడం ఆశ్చర్యకరం.
బానో కేసులో దోషుల్ని జైలు నుంచి విడిచిపెట్టి, గుజరాత్ అల్లర్లపై గళం విప్పిన ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్, పోలీసు అధికారులు సంజీవ్ భట్, ఆర్పీ శ్రీకుమార్ లాంటివారిని కటకటాల వెనక్కి నెట్టడం వక్రోక్తి. నోరెత్తిన నేరానికి వయోభారం, వైకల్యంతో ఉన్నాసరే కవుల్నీ, ప్రొఫెసర్లనీ విచారణ సాకుతో అక్రమ కేసుల్లో ఏళ్ళ తరబడి జైలులో మగ్గబెడుతున్న మన పాలక, న్యాయవ్యవస్థ లకు క్రూరమైన హత్యాచార దోషులపై ఎక్కడలేని జాలి కలగడం విడ్డూరం. 2012లో ‘నిర్భయ’ తర్వాత దేశంలో కఠిన చట్టాలు చేశామని జబ్బలు చరుచుకుంటున్న పాలకుల చిత్తశుద్ధిని ఇప్పుడేమ నాలి? స్త్రీలు సరైన దుస్తులు ధరించకపోతే అత్యాచార వ్యతిరేక చట్టం వర్తించదంటున్న కేరళ కోర్టును చూస్తే మన వ్యవస్థలు ఏం మారినట్టు? ఈ మాటలు, నిర్ణయాలు సమాజానికే సిగ్గుచేటు. బానో కేసులో పాలకుల నిర్ణయం మహిళలెవ్వరూ సహించలేని ఘోరం! క్షమించలేని నేరం!
Comments
Please login to add a commentAdd a comment