ఈ పాపం ఎవరిది? | Sakshi Editorial On Fire Accidents | Sakshi
Sakshi News home page

ఈ పాపం ఎవరిది?

Published Wed, May 29 2024 5:16 AM | Last Updated on Wed, May 29 2024 5:16 AM

Sakshi Editorial On Fire Accidents

గత వారం జరిగిన అగ్ని ప్రమాదాలు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఇరవై నాలుగు గంటల్లో వేర్వేరు చోట్ల సంభవించిన ఈ ప్రమాదాల్లో అభం శుభం తెలియని పలువురు చిన్నారులతో సహా 40 మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదం. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ గేమింగ్‌ జోన్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 33 మంది, అదే రాత్రి తూర్పు ఢిల్లీలోని పిల్లల ఆసుపత్రిలోని ఘోర ప్రమాదంలో నవజాత శిశువులు ఏడుగురు దుర్మరణం పాలైన ఘటనలు సున్నిత మనస్కుల్ని చాలాకాలం వెంటాడనున్నాయి. 

ఆక్సిజన్‌ సిలిండర్ల పేలుడు సంభవించిన ఆ ఆసుప్రతి లైసెన్స్‌ గడువు రెండు నెలల క్రితమే తీరిపోతే, రాజ్‌కోట్‌ గేమింగ్‌ జోన్‌ నిరభ్యంతర పత్రమే (ఎన్‌ఓసీ) లేకుండానే యథేచ్ఛగా నడుస్తుండడం మన వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. నిబంధనల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. అగ్నిప్రమాద నివారణ నిబంధనలు, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరంపై మరోసారి చర్చ మొదలైంది. 

తాజా ఘటనల నేపథ్యంలో – పాతికేళ్ళ పైచిలుకు క్రితం 1997లో ఢిల్లీలో జరిగిన ఉపహార్‌ సినిమా హాలు ప్రమాదం మొదలు 2004లో 90 మంది పాఠశాల విద్యార్థులను బలి తీసుకున్న కుంభకోణం అగ్నిప్రమాదం దాకా పాత పీడకలలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. గతం నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకున్నామని నిలదీస్తున్నాయి. వాణిజ్య సంస్థల నుంచి నివాస ప్రాంగణాల దాకా అన్నిచోట్లా ఇవాళ ప్రాథమిక భద్రతా ఏర్పాట్లు మృగ్యమైపోతున్నాయి. 

అనుకోనిది ఏం జరిగినా పదుల కొద్దీ ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నాయి. మే 26 నాటి ప్రమాదంలో శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కానీ, ప్రమాద భద్రతా సర్టిఫికెట్‌ కానీ, చివరకు అగ్ని ప్రమాద నివారణ సామగ్రి కానీ, సరైన నిష్క్రమణ మార్గాలు కానీ లేకుండానే ఢిల్లీ లాంటి చోట ఒక ఆసుపత్రి నడుస్తోందంటే ఏమనాలి? రాజ్‌కోట్‌ గేమింగ్‌ జోన్‌లో ఎలాంటి కనీస అగ్నిప్రమాద భద్రతా లేకుండా దాదాపు రెండంతస్తుల భవనం ఎత్తున రేకులతో పెద్ద నిర్మాణం చేపడితే అధికారులు ఏం చేస్తున్నట్టు? ఆ ప్రాంగణంలో 2 వేల లీటర్ల పెట్రోల్, లెక్కకు మిక్కిలి టైర్లు నిల్వ చేస్తుంటే అడ్డుచెప్పే నాథుడు లేడా?

ఒక్క ఢిల్లీలోనే గత రెండేళ్ళ పైచిలుకు కాలంలో 66 ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి, అగ్నిప్రమాద నివారణ నిబంధనలు ఎంతగా ఉల్లంఘనకు గురవుతున్నాయో స్పష్టమవుతోంది. సాక్షాత్తూ మన దేశ రాజధానిలోనే ఇలా ఉంటే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితిని ఇట్టే ఊహించుకోవచ్చు. మన దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు ఇప్పటికీ అంతంత మాత్రమే. మూడేళ్ళ క్రితం దేశంలో కరోనా మహమ్మారి విజృంభించి, డెల్టా వేరియంట్‌ విలయ తాండవం చేసినప్పుడు ఆ నిష్ఠురసత్యం మన కళ్ళ ముందు కనిపించింది. 

ప్రభుత్వ రంగంలో ఆరోగ్య రంగం అలా కునారిల్లుతుండడం వల్లే, ఆ లోటును పూడ్చడానికి ప్రైవేట్‌ రంగం అవసరం ఉంటోంది. జనం ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు, తదితరాలపై ఆధారపడడం ఎక్కువవుతోంది. సరిగ్గా ఈ కారణాల రీత్యానే ప్రైవేట్‌ ఆరోగ్యరక్షణ రంగంలో భవనాల మొదలు నాణ్యమైన మందులు, సేవల వరకు అన్నింటిలో కనీసపాటి భద్రతా ప్రమాణాలు తప్పనిసరి. కానీ, చాలాచోట్ల అవి హుళక్కి. తాజా ఘటనలే అందుకు తార్కాణం.

నిజానికి, మన దేశంలో అగ్నిప్రమాదాల నుంచి భద్రతకు కీలకమైన ప్రమాణంగా జాతీయ నిర్మాణ నిబంధనావళి (ఎన్‌బీసీ) ఉంది. 1970లోనే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) దీన్ని ప్రచురించింది. 2016లో సైతం దాన్ని నవీకరించారు. అగ్నిప్రమాద నివారణ అనేది రాష్ట్ర జాబితాలోని అంశమైనా, అన్ని రాష్ట్రాలూ దీన్ని పాటించడం తప్పనిసరి. ఇవి కాక స్థానిక భవననిర్మాణ చట్టాల్లోనూ కావాల్సినన్ని కఠిన నియమ నిబంధనలున్నాయి. అయితే, అవి తరచూ ఉల్లంఘనకు గురవుతున్నాయి. 

తాజా ప్రమాదాల్లోనూ అదే జరిగింది. ఆ మాటకొస్తే, గడచిన 2022లోనే మన దేశంలో 7500 పైగా అగ్నిప్రమాదాలు జరిగాయని తాజా నివేదిక. వాటిలో కనీసం 7435 మంది మరణించినట్టు ప్రమాద మరణాలు, ఆత్మహత్యలపై తాజా నివేదిక మాట. నిన్నటి ఢిల్లీ ప్రమాదంలో సైతం అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి, పక్కనున్న భవనం నుంచి నిచ్చెన ఎక్కి, ఆసుపత్రి వెనకవైపు నుంచి వెళ్ళబట్టి కనీసం అయిదుగురు శిశువుల్ని ఆఖరు క్షణంలో కాపాడగలిగారు. లేదంటే ఏమిటి పరిస్థితి? అందుకే, ఇది ప్రభుత్వ యంత్రాంగం అంతటికీ మరోసారి మేలుకొలుపు. 

గుజరాత్‌ లాంటి చోట్ల నిబంధనల్లోని లోపాలను అడ్డం పెట్టుకొని, అహ్మదాబాద్, గాంధీనగర్‌ సహా అనేకచోట్ల చట్టవిరుద్ధంగా వినోద కార్యకలాపాల వసతులు పుట్టగొడుగుల్లా మొలుస్తున్నాయి. తాత్కాలిక నిర్మాణాలతో భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కి, ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. దీన్ని అరికట్టాలి. తప్పులు జరిగినప్పుడు సంబంధిత శాఖల అధికారులను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవడం పరిష్కారం కాదు. 

కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మనుషుల ప్రాణాలను తృణప్రాయంగా తీసుకొని కొందరు సాగిస్తున్న దుర్మార్గ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలి. ఎవరినీ ఉపేక్షించేది లేదనే సంకేతాలు మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపాలి. ప్రమాదాల నివారణకు సమర్థ, ప్రామాణిక చర్యల ప్రణాళికను అమలుచేయాలి. దీనికి ముందు రాజకీయ నేతల చిత్తశుద్ధి అవసరం. ఆపైన అలాంటి వసతులనే ఎంచుకోవడంలో సామాన్యుల అప్రమత్తత కీలకం. 

దేశవ్యాప్తంగా అధికారులు రంగంలోకి దిగి, చర్యలు చేపట్టేందుకు ప్రమాద భద్రతపై సత్వరమే జాతీయ స్థాయి ఆడిట్‌ జరిపితే మేలు. నేతల సంతాపాలు, నష్టపరిహారాలు మనుషుల ప్రాణాల్ని వెనక్కి తీసుకురాలేవు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement